ప్రాచీనకాలం నుంచి భారతదేశానికి ఐరోపా దేశాలతో వర్తక, వ్యాపార సంబంధాలున్నాయి. మనదేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో విశేషమైన ఆదరణ ఉండేది. భారతదేశం సముద్రం, భూమార్గాల ద్వారా విశేషమైన వర్తకాన్ని నిర్వహించింది. క్రీ.శ. 73 సంవత్సరంలో ప్లినీ భారత్ లో తయారయ్యే పలుచటి వస్త్రాల నాణ్యతను గురించి గొప్పగా వర్ణించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఈజిప్టు, సిరియా దేశాలు అరబ్బుల అధీనంలోకి రావడంతో వ్యాపారమంతా వారి స్వాధీనమైంది. వీరు తమ దేశాల ద్వారా భారతీయ ఉత్పత్తులను విదేశాలకు చేరవేసేవారు.క్రీ.శ. 1453లో కాన్స్టాంట్ నో పిల్ తురుష్కుల స్వాధీనం కావడంతో భారతదేశానికి ఉన్న భూవ్యాపార మార్గం మూత పడింది. దీంతో భారత్ మొదలైన ఆసియా దేశాలకు సముద్ర మార్గం కనుక్కోవాలనే ఆలోచన ఐరోపాలో బలపడింది. పోర్చుగల్ రాజు హెన్రీ ప్రోద్బలంతో 1498 మే 27న వాస్కోడిగామా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, భారతదేశ పశ్చిమతీరంలోని కాలికట్ చేరాడు. దీంతో ఐరోపా దేశాలతో భారతదేశానికి సంబంధాలేర్పడ్డాయి. కాలికట్ రాజైన జమోరిన్ పోర్చుగీసులకు స్వాగతం పలికాడు. వీరు కాలికట్ లోనే కాకుండా కన్ననూరు, కొచ్చిన్ ప్రాంతాల్లో తమ వ్యాపార కేంద్రాలను స్థాపించారు. భారతదేశంలో తమ కార్యకలాపాలను వ్యాపారం వరకే పరిమితం చేశారు. వీరి గవర్నర్ డీ అల్మిడా అనుసరించిన ఈ పద్ధతినే నీలి నీటి విధానం అని వ్యవహరిస్తారు. కానీ అల్మిడా తర్వాత గవర్నర్ గా వచ్చిన అల్ఫన్సో డి అల్బుకర్క్ భారత భూబాగాల ఆక్రమణకు సిద్ధమయ్యాడు.

క్రీ.శ. 1510లో గోవాను, 1511 లో మలక్కా దీనిని ఆక్రమించాడు. తదనంతరం వీరు ఆంధ్రదేశంలోని మచిలీపట్నంలో 1670లో తమ స్థావరం ఏర్పరచుకున్నారు. తర్వాత కాలంలో ఐరోపా దేశాల పోటీని తట్టుకోలేక క్రమంగా బలహీనపడ్డారు. 

డచ్చివారు 

హాలెండ్ ప్రభుత్వ మద్దతుతో నెదర్లాండ్స్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1602 లో స్థాపించారు. భారతదేశంలో వీరు సూరత్, మచిలీపట్నం, షేటసాలి, నాగపట్నం, భీమునిపట్నం, నరసాపూర్‌లలో వర్తక స్థావరాలు నెలకొల్పారు. 1606లో మచిలీపట్నంలో వర్తకానికి అనుమతి పొందారు. 1610లో పులికాట్ లో ఫ్యాక్టరీ నిర్మించారు. గోల్కొండ సుల్తాన్లు వీరికి సొంత నాణేలను ముద్రించుకోవడానికి అనుమతినిచ్చారు. బ్రిటిషర్ల పోటీని ఎదుర్కోలేక క్రమేపీ తమ స్థావరాలను, వర్తక వ్యాపారాలను పోగొట్టుకున్నారు. 

