విజయనగర రాజుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి అష్టదిగ్గజాల రచనలు ప్రముఖంగా అల్లసాని పెద్దన రచించిన 'మనుచరిత్ర' విదేశీయుల యాత్రాకథనాల ద్వారా కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు కాలం నాటి స్థితిగతులు తెలుస్తాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర వల్ల ఆనాడు నాలుగు వర్ణాల వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రాహ్మణులు పౌరోహిత్యంతో పాటు సైనికులు, పాలకులుగా వ్యవహరించే వారని డోమింగో పెయిస్ రచన ద్వారా తెలుస్తోంది. బ్రాహ్మణులు శాఖాహారులని, బయట ప్రపంచంలోకి వచ్చే వారు కాదని డొమింగో రాశాడు. క్షత్రియులు యుద్ధాల్లో, వైశ్యులు వాణిజ్యంలో ఉండేవారు. శూద్రులను తక్కువ కులంగా భావించేవారు. శ్రమశక్తి అంతా వీరిదే. పోర్చుగీసు యాత్రికుడు ఎడ్వర్డ్ బార్బోజా రచన ప్రకారం విజయనగరం అత్యంత జనసాంద్రత కలిగిన నగరం. వర్తక వ్యాపారాలకు ప్రధాన కేంద్రం. పెగూ దేశం నుంచి రుబీలు, చైనా నుంచి సిల్కు వస్త్రాలు ఇక్కడకు దిగుమతి అయ్యేవని రాశారు. కర్పూరం, చందనం, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు మలబారు తీరం నుంచి వచ్చేవని తెలిపారు. ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి బార్బోసా ఆసక్తికరంగా చెప్పారు. విజయనగర గ్రామాల్లో హిందూ, ముస్లింలు సమైక్యంగా జీవించారని రాశారు. కర్పూరం, చందనం, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు మలబారు తీరం నుంచి వచ్చేవని తెలిపారు. ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి బార్బోసా ఆసక్తికరంగా చెప్పారు. విజయనగర గ్రామాల్లో హిందూ, ముస్లింలు సమైక్యంగా జీవించారని రాశారు. క్షత్రియ కాంతలు సతీసహగమనం చేసేవారు. లింగధారణ చేసే వీరశైవులు కూడా శాకాహారాన్నే భుజించేవారు. బ్రాహ్మణులకు సమాజంలో ఎక్కువ ఆదరణ ఉండేది. భర్త శవంతో పాటు భార్యను కూడా పూడ్చిపెట్టే ఆచారం ఉందని న్యూనిజ్ వర్ణించాడు. న్యూనిజ్ యాత్రాకథనం ప్రకారం రాజాంతః పురాల్లో స్త్రీలను విరివిగా నియమించే వారు. దేవదాసీ పద్ధతి అమల్లో ఉండేది. 'పయస్' కథనం ప్రకారం 'దేవదాసీలకు' సమాజంలో మంచి గౌరవం ఉండేది. సామాన్య ప్రజల్లో పురాణాలు, ఇతిహాసాలు ప్రాచుర్యం పొందాయి. జైన మతాన్ని కూడా ఆదరించారు. తొలి విజయ నగర రాజులు శైవ భక్తులు. తరువాత కాలంలో వైష్ణవ మతాన్ని ఆదరించారు. రామానుజుడి 'వైష్ణవమతం' మాధవుడి 'ద్వైతమతం' ఆదరణ పొందాయి.

ఆ కాలంలో శరన్నవరాత్రులు మహావైభవంగా జరిపేవారు. రాయలు వైష్ణవమతాన్నే అనుసరించినా ఇతర దైవాలకు, దేవాలయాలకు ఉత్సవాల సమయంలో విరివిగా దానాలు చేశారు. సంస్కృత నాటకాలు, తెలుగు యక్షగానాలు, బొమ్మలాటలు విరివిగా ఉండేవి. బొమ్మలాట విరూపాక్షయ్య కొడుకు బొమ్మలాట కాశయ్య రాయలుకు ఆప్తులని 'ఆముక్తమాల్యద' విశదీకరిస్తోంది. రాయలు విద్యావినోదాలు జరిపే సభాభవనం పేరు భువన విజయం. ఆయన నివసించే మందిరం మలయకూటం. సాహిత్యగోష్టిలో ఎనిమిది మంది కవులు పాల్గొనే వారు. ఇది వైష్ణవ సాంప్రదాయం. రాజాంతఃపురాల్లో నృత్య కళాకారిణులుగా, పల్లకీలను మోసేవారుగా పెద్దసంఖ్యలో స్త్రీలను నియమించేవారు. పురుష, మహిళా వస్తాదులుండేవారు.

