సమైక్య రాష్ట్ర నిర్మాణ విషయమై తెలంగాణ నాయకుల అనుమానాలను నివృత్తిచేసి, వారిని సంతృప్తి పరచడానికై, రాష్ట్ర వ్యయనిష్పత్తి, శాసనసభ్యుల సంఖ్య, విద్యా సౌకర్యం, ఉర్దూభాష ప్రాధాన్యత మొదలైన అంశాలపై ఆంధ్రా- తెలంగాణా నాయకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పెద్దమనుషుల ఒప్పందం అని అంటారు. పెద్దమనుషుల ఒప్పందం 1956, ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర నాయకులు తెలంగాణ అభివృద్ధికై ప్రత్యేక హామీలు యిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణకు రక్షణలు కల్పిస్తూ ఒప్పందం జరిగింది. తెలంగాణ ప్రాంతం మిగులు నిధులు తెలంగాణ అభివృద్ధికే ఖర్చు చేయాలని, తెలంగాణ విద్యా సంస్థల్లో ప్రవేశం తెలంగాణకే పరిమితం చేయాలని ఒప్పందం జరిగింది. వీటన్నిటినీ సమీక్షించడానికి ప్రాంతీయ మండలిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా ముల్కీ నిబంధనలు కూడా మరల కొనసాగించనున్నట్లు తెలిపింది. 

ఒప్పందంలోని అంశాలు 

1. రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య మరియు సాధారణ పరిపాలనా విభాగాలపై అయ్యే ఖర్చు తగు నిష్పత్తిలో ఇరు ప్రాంతాలు భరించాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని కేవలం ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి. ఈ నిబంధనను 5 సంవత్సరాల అనంతరం సమీక్షించి అసెంబ్లీలోని తెలంగాణా శాసనసభ్యులు కోరిన పక్షంలో మరో 5 సంవత్సరాలకు గాను పొడిగించాలి. 

2. తెలంగాణా శాసనసభ సభ్యులు కోరిన విధంగానే తెలంగాణా లో మద్యపాన నిషేధాన్ని అమలు జరపాలి. 

3. తెలంగాణాలో అమలులో గల విద్యా సౌకర్యాలను తెలంగాణా విద్యార్థులందరికీ వర్తింపజేసి వాటిని మరింతగా అభివృద్ధి పరచాలి. తెలంగాణాలోని సాంకేతిక విద్యాసంస్థల్లో తెలంగాణా విద్యార్థులకే మాత్రమే ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేయాలి. అలా కుదరని పక్షంలో రాష్ట్రంలోని మొత్తం సీట్లను తెలంగాణా విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలి. ఈ రెండిట్లో తెలంగాణా ప్రాంతానికి ఏది ప్రయోజనకరంగా ఉంటే దానిని కొనసాగించాలి. 

4. ఉద్యోగుల విభజన ఆయా ప్రాంతాలకు తగిన నిష్పత్తిలో చేయాలి. 

5. ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆయా ప్రాంతాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలి. 

6. తెలంగాణాలో సాధారణ పరిపాలన మరియు న్యాయ విభాగాల్లో ఉర్దూ భాషను 5 ఏళ్ళ పాటు కొనసాగింపు. ఉద్యోగ నియామకాలకు తెలుగుభాషా పరిజ్ఞానం తప్పని సరి చేయకూడదు కాని ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకు ఉద్యోగులకు నిర్వహించే తెలుగు పరీక్షలో తప్పక ఉద్యోగులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. 

7. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు స్థానికతకు 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. 

8. తెలంగాణా ప్రాంతపు బహుముఖాభివృద్ధి కొరకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు. 

9. తెలంగాణలోని అన్ని వ్యవసాయ భూముల అమ్మకాలు తెలంగాణ ప్రాంతీయ సంఘం అధీనంలో ఉండాలి. 

10. ప్రాంతీయ మండలిలో ఉండే 20 మంది సభ్యులలో జిల్లాకు ఒక్కరు చొప్పున 9 మంది అసెంబ్లీ సభ్యులు, 6 మంది సభ్యులు అసెంబ్లీ నుండి గాని పార్లమెంటు నుండి గాని తెలంగాణా అసెంబ్లీ సభ్యులు ఎన్నుకోవాలి. మరో 5 మంది సభ్యులు బయటివారుగా ఉండాలి. వీరిని తెలంగాణా వారే ఎన్నుకోవాలి. 

11. ప్రాంతీయ సంఘం భారత రాజ్యాంగం ప్రకారం 371 అధికరణను అనుసరించి రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడే ఒక చట్టబద్ద సంస్థగా రూపొందుతుంది. ప్రాంతీయ సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కలిగే భేదాభిప్రాయాను సరిదిద్దడానికి భారత ప్రభుత్వం కలుగ జేసుకోవచ్చును. ఈ ఏర్పాటు మధ్యలో మరొక ఒప్పందం లేకపోతే సమీక్ష పది సంవత్సరాల అనంతరం జరుగుతుంది. 

12. క్యాబినెట్ మంత్రుల నియామకం 60:40గా ఉండాలి. తెలంగాణ ప్రాంతం నుండి ఒక ముస్లిం అభ్యర్థిని మంత్రిగా నియమించాలి. 

13.ముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం వాడయితే ఉపముఖ్యమంత్రి తెలంగాణా వాడై ఉండాలి. ఒక వేళ ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం వాడై ఉండాలి. 

14. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు 1962 వరకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని ఆశించారు. ఆంధ్రప్రాంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. 

పై అంశాల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం పేరు ఒక అంశం కాగా, హైకోర్టుకు సంబంధించిన అంశం మరొకటి. 

తెలంగాణ ప్రాంత నిధులు రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ అని పేరు పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రాంత ప్రతి నిధులు జాయింట్ సెలెక్ట్క మిటీ సూచించిన ఆంధ్ర ప్రదేశ్ పేరుండాలని పట్టుబట్టారు. తెలంగాణ ప్రాంత ప్రతినిధులు హైకోర్టు బెంచి గుంటూరు లో, హైదరాబాద్ లో ప్రధానపీఠం ఉండాలన్నారు. గుంటూరు లో బెంచి అవసరం లేదని, హైకోర్టు హైదరాబాద్ లోనే ఉండాలని ఆంధ్ర ప్రతినిధులు వాదించారు.

పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన ఆంధ్ర - తెలగాణ నాయకులు 

1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంపై 1956 ఆగస్టు 14వ తేదీన మొత్తం 8 మంది సంతకం చేశారు. 

ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు : బెజవాడ గోపాలరెడ్డి (ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి), నీలం సంజీవరెడ్డి(ఉప ముఖ్యమంత్రి), గౌతు లచ్చన్న (మంత్రులు), అల్లూరి సత్యనారాయణ రాజు (ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు). 

తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు : బూర్గుల రామకృష్ణారావు (హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి) కె.వి.రంగారెడ్డి, మర్రి. చెన్నారెడ్డి (మంత్రులు), జె.వి.నరసింగరావు (హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు) ప్రాతనిధ్యం వహించారు. పెద్దమనుష్యుల ఒప్పందం తర్వాత ఆంధ్ర - తెలంగాణాల విలీకరణను ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది.

పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల ఉల్లంఘన- తెలంగాణ ప్రాంత వాసుల అసంతృప్తి 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి నూతన రాష్ట్ర ముఖ్య మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంత వ్యక్తిని ఉపముఖ్య మంత్రిని చేయలేదు. ఉపముఖ్య మంత్రి పదవి అవసరం లేదని ఎవరికీ ఆ పదవి ఇవ్వ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఇద్దరు ముఖ్య మంత్రులు మారినారు ఒకరు-టంగుటూరు ప్రకాశం పంతులు, మరొకరు బెజవాడ గోపాల రెడ్డి ఇద్దరి వద్ద నీలం సంజీవరెడ్డి ఉపముఖ్య మంత్రిగా పదవి నిర్వర్తించాడు. కానీ తాను ముఖ్య మంత్రిగా పదవిలోకి రాగానే ముఖ్యమంత్రి పదవి అనవసరం అనడంతో ఇది కావాలని చేసిన కుట్రగా భావించిన తెలంగాణ ప్రాంత నాయకుల, ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నవి. ఒప్పందంలో భాగంగా తెలంగాణ వ్యక్తికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే సంజీవరెడ్డి ఆ పదవికి తగిన ప్రాధాన్యత కల్పించలేనది తెలంగాణ ప్రజలు భావించారు. సంజీవరెడ్డి మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కె.వి.రంగారెడ్డి, మందుముల నరసింగరావు, వల్లూరి బసవరాజు, మొహిదీ నవాజ్ జంగ్ కు మంత్రి పదవులు ఇచ్చాడు. కీలక శాఖలన్నీ ఆంధ్ర ప్రాంతం వారికి ఇవ్వడం కూడా తెలంగాణ ప్రాంతం వారికి నచ్చలేదు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమైన హోం, ప్రణాళిక శాఖలను తన ఆధీనంలోనే ఉంచుకుని మరో రెండు కీలక శాఖలైన ఆర్థిక, భూ సంస్కరణలను ఆంధ్రా నాయకుడైన కళా వెంకట్రావుకు అప్పగించాడు. తెలంగాణ ప్రాంత నాయకుడైన వల్లూరి బసవ రాజుకు మరో కీలక శాఖ వాణిజ్య-పరిశ్రమల శాఖను అప్పగించాడు. వాస్తవానికి అది కూడా ఆంధ్ర నాయకుడికి ఇచ్చినట్లు తెలంగాణ వారు భావించారు. వల్లూరి బసవ రాజు గుంటూరు జిల్లా, బాపట్లకు చెందిన వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడి సికింద్రాబాద్ నుండి ఎన్నికల్లో గెలిచాడు. కావున ఆంధ్రా మూలాలున్న వ్యక్తికే కీలక శాఖను కేటాయించడం జరిగిందని తెలంగాణ వారు భావించారు. అంతే కాకుండా ఆంధ్ర-తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కలిపి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడగానే తన అనుయాయులైన అల్లూరి సత్యనారాయణ రాజును దానికి అధ్యక్షునిగా నియమించాడు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తన పెత్తనాన్ని ఉండేలా చూసుకున్నాడు. ఇది తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఉద్యోగ రక్షణలను కూడా ఉల్లంఘించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన డి.ఎస్.రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ గా నియమించాడు. కొద్ది రోజులకు నీలం సంజీవ రెడ్డి మీద అసమ్మతి సెగ రగులుకున్నది. మర్రి చెన్నారెడ్డి, బొమ్మకంటి సత్యనారాయణ, హయగ్రీవాచారి, గోపాలరావు, మేల్కోటే, పాగా పుల్లారెడ్డి తదిర తెలంగాణ నాయకులు ముఖ్యమంత్రిని వ్యతిరేకించడం ప్రారంభించారు. రాష్ట్ర ఏర్పాటుకు, ఆంధ్ర నాయకుల ప్రవర్తనలతో విసిగిన బూర్గుల రామకృష్ణారావు క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికి కేరళ గవర్నర్ గా కొనసాగాడు.