బౌద్ధానికి ఇక్ష్వాకులు చేసిన సేవ

బౌద్ధమతం ఇక్ష్వాకు రాజవంశ ఆదరణలో ఉచ్ఛస్థితిని అందుకొన్నిది. నాగార్జున కొండలో లభ్యమైన శాసనాలలో రాజకీయ విషయాలు గాక, బౌద్ధమత సంబంధమైన విషయాలే పేర్కొనబడింది. విజయపురిలోనూ, శ్రీ పర్వతం మీద నిర్మించిన బౌద్ధ కట్టడాల గురించి సింహళం, మలేషియా, చైనా, తూర్పు ద్వీపాల నుంచి వచ్చి ఇచట నివాసమేర్పరచుకొన్న పెక్కు మంది భిక్షువులు, భిక్షాణుల గురించి ఈ శాసనాలు పేర్కొంటున్నాయి. ఈ శాసనాలలో ఆనాడు ఆంధ్రలో వున్న బౌద్ధమత శాఖలు, రాజ వంశీకులు, సాధారణ ప్రజలు ఒక్కొక్క శాఖ వారిని ఆదరించిన తీరు చెప్పబడింది.

నాగార్జున కొండ శాసనాలలో బౌద్ధమత సంస్థలకు, ఇక్ష్వాకు రాజులు దానాలిచ్చినట్లు కన్పించదు. బౌద్ధమత సంస్థలను ఆదరించిన వారందరూ రాజ కుటుంబ స్త్రీలు వారి బంధువులు, ఇక్ష్వాకు రాజులందరూ బ్రాహ్మణ మతస్థులైనా మత సహనము కలవారు. అందువల్లనే వారు బౌద్ధ సంస్థలను రాణులు, వారి బంధువులను ఆదరించడానికి అభ్యంతరము చెప్పలేదు. వీర పురుష దత్తుడు, అతని కుమారుడు బహుబలుడు బౌద్ధమతాభిమానులు కావడానికి అవకాశముందని నాగార్జునకొండ శిల్ప సాక్ష్యము ద్వారా తెలుస్తుంది.

మొదట్లో బ్రాహ్మణ మతస్థుడైన వీర పురుష దత్తుడు బౌద్ధ ప్రభావం వల్ల బ్రాహ్మణ మతాన్ని విడిచిపెట్టి, బౌద్ధాన్ని స్వీకరించి, ఆ మత వ్యాప్తికి పాటు పడినట్లు ఈ శిల్ప సాక్షమును బట్టి చెప్పవచ్చు. ఒక శిల్పములో ఒక రాజు తన కుడి కాలితో శివలింగాన్ని అణగదొక్కే దృశ్యము కలదు. ఈ దృశ్యాన్ని తిలకించే వారిలో రాజ దర్బారు సభ్యులు కలరు. ఇటువంటి శిల్పమే మరొక చోట కూడా బయల్పడినది. వీర పురుష దత్తుని ఆరవ పాలనా కాలంలో శ్రీ పర్వతము పైన మహా చైత్యము పునర్నిర్మితమైనట్లు 16 శాసనాలలో ప్రస్తావించబడినందువల్ల వీర పురుష దత్తుడు బౌద్ధాన్ని స్వీకరించినట్లు భావించవచ్చు. ఈ కాలంలోనే మహా విహారాలు, చైత్య గృహాలు, మండపాలు, చతుశ్శాల నిర్మించబడ్డాయి. ఇవి దూర ప్రాంత యాత్రికుల కొరకు నిర్మించబడ్డాయి. శ్రీ పర్వతం మహాయన మతస్థులకు పుణ్య క్షేత్రం అయింది.

వీర పురుష దత్తుని మేనత్త అయిన మహాసేనాపత్ని, మహాదాన పత్ని శాంతిశ్రీ శ్రీ పర్వత బౌద్ధ కట్టడాలకు కారకురాలు. ఈమె దానశీలత మహాచైత్య ఆయక స్థంభ శాసనాలలో చెప్పబడింది. ఈ నిర్మాణాలు శాంతి శ్రీ తన అల్లుడైన మాఠరీ పుత్ర శ్రీ వీర పురుష దత్తుని ఆయురారోగ్యాల కోసం, విజయం కోసమని శాసనాలలో చెప్పబడింది. శాసనాలలో చెప్పబడిన దానాలన్నీ మహాభిక్షు సంఘము, అపర మహావిన శైలీయ శాఖ భిక్షువుల కొరకనీ పేర్కొనబడింది. శ్రీ పర్వతములోని మహాచైత్య నిర్మాణానికి రాజస్త్రీలలో మహాతలసరి అడవి శాంతి శ్రీ, మహా సేనాపత్ని రుద్ర శాంతి శ్రీ నాగ, మహా సేనాపత్ని వాశిష్ట పుత్ర స్కంధ చలికి రెమ్మణక, మహాదేవి బాపి శ్రీ, మహాదేవి చటి శ్రీ తోడ్పడినారు.

