వరుసగా ముగ్గురు నిజాంలు-నాసిరుద్దేలా, అష్టలుద్దేలా, మీర్ మహబూబ్ అలీఖాన్ కింద ప్రధానిగా పనిచేసిన ఘనత మొదటి సాలర్‌జంగ్ దే. ఇతని అసలు పేరు తురాజ్ అలీ ఖాన్. ఇతడు భారతదేశ సంస్థానాలలోని ప్రధాన మంత్రులలోనే అగ్రగణ్యుడుగా గణతికెక్కినాడు. ఇతను ప్రవేశ పెట్టిన సంస్కరణలు భారతదేశం సంస్థానాల చరిత్రలోనే ముఖ్య ఘట్టాలుగా వర్ణించవచ్చును. నాసిరుద్ధాలా కాలంలో మే 31, 1853వ తేదీన సాలార్ జంగ్ దివానుగా నియమించబడే నాటికి నిజాం రాజ్య పరిస్థితులు అంత సంతృప్తికరంగా లేవు. ఆర్థిక పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. బ్రిటీష్ ప్రభుత్వం సికింద్రాబాద్, బొల్లారంలలోనున్న కంటింజెంట్ సైనిక వ్యయ నెపమున సారవంతములైన బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ జిల్లాలను కైవసము చేసుకొన్నారు. దీనివలన నిజాంకు వచ్చే సంవత్సరాదాయం తగ్గిపోయి ఆర్థిక పరిస్థితి క్షీణించింది.అరబ్బులు, రొహిల్లాలు తమకు రావాల్సిన బకాయిల కింద కొంత రాజ్య భాగాన్ని ఆక్రమించారు. అవినీతిపరులైన ఉద్యోగుల కారణంగా పాలనా పరమైన సమస్యలు తలెత్తినవి. కొన్ని జిల్లాల్లో వేలం ద్వారా భూమిశిస్తు వసూలు చేయు అధికారము పొందిన వారు రైతులను పీడించి అధిక శిస్తులు వసూలు చేయసాగారు. పాలనా సంబంధమైన సైనిక వ్యయము భరించడానికి వేరే మార్గం లేక నిజాం తన స్వతం ఎస్టేట్లను, ఆభరణములను, వజ్రాలను రోహిల్లాలకు, అరబ్బులకు, వడ్డీ వ్యాపారస్తులకు తాకట్టు పెట్టి రూ|| 2.70 కోట్ల అప్పు తీసుకోవాల్సిన దుస్థితి కలిగింది. ఇలాంటి పరిస్థితిలో ప్రధానమంత్రి పదవిలో ఉన్న సాలార్జంగ్ తక్షణమే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఆర్థిక సంస్కరణలు
రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచే క్రమంలో క్షీణిస్తున్న ఆదాయాన్ని పెంచడం, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం తద్వారా ఋణభారం నుండి సంస్థానాన్ని విముక్తి చేయడం. 1857లో బ్రిటీష్ ప్రభుత్వం చేస్తున్న పనులను సమర్ధించాడు. బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్న ధారాశివ, రాయచూర్, నల్ దుర్గా జిల్లాలలోని భూములను రైతులకు కౌలుకు ఇచ్చి వాణిజ్య పంటలను ప్రోత్సహించాడు. 25 వేలు ఉన్న తన వేతనాన్ని స్వచ్ఛందంగా 15 వేలకు తగ్గించుకుని, ఇతర ఉన్నతోద్యోగుల వేతనాలను కూడా తగ్గించాడు. సైనిక ఖర్చులను కూడా తగ్గించాడు. ప్రత్యేకంగా మున్సిపాలిటీ శాఖను ఏర్పాటు చేశాడు. ఆబ్కారి, వాణిజ్య సుంకాలు, రహదారి పన్నులు, క్రయ విక్రయాలపై రుసుము, అడవులు మొదలగు ప్రకృతి వనరుల నుంచి రావాల్సిన ఆదాయాన్ని క్రమబద్ధం చేశాడు.
హాలీసిక్కా
హాలీసిక్కా అనే సొంత నాణాన్ని ప్రవేశపెట్టి చెల్లింపులు హాలిసిక్కాతో చేయడం వలన కొంతధనం మిగిలింది. హాలి సిక్కా బ్రిటీష్ ఇండియా కాలం నాటి కట్టారు సిక్కా కంటే 16% తక్కువ విలువ కలిగి ఉండేది. కేంద్ర ఖజానాను ఏర్పాటు చేశాడు.
భూమిశిస్తు
ధాన్యరూపంలో చెల్లింపులు జరిగే భూమిశిస్తును ధన రూపంలో చెల్లించేలా మార్చాడు. బిల్ మక్తాదార్లకు నష్టపరిహారం చెల్లించి, వారిని పదవుల నుంచి తొలగించి తాశీల్దార్, పటేల్, పట్వారీల ద్వారా శిస్తు వసూలు చేసే పద్ధతి ప్రవేశ పెట్టాడు. ప్రభుత్వం వద్ద గల పాత రికార్డుల ఆధారంగా రైతులు సాగు చేస్తున్న భూముల విస్తీర్ణాన్ని నిర్ణయించి శిస్తును వసూలు చేయడం ప్రారంభించాడు. నూతన శిస్తు విధానం ముప్పయి సంవత్సరాల పాటు ఉండేటట్లు ఏర్పాట్లు చేశాడు. జిల్లా వారి శిస్తు వసూలు పర్యవేక్షణకు రెవెన్యూ బోర్డును, రెవన్యూ శాఖను ఏర్పాటు చేశాడు.
