అగ్ని క్షిపణులు 

మధ్యంతర నుంచి ఖండాంతర వ్యాప్తి ఉన్న ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల అగ్ని శ్రేణి క్షిపణులు 5 రకాలు. అగ్ని-I, అగ్ని-II, అగ్ని-III క్షిపణులను 2008 నాటికి అభివృద్ధి చేశారు. అగ్ని IV, V, VI రకం క్షిపణులు అభివృద్ధి, పరిశోధన దశలో ఉన్నాయి.

పృథ్వీ: 

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. ఐజీఎండీపీలో భాగంగా డీఆర్డీవో పృథ్వీ క్షిపణులను అభివృద్ధి చేసింది.

ఆకాశ్:

ఉపరితలనం నుంచి గగన తలానికి (ఎస్ఏఎం) ప్రయోగించగల సూపర్‌సోనిక్ మధ్యంతర క్షిపణి. సుమారు 25 కి.మీ.ల ఎత్తులోని యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ఇది కూల్చివేయగలదు. దీన్నే ఇంటర్ సెప్టార్ మిస్సైల్ గా ఉపయోగించవచ్చు. ఆకాశ్ తొలి బహుళ లక్ష్య (మల్టీపుల్ టార్గెట్) క్షిపణి.

త్రిశూల్:

ఉపరితలం నుంచి గగన తలానికి (ఎస్ఏఎం) ప్రయోగించే సత్వర ప్రతిచర్య (క్విక్ రియాక్షన్) రకానికి చెందిన క్షిపణి. దీని వ్యాప్తి 9 కి.మీ.లు ఇది తక్కువ ఎత్తులో ఎగిరే వస్తువులను (ఫ్లైయింగ్) కూల్చివేయగలదు. త్రివిధ దళాలు ఉపయోగించవచ్చు.

నాగ్:

ఇది మూడో తరానికి చెందింది. ఫైర్ అండ్ ఫర్ గెట్ రకానికి చెందిన యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి (ఏటీఎం - యాంటీ ట్యాంకు మిస్సైల్). ఇది సుమారు 4-5 కి.మీ.ల దూరంలోని ట్యాంకులను ధ్వంసం చేస్తుంది. ఫైబతో నిర్మితమైన మొదటి ఏటీఎం. నాగ్ క్షిపణిని రెండు రకాలుగా అభివృద్ధి పరిచారు. అవి 1) పదాతి దళం కోసం నాగ్ మిస్సైల్ కారియర్ (ఎస్ఏఎంఐసీఏ) పై ఉపయోగించే క్షిపణి, 2) వైమానిక దళం కోసం హెలికాప్టర్ నుంచి ప్రయోగించగల హెలీనా (హెచ్ఈఎల్‌ఎస్ఏ) రకం క్షిపణి. హెలీనా వ్యాప్తి 7-8 కి.మీ.లు. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఎఎల్) అభివృద్ధి చేసిన ధ్రువ్ లేదా లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్ సీహెచ్)లలో అమర్చవచ్చు.

అస్త్ర:

యాక్టివ్ రాడార్ రోమింగ్ వ్యవస్థను కలిగిన, బియాండ్ విజిబుల్ రేంజ్ - గగనతలం నుంచి గగనతలానికి (బీవీఆర్ఎఏఎం) ప్రయోగించగల క్షిపణి అస్త్ర. దీన్ని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. మొత్తం 8 సార్లు దీన్ని పరీక్షించారు. ఇది వేర్వేరు దూరాలు, ఎత్తుల్లో ఉండే లక్ష్యాలను ఛేదిస్తుంది. 20 కి.మీ.ల లోపు ఉండే స్వల్ప అవధి లక్ష్యాల నుంచి 80 కి.మీ.ల వరకు ఉండే దీర్ఘ అవధి లక్ష్యాలను ఛేదిస్తుంది. దీన్ని చివరిసారిగా మార్చి 18, 2015న సుఖోయి-30 యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. దీన్ని హెచ్ఎఎల్ అభివృద్ధి చేసిన తేజస్, ఏఎంసీఏ, ఎఫ్ జీఎస్ఎ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కూడా ప్రయోగించే అవకాశం ఉంది.


