సాంస్కృతిక విశేషాలు 

విష్ణుకుండినుల కాలం నాటి విశేషాలు వారు వేయించిన తామ్ర శిలా శాసనాలు, సమకాలీన రాజవంశీయుల శాసనాలు, జనాశ్రయచ్ఛందో విచ్ఛిత్తి, వాస్తు శిల్పాలు మొదలైనవి వివరిస్తున్నాయి. వీరి రాజముద్ర సింహం. వీరి శాసనాలు, కడియాలపై గల రాజముద్రికలను గమనిస్తే దూకే సింహం కనిపిస్తుంది. వీరి నాణేలలో కూడా ఈ సింహం కనిపిస్తుంది. కేసరి రామలింగేశ్వరాలయం వీరి రాజ లాంఛనం పేరనే నిర్మించిబడినది. నల్గొండ జిల్లాలోని దొండపాడు గ్రామంలో ఒక నాణేల బిందే లభించగా అందులోని నాణేలపై దూకడానికి సిద్ధంగా ఉన్న సింహ రూపం, 'సత్యాశ్రయ, విషమసిద్ధి' అనే పేరు అదే విధంగా సింహం ముందు భాగంలో అడ్డంగా విచ్చుకత్తి చెక్కబడినవి. పరిపాలనా విధానం వీరి కాలంలో రాజులు నిరంకుశులైనా కూడా ప్రజాభిప్రాయం ప్రకారమే రాజ్యపాలన జరిగింది. పరిపాలనా సౌలభ్యం కొరకు సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలుగా, విషయాలుగా విభజించారు. శుక్రనీతిననసురించి రాజ్య పాలన చేశారు. కీలకమైన ప్రాంతాలలో రాజకుటుంబీకుల్ని ప్రతినిధులుగా నియమించేవారు. రాష్ట్రానికి అధిపతి రాష్ట్రకుడు. విషయాధిపతి విషయానికి అధిపతి. రాజాజ్ఞలను అమలుపరిచే వాడు ఆంతరంగికుడు. న్యాయ పాలనలో అన్ని అధికారాలు రాజువే. వీరి సైన్యంలో చతురంగబలం ఉండేది. వీరి కాలంలో అగ్రహారాలు దానాలు ఇచ్చే వారు. 

మతము

వీరి శాసనాలన్నీ సమకాలీన మత పరిస్థితులకు ప్రతిబంబాలుగా నిలుస్తున్నాయి. బౌద్ధమతంలో వజ్రయాన శాఖ వీరి కాలంలో ఆవిర్భవించినది. ఈ శాఖ వలన బౌద్ధానికి ఉన్న కీర్తి, ప్రతిష్టలు అడుగంటినవి. మొదటి మాధవ వర్మ, మొదటి గోవిందుడు బౌద్ధమతాన్ని ఆచరించారు. 'ఇంద్రపాల నగర' తామ్ర శాసనాల వల్ల వీరు బౌద్ధమతానుయాయులని ఈ రాజులలో గోవిందవర్మ బౌద్దాన్ని ఆదరించి పోషించారని తెలుస్తున్నది. గోవింద వర్మ భార్య మహాదేవి తన పేర 'విహారం' నిర్మించడం వలన ఈ విషయం రుజువవుతున్నది. 

శైవం

కీసరలో రామలింగేశ్వరాలయం నిర్మించిన రెండవ మాధవ వర్మ మొదట బౌద్ధమతస్థుడుగా ఉండి మహాదేవిని వివాహమాడి తరువాత వైదిక మతాన్ని అవలంభించాడు. 

జైనం

విష్ణుకుండినుల కాలంలో జైనమతం పూర్తి క్షీణదశలో ఉండినదని చెప్పవచ్చును. జైనులలోని 'కాపాలిక' జైనులు తెలంగాణలో జైనమతం అంతరించడానికి ముఖ్యకారణమైనారు. 'జైన మహర్షి' వ్రాసిన 'పూర్వ మీమాంస' సూత్రాలపై కుమారిల భట్టు 'తంత్ర వార్తిక' 'మహాభాష్యం' రచించాడు. రాజుల ఆదరణతో, ప్రోత్సాహంతో బౌద్ధారామాలు, విహారాలు శైవ క్షేత్రాలుగా రూపుదిద్దుకున్నవని ఈ రచనల ద్వారా తెలుస్తున్నది. 

సారస్వతము

విష్ణుకుండిన రాజులు గొప్ప భాషాభిమానులు. మొదటి రాజులు ప్రాకృత భాషను ఆదరించినా మొదటి గోవిందుడు తన పాలనాకాలంలో సంస్కృతం రాజభాషగా మార్చినాడు. విద్వాంసులైన బ్రాహ్మణులకు భూ దానాలిచ్చారు. వేదాధ్యయనానికి, ప్రచారానికి ఘటికా స్థానాలు ఏర్పాటు చేశారు. అనేక వైదిక క్రతువులు నిర్వహించడం ద్వారా తాము బ్రాహ్మణ మతంలో విశ్వాసం కలిగి ఉన్నామని ప్రజలకు చాటి చెప్పినారు. విష్ణుకుండిన రాజులలో ఒక శాసనంలో విక్రమేంద్ర వర్మ 'మహాకవి'గా వర్ణించబడినాడు. 'జనాశ్రయ ఛందో విచ్ఛితి' అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని 'జనాశ్రయ' బిరుదాంకితుడైన మూడవ మాధవ వర్మ రచించినట్లు తెలుస్తున్నది. ఇందులో వివిధ జాతుల పద్యాలున్నాయి. దీనిని బట్టి సంస్కృత భాష రాజాదరణ పొందినట్లు గ్రహించవచ్చును. విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన చిక్కుళ్ళ శాసనంలో 'విజయ రాజ్య సంవత్సరంబుల్' అనే తెలుగు పదము ఉన్నది. 

వాణిజ్యము

విష్ణుకుండినుల కాలములో వర్తక వ్యాపారాలు విశేషముగా సాగినవి. వివిధ వృత్తులకు సంబంధించిన ప్రజలుండుట వలన కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందినవి. 

వాస్తు శిల్పకళలు

విష్ణుకుండిన రాజులు శిల్ప కళకు గొప్ప సేవ చేసినారు. వీరి కాలంలో ప్రత్యేక శిల్ప కళ వృద్ధి చెందింది. తొలి ముగ్గురు రాజులు బౌద్ధ మతానుయాయులు కావడంతో బౌద్దారామ స్తూపాలను నిర్మించినారు. వైదిక మత వ్యాప్తికి అనేక దేవాలయాలను నిర్మించి, గుహాలయాలను తొలపించినారు. ఉండవల్లి గుహాలయాలలో త్రిమూర్తుల విగ్రహాలు, అనంతశయన విష్ణువు దేవాలయం, త్రికూర ఆలయం, సన్యాసుల విశ్రాంతి మందిరాలు గలవు.