న్యాయపాలన
బ్రిటిష్ ప్రాంతాల్లోని విధానాన్ని నమూనాగా తీసుకొని, న్యాయ పాలనా విధానాన్ని సంస్కరించి 'న్యాయం ముందర అందరూ సమానమే'అనే సూత్రాన్ని అమలు పరచడానికి సాలార్జంగ్ ప్రయత్నించాడు. జిల్లా, తాలూకా కేంద్రాల్లో సివిల్, క్రిమినల్ కోర్టులేర్పర్చాడు. వాటి విధులు స్పష్టంగా నిర్వచించడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నత న్యాయస్థానం నెలకొల్పబడింది. అందులో ఒక ప్రధాన న్యాయమూర్తి 5 మంది న్యాయాధీశు లుండేవారు. అరాచకం సృష్టిస్తున్న అరబ్, పఠాన్, రోహిల్లాలను విచారించి శిక్షించడానికి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. మరణ శిక్షను నిజాం అనుమతించవలెనని సాలార్జంగ్ సూచించాడు. హిందువుల మధ్య తగాదాలన్నీ ధర్మశాస్త్రాలను అనుసరించే జరిపించాలని చెప్పాడు.
రాజ్యపాలన
శాసనసభను ఏర్పాటు చేయాలనే సాలార్జంగ్ అభిలాష నెరవేరలేదు. కానీ మంత్రివర్గ పద్దతిని మాత్రం ప్రవేశ పెట్టగలిగాడు. పరిపాలనను నాలుగు శాఖలుగా విభజించి, వాటి పరిమితులను నిర్ణయించాడు. అయితే మంత్రులకు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకొనే అధికారం మాత్రం ఇవ్వలేదు.
విద్య
ఆధునిక విద్యా విధానానికి సాలార్జంగ్ అంకురార్పణ చేశాడు. 160 మంది విద్యార్థులతో 1853-54 లో సాలార్జంగ్ ఒక ఓరియంటల్ కాలేజ్ (దార్-ఉల్-ఉలూం)ను స్థాపించాడు. అందులో అరబ్బీ, పర్షియన్, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ భాషల్లో బోధన జరిగేట్లు ఏర్పాటు చేశాడు. 1860 నాటికి తాలూకా, జిల్లా కేంద్రాల్లో పాఠశాలలను స్థాపించేలా చర్యలు తీసుకున్నాడు. 1860లో ప్రజా సౌకర్యాల కింద ఒక ఇంజనీరింగ్ కాలేజీని దానికి అనుబంధంగా ఒక ఇంగ్లీష్ బోధనా పాఠశాలను ఏర్పాటు చేశాడు. 1872 నాటికి ఈ పాఠశాల చాదర్‌ఘాట్ ఆంగ్లో-వర్నాక్యులర్ పాఠశాలగా, తరువాత హైదరాబాద్ కాలెజ్ గా రూపొందింది. 1884లో ఈ కాలేజ్ ను మద్రాస్ విశవిద్యాలయంలో చేర్చడం జరిగింది. ప్రభువర్గాల కోసం మదర్-ఇ-ఆలియాను, మదరసా- ఇ-అజియాను స్థాపించడం జరిగింది. ఉపాధ్యాయ శిక్షణా కళాశాల ఒకటి నగరంలో నెలకొల్పాడు.
సమాచార సాధనాలు
1856-57లో బొంబాయి-హైదరాబాద్, హైదరాబాద్- కర్నూలు మధ్య తంతి సౌకర్యం ఏర్పాటు చేయబడింది. 1862 నాటికి జిల్లా కేంద్రాల్లో తపాలా కార్యాలయాలు ఏర్పడ్డాయి. 1871లో తంతి తపాలా శాఖ ఏర్పాటు చేయబడిన 'పోస్ట్ మాస్టర్ జనరల్' నియామకం జరిగింది. జిల్లా, తాలూకా కేంద్రాలకు ప్రతి రోజు ఉత్తరాల బట్వాడా ప్రారంభమైంది
రైలుమార్గం
1874 నాటికి వాడి నుండి సికింద్రాబాదు రైలుమార్గం ఏర్పడింది. బొంబాయి నుంచి హైదరాబాద్ గుండా మద్రాసు గ్రాండ్ పెనిన్యులర్ రైలు మార్గ నిర్మాణానికి, సికింద్రాబాద్ నుంచి బెజవాడకు, సింగరేణి గనుల గుండా గోదావరి ముఖ ద్వారానికి రైలుమార్గ నిర్మాణానికి ప్రణాళికలు వేయబడినవి.
Tags : Salar Jung Telangana History
Education In Hyderabad Hali Sicca
Economic Policies Freedom Movement
Pages