ఆంగ్లేయులు 

ఆంగ్లేయ వ్యాపారులు తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటన్ రాణి ఎలిజబెత్ నుంచి క్రీ.శ. 1600 లో అనుమతి పొందారు. క్రీ.శ. 1608లో కెప్టెన్ హాకిన్స్ నాయకత్వంలో బ్రిటిష్ కంపెనీ సూరత్ రేవు చేరి మొగల్ చక్రవర్తి జహంగీర్ నుంచి సూరత్ లో వర్తకానికి అనుమతి పొందారు. పోర్చుగీస్ వారి వ్యతిరేకత కారణంగా ఈ అనుమతి రద్దయింది. తర్వాత కాలంలో సూరత్ సమీపంలోని స్వాలి వద్ద 1612లో పోర్చుగీసు నౌకలను ఓడించారు. ఫలితంగా జహంగీర్ చక్రవర్తి 1613లో వీరికి సూరత్ లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిచ్చాడు. 1608 నాటికి ఆంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వర్తక స్థావరాల స్థాపనకు ఆంగ్లేయ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది. బంగాళాఖాతం తీర ప్రాంతంలో వర్తక స్థావరాల అన్వేషణ కోసం హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ అనే నౌక ప్రయాణం ప్రారంభించి, 1611 జనవరిలో మచిలీపట్నం చేరింది. గోల్కొండ సుల్తాన్ మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. కలంకారి అద్దకం దుస్తులు, రత్నాలు మొదలైన అపురూప వస్తువుల వ్యాపారానికి మచిలీపట్నం ముఖ్య కేంద్రమైంది. పోర్చుగీసు, డచ్చివారి ప్రతిఘటనల వల్ల బ్రిటిషర్లు మచిలీపట్నం నుంచి పులికాట్ కు, అక్కడి నుంచి అర్మగాన్ కు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత కాలంలో గోల్కొండ సుల్తాన్ బ్రిటిషర్లను మచిలీపట్నానికి ఆహ్వానించాడు. బ్రిటిషర్లు వెళ్లి కుతుబ్ షాహీల అనుమతితో 1632లో మచిలీపట్నంలోనే కాకుండా నిజాంపట్నం, భీమునిపట్నాల్లో కూడా తమ ఫ్యాక్టరీలను నిర్మించారు. 1682లో విశాఖపట్నంలో తమ స్థావరాన్ని ఏర్పాటుచేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఇజీర కూడా వారి వర్తక కేంద్రమే చంద్రగిరి రాజు ప్రతినిధి దామెర్ల వెంకటాద్రి అనుమతితో ఆంగ్లేయులు మద్రాస పట్నంలో 1640లో సెయింట్ జార్జి కోటను నిర్మించారు. ఫ్రెంచి కంపెనీ ఫ్రెంచి ప్రభుత్వం తన కంపెనీని స్థాపించి భారత దేశంలో సూరత్, పాండిచ్చేరి, చంద్రనాగూర్, బాలసూర్, కాశీంబజార్లలో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

ఫ్రెంచి కంపెనీ 

ఆంధ్రదేశంలో 1669లో మచిలీపట్నంలో, 1708లో యానాంలో వర్తక స్థావరాలను ఏర్పాటుచేసింది. దక్కన్ సుబేదార్, ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యస్థాపకుడైన నిజాం-ఉల్-ముల్క్ పాలన కింద మహారాష్ట్ర, మైసూరలను మినహాయించి దక్షిణ భారతదేశం మొత్తం ఉండేది. అతడి అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్. అతడి బిరుదులు నిజాం-ఉల్-ముల్క్, చినఖులిచ్ ఖాన్, రాజ వంశం పేరు అసఫ్హీ . ఈ సుబా కింద ఉన్న సర్కార్లలోని పాలకులను నవాబులు అనేవారు. ఆర్కాట్ రాజధానిగా ఉన్న కర్ణాటక సర్కార్ విశాలమైంది, సుసంపన్న మైంది. దీని నవాబు అన్వరుద్దీన్. ఇక్కడే ఆంగ్లేయ, ఫ్రెంచి కంపెనీలు తమ ప్రాబల్య నిర్ధారణకు, విస్తరణకు యుద్ధాలు చేశాయి. వీటినే కర్ణాటక యుద్ధాలన్నారు. 

