మైసూరులోని తుళువనాడు వీరి జన్మస్థలం కావడం వల్ల వీరి వంశానికి ఆ పేరు వచ్చింది. తుళువ వంశానికి మూలపురుషుడు తిమ్మరాజు. తుళువ నరసనాయకుడికి ముగ్గురు భార్యలు. పెద్ద భార్య కుమారుడు వీరనరసింహరాయలు. రెండో భార్య నాగాంబ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు, మూడో భార్య కుమారులు శ్రీరంగదేవరాయలు, అచ్యుతదేవరాయలు. వీర నరసింహరాయలు వీర నరసింహరాయలపై నాటి బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా దండెత్తి రాగా, రాయలి సామంతులు అతడిని ఓడించారు. ఉమ్మత్తూరు, శివసముద్ర రాష్ట్ర పాలకులు తిరుగుబాటు చేయగా, వారిని అణిచివేసే యత్నంలో వీర నరసింహరాయలు మరణించాడు. దీంతో అతడి తమ్ముడైన శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. 

శ్రీకృష్ణదేవరాయలు

తుళవ వంశంలోనే కాకుండా విజయనగర చరిత్రలో అద్వితీయుడు, మహోన్నతుడు. ఇతడు అధికారంలోకి వచ్చేనాటికి సామ్రాజ్యం అస్తవ్యస్తంగా ఉంది. తీరాంధ్ర దేశంలో గజపతులు, బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్ షా, గోల్కొండ పాలకుడు కులీకుతుబ్ షా వియజనగర సామ్రాజ్యాన్ని కబళించడానికి పూనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిని ప్రదర్శించాడు. 1510లో పోర్చుగీసు వారితో సంధి చేసుకుని, అశ్విక దళాన్ని పటిష్టం చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు రాజ్య విస్తరణ కోసం అనేక దిగ్విజయ యాత్రలను కొనసాగించాడు. 1510-11 కాలంలో బహమనీ రాజ్యంపై దండెత్తి రాయచూర్, ముద్గళ్ ప్రాంతాలను ఆక్రమించాడు. అప్పటికే బహమనీ సామ్రాజ్యం క్షీణించి బీరార్, బాజీపూర్, బీదర్, అహ్మద్ నగర్, గోల్కొండ అనే అయిదు స్వతంత్ర్య రాజ్యాలుగా విడిపోయింది. 1510 లో బీదర్ లో అహ్మద్ బరీద్ అనే సేనాని, సుల్తాన్ మహ్మద్ షాను బంధించి తనను తాను సుల్తాన్ గా మహ్మద్ షాను బంధించి తనను తాను సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. దీంతో బీదర్ ప్రజల కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు దండెత్తి గుల్బర్గా వరకు వెళ్లి, బరీద్ ను శిక్షించి, సుల్తాన్ ను విడిపించి, మహమ్మద్ షా అధికారాన్ని పునరుద్ధరించాడు. దీనికి చిహ్నంగా 'యవనరాజ్య స్థాపనాచార్య' అనే బిరుదు ధరించాడు.

దక్షిణదేశ దండయాత్రలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు 1512-13లో పెనుగొండ, ఉమ్మత్తూరు, శివసముద్ర దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. తన ప్రతినిధిగా చిక్కరాయలను నియమించాడు. శ్రీకృష్ణదేవరాయలి తూర్పు దిగ్విజయ యాత్ర 1513లో ఉదయగిరి ఆక్రమణతో ప్రారంభమై 1519లో ముగిసింది. కొండ వీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం మొదలైన ప్రాంతాలను వశపరచుకుని గజపతుల రాజధాని కటకాన్ని చేరుకున్నాడు. దీంతో ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తె అన్నపూర్ణాదేవిని ఇచ్చి వివాహం జరిపించి, కృష్ణదేవరాయలితో సంధి చేసుకున్నాడు. రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో నిమగ్నమై ఉండగా, బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలు 1520 లో బీజాపూర్ పై దండెత్తి రాయచూర్ యుద్ధంలో ఓడించి, అంతర్వేదిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇలా శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశానికి తిరుగులేని సార్వభౌముడు అయ్యాడు.

శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో అనేక చెరువులు, కాలువలు, బావులు తవ్వించి సాగునీటి వసతి కల్పించి వ్యవసాయాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఇతడి కాలంలో విజయనగర ఆస్థానంలో వసంతోత్సవాలు జరిగేవి. రాయల ఆస్థానానికి 'భువన విజయం' అనే పేరుంది. తెలుగు భాషలోని మాధుర్యాన్ని గ్రహించి 'దేశభాషలందు తెలుగు లెస్స' అని వ్యాఖ్యానించాడు. సంస్కృత సారస్వతానికి మిహిరభోజుడు ఎంత సేవ చేశాడో కృష్ణదేవరాయలు తెలుగు భాషకి అంత సేవ చేసి 'ఆంధ్రభోజుడనే' బిరుదు పొందాడు.