రైతుల పరిస్థితులు

విజయనగర రాజుల కాలంలో రైతుల పరిస్థితి గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. సమకాలీన విదేశీ యాత్రికులకు గ్రామాల జీవనసరళిపై సరైన అవగాహన లేదని వారి రచనల బట్టి తెలుస్తోంది. అందువల్ల గ్రామీణ వ్యవస్థ గురించి సమాచారం ఎక్కువగా లేదు. అక్కడక్కడా ప్రస్తావించి వదిలేశారు. అయితే గ్రామీణులు ఆర్థిక పరిస్థితుల్లో సామాన్య ప్రజల జీవన ప్రమాణాల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. గ్రామీణులు గుడిసెల్లో నివసించే వారు. అర్ధనగ్నంగా ఉండేవారు. ఉన్నతవర్గ ప్రజలు ఆడంబరమైన జీవితాన్ని గడిపేవారని తెలుస్తోంది.

లలితకళలు

విజయనగర రాజులు దేవాలయంలో నిర్మాణంలో అనుసరించిన నూతన పద్ధతులు విజయనగర శిల్ప శైలి, వాస్తుశైలిగా ప్రసిద్ధి చెందాయి. దేవుడి భార్యకు 'అమ్మగుడి'ని దేవాలయంలో భాగంగా నిర్మించేవారు. కళ్యాణమండపాలు. రాతిరధాలు, సంభామండపాలు, తోరణాలు, సంగీతం పలికించే స్తంభాలు నిర్మాణదశలో వీరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విజయనగరంలో నిర్మించిన విఠలస్వామి దేవాలయం, హజారా రామదేవాలయం విజయనగర శిల్ప, వాస్తుకళలకు మచ్చు తునకలు. తాడిపత్రి, చిదంబరం, కాంచీపురం, మొదలైన ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించారు. విజయనగర రాజులు గొప్ప సాహిత్య పోషకులు. వీరికాలంలో సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో అనేక గ్రంథాలు వెలువడ్డాయి.

సాహిత్య సాంస్కృతిక సేవలు

తొలిదశలో సంస్కృత భాషలో అపారమైన మత సారస్వతం వచ్చింది. వేదాంత దేశికుడు యాదవా భ్యుదయం, హంస సందేశం, సంకల్ప సూర్యోదయం ఉత్తమ రచనలు చేశాడు. మాధవ విద్యారణ్యులు, సాయనాచార్యులు నాలుగు వేదాలు, పరాశర, మనుస్మృతుల మీద భాష్యాలు రాశారు. వేదాంత దేశికుడు - వైష్ణవ మతం మీద, శ్రీకంఠ పండితుడు శైవ సిద్ధాంతం మీద గ్రంథాలు రచించారు. వ్యాకరణ, అలంకార, సంగీత శాస్త్రాలు ఎన్నో వెలువడ్డాయి. ఈ యుగంలో చారిత్రక రచన పేర్కొన తగినది. గంగాదేవి మధురావిజయం, తిరుమలాంబ వరదాంబికా పరిణయం, రామ భద్రాంబ, రఘునాదాభ్యుదయం పేర్కొనదగిన రచనలు. ఈ యుగంలో తెలుగు భాష పునరుజ్జీవం పొందింది. 'దేశభాషలందు తెలుగులెస్స' అని కీర్తించిన కృష్ణదేవ రాయలు ఆంధ్రభోజుడని బిరుదు పొందాడు. తెలుగు భాషలో ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని రచించాడు. సాహిత్యంతోపాటు శిల్పం, చిత్రలేఖనం ఎంతో అభివృద్ధి చెందింది. విద్యారణ్యుడు సంగీత సారం రచించాడు. ప్రౌఢ దేవరాయలు 'మహానాటక సుధానిధి'

రామయ్య మంత్రి 'స్వరమేళ సుధానిధి' రచించారు. కూచిపూడి, భాగవతం, యక్షగానాలు ప్రాచుర్యం పొందాయి. తిరుపతి, కాళహస్తి, అహోబిలం, లేపాక్షి, సింహాచలం, కాంచీపురం మొదలైనచోట్ల పెద్ద దేవాలయాలు ఎత్తైన గోపురాలతో నిర్మించారు. ఈ యుగంలో సాహిత్యం నలుదిశలా వ్యాపించింది. పెద్దన మనుచరిత్ర, తిమ్మన పారిజాతాపహరణం మాదయగారి మల్లన రాజశేఖర చరిత్ర, ధూర్జటి, కాళహస్తి మహాత్యం, ఎల్లనార్యుడు రాసిన రాధామాధవ కావ్యం. తెనాలి రామలింగకవి పాండురంగ మహాత్యం, భట్టుమూర్తి రచించిన వసుచరిత్ర, నరసభూపాలీయం, హరిశ్చంద్రోపాఖ్యానం, పింగళి సూరన 'కళాపూర్ణో దయం, కూచిరాజు ఎర్రన రచించిన కొక్కొకం (రతిశాస్త్రం తెలుగులో) సంకుసాల నరసయ్య రాసిన 'కవికర్ణ రసాయనం' వరాహపురాణాన్ని తెలుగులో రచించిన నందిమల్లన, తాళ్లపాక అన్నమయ్య భార్య తిమ్మక్క రాసిన సుభద్రా కళ్యాణం వంటి గొప్ప సాహిత్యం విజయనగర రాజుల కాలంలో బహుళ ప్రచారం అయ్యింది.