ఆర్యసమాజం

1892లో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆయన శిష్యుడు స్వామి నిత్యానంద సరస్వతి అదే సంవత్సరం హైదరాబాద్ కు వచ్చి ఆర్యసమాజ శాఖను నెలకొల్పాడు. హిందూ మతంలో కాలదోషం పట్టిన మూఢ నమ్మకాలను దూరం చేసి సిసలైన వేద సమ్మతమైన మత ప్రచారం చేయడమే ఆర్యసమాజం లక్ష్యం. స్వామి దయానందసరస్వతి రచించిన 'సత్యార్థ ప్రకాశం' అనే గ్రంథం ఆర్యసమాజీయులకు మూలగ్రంథం. అనేక కారణాల వలన ఇతర మతాలలో చేరిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చడానికి 'శుద్ధి' ఉద్యమం ప్రారంభించారు.

నిజాం ప్రభుత్వం రాజకీయంగా కాంగ్రెస్ పై ఎంత ద్వేషంతో ఉండేదో, మతపరంగా ఆర్యసమాజం అంటే అంతకంటే ఎక్కువ ద్వేషంతో ఉండేది. హిందువుల ఆత్మగౌరవోద్ధరణ ఆర్యసమాజం యొక్క ప్రధానోద్దేశ్యం. వేద సాహిత్యమంతా సంస్కృతంలో ఉంది. ఆర్యసమాజం ఉత్తర హిందూస్థానంలో జన్మించింది. కాబట్టి ఆర్య సమాజ సాహిత్యం , ఉపన్యాసాలు కూడా దేశవాసులందరికీ ఉపయోగ పడేలాగా జాతీయ భాష అయిన హిందీలో ఉండేవి. కాంగ్రెస్ మహా నాయకులు అందరూ ఆర్యసమాజం వల్ల ప్రభావితులైనవారే టి.హయగ్రీవాచారి, రావినారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బి.వెంకట్రామారావు, రుద్రదేవ్ వెంకటస్వామి మొదలైన వారు ఆర్యసమాజం వేదిక పై పనిచేశారు. ఆ విధంగా ఆర్యసమాజం 1930 నాటికి బహుళ వ్యాప్తి చెంది హిందువులను జాగృతం చేసి నిజాం నిరంకుశ పాలన నుంచి వారు విముక్తి పొందటానికి తన వంతు కృషిని ఆర్యసమాజం చేసింది.

ఆర్యసమాజ బోధకుడైన పండిత బాలకృష్ణ శర్మ నిత్యానందలను నిజాం ప్రభుత్వం రాజ్య బహిష్కృతులను చేసింది. శుద్ధి కార్యక్రమం ప్రారంభించినందుకుగాను 'ఖాజాహసన్ నిజాం' అనే ముస్లిం నాయకుడు నిజాం ప్రభువు సహకారంతో అబ్దుల్ రశీద్ అనే అతని చేత శ్రద్ధానందుడిని 1926 డిసెంబర్ 23న హత్య చేయించడం జరిగింది. నిజాం కళ్ళు తెరిపించడానికి ఆర్యసమాజం శోలాపూర్ లో 1938 డిసెంబర్ 25-29 తేదీల్లో అఖిలభారత ఆర్య మహా సమ్మేళనాన్ని లోకనాయక్ శ్రీ మాధవరావు ఆణె అధ్యక్షతన ఒక దీర్ఘ కాలిక ఉద్యమానికి రూపకల్పన చేసింది. ఈ క్రమంలో శ్రీ దేవీలాల్ జీ నేతృత్వంలో మొదటి సత్యాగ్రహం జరిగింది. నిజాం ప్రభుత్వం వారందరికి సంవత్సర కారాగారశిక్ష విధించింది. హైదరాబాద్ డే