బౌద్ధ సంస్థలకు దానాలిచ్చిన స్త్రీలలో రాజ భాండాగారకుని మేనకోడలు ఉపాశిక బోధి శ్రీ ఖ్యాతి గడించింది. ఈమె వీర పురుష దత్తుని 14 వ పాలనా కాలంలో బౌద్ధ ధర్మ ప్రచారం చేసే భిక్షువుల కొరకు శ్రీ పర్వతములో చుళధర్మ గిరి పై ఒక చైత్య గృహం, ఒక చుతశాల నిర్మించింది. ఈ భిక్షువులు తామ్ర సర్ణి, కాశ్మీరము, గాంధారము, చీనా, కిరాత్, తోసలి, అపరాంత, వంగ, వనవాస, యవన, ద్రమిళ, పాలూరు మొదలగు రాజ్యాలలో మత ప్రచారం చేసేవారు. ఈమె శ్రీ పర్వతం లోని కుహల విహారము దగ్గర ఒక చైత్యాన్ని సింహళ విహారములో బోధి వృక్షానికి వేదికను, మహాధర్మ గిరి పైన ఒక గృహాన్ని, దేవగిరి పై ప్రార్థనా శాలను పూర్వ వైలము పై తటాక మంటప శాలలను, కంటక శైల మహా చైత్య తూర్పు ద్వారము దగ్గర శిలా మండపాన్ని పుష్పగిరి పై శిలా మండపాన్ని, ఇంకొక విహారము దగ్గర ఒక శిలా మండపాన్ని భిక్షు సంఘము కొరకు, ప్రపంచ యాత్రికుల సౌకర్యం కోసం నిర్మించింది.

ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాభివృద్ధికి సాక్ష్యమిచ్చే శాసనాలలో ఉపాశిక బోధి శ్రీ శాసనం ముఖ్యమైనది. ఈ శాసనములో బుద్ధ దేవుని ప్రార్థించే పద్ధతి విలక్షణమైనది. ఈ శాసనములో ఆంధ్ర, బౌద్ధమత ప్రచారకులు సంచరించిన ప్రాంతాలు పేర్కొనడం జరిగింది. ఈ ప్రచారకులు వర్తక మార్గాల ద్వారా, దూర ప్రాంతాలకు వెళ్ళారు. ఈ శాసనము వల్ల ఆంధ్ర బౌద్ధమత ప్రచారకులు తూర్పున చైనా వరకూ, పడమర కాశ్మీర్ వరకూ వెళ్ళినట్లు రూఢి అవుతుంది. రాజాదరణ లభించడం వల్లనే బౌద్ధులు దేశ విదేశాలలో ప్రచారము చేయగలిగారు. ఈ ప్రచారకులకు వారి దూర ప్రాంత శిష్యుల సౌకర్యార్థమే ఉపాశిక బోధి శ్రీ చైత్యాలను, చైత్య గృహాలను, విహారాలను, మండపాలను, చతుశ్శాలలను కట్టించింది.

బౌద్ధమత వ్యాప్తి కారణముగా శ్రీ పర్వతం బౌద్ధులకు పరమ పవిత్ర క్షేత్రమయింది. ఇక్ష్వాకుల పాలనలో విజయపురి, శ్రీ పర్వత కట్టడాలు సౌందర్యానికి పేరుగాంచింది. ఇచట బౌద్ధ భిక్షువులు కృష్ణా ముఖద్వారము దాటి, సముద్రాలు దాటి దూర దేశాలకు వెళ్లి బౌద్ధ మతం ప్రచారం చేశారు. భావ వివేకుడు అనే తార్కికుడు విజయపురి విహారములో నివశించినట్లు హుయాన్‌త్సాంగ్ రచనలను బట్టి తెలుస్తుంది. ఆంధ్ర దేశపు మహా సాంఘీకులలో ఆనాడు నాలుగు శాఖల వారు వుండేవారు. ఆంధ్ర దేశపు మహా సాంఘీకులకు అంధకులు అనే పేరు వచ్చింది. శాంతమూలుని కాలములో అణగదొక్కబడిన బౌద్ధమతం మాఠరీ పుత్ర శ్రీ వీర పురుష దత్తుని కాలంలో మళ్లీ బలవంతమై బ్రాహ్మణ మతాన్ని అడ్డుకొన్నది.

మతసహనం 

ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ, వైదిక మతాల మధ్య సహజీవనం సాగింది. ఇక్ష్వాకు రాజులు పరమత సహనం కలవారు. ఆనాడు బౌద్ద మతములోని అనేక శాఖల వారి మధ్య కూడా పరస్పర సహకారం ఉండేది. బౌద్ధులు వైదిక మత పూజా విధానాన్ని స్వీకరించారు. ఆనాటి హిందూ బ్రద్ధ, సంస్కృతీ కేంద్రం నాగార్జున కొండ బుద్ధుని ధాతువుపై నిర్మించబడిన స్తూపం. దాని సమీపములోనే శాంతమూలుడు యజ్ఞ వేదిక నిర్మించి యజ్ఞం చేయడము మత సహనానికి, సహజీవన సూత్రానికి నిదర్శనము.