ఐఎన్ఎస్ విక్రమాదిత్య

ఇది అతి పెద్ద యుద్ధ వాహక నౌక. ఒకేసారి 36 యుద్ధ విమానాలను తీసుకెళ్లగలదు. 1987లో నిర్మించిన ఈ నౌక యూఎస్ఎస్ఆర్, రష్యా దేశాల్లో సేవలందించి 2014లో భారత్ కు చేరింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 జూన్ 14న భారత నావికా దళానికి అంకితం చేశారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ 

భారత్ నిర్మించిన తొలి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. 2013 ఆగస్టులో ఇది జలప్రవేశం చేసింది.

ఐఎన్ఎస్ కొచ్చి

భారత్ లో తయారైన అతి పెద్ద యుద్ధ నౌక. కోల్కత క్లాస్ కి చెందిన మూడింటిలో ఇది రెండో నౌక. దీన్ని నావికా దళం డిజైన్ చేయగా, ముంబైలోని మజగావ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. క్షిపణులను ధ్వంసం చేయగల బహుళ యుద్ధ వ్యూహాలను ప్రదర్శించే ఈ నౌక 2015 సెప్టెంబరు 30న జలప్రవేశం చేసింది. ఈ తరహాకి చెందిన ఐఎన్ఎస్ - కోల్కత, 2014 ఆగస్టులో జలప్రవేశం చేసింది. మూడో రకమైన ఐఎన్ఎస్ - చెన్నై 2016 నాటికి అందుబాటులోకి రానుంది.

ఐఎన్ఎస్ సహ్యాద్రి

ఇది శివాలిక్ రకానికి చెందిన రహస్య బహుళ పాత్ర పోషించే చిన్న తరహా యుద్ధ నౌక. దీన్ని మజగావ్ డాక్ లిమిటెడ్ 2011లో నిర్మించింది. 2012 జులై 21న జలప్రవేశం చేసింది. 'లుక్ ఈస్ట్', 'యాక్ట్ ఈస్ట్' విధానం (పాలసీ)లో భాగంగా నావికా దళం దీన్ని వియత్నాంలో అక్టోబరు 2 నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ఇందులో దీర్ఘ వ్యాప్తి యాంటీషిప్ మిస్సైల్స్, ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే మిస్సైల్స్, శక్తిమంతమైన తుపాలకుతో పాటు రెండు హెలికాప్టర్లు ఉన్నాయి.

ఐఎన్ఎస్ కవరట్టి

యాంటీ సబ్ మెరైన్ యుద్ధ రకానికి చెందిన రహస్య చిన్న తరహా నౌక. దీన్ని 2015 మే 19న జలప్రవేశం చేశారు. ప్రాజెక్ట్-28లో నిర్మిస్తున్న నాలుగు యాంటీ సబ్ మెరైన్ నౌకల్లో ఇది చివరిది. మిగతా మూడూ ఐఎన్ఎస్-కమోర్త, ఐఎన్ఎస్-కడమత్, ఐఎన్ఎస్-కిల్టాన్.

ఐఎన్ఎస్ విశాఖపట్నం

భారతదేశ అత్యధిక శక్తిమంతమైన, భయానక విధ్వంసకారి (డెస్ట్రోయర్). దీన్ని 2015 ఏప్రిల్ 21న నావికా దళాధిపతి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ భార్య మిను ధోవన్ ముంబైలో జలప్రవేశం చేశారు. 2018 నాటికి నావికాదళంలో చేరనుంది. దీనిలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్‌సోనిక్ క్షిపణులు, ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే బరాక్-8 క్షిపణులను అమరుస్తారు. భారతదేశంలో ఉత్పత్తి అయిన ఉక్కుతో డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ దీన్ని రూపొందించింది.

ఐఎన్ఎస్ అస్త్రధరణి

దీన్ని ఎస్ఎసీఎల్ తయారు చేసింది. ఇది ఆయుధాలను నీటిలో పరీక్షించేందుకు, తిరిగి వాటిని పొందేందుకు ఉపయోగపడుతుంది. తొలిసారిగా ప్రైవేటు షిప్ యార్డ్ లో తయారైన యుద్ధనౌక. ఇది 2015 అక్టోబరు 6న విశాఖపట్నంలో జల ప్రవేశం చేసింది.

ప్రధాన ఐఎన్ఎస్ చక్ర

సంప్రదాయ జలాంతర్గామికి భిన్నంగా న్యూక్లియర్ శక్తితో పనిచేసే ఐఎస్ఎస్ చక్ర సబ్ మెరైన్ ని రష్యా నుంచి 10 సంవత్సరాల కాలం పాటు లీజుకు తీసుకున్నారు. దీన్ని 2012 ఏప్రిల్ లో భారత నావికా దళానికి అప్పగించారు. ఇది శత్రు నౌకలను వేటాడి, చంపే (హంట్ అండ్ కిల్) రకానికి చెందింది.

ఐఎన్ఎస్ కల్వరి

భారత్ లో తయారైన తొలి స్కార్పియన్ రకానికి చెందిన సబ్ మెరైన్. దీన్ని ఫ్రాన్స్ సహకారంతో మజగావ్ డాక్ లిమిటెడ్ తయారు చేసింది. 2020 నాటికి ఈ తరహాకి చెందిన మరో 5 జలాంతర్గాములను నిర్మించనున్నారు. ఇది సముద్రం లోపల 50 రోజులపాటు సుమారు 12,000 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. 2015 ఏప్రిల్ 6న దీన్ని జలప్రవేశం చేయించారు. 2016 జూన్ నాటికి భారత నావికాదళంలో చేరనుంది.

ఐఎన్ఎస్ అరిహంత్

విశాఖపట్నంలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ దేశీయ పరిజ్ఞానంతో నిర్మించింది. ఇది న్యూక్లియర్ శక్తితో నడిచే తొలి బాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్. దీన్ని నడిపించేందుకు వాడే 83 మెగా వాట్ల శక్తి ఉన్న ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ (పీడబ్ల్యూఆర్)ని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) కల్పకంలో అభివృద్ధి చేశారు. భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ 2014 డిసెంబరు 15న ఐఎన్ఎస్ అరిహంతను వైజాగ్ లో జలప్రవేశం చేయించారు. అణు బాంబులను కలిగిన కె-4 (వ్యాప్తి - 3,500 కి.మీ.), బీవో-5 (వ్యాప్తి - 700 కి.మీ.) రకాల క్షిపణులను అరిహంత్ నుంచి ప్రయోగిస్తారు. 2016 సంవత్సరం నాటికి ఇది నావికాదళంలో చేరనుంది. అరిహంత్ రకానికి చెందిన మరో రెండు సబ్ మెరైన్లను తయారు చేయనున్నారు. ఈ తరహాకి చెందిన రెండో సబ్ మెరైన్ ని ఐఎస్ఎస్- అరిథమన్ అని పిలవనున్నారు.

ఐఎన్ఎస్ సింధురక్షక్

రష్యాలో తయారైన సంప్రదాయ డీజిల్-ఎలక్ట్రిక్ రకానికