శాతవాహన సామ్రాజ్య పతనానంతరం అనేక స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించినవి. వాటిలో కాలక్రమాన్ని అనుసరించి విజయపురిని రాజధానిగా పాలించిన వారు ఇక్ష్వాకులు. శాతవాహన సామ్రాజ్యం చీలిపోయిన తరువాత అధికారం చేపట్టిన స్థానిక రాజవంశాల వర్ణన పురాణాలలో కన్పిస్తుంది. ఈ రాజవంశీయులలో శ్రీ పర్వతీయులు ఒకరు. వీరికి చుటు కులము వారని మరొక పేరుంది.శ్రీ పర్వతీయులను అధికారంలో నిలిపి, తీరప్రాంత రక్షణ బాధ్యత అప్పగించిన ఘనత శాతవాహనులదే. నాగార్జున కొండలోయలో దొరికిన శాసనాల వల్ల శ్రీ పర్వతీయులే ఇక్ష్వాకులని స్పష్టమవుతుంది.

ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయులని పురాణాలు వర్ణించడానికి శ్రీ పర్వతము విజయపురి సమీపంలో ఉండటమే కారణం అయి ఉండవచ్చు. నాగార్జున కొండ శాసనాలలో విజయపురి, శ్రీ పర్వతాల విషయాలున్నాయి.పురాణాలలో చెప్పబడినట్లు ఏడుగురు ఇక్ష్వాకు రాజులు మొత్తం 100 సంవత్సరాలు పాలించారని గ్రహించబడినది. దీనికి అనుగుణంగానే శాసనాల్లో కనిపిస్తున్న రాజులు కనీసం 68 సంవత్సరాలు పాలించారని స్పష్టమవుతున్నది.  ఇక్ష్వాకుల రాజధాని నాగార్జున కొండ సమీపంలోని విజయపురి. 

శాసనాల ద్వారా లభ్యమైన నలుగురు ఇక్ష్వాకు రాజుల పేర్లు

వాశిష్టీ పుత్ర శ్రీ శాంతమూలుడు 

మాఠరీ పుత్ర శ్రీ వీర పురుష దత్తుడు 

వాశిష్టీ పుత్ర శ్రీ బహుబల (ఎహువల) శాంతమూలుడు 

రుద్ర పురుష దత్తుడు

వాశిష్ట పుత్ర శ్రీ శాంతమూలుడు (క్రీ॥శ॥ 200-218):

ఇక్ష్వాకు వంశ రాజ్య స్థాపకుడు వాశిష్ట పుత్ర శ్రీశాంత మూలుడు. ఇతని పరిపాలనా కాలం పద్దెనిమిది సంవత్సరాలు. అగ్ని హోత్రాది మహాక్రతువులు చేసినాడు. ఈ సందర్భంగా హిరణ్య కోటి, గోశథ సహస్ర, హల శత సహస్ర దానాలు ఇచ్చాడు. ఇతడు మహాసేన విరూపాక్షపతి భక్తుడు, ఆరాధకుడు, యజ్ఞయాగాదులను పునరుద్ధరించి, ఈశ్వరారాధనకు తోడ్పడిన శ్రీ శాంతమూలుడు వైదిక బ్రాహ్మణ మతాభిమాని.

శాసనాల ద్వారా శాంతమూలుని సోదరీమణుల పేర్లు, బంధువుల పేర్లు తెలుస్తున్నాయి. వీరందరూ నాటి రాజకీయాలలో కీలక పాత్ర వహించినవారే. శాంతమూలుని కుమారుడు వీర పురుష దత్తుడు, కుమార్తె మహాతలవరి అడవి శాంతి శ్రీ మహాతలవర, మహా సేనాపతి, మహా దండనాయక పదవులనలంకరించిన స్కంధ విశాఖనాగుని భార్య అడవి శాంతి శ్రీ శాంతమూలుని సోదరీ మణులలో ఒకరైన మహాసేనాపత్ని, మహాదానపతి అయిన శాంతి శ్రీ పూగియ కుటుంబానికి చెందిన మహాసేనాపతి, మహా తలవర మహాస్కందశ్రీ భార్య, మరో సోదరి పేరు హమ్మరిక, శాంతిశ్రీ కుమార్తెలలో ఒకరు వీరు పురుషదత్తుని భార్య అయింది. 

శ్రీశాంత మూలుడి గొప్పతనం 

శ్రీశాంతమూలుడు గొప్ప రాజనీతిపరుడు. సామంత కుటుంబాలతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకొని రాజకుటుంబానికి అంగబలము చేకూర్చాడు. తన కుమారునికి ఉజ్జయినిని పాలించే క్షాత్రపుడైన మొదటి రుద్రసేనుని కుమార్తెను ఇచ్చి పెండ్లి చేశాడు.  ఈ వైవాహిక సంబంధంతో ఇక్ష్వాకుల కీర్తి మరింతగా పెరిగింది. శ్రీ శాంతమూలుడు అనేక కోట్ల బంగారు నాణాలను, లక్షల కొలది గోవులను, లక్షల కొలది నాగళ్ళు, భూమిని దానం చేశాడు. ఈ దానాలకు సాంఘిక, ఆర్థిక ప్రాధాన్యం చాలా వున్నట్లు కన్పిస్తుంది.  అడవులను ఛేదించి, క్రొత్త భూములను సాగులోనికి తెచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. బ్రాహ్మణులను అనేక అగ్రహారాలను, సాగు భూములను దానిమిచ్చి, బ్రాహ్మణ మత విస్తరణకు పాటుపడినాడు. ఇతని ఘన విజయాలు, దాన ధర్మాలు ప్రజలపై చెరగని ముద్ర వేశాయి. 

మాఠరీ పుత్ర శ్రీ వీర పురుష దత్తుడు

వాశిషీ పుత్ర శ్రీ శాంతమూలుని తరువాత అతని కుమారుడైన మాఠరీ పుత్ర శ్రీ వీర పురుష దత్తుడు సింహాసన మధిష్టించినాడు. శ్రీ వీర పురుష దత్తుని పరిపాలనా కాలంలో బౌద్ధమత ప్రభావము ఆంధ్రదేశమంతటా వ్యాపించింది. ఈ కాలాన్ని ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగమనవచ్చు. ఇతని 6, 14, 15, 18, 20 వ పరిపాలనా సంవత్సరాలలో నాగార్జునకొండ లోయలో వేయించిన శాసనాలను బట్టి ఇతని కాలము సుఖ, సంపదలకు, ఘనతకు పేరు గాంచినట్లు తెలుస్తుంది. తన తండ్రి వలె ఇతడు కూడా దక్షిణాపథ చక్రవర్తి అధికారం నెరిపినాడు.

వీర పురుష దత్తుని పాలనా కాలంలో కొత్త భూభాగాలు జియించినట్లు కన్పించదు. ఇతని రాజ్యానికి సరసన ఉత్తరాన ఉజ్జయిని మహా క్షాత్రవులు, వాయువ్యాన త్రికూట ఆభీరులు, పశ్చిమాన వనవాస ఆంధ్ర భృతులు గలరు. ఇతని సామ్రాజ్యం కళింగ, కోసల, ఆంధ్ర దేశాల వరకే పరిమితమయినట్లు భావించబడుతుంది. తండ్రి వలె ఇతడు కూడా వైవాహిక సంబంధం ద్వారా తన అధికారాన్ని పటిష్టపరచుకొని సమస్యలను పరిష్కరించినాడు. తన కుమార్తె అయిన కొడ బలిసిరిని వనవాస రాజుకిచ్చి వివాహం జరిపించి ఆ రాజ్యాన్ని తన పలుకుబడి కిందకు తెచ్చుకున్నాడు. తన భార్య ద్వారా ఉజ్జయిని క్షాత్రవుల మైత్రిని కొనసాగించాడు. సామంతుల భక్తి నిలుపుకునే ఉద్దేశంతోనే తన మేనత్తలయిన హమ్మసిరి, శాంతసిరి కుమార్తెలను ముగ్గురిని వివాహమాడినాడు. శాసనాల ప్రకారం వీర పురుష దత్తునికి పట్టపు రాణి మహాదేవి భట్టిదేవ, మహాదేవి రుద్రధర భట్టారిక, శాంతిశ్రీ, మహాదేవి సష్టిశ్రీ, మహాదేవి బావశ్రీ అనే అయిదుగురు భార్యలు ఉన్నట్లు తెలుస్తున్నది.