అల్లసాని పెద్దన రాయల ఆస్థాన కవి. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాభిమాని. అద్వైత మతాచార్యుడైన వ్యాసరాయలు ఇతని గురువు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఈయన రచించిన 'ఆముక్తమాల్యద'ను తెలుగు సాహితీ రంగంలో ఉత్తమ శ్రేణి గ్రంథంగా పేర్కొంటారు. ఆముక్తమాల్యదను 'విష్ణుచిత్తీయం' అని కూడా అంటారు. ఈ గ్రంథం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గురించి తెలియజేస్తుంది.

శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో భవనాలు, ఆలయ మంటపాలు కట్టించాడు. తిరుపతి, కంచి, శ్రీకాళహస్తి, సింహాచలం, అహోబిలం ఆలయాలకు గోపురాలు, మండపాలను నిర్మించాడు. రాజధానిలో విఠలస్వామి ఆలయాన్ని, హజరా రామస్వామి ఆలయాన్ని నిర్మించాడు. తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం 'నాగలాపురం' అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇతడు 1529 లో మరణించాడు. 

శ్రీకృష్ణ దేవరాయల సైనిక విజయాలు

హంపీ విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు జులై 26, 1509 కృష్ణాష్టమి రోజున పట్టాభిషేకం జరిగినట్లు అతడు వేయించిన మొదటి శాసనం వల్ల తెలుస్తోంది. ఇతడు విజయనగర రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు. ఇతడు చేసిన దండ యాత్రలు అన్నీ విజయవంతమయ్యాయి. రాజ్యం అత్యంత వైభవంగా సిరిసంపదలతో విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కృష్ణదేవరాయలు ప్రారంభదశలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. రాజ్యానికి వచ్చేసరికి పరిస్థితులు సజావుగా లేవు.మైసూరు ఉమ్మత్తూర్ రాజు విజయనగర రాజ్యానికి సవాలుగా పరిగణించాడు. ఉత్తర ఈశాన్య ప్రాంతంలో కళింగ రాజులు (గజపతులు) ఆధిపత్యం చెలాయించారు. కళింగ గజపతి ప్రతాపరుద్రుడు విజయనగర రాజ్యంపై శత్రుత్వంతో తిరుగుబాటు చేస్తున్నాడు. కృష్ణదేవరాయల కాలం నాటికి బహుమనీ రాజ్యం అయిదు భాగాలుగా చీలిపోయింది. అయినప్పటికీ బీజాపూర్ సుల్తానుల నుంచి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉండేది.

కొత్తగా పోర్చుగీసు వారు భారతదేశంలో తమ స్థావరాలను ఏర్పరచుకుని, దక్కను పశ్చిమ ప్రాంతంలో ఓడరేవుల మార్గా లను వ్యాపారం కోసం తమ అధీనంలో ఉంచుకున్నారు. కృష్ణదేవరాయలు క్రమేణా పోర్చుగీసువారితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వారు కృష్ణదేవరాయల సహాయంతో బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి గోవాను ఆక్రమించారు. దేవరాయలకు మేలు జాతి గుర్రాలను సరఫరా చేశారు. బీదరు సుల్తాన్ మహమ్మద్ షా జిహాద్ ప్రకటించి, విజయనగర రాజ్యంపై దండయాత్ర చేశాడు. బహమనీ సుల్తానులందరూ బీదర్ లో సమావేశమై సుల్తాన్ మహమ్మద్ నాయకత్వంలో రాయల రాజ్యంపై దండెత్తారు. దివానీ యుద్ధంలో కృష్ణదేవరాయలు మహమ్మద్ షాను ఓడించాడు. యూసఫ్ ఆదిల్ ఖాన్ ను కోవిలకొండ యుద్ధంలో రాయలు ఓడించాడు. కోవిలకొండ కోటను స్వాధీనం

చేసుకున్నాడు.