కె-15 సాగరిక

అణు త్రయం(న్యూక్లియర్ ట్రయాడ్)లో భాగంగా 700 కి.మీ.ల వ్యాప్తిలోని లక్ష్యాలపై అణ్వస్త్రాలను, జలాంతర్గామి నుంచి ప్రయోగించగల క్షిపణి ఇది. దీన్ని అరిహంత్ రకం జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని హైదరాబాద్ లోని డీఆర్డీవో క్షిపణుల సమూహం (డీఆర్డీఎల్ ఎ ఏఎల్ ఎ ఆర్ సీఐ) అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి వ్యవస్థను బలోపేతం చేయడానికి 3-4 రకం క్షిపణిని డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. దీని ప్రభావాత్మక లక్ష్య దూరం 3,500 కి.మీ.లు. కె-రకం క్షిపణులు ఎస్ఎల్ బీఎం (సబ్ మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్) రకానికి చెందిన ఎదురు దాడి (సెకండ్ స్ట్రైక్) సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

శౌర్య

ఈ క్షిపణి సాగరికను పోలిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్, హైపర్‌సోనిక్ టాక్టికల్ క్షిపణి. ఇది గొట్టపు కవచం (క్యానిస్టర్)లో నిక్షిప్తమై ఉండటం వల్ల దీన్ని దీర్ఘకాలం సరిహద్దుల్లోని నేలమాళిగల్లో అమర్చవచ్చు. శత్రుదేశాల నిఘా వ్యవస్థలు, ఉపగ్రహాలు వీటిని గుర్తించలేవు. ఇవి మున్ముందు ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) నుంచి సహాయాన్ని పొంది ఉపరితలం నుంచి ఉపరితలానికి చెందిన లక్ష్యాలను గురితప్పకుండా ఛేదిస్తాయి.

ప్రహార్

ఇది తక్కువ ఖర్చుతో, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఏ భూభాగంలోనైనా అత్యంత కచ్చితత్వంతో పనిచేసే సత్వర ప్రతిచర్య (క్విక్ రియాక్షన్) రకానికి చెందిన ఘన ఇంధన రాకెట్. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల తక్కువ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. ఈ ఘన ఇంధన రాకెట్లను రెండు, మూడు నిమిషాల్లో ప్రయోగించవచ్చు. ఇది టాక్టికల్, స్ట్రాటజిక్ లక్ష్యాలను ఛేదించడంలో భారతీయ సైన్యానికి, నావికా దళానికి ఉపయోగపడుతోంది. ప్రహార్ క్షిపణిని 'ప్రగతి' పేరుతో విదేశాలకు ఎగుమతి చేయనున్నారు.

నిర్భయ్

ఇది దీర్ఘవ్యాప్తి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో అత్యంత కచ్చితత్వంతో, రహస్యంగా భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. దీని వ్యాప్తి 800 కి.మీ.ల కంటే ఎక్కువ. అణ్వస్త్రాలను మోసుకుని వెళ్లే నిర్భయ్ క్షిపణులను సుఖోయ్ విమానాల్లో అమర్చనున్నారు. ఇది భారత తొలి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి.

అమోఘ-1

ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండో తరానికి చెందిన యుద్ధట్యాంక్ విధ్వంసక (ఏటీఎం) క్షిపణి. దీన్ని హైదరాబాద్ కి చెందిన భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) రూపొందించి అభివృద్ధి చేసింది. 2.6 - 2.8 కి.మీ.ల లక్ష్య వ్యాప్తితో ఉన్న రెండు క్షిపణులను సెప్టెంబరు 10న మధ్యప్రదేశ్ లోని బాబిన ఆర్మి రేంజ్ లో విజయవంతంగా పరీక్షించారు. పినాక (మిస్సైల్ కమ్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్) ఈ క్షిపణిని పదాతి దళం కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. ఇది బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థ, 40 కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను కేవలం 44 సెకన్ల వ్యవధిలో 12 రాకెట్లతో చేధించగలదు. క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి వీటిని కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు. పినాక - మార్క్ 2 రకం వ్యాప్తి 65 కి.మీ.లు

బరాక్

ఇవి ఉపరితలం నుంచి గగనతలానికి (ఎస్ఏఎం) ప్రయోగించగల క్షిపణులు. వీటిని ఇజ్రాయిల్, భారత్ లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. గగనతలం నుంచి వచ్చే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే బరాక్-8 క్షిపణులు 360 డిగ్రీల విస్తృత దృక్ వ్యాప్తిని కలిగి ఉంటాయి.