కర్ణాటక యుద్ధాలు 

అసఫ్ జాహీ వంశ స్థాపకుడు, హైదరాబాద్ పాలకుడు నిజాం-ఉల్-ముల్క్ 1748లో మరణించాడు. దీంతో సింహాసనం కోసం అతడి కుమారుడు నాజర్ జంగ్, మనవడు ముజఫర్ జంగ్ మధ్య తగాదా ప్రారంభమైంది. ఇలాంటి తగాదానే కర్ణాటక సింహాసనం కోసం చందాసాహెబ్, అన్వరుద్దీన్ల మధ్య తలెత్తింది. ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్, చందాసాహెబ్స్ పక్షాన నిలిస్తే, ఆంగ్లేయులు నాజర్ జంగ్, అన్వరుద్దీన్ వైపు నిలిచారు. ఫ్రెంచి గవర్నర్ డూప్లే సైనిక సహాయంతో ముజఫర్ జంగ్, చందాసాహెబు 1749లో అంబూరు వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీన్ ను ఓడించి, సంహరించారు. అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీ తిరుచినాపల్లి పారిపోయి రక్షణ పొందాడు. ముజఫర్ జంగ్ హైదరాబాద్ రాజ్య పాలకుడయ్యాడు. చందాసాహెబ్ కర్ణాటక నవాబు అయ్యాడు. ప్రతిఫలంగా ఫ్రెంచివారికి మచిలీపట్నం, దివి వశమయ్యాయి. కడప, కర్నూలు నవాబుల కుట్ర ఫలితంగా ముజఫర్ జంగ్ పాండిచ్చేరి నుంచి హైదరాబాదు ప్రయాణించేటప్పుడు రాయచోటి వద్ద హత్యకు గురయ్యాడు. నాజీ జంగ్ సోదరుడైన సలాబత్ జంగ్ ను ఫ్రెంచి జనరల్ బుస్సీ హైదరాబాద్ పాలకుడిగా ప్రకటించాడు. సలాబత్ జంగ్ దీనికి ప్రతిఫలంగా నిజాంపట్నం, కొండవీడు, నరసాపురం ప్రాంతాలను ఫ్రెంచి కంపెనీకి ఇచ్చాడు. ఫ్రెంచి సైన్యాధిపతి బుస్సీ 1751 నుంచి 1758 వరకు హైదరాబాద్లోనే మకాం పెట్టి, సలాబత్ జంగ్ కు సహాయపడ్డాడు. సలాబత్ జంగ్, హైదరాబాద్ లో ఉన్న ఫ్రెంచి సైన్య పోషణకు శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్ (కొండపల్లి)లను ఫ్రెంచివారికిచ్చారు. ఈ విధంగా ఉత్తర సార్కర్లు ఫ్రెంచివారి అధీనమయ్యాయి. ఈ సర్కార్లలో ఫ్రెంచివారికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. చికాకోల్ ఫౌజ్ దారైన జఫి లీ విజయనగర రాజు విజయరామరాజు ప్రోద్బలంతో ఫ్రెంచివారి అధికారాన్ని ప్రశ్నించాడు.