బీజాపూర్, బహమనీ సుల్తానుల మధ్య కలహాలను ఆసరాగా తీసుకొని అదను చూసి రాయలు రాయచూర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ నుంచి తన విజయ యాత్రలో గుల్బర్గా, బీదరు పట్టణాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాలకు గుర్తుగా 'యవన రాజ్య స్థాపనాచార్య' 'యవన కోణీభస్థాపక' అనే బిరుదులు పొందాడు. పెనుగొండ, ఉమ్మత్తూరు, శివసముద్రం కోటలపై దాడి చేశాడు. ఈ ప్రాంతాలన్నింటినీ రాయలు తన రాజ్యంలో విలీనం చేశాడు. ఉమ్మత్తూర్ శివసముద్రం ప్రాంతాలన్నిం టినీ కలిపి శ్రీరంగ పట్టణం రాజధానిగా ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేశాడు. క్రీ.శ. 1513 నుంచి 1519 వరకు అనేక యుద్ధాల్లో రాయలు కళింగ గజపతులను ఓడించి ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం, పొట్నూరు, సింహాచలం ప్రాంతాలను స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కళింగ గజపతి ప్రతాపరుద్రుడి రాజధాని కటకం (నేటి కటక్)పై దండెత్తి సంధి కుదుర్చుకున్నాడు. ఆనాడు తెలంగాణా ప్రాంతమంతా కళింగ గజపతుల అధీనంలో ఉండేది. గజపతులతో అనేక యుద్ధాలు చేసి రాయలు ఈ ప్రాంతాలన్నింటినీ తన రాజ్యంలో విలీనం చేసుకున్నారు. ఈ దండయాత్రల కాలంలోనే పొట్నూరు, సింహాచలంలో రెండు విజయ స్తంభాలు నిలిపాడు. కళింగుల రాజధాని కటకను స్వాధీనం చేసుకొని ప్రతాపరుద్రుడి కూతురుని వివాహం చేసుకున్నాడు. అయితే రాయలు విశాల హృదయంతో కృష్ణానదికి ఉత్తర దిశలో ఉన్న భూభాగాలన్నింటినీ తిరిగి కళింగ ప్రతాపరుద్రుడికి ఇచ్చివేశాడు. ఈ కళింగ దండయాత్రలు పూర్తి చేసుకొని విజయ సూచికగా తన భార్యలైన తిరుమలదేవి, చిన్నాదేవి లతో తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించాడు. కృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర జరుపుతున్నప్పుడు బీజాపూర్ సుల్తాన్ 'ఇస్మాయిల్ ఆదిల్ షా' రాయచూరును తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అందువల్ల బీజాపూర్ పై రెండోసారి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో బీజాపూర్ సైన్యాలు చిత్తుగా ఓడిపోయాయి. తర్వాత బెల్గాం, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరార్ రాజ్యాల సుల్తానుల విజయ నగర సామ్రాజ్యానికి బద్ధ శత్రువులయ్యారు. 

శ్రీకృష్ణదేవరాయల పరిపాలన విధానం

శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనాదక్షుడు, రాజకీయవేత్త. మొత్తం దక్షిణా పథం అంతా అతడి అధీనంలోకి వచ్చింది. ఎంతోమంది సామంతరాజులు ఉండేవారు. మొత్తం సామ్రాజ్యం - మహారాజు ప్రత్యక్ష పాలనలో ఉండేది. సామ్రాజ్యాన్ని అనేక భాగాలుగా విభజించి రాజప్రతినిధుల అధీనంలో ఉంచారు. సైనికాధికారులే రాజప్రతినిధులుగా ఉండేవారు. వీరికి పాలన స్వేచ్చ ఉండేది. రాజు కోరిన సమయంలో అవసరమైన సైనిక దళాలను రాజప్రతినిధులు సరఫరా చేసేవారు. ప్రతి సంవత్సరం చక్రవర్తికి నిర్దేశించిన మొత్తం డబ్బును రాజు ఖజానాకు చెల్లించాలి.

శ్రీకృష్ణదేవరాయలి మరణం తర్వాత అచ్యుతదేవరాయలు (1529 - 42) పరిపాలించాడు. 1542 - 43 లలో మొదట వెంకటపతిరాయల పాలన సాగింది. 1543 నుంచి 1570 వరకు సదాశివరాయలు పాలించాడు.

రాక్షస తంగడి యుద్ధం

భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధాల్లో రాక్షస - తంగడి యుద్ధం ఒకటి. దీన్నే 'బన్నీహట్టి' యుద్ధం అని కూడా పిలుస్తారు. దక్కన్ సుల్తాన్లలోని అంతఃకలహాలను అవకాశంగా తీసుకుని రామరాయలు వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నాడు. అహ్మద్ నగర్, గోల్కొండ సుల్తానులకు సహాయంగా బీజాపూర్ పై దండెత్తాడు. తర్వాత బీజాపూర్ తో కలిసి అహ్మద్ నగర్‌ను ధ్వంసం చేశడు. చివరికి రామరాయల కుట్రను గ్రహించిన సుల్తానులు తమలో విభేదాలను మరచి, ఐకమత్యంతో కూటమిగా ఏర్పడి 1565 లో విజనగర సామ్రాజ్యంపై దండెత్తారు. విజయనగరానికి 10 మైళ్ల దూరంలోని రాక్షస - తంగడి అనే గ్రామాల మధ్య ఉన్న మైదానాల్లో ఉభయ పక్షాలు తలపడ్డాయి. యుద్ధ ప్రారంభంలో విజయం అళియ రామరాయలకే దక్కింది. కానీ, ముస్లిం సైన్యాలు 20 మైళ్లు వెళ్లి విజయనగర సైన్యాలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు మెరుపుదాడికి పాల్పడ్డాయి. రామరాయలను అహ్మద్ నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాంషా అతిక్రూరంగా హతమార్చాడు. విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మైత్రి కుదుర్చుకున్న సుల్తానుల కూటమి మళ్లీ విడిపోయి ఎవరికి వారు విడిగా వ్యవహరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని 1570 లో విజయనగరాన్ని పాలించిన అరవీటి వంశం (నాలుగోది) పెనుగొండను రాజధానిగా చేసుకుని 1680 వరకు పాలన సాగించింది.