బీఎండీ (బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్) వ్యవస్థ

ప్రధానంగా దేశంలోని దిల్లీ లాంటి ప్రముఖ నగరాలపై శత్రుదేశాలు క్షిపణులను ప్రయోగించినప్పుడు వాటిని గగనతలంలోనే ఎదుర్కొని ధ్వంసం చేయడానికి బీఎండీ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇది రెండంచెల వ్యవస్థ. మొదటి రకం అధిక ఎత్తులో నుంచి వచ్చే క్షిపణులను మధ్యలోనే కూల్చివేయగల పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ (పీఏడీ) ఇంటర్ సెప్టార్ క్షిపణి వ్యవస్థ. రెండోది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ) వ్యవస్థ. ఇది తక్కువ ఎత్తులో దాడి చేసే క్షిపణులను ప్రయాణమార్గంలోనే కూల్చివేస్తుంది. ఈ రెండంచెల వ్యవస్థ 5000 కి.మీ.ల దూరం నుంచి వచ్చే అణ్వస్త్ర సహిత క్షిపణులను కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.

వరుణాస్త్ర

ఇది స్వయం చోదిత, నీటి అడుగు నుంచి ప్రయోగించే క్షిపణి (టార్పెడో). ఈ క్షిపణి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను జలాంతర్గామి నుంచి శత్రు నౌకలపైకి ప్రయోగిస్తుంది. దీన్ని విశాఖపట్నంలోని ఎన్టీ ఎస్ఎల్ (నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ) అభివృద్ధి చేసింది. మైత్రి భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ప్రోగ్రాం.

లహత్

ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న లేజర్ హోమింగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి. వీటిని అర్జున్ మార్క్-2 ట్యాంక్ పై అమర్చాలి. అయితే భారత సైన్యం వీటి పనితీరుతో సంతృప్తి చెందకపోవడం వల్ల నిషేధించింది.

బ్రహ్మో స్

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. భారత్ లోని బహ్మపుత్ర,  రష్యా లోని మాస్కోవా నదుల పేర్ల నుంచి 'బ్రహ్మోస్' అనే పేరును రూపొందించారు. రష్యా సహకారంతో హైదరాబాద్ లోని డీఆర్‌డీవో తయారుచేసిన బ్రహ్మోస్-1 వ్యాప్తి 300 నుంచి 500 కి.మీ.లు, వేగం 2.8 మ్యాక్.  దీన్ని విమానం, నౌక, సబ్ మెరైన్ లేదా ఉపరితలం నుంచి ప్రయోగించవచ్చు. ఇది బహుళ లక్ష్యాలపై కేవలం మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగలదు. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల దీన్ని శత్రుదేశాల రాడార్లు గుర్తించలేవు. సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించడం వల్ల దీన్ని ఏ ప్రతిక్షిపణీ ఎదుర్కోలేదు.

అమెరికా టొమహాక్ క్షిపణుల కంటే ఇవి ఎన్నో రెట్లు మేలైనవి. ఉపరితల, సముద్ర రకం బ్రహ్మోస్ క్షిపణులు ఇప్పటికే ఉపయోగించే స్థితిలో ఉన్నాయి. జలాంతర్గామి, వైమానిక క్షిపణి రకాలు శోధన స్థితిలో ఉన్నాయి. సుమారు 7 మ్యాక్ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ మార్క్-2 రకం హైపర్ సోనిక్ క్షిపణిని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. కలాం జ్ఞాపకార్థం ఈ క్షిపణిని బ్రహ్మోస్-2కె ('కె' అంటే కలాం) అని పిలవనున్నారు. పదాతి దళాల కోసం ఉపయోగించే మొబైల్ అటానమస్ లాంచర్(ఎంఏల్ వాహనం)లో మూడు బ్రహ్మోస్ క్షిపణులు, సమాచార, రాడార్ వ్యవస్థలు అమర్చి ఉంటాయి.