ఫ్రెంచివారు లంచమిచ్చి విజయరామరాజును ప్రలోభ పెట్టారు. విజయరామరాజు, ఫ్రెంచి జనరల్ బుస్సీ ద్వారా ప్రేరేపితుడై బొబ్బిలి రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. 1757లో ఫ్రెంచివారి సహాయంతో బొబ్బిలి యుద్ధం చేసి బొబ్బిలిని ఆక్రమించాడు. తర్వాత విజయరామరాజుకు ఫ్రెంచివారితో విభేదాలు రావడంతో బ్రిటిష్ వారితో స్నేహం మొదలు పెట్టాడు. మద్రాసు ఆంగ్ల గవర్నర్ సాండర్స్, తిరుచినాపల్లిలో ఉన్న మహ్మద్ అలీకి సహాయం చేయడం ద్వారా కర్ణాటకలో ఫ్రెంచి ఆధిపత్యాన్ని అంతం చేయవచ్చని భావించాడు. అతడి ఆజ్ఞల మేరకు లార్డ్ క్లైవ్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం కర్ణాటక రాజధాని ఆర్కాట్ ను ముట్టడించి ఆక్రమించింది. ఈ పోరాటంలో చందాసాహెబ్ హతుడయ్యాడు. మహ్మద్ అలీ కర్ణాటక నవాబయ్యాడు. 

మూడో కర్ణాటక యుద్ధం (1756-1763) 

ఈ యుద్ధానికి కారణం ఐరోపాలో సంభవించిన సప్తవర్ష సంగ్రామం. దీనిలో ఇంగ్లండ్, ఫ్రాన్స్ లు వ్యతిరేకపక్షాలు. దీని ఫలితంగా కర్ణాటకలో ఆంగ్ల, ఫ్రెంచి కంపెనీలు బలప్రదర్శనకు దిగాయి. ఫ్రెంచి సైన్యం కౌంట్-డి-లాలీ నాయకత్వంలో కడలూరు వద్ద పోర్టుడేవిడ్ ను వశపరచుకొంది. హైదరాబాద్ లో ఉన్న బుస్సీని తనకు సహాయంగా రమ్మని కౌంట్-డి-లాలీ ఆదేశించాడు. కాన్ క్లాస్ అనే సైన్యాధికారి నాయకత్వంలో కొంత ఫ్రెంచి సైన్యాన్ని ఉత్తర సర్కార్లకు పంపించాడు. ఈ సైన్యం ఆంగ్ల, విజయనగర సైన్యాలను రాజమండ్రి సమీపంలోని చందుర్తి వద్ద ఎదుర్కొంది. 1758 డిసెంబరు 7న జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించి, ఫ్రెంచివారిని ఉత్తర సర్కార్ నుంచి తరిమేశారు. 1759లో ఆంగ్ల సైన్యం మచిలీపట్నం ఆక్రమణకు వస్తున్న విషయం తెలుసుకున్న ఫ్రెంచివారు సలాబత్ జంగ్ సహాయాన్ని అర్థించారు. హైదరాబాద్ సైన్యాలు తరలిరాకముందే ఆంగ్లేయ సైనికాధికారి కర్నల్ ఫోర్ట్ విజయనగర సైన్యాల సహాయంతో మచిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఫ్రెంచి ఓటమి తెలిసి సలాబత్ జంగ్ 1759 మే 14న ఆంగ్లేయులతో సంధి చేసుకుని, మచిలీపట్నం, నిజాంపట్నం, ముస్తఫానగర్ సర్కార్ లో కొంతభాగం వారికి ఇచ్చాడు. ఫ్రెంచి సైన్యాన్ని హైదరాబాద్ నుంచి 15 రోజుల్లో పంపించివేస్తామన్నాడు. హైదరాబాద్ లో అతడి సోదరుడు నిజాం అలీఖాన్ తిరుగుబాటు చేసి సలాబత్ జంగ్ ను తొలగించి పాలకుడయ్యాడు. బ్రిటిషర్లు ఉత్తరసర్కార్‌ కోసం నిజాం అలీఖాన్ తో సంప్రదింపులు జరపడానికి ప్రసిద్ధ దుబాసీ కాండ్రేగుల జోగిపంతులును హైదరాబాదు పంపించారు.