వాశిష్ఠ పుత్ర శ్రీ బహుబల (ఎహువల) శాంతమూలుడు

వీర పురుష దత్తుని తరువాత అతని కుమారుడైన వాశిష్ట పుత్ర శ్రీ బహుబల(ఎహువల) శాంతమూలుడు చక్రవర్తి అయినాడు. ఇతడు మహాదేవి భట్టిదేవి కుమారుడు. ఇతని పరిపాలనా కాలానికి సంబంధించి రెండు శాసనాలు దొరికాయి. వీటిలో రాజకీయ ప్రసక్తి లేదు. వీటిలో బౌద్ధమతానికి చెందిన విషయాలు ఉన్నాయి. బహుశృతీయులని, మహిశాసకులని మరికొన్ని తెగలు బౌద్ధ సంఘంలో వున్నట్లు ఈ శాసనాలు చెబుతున్నాయి. బహుబలుని కాలంలో మహాదేవి భట్టిదేవ, మహాదేవి కొడబలిసిరి కట్టించిన చైత్యాలు, చైత్య గృహాలు, మండపాలు, శాసనాలలో పేర్కొనబడ్డాయి.

బహుబల శాంతమూలుని కాలంలో నాగార్జునకొండ లోయలో ఒక వైపు బౌద్ధ సంస్థలు, మరొక వైపు బ్రాహ్మణ మతం విరివిగా నిర్మాణాలు సాగించాయి. సేనాని యిలిసిరి కుమార స్వామికి సర్వదేవ ఆలయం నిర్మించాడు. రాకుమారుడు వీర పురుష దత్తుడు పుష్పభద్రస్వామి ఆలయం నిర్మించాడు. ఒక అంతఃపుర స్త్రీ నొడగిరి స్వామికి దాన ధర్మాలు చేసింది. ఇతని కాలము నుండే శాసనాలలో సంస్కృతము వాడడము ప్రారంభము అయింది.

రుద్ర పురుష దత్తుడు

తెలంగాణలోని నాగార్జునకొండ, గురజాల వద్ద ఇటీవల దొరికిన శాసనాలను బట్టి బహుబల శాంతమూలుని తరువాత అతని కుమారుడు రుద్ర పురుష దత్తుడు సింహాసనమధిష్టించాడని తెలుస్తున్నది. ఇతడే మనకు తెలిసినంత వరకు చివరి ఇక్ష్వాకు రాజు. పొరుగు మిత్ర రాజులైన మహా క్షాత్రపులు బలహీనులు కావడంతో ఇక్ష్వాకుల బలము కూడా తగ్గినది. వనవాస రాజు శిసస్కంధ వర్మ చనిపోయిన తరువాత పల్లవులు విజృంభించి వనవాస రాజ్యాన్ని ఆక్రమించారు. ఇదే కాలంలో ఇక్ష్వాకుల పై దెబ్బ తీయడానికి శాతవాహన వంశస్థులు పల్లవులకు సహాయం చేశారు.

ప్రాచీన పల్లవ రాజు సింహవర్మ శాసనం విజయపురి సమీపములో మంచి కల్లు దగ్గర దొరికింది. ఇందులో విజయానికి చిహ్నముగా తైర్థికులకు దానం చేసినట్లు సింహవర్మ చెప్పుకున్నాడు. దీనిని బట్టి పల్లవ సింహవర్మ ఇక్ష్వాకు రాజ్యము పై దండెత్తి రుద్ర పురుషదత్తుని ఓడించి, వధించి విజయపురిని తగులబెట్టి ఇక్ష్వాకు రాజ్య దక్షిణ భూములను తన రాజ్యములో కలుపుకున్నాడు. సామ్రాజ్య ఉత్తర భూములు ఇతర సామంతులు ఆక్రమించారు. దీనితో ఇక్ష్వాకుల వంశం అంతరించింది.