ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో అనేక బౌద్ధ నిర్మాణాలు జరిగాయి. వీటిలో స్థూపాలు, విహారాలు, చైత్య గృహాలు కలవు. 1927-1960 మధ్య కాలంలో జరిపిన త్రవ్వకాల వలన బౌద్ధ శిధిల నిర్మాణాలు, అద్భుత శిల్ప కళాఖండాలు బయల్పడ్డాయి. వీర పురుష దత్తుని ఆరవ రాజ్య పాలనాకాలంలో అతని సోదరి శాంతి సిరి శ్రీ పర్వతం పై పాడుపడి ఉన్న మహాచైత్యాన్ని పునఃనిర్మించింది. ఇచ్చట గల ఒక ఆయక స్థంభం మీద ఇక్ష్వాకుల నాటి ప్రాకృత శాసనంలో చైత్యంలో బుద్ధ ధాతువు నిక్షిప్తము చేసినట్లు పేర్కొనబడింది. స్థూపం అడుగు భాగాన నైరుతి వైపు గల గూడులో ఒక చిన్న బంగారు భరిణె అందులో దంతం అవశేషం లభించింది.

ఉపాసిక బోధి సిరి నాగార్జున కొండలో చుళదమ్మగిరి పై ఒక చైత్యాలయాన్ని, ఒక చతుశ్శాలను నిర్మించింది. ఇది విదేశాలలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసే భిక్షువుల కోసం నిర్మించబడింది. శ్రీ పర్వతంలో బౌద్ధ భిక్షువుల నివాసం కొరకు సింహళ రాజు ఒక విహారాన్ని నిర్మించాడు. వీరు దేశ విదేశాలలో హీనయాన మతాన్ని ప్రచారం చేశారు. ఈ విహారాన్ని సింహళ విహారమని పిలిచేవారు. ఈ విహారానికి బోధి సిరి ధన సహాయం చేయడమే కాక ఆ విహారంలో ఉన్న బోధి వృక్షానికి ఒక వేదికను నిర్మించినట్లు అచ్చట గల శాసనంలో ఉంది.

నాగార్జున కొండ లోయలో త్రవ్వకాలలో సుమారు 30 విగ్రహాలు బయల్పడ్డాయి. వీటిలో ఒక విహారాన్ని భట్టీదేవి నిర్మించింది. దీనికి దేవి విహారం అని పేరు. థేరవాద విహారాల ప్రసక్తి ఉపాసిక బోధి సిరి వేయించిన శాసనంలో ఉన్నది. ఈమె చుళదమ్మ గిరి పై ఒక చైత్యాలయాన్ని నిర్మించింది. కొడబలి సిరి ఒక థేరవాద విహారాన్ని నిర్మించింది. ఎహువల శాంతమూలుని శాసనంలో ప్రస్తావించబడిన కుమార నంది విహారాన్ని కనుగొనడం జరిగింది. దీనిని కుమార నంది అనే శ్రేష్ఠి నిర్మించి అందులో బుద్ధుని శిలా విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కొడబలి సిరి కూడా ఆరామాలకు దానాలు చేసి, శాసనాలు వేయించింది.

నాగార్జున కొండ లోయ త్రవ్వకాలలో శిధిలాల నుండి అనేక శిల్పాలు, బుద్ధ విగ్రహాలు వెలికి తీశారు. బుద్ధుని జీవిత విశేష గాధలను బోధిసత్వుని జాతక కథలలోను గల శిల్పాలు అనేకం లభించాయి. వీటితో పాటు లౌకిక దృశ్యాలు కూడా బయల్పడ్డాయి. బుద్ధుని జననం, మహాభినిష్క్రమణ, సంబోధి, ధర్మచక్ర పరివర్తన, మహాపరి నిర్యాణం, జాతక కథలు, బుద్ధుని విగ్రహాలు త్రవ్వకాలలో బయల్పడిన వాటిలో గలవు. వీటిలో మహాభినిష్క్రమణ ఘట్ట శిల్పం మహోన్నతమైనది.