జోగిపంతులు దౌత్యం వల్ల ఏడాదికి రూ. 15 లక్షల కౌలుకు ఉత్తరసర్కార్లను బ్రిటిష్ వారికి ఇవ్వడానికి నిజాం అలీ ఖాన్ అంగీకరించాడు. శ్రీకాకుళం, ఏలూరు రాజమండ్రి, ముస్తఫానగర్, ముర్తజ్ నగర్ మొదలైనవి ఆంగ్లేయుల వశమయ్యాయి. నిజాం అలీఖాన్ సోదరుడు బసంత్ జంగ్ అధీనంలో ఉన్న గుంటూరు సార్కరను అతడి మరణానంతరం 1788లో ఆంగ్లేయులకిచ్చారు. ఈ విధంగా అయిదు ఉత్తరసర్కార్లు బ్రిటిషర్ల వశమయ్యాయి. 

సైన్య సహకార ఒప్పందం

నిజాం అలీఖాన్ మహారాష్ట్రల దాడులకు భయపడి, వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్దతిని అంగీకరించి, 1798లో వారితో సంధి చేసుకున్నాడు. ఇలా బ్రిటిషర్లతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న ప్రథమ స్వదేశీ రాజు నిజాం అలీఖాన్. ఆయన 1800 లో బ్రిటిషర్లతో మరో ఒడంబడిక చేసుకుని హైదరాబాద్ లో తన రక్షణ కోసం ఏర్పరచిన బ్రిటిష్ సైన్యం పోషణకు కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం ప్రాంతాలను ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు. అందుకే వీటిని దత్త మండలాలు లేదా సీడెడ్ జిల్లాలు అంటారు. ఇలా రాయలసీమ జిల్లాలు బ్రిటిష్ పరమయ్యాయి. మైసూర్ యుద్ధాల్లో కర్ణాటక నవాబు తమకు వ్యతిరేకంగా పనిచేశాడనే ఆరోపణతో ఆ నవాబు ఆధీనంలో ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలను బ్రిటిషర్లు ఆక్రమించారు. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశం బ్రిటిష్ ఆధీనమైంది. కంపెనీ తన పరిపాలనను ప్రవేశ పెట్టింది. తరువాతి కాలంలో విజయనగర రాజైన విజయరామరాజుకు, బ్రిటిషర్లకు మధ్య 1794 లో పద్మనాభ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో విజయరామరాజు హతుడయ్యాడు.

కంపెనీ పాలనలో ఆంధ్రదేశంలో ఎన్నో అనర్ధాలు జరిగాయి. ఎందరో అధికారులు కంపెనీ పేరుతో ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు. ఇందులో కొంతమంది మానవత్వం మూర్తీబవించిన మహనీయులైన అధికారులూ లేకపోలేదు. అలాంటివారిలో ప్రథముడు సర్ థామస్ మన్రో. ఆయన ఆంధ్రదేశానికి ఎనలేని సేవ చేశాడు. రాయలసీమ జిల్లాల ప్రిన్సిపల్ కలెక్టర్‌గా పనిచేశాడు. అక్కడ గ్రామ ప్రజలను భయపెడుతున్న పాలెగాండ్రను మల్లే అణచివేశాడు. అంతకుముందు తాను బారామహలో అమలు చేసిన రైత్వారీ పద్ధతిని రాయలసీమలో ప్రవేశపెట్టాడు. రైత్వారీ పద్ధతికి ముందు ఆయన గ్రామవారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన తరువాత అధికారి సర్ ఆర్థర్ కాటన్. ఆయన కంపెనీలో ఇంజనీర్ గా చేరాడు. తరచూ కరవుకు లోనవుతున్న ఆంధ్రదేశ స్థితిగతులను చూసి చలించి, ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని 1852లో పూర్తి చేశాడు.


Tags :   Invasion of Europeans      French rule in Andhra   

   Karnatic War    Third Karnatic War   

 British rule in Andhra      Andhra History     

Andhra Pradesh Hisory