గంగానదీ వ్యవస్థ

భారతదేశంలోని నదీ వ్యవస్థల్లో అతి పెద్దదైన గంగానదీ వ్యవస్థ, దేశ భూభాగంలో ఎక్కువ దూరం ప్రవహించే నది. ఇది దేశంలోని మొత్తం భూభాగంలో 26.2 శాతం భూభాగాన్ని ఆక్రమించి ఉంటుంది. గంగానది మొత్తం పొడవు 2,525 కి.మీ. భారతదేశంలో ఇది 2,071 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. గంగానది హరివాణం దాదాపు 8,38,200 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది దేశంలోనే అతి పెద్ద హరివాణం. భాగీరథ, అలకానంద నదులు దేవప్రయాగ వద్ద కలిసి గంగానది ఏర్పడింది. అక్కడి నుండి హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల గుండా గంగానది బంగ్లాదేశ్ లోకి ప్రవేశించి బ్రహ్మపుత్ర నదితో కలిలి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. పశ్చిమబెంగాల్ లోకి ప్రవేశించిన అనంతరం ఫరక్కాకు దక్షిణంగా గంగానది హుగ్లీ, భాగీరథగా విడిపోతుంది. బంగ్లాదేశ్ లోకి ప్రవేశించిన తర్వాత గంగానదిని పద్మ అని, బ్రహ్మపుత్ర నదితో కలిసిన తర్వాత జమున అని పిలుస్తారు.

యమున:

గంగానది ఉపనదుల్లోకెల్లా పెద్దదైన యమునా నది ఉత్తరప్రదేశ్ లోని ఘరీవాల్ జిల్లాలోని యమునోత్రి హిమనీనదం వద్ద జన్మింస్తుంది. ఇది అలహాబాద్ వద్ద గంగానదితో కలుస్తుంది. దీని ప్రవాహ మార్గం సుమారు 1,376 కి.మీ. ఇది నాగ్ తిబ్బ, ముస్సోరి, శివాలిక్ కొండలను దాటి తాజెవాలా వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. దీని ఉపనదుల్లో ముఖ్యమైనవి చంబల్, బెట్వా, కెన్ నదులు.

చంబల్:

ఇది యమునానదికి ఉపనది. మధ్యప్రదేశ్ వింధ్య పర్వతాల్లోని జనపావో కొండల్లో జన్మిస్తుంది. ఇది యమునానదితో ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జిల్లాలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1050 కి.మీ. సోన్: ఇది అమరకంటక్ పీఠభూమిలో జన్మించి 784 కి.మీ. ప్రవహించి పాట్నా జిల్లాలోని దనీపూర్ వద్ద గంగానదితో కలుస్తుంది. 

దామోదర్:

ఇది చోటానాగ్ పూర్ పీఠభూమిలో జన్మించి పగులులోయ గుండా ప్రవహిస్తుంది. దీనిని బెంగాల్ దుఃఖదాయని అంటారు. ఇది జన్మస్థానం నుంచి 541 కి.మీ. ప్రవహించి హుగ్లీ నదితో కలుస్తుంది.

రామ్ గంగా:

ఇది ఉత్తరప్రదేశ్ లోని ఘరీవాల్ జిల్లాలో జన్మిచి కాలఘర్ వద్ద గంగా మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఇది జన్మస్థానం నుంచి 596 కి.మీ. ప్రవహించి కనోజ్ వద్ద గంగానదితో కలుస్తుంది.

గాఘ్రా :

ఇది టిబెట్ లోని గుర్లా మాందత శిఖరం వద్ద జన్మించి 1080 కి.మీ. ప్రవహించి గంగానదితో కలుస్తుంది. దీనిని పశ్చిమ నేపాల్ లో 'కర్సెలి' అని పిలుస్తారు.

కాళి:

ఇది ట్రాన్స్ హిమాలయ పర్వతాల్లో జన్మించి కుమయూన్ పర్వతాలను దాటుకుంటూ నేపాల్, భారతదేశాలకు సరిహద్దుగా ప్రవహిస్తుంది. మైదానప్రాంతంలోకి ప్రవేశించేచోట దీనిని శారవ లేదా చౌకీ నది అని పిలుస్తారు. ఇది సితాపూర్, బరబంకీ, బరాచ్ జిల్లాల కలయిక వద్ద గాఝనదితో కలుస్తుంది.

గండక్:

ఇది నేపాల్ లో జన్మించి బీహార్ లోని వైశాలి జిల్లాలోని హాజీపూర్ వద్ద గంగానదితో కలుస్తుంది. ఇది జన్మస్థానం నుంచి 425 కి.మీ. ప్రవహించి గంగానదితో కలుస్తుంది. దీనిని నేపాల్ లో కాలీగండక్ అంటారు.

కోసి:

సన్ కోసి, అరుణ్ కోసి, తామర్ కోసి నదుల కలయిక వల్ల ఈ నది ఏర్పడింది. ఇవి అస్సాం, టిబెట్, నేపాల్ లోని కొండ ప్రాంతాల్లో జన్మించి మహాభారత శిఖరాల వద్ద ఒకటిగా 'కోసి' నదిగా మారాయి. ఇది జన్మస్థానం నుంచి 730 కి.మీ. ప్రయాణించి కుర్ సేలా వద్ద గంగానదితో కలుస్తుంది. దీనికి బీహార్ దుఃఖదాయని అని పేరు.