ఆర్యసమాజం హైదరాబాద్ విషయాన్ని జాతీయ సమస్యగా మార్చి, దానికి దేశవ్యాప్త ప్రాచుర్యం తెచ్చే ఉద్దేశ్యంతో మొదటి సారిగా 25 జనవరి, 1939న 'హైదరాబాద్ డే'ను దేశమంతటా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 25 మంది కార్యకర్తలు అరెస్టు కాబడినారు. మార్చి 22, 1939న రెండవసారి, ఏప్రిల్ 22వ 1939వ తేదీన మూడవ సారి, మే 22, 1939వ తేదీన నాల్గవ సారి జూన్ 6, 1939వ తేదీన ఐదవ సారి హైదరాబాద్ డేను నిర్వహించారు. ఆర్యసమాజ కార్యకర్తలపై జరిగిన అకృత్యాలు నిజాం ప్రభుత్వం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆర్య సమాజ కార్యకర్తలను అనేక రకాలుగా వేధించసాగింది. రజాకార్ల సహాయంతో సైనికుల సహాయంతో అనేక అకృత్యాలు చేయడం జరిగింది. ఎబలా అనే గ్రామంలో మహదేవ్ అనే కార్యకర్తను 1938 జూలై 17న హత్య చేశారు. 1938 ఆగస్టు 2వ తేదీన నిజామాబాద్ లోని కోటగల్లి ప్రాంతంలో రాధాకృష్ణ అనే కార్యకర్తను దొంగచాటుగా కత్తులతో పొడిచి హత్య చేశారు. 1938 డిసెంబర్ లో గుంజోటిలో దేవప్రకాశ్ ను ముస్లింగా మార్చడానికి ప్రయత్నించగా ఆయన వ్యతిరేకించగా ఆయనను హతమార్చారు. హైదరాబాద్ రాజ్య ఒక సువిశాలమైన చెరసాల అని ప్రకటించిన పండిత్ నరేంద్రజీపై రాజద్రోహం నేరం మోపి 6 నెలల పాటు జైలులో నిర్బంధించడం జరిగింది. పండితగణపతి లాల్జీ హైదరాబాద్ సంస్థానంలోని ఏ న్యాయస్థానంలో కూడా హిందువులకు న్యాయం జరగదు అని వ్యాఖ్యానించినందుకు మూడు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. కళ్యాణి ప్రాంతంలో ఆర్యసమాజ ప్రచారం చేస్తున్న మోహన్ సింగ్ అనే కార్యకర్తలను చిత్రవధ చేసి హత్యచేశారు. 1937 జూన్ 18వ తేదీన నిజాం ప్రభుత్వం 'యజ్ఞాలు నిషిద్ధం' అని ప్రకటించి, మురఖేలో చౌదరి శ్రీరాం, నాగర్గా లో రఘునాథ ప్రసాద్, ఘనశ్యాం ప్రసాదు శిక్షంచింది. 1939 జూన్ 23వ తేదీన బన్సీలాల్ వ్యాసను అతని వెంటనున్న 18 మందిని లాఠీలతో చితకబాది జైలులో వేయడం జరిగింది. 1938 డిసెంబర్ 16వ తేదీన పండిత్ శాం్యలాల్ జీని బీదర్ జైల్ లో అనారోగ్యానికి మందు ఇస్తున్నట్లు నమ్మించి విషం ఇచ్చి హత్య చేశారు.

ఆంధ్రజన కేంద్ర సంఘం

నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణ ప్రజల్లో 1920 నుండి రాజకీయ చైతన్యం ప్రారంభమైనదని చెప్పవచ్చును. దీనికి కారణమే ఆంధ్రమహాసభ ఏర్పాటు ఆంధ్రమహాసభ మొదట ఆంధ్రజన సంఘంగా ఉండినది. మొదట ఈ సభ తెలుగు భాష, సంస్కృతుల వికాసం కోసం ప్రారంభమైనా తరువాతి కాలంలో వెట్టి చాకిరీ, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించింది.

క్రీ.శ. 12-1-1921వ తేదీన హైదరాబాదు నగరంలో సంఘ సంస్కరణ మహాసభ జరిగింది. ఈ మహాసభకు కార్వే పండితుడు అధ్యక్షత వహించాడు. ఈ సభలో మహారాష్ట్ర, కర్ణాటక నాయకుల ఉపన్యాసము ఆయా నాయకుల మాతృ భాషలలో సాగాయి. శ్రీ ఆలంపల్లి వేంకట రామారావు గారు తెలుగులో ఉపన్యాసం ప్రారంభించగానే సభికులలో ఉన్న మహారాష్ట్ర, కన్నడ మాతృ భాష గలవారు చప్పట్లు చరచుచు, కేకలు వేస్తూ, ఉపన్యాసమును ముందుకు సాగనీయలేదు. ఈ చర్యను అవమానంగా భావించి తెలుగు నాయకులు ఆ రోజు రాత్రి శ్రీ టేకుమాల రామారావుగారి ఇంట్లో సమావేశమై, ఆంధ్ర జనసంఘమును ఏర్పాటు చేశారు.

14 ఫిబ్రవరి 1922వ తేదీన కె.వి.రంగారెడ్డి అధ్యక్షుడుగా, మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో దీని మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రజనసంఘం పేరును నిజాం రాష్ట్ర ఆంధ్రజనసంఘంగా మార్చారు.

తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభ్యున్నతి కోసం కృషిచేయడం ఈ సంఘం లక్ష్యం. తరువాత కాలంలో దీనికి అనుబంధంగా 'ఆంధ్రపరిశోధక మండలి'అనే సంస్థను ఏర్పాటు చేశారు. తాళపత్ర గ్రంథాలను సేకరించడం, శాసనాల ప్రతులను రాయించడం ఈ సంస్థ ముఖ్య విధిగా ఉండేది. కొమర్రాజు లక్ష్మణ రావు మరణించిన తరువాత దీనిని లక్ష్మణరాయ పరిశోధక మండలి' గా మార్చురు. ఈ సంస్థలన్నింటిని సమన్వయపరిచే ఉద్దేశ్యంతో 'ఆంధ్రజన కేంద్ర సంఘం' స్థాపించబడింది.1923 ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రజన కేంద్ర సంఘం మొదటి సమావేశం హనుమకొండలో జరిగింది. 

ప్రధానోద్దేశ్యాలు

  • తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు నెలకొల్పడం 
  • విద్యార్థులను ప్రోత్సహించి సహాయ, సహకారాలు అందించడం 
  • చారిత్రక పరిశోధనా కార్యక్రమాలు ప్రోత్సహించడం 
  • కరపత్రాలు, లఘు పుస్తకాలు, బహిరంగ సభల ద్వారా ప్రజలలో విద్యావ్యాప్తి చేయడం 
  • తెలుగు భాష, సంస్కృతులను, లలితకళలను ప్రోత్సహించడం


Tags :   Arya Samaj     Telangana History   

 Andhra Jana Kendra Sangham    Shuddhi Movement   

 Swamy Dayananda Saraswati    Freedom Movement