నిషాంత్

డీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) చేసిన కృషి ఫలితంగా తయారైన తొలి దేశీయ మానవరహిత విమానం (యూఏవీ) ఇది. దీన్ని డీఆర్డీవో విభాగమైన ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేసింది. దీన్నిమొబైల్ హైడ్రో-న్యూమాటిక్ లాంఛర్ తో ప్రయోగిస్తే, పారాచ్యూట్ సహాయంతో తిరిగి పొందవచ్చు. ఇది గంటకు 125-150 కి.మీ.ల వేగంతో నాలుగున్నర గంటలు ప్రయాణిస్తుంది. శత్రు భూభాగంలోని సైనిక కదలికలపై నిఘా కోసం, లక్ష్యాలను గుర్తించడానికి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ (ఈఎఎన్టీ), సిగ్నల్ ఇంటెలిజెన్స్ (ఎస్ఏజీఎస్ఈటీ)కి ఉపయోస్తారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు. చక్రాలతో కూడిన ఈ నిషాంత్ ని 'పంచి' అని పిలుస్తారు.

ఏయూఆర్ఎ

శత్రువులకు తెలియకుండా ఆకాశం నుంచి బాంబులను వేసే భారతీయ మానవరహిత గగనతలం నుంచి దాడిచేసే వాహనాన్నే (ఐయూఎస్ఏవీ) ఏయూఆర్ఎ అని పిలుస్తున్నారు. దీని పూర్తి పేరు అటానమస్ ఆన్యూడ్ రిసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్ మాదిరిగా దీనికి కూడా ఒక భారతీయ పేరును నిర్ణయించాల్సి ఉంది. ఇది సంప్రదాయ, న్యూక్లియర్ బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ, శత్రువుల రాడార్ల నుంచి తప్పించుకుని దాడిచేస్తుంది. దీనికి తేజలో వాడిన 'కావేరి' ఇంజిన్ ని ఉపయోగించారు.

లక్ష్య

దీన్ని కూడా డీఆర్డీవోనే అభివృద్ధి చేసింది. ఇది అధిక వేగంతో ప్రయాణించే డ్రోన్ వ్యవస్థ. దీన్ని కొంత దూరం నుంచి నియంత్రించవచ్చు. శత్రు విమానాలను ఎదుర్కోవడంలో భాగంగా పైలట్లకు, సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ డ్రోన్ గాలిలో రెండు లక్ష్యాలను తాడుతో లాక్కొని వెళుతుంది. సైనికులు వీటిని కాల్చడం ద్వారా తర్ఫీదు పొందుతారు. మొదటిసారి డీఆర్‌డీవో లక్ష్యకు సంబంధించిన టెక్నాలజీని ఎల్ అండ్ టీ కంపెనీతో పంచుకుంటుంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిపరిచిన లక్ష్య-2ను ఉత్పత్తి చేయనున్నారు. 'లక్ష్య'ను భూమి లేదా నౌక నుంచి 'జీరో లెన్ లాంఛర్'తో ప్రయోగిస్తారు.

నేత్ర

ఐడియా ఫోర్ట్ అనే ముంబయి కంపెనీ, డీఆర్డీవో భాగస్వామ్యంతో తయారు చేసిన తేలికపాటి స్వయం నియంత్రిత మానవరహిత వైమానిక వాహనం. సాలీడు ఆకారంలో ఉండే దీని బరువు 1.5 కిలోల కంటే తక్కువ. వీటిని ప్రాథమికంగా సీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్), బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లు ఉపయోగించనున్నాయి. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, జగన్నాథ రథయాత్రలోని అశేష జనవాహినిని గమనించేందుకు దీన్ని ఇప్పటికే ఉపయోగించారు. ఈ విమానంలో కెమెరా, వీడియోలతోపాటు థర్మల్ (పరారుణ) కెమెరా కూడా ఉంటుంది. ఇది వైమానిక నిఘాకు, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది.

రుస్తోమ్

ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ 'రుస్తోమ్ దమానియా' కృషికి గుర్తింపుగా డీఆర్‌డీవో దీనికి రుస్తోమ్ అని నామకరణం చేసింది. ఇది మధ్యంతర ఎత్తులో అధిక కాలం ఎగిరే మానవ రహిత యుద్ధ గగనతల వాహనం. (ఎమ్ఏఎల్ ఈ-యూసీఏవీ). రుస్తోమ్ అటానమస్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ (ఏటీవోఎల్) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రుస్తోమ్-2 అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్లను పోలి ఉంటుంది. ఎల్ అండ్ టీ కంపెనీ రుస్తోమ్-2ను డీఆర్డీవో సహాయంతో మరింత ఆధునీకరించనుంది.

హెచ్ఎఎల్-తేజస్

ఇది తేలికపాటి యుద్ధ విమానం (లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్-ఎల్ సీఏ). ఒకే సీటు, ఒకే ఇంజితో ఉండే తోకలేని ఫైటర్ విమానాన్ని దేశీయ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) అభివృద్ధి చేసింది. ఎల్‌సీఏ ప్రోగ్రాంలో భాగంగా తయారైన ఈ విమానానికి 'తేజస్' అని అటల్ బిహారీ వాజ్ పేయి నామరణం చేశారు. 1980 వరకు భారత్ విదేశీ యుద్ధ విమానాల కొనుగోలుకు బిలియన్ల అమెరికన్ డాలర్లను వెచ్చించింది. విదేశీ రక్షణ వ్యవస్థలపై ఆధారపడకుండా, దేశీయ తేలికపాటి యుద్ధ విమానాలు తయారు చేసే లక్ష్యంతో ఎల్ సీఏ ప్రోగ్రామ్ ని 1983లో ప్రారంభించారు. 2001లో మొదటిసారి ఎల్ సీఏ గాల్లో ఎగిరింది. సూపర్ సోనిక్, మల్టీరోల్ టాక్టికల్, అడ్వాన్స్డ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మార్క్-I ని అభివృద్ధి చేసి తేజస్ మార్క్-II ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేయనున్నారు. రఫెల్ యుద్ధ విమానాలకు బదులు 120 దేశీయ తేజస్ విమానాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) సమకూర్చుకోనుంది.