సింధూ నదీ వ్యవస్థ 

హిమాలయాల్లోని టిబెట్లో గల కైలాస కొండల్లోని మానస సరోవరం వద్ద 5180 మీటర్ల ఎత్తులో ఈ నది జన్మించింది. దీని పరీవాహక ప్రాంతం 3,21,000 చ.కి.మీ. పొడవు 2,880 కి.మీ. (భారత్ లో 709 కి.మీ., జమ్ము కశ్మీర్ లో మాత్రమే). ఇది భారతదేశంలో థామ్ చుక్ అనేచోట ప్రవేశించి జమ్ము కశ్మీర్ మీదుగా వెళ్లి పాకిస్థాన్లో ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఉత్తర దిశగా ప్రవహించే ఏకైక నది సింధు. దీనికి రెండు రకాల ఉప నదులు కలవు 1) పర్వత ప్రాంత ఉప నదులు ఇవి పర్వతాలలో జన్మించి సింధు నదిలో ఎడమవైపున కలుస్తాయి. గిల్ గ్రిట్, ద్రాస్, స్యోక్, సిడిక్ మొదలైనవి. 2) మైదాన ప్రాంత ఉప నదులు. ఇవి సింధు నదిలో కుడి వైపున కలుస్తాయి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.

జీలం:

సింధు నదికి ఉన్న ఉప నదుల్లో అతి చిన్నది. దీనిని రుగ్వేదంలో వితస్త అని పిలిచేవారు. జమ్ము, కశ్మీర్ లోని వెరినాథ్ అనే ప్రాంతం దీని జన్మస్థలం. ఈ నది లడక్ జస్కర్ పర్వతాల మధ్య ఊలార్ సరస్సుల మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదీ తీర నగరం శ్రీనగర్ (దాల్ సరస్సు).

చినాబ్: 

ఇది హిమాచల్ ప్రదేశ్ లోని వాతాబార్-చిహిలా కనుమల వద్ద జన్మించింది. దీని పాత పేరు అస్నికి. మన దేశంలోని ఉప నదుల్లోకెల్లా ఇది పెద్దది. చినాబ్ నదిపై జమ్ము కశ్మీర్‌లో ఉన్న ప్రాజెక్టులు దూల హస్తి ప్రాజెక్టు, సలార్‌జంగ్ ప్రాజెక్టు, నబ్రాజాకీ ప్రాజెక్టు, బా/హర్ ప్రాజెక్టు

రావి :

హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తక్ కనుమ వద్ద ఈ నది జన్మించింది. దీన్ని రుగ్వేద కాలంలో పరుష్ఠి, అని పిలిచేవారు. పంజాబ్ లో రావి నదిపై తెయిన్ డ్యామ్ నిర్మించారు.

బియాస్:

రుగ్వేద కాలంలో ఈ నదిని విపాష అని పిలిచారు. సింధూ నది ఉపనదుల్లో కేవలం భారతదేశంలో మాత్రమే ప్రవహించే నది బియాస్. ఈ నది కూడా హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తక్ కనుమలో జన్మించింది. ఈ నదిపై గల బియాస్ ప్రాజెక్టు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టు.

సట్లెజ్ :

టిబెట్ లోని కైలాస కొండల్లో గల రాకాసి సరస్సు దీని జన్మస్థలం. సింధు ఉప నదుల్లో అత్యంత పొడవైనది, పెద్దది సట్లెజ్. మన దేశంలో అత్యధిక నీటి సదుపాయాలు కల్పిస్తున్న ఉప నది. దీని పూర్వనామం శతుద్రి. మూడు దేశాల మీదుగా ప్రవహించే ఏకైక సింధు ఉపనది. భారతదేశంలో దీనికి అత్యధిక వరద కాలువలు కలవు. ఇండియాలో మొట్టమొదటిది, అతి పెద్దది అయిన భాక్రానంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై హిమాచల్ ప్రదేశ్ లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల హిమాచల్ ప్రదేశ్ లో గోవిందసాగర్ అనే అతి పెద్ద సరస్సు నిర్మితమైంది. ఇది దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సుగా పేర్గాంచింది.

బ్రహ్మపుత్ర నది: 

జీవనదుల్లో అత్యంత పురాతనమైన ఈ నది టిబెల్ లోని కైలాస కొండల్లో ఉన్న షమ్-యమ్-డమ్ అనే హిమనీనదం వద్ద జన్మించి, భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఈ నది అరుణాచల్ ప్రదేశ్ లోని జిడోబీ అనే ప్రాంతంలో దేశంలోకి ప్రవేశించి అసోంలోని దుబ్రి వద్ద బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 2900 కిలోమీటర్లు. హిమాలయాల్లో జన్మించే నదులన్నింటిలోకీ ఇది పొడవైనది. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద నదీ ఆధారిత దీవి మజురి ఈ నది పైనే ఉంది. బ్రహ్మపుత్ర నదిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. టిబెట్లో సాంగ్ పో అని, చైనాలో జోయార్లాంగ్ , భారతదేశంలో ఎరుపు నది, బంగ్లాదేశ్ లో జమున, అరుణాచల్ ప్రదేశ్ లో ది హంగ్, అసోంలో సైడంగ్ అని పిలుస్తారు. ఈ నదికి తరచూ వరదలు రావడం వల్ల అసోంలో అనేక ప్రాంతాలకు నష్టం కలుగుతోంది. అందువల్ల దీనిని అసోం దుఖఃదాయిని అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్ లోని గో ఆలిండు అనే ప్రాంతం వద్ద పద్మ నది జమున నదితో కలిసి మేఘనగా అవతరించి సాగరమాల దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. బహ్మపుత్ర నదికి సబనసిరి, ఉత్తర ధన సిరి, దక్షిణ ధన సిరి, కాలి, తీస్తా, లోహిత్, మానస్, దిబంగ్, బారక ఉపనదులు.