క్రీ.శ.4-7 శతాబ్దాల మధ్య విష్ణుకుండినులు తెలంగాణను ప్రాంతాన్ని పాలించారు. కేవలం రాజకీయంగానే కాకుండా సాంస్కృతికపరంగా కూడా ప్రముఖ పాత్ర వహించినారనడంలో సందేహం లేదు. 

విష్ణుకుండినుల చరిత్రకు ఆధారాలు 

కీసరగుట్ట (రంగారెడ్డి జిల్లా) 

తుమ్మలగూడెం శాసనం, 

ఏలేశ్వరం శాసనం (నల్గొండ జిల్లా) గొల్లగుడి, 

గుమ్మడం (మహబూబ్ నగర్ జిల్లా)

నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా), 

తెల్లకుంట (కరీంనగర్ జిల్లా) 

మొదలైన ప్రాంతాల్లో లభ్యమైన పురావస్తు ఆధారాలు, శాసనాలు తుమ్మల గూడెంలో లభించిన 2000 నాణేల ఆధారంగా వీరి చరిత్ర కొంత వరకు తెలుస్తున్నది.

విష్ణుకుండినుల చరిత్రకు ఇన్ని శాసనాల ఆధారాలున్నా కూడా చారిత్రకారులలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వలన, అనేక వాదోపవాదాల వలన వారి చరిత్ర గురించిన సమగ్రమైన మరియు అనుకూలమైన సమాచారం లేకుండాపోయింది. విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు. అతడే శ్రీశైల మల్లిఖార్జున స్వామి అని కీల్ హారన్ అభిప్రాయబడినాడు. మిగతా చరిత్రకారులు శ్రీపర్వత స్వామి శ్రీశైల మల్లిఖార్జున స్వామి కాదని శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ అని విష్ణుకుండినులు అక్కడి దేవుడిని కొలిచే వారని వాదించారు. విష్ణుకుండినుల కులం విషయంలో కూడా చరిత్రకారులలో ఏకాభిప్రాయం లేదు. కొందరు వీరు బ్రాహ్మణులని, కొందరు వీరు క్షత్రియులని అభిప్రాయపడినారు. 

మహారాజేంద్రవర్మ 

విష్ణుకుండిన వంశ స్థాపకుడు మహా రాజేంద్రవర్మ ఇతడినే కొందరు చరిత్రకారులు ఇంద్రవర్మ అనికూడా అన్నారు. కీసర, ఏలేశ్వరం, మిర్యాలగూడ నల్లగొండ, భువనగిరి ఇంద్రపాల నగరం తదితర ప్రాంతాలను ఆక్రమించి క్రీ.శ. 358 ప్రాంతంలో ఇంద్రపాల నగరం రాజధానిగా రాజ్యస్థాపన చేశాడని చరిత్రకారుల వాదన. 

మొదటి మాధవవర్మ 

ఇతడు రాజ్యాన్ని చేపట్టిన తర్వాత మొదట ఉన్న ప్రాంతాలతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, కొల్లాపురం మొదలైన ప్రాంతాలను కూడా తన ఆధిపత్యం కిందకి తెచ్చుకొన్నాడు. గోవింద వర్మ వేయించిన శాసనందో ఇతని ప్రస్తావన కలదు.

మొదటి గోవిందవర్మ 

మొదటి మాధవవర్మ అనంతరం రాజ్యానికి వచ్చిన మొదటి గోవిందవర్మ తొలి విష్ణుకుండిన రాజులలో గొప్పవాడు. కృష్ణా, గోదావరి మధ్య గల ప్రాంతాలను గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కూడా తన రాజ్యం కిందికి తెచ్చుకొన్నాడు. ఇంద్రపురి రాజధానిగానే రాజ్యపాలన చేశాడు. హైదరాబాద్ నగరంలో చైతన్య పురిలో మూసీనదీ తీరంలో లభించిన ప్రాకృత శాసనం ఇతని పేరు మీద వెలసిన విహారాన్ని గురించి వివరిస్తున్నది. మంచి రాజనీతిజ్ఞుడే కాకుండా పరాక్రమవంతుడు కూడా. తీరాంధ్రలో గుణపాశ పురంలో బలవంతుడైన మూలరాజ వంశస్థుడైన పృథ్వీ మూలుని కుమార్తె అయిన మహాదేవిని వివాహమాడి వారి సహాయంతో శాలకాయనులనోడించి రాజ్య విస్తరణ చేశాడు. గోవింద వర్మ భార్య మహాదేవి బౌద్ధమతాభిమాని. ఆమే ఇంద్రపురిలో తన పేర 'చాతుర్దదశార్య' సంఘ భిక్షువులకు ఒక మహా విహారాన్ని నిర్మించి ఇచ్చింది. ఆ మహా విహారానికి గోవిందవర్మ పేణ్కపటి (పనకబండ) గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశాడు. ఈ గ్రామం ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని 'మోత్కూరు' తాలూకాలో కలదు. ఈ సంఘటనను బట్టి ఆంధ్రదేశంలో బౌద్ధమతం కొంత కాలం వర్ధిల్లడానికి గోవిందవర్మ తన శాయశక్తులా దోహదపడినట్లు తెలుస్తున్నది. 

రెండవ మాధవ వర్మ 

ఇతడు శాలంకాయనులు, ఆనంద గోత్రికులను జయించి వేంగి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పల్లవులను ఓడించి గుండ్ల కమ్మ వరకు తిరిగి విష్ణుకుండినుల అధికారాన్ని స్థాపించినాడు. దక్షిణ దేశ రాజ్యాలను జయించిన అనంతరం వాకాటక చక్రవర్తి అయిన రెండవ పృథ్వీసేనుని కూతురు మహాదేవిని వివాహం చేసుకున్నాడు. మాధవ వర్మ తన విజయాలను పురస్కరించుకొని 11 అశ్వమేధ యాగాలు, 1000 క్రతువులు నిర్వహించాడు. తన రాజధానిని ఇంద్రపాల నగరం నుండి అమరావతికి మార్చినాడని కొందరు చరిత్రకారులు, వేంగీ సమీపంలోని దెందులూరుకు మార్చినాడని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడినారు. 'త్రికూట మలయాధిపతి'గా అభివర్ణింపబడినాడు. తెలంగాణలో ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కీసరలో ఉన్న రామలింగేశ్వరాలయం ఇతని కాలంలోనిదే. ఇక్కడ విష్ణుకుండినుల కాలం నాటి కట్టడాలు, దేవాయాలు, దుర్గములు, నాణేలు లభించినవి. నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకాలోని ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున ఆలయాలు, చెరువుగట్టులోని జడల రామలింగేశ్వరాలయం ఇతని కాలంలో కట్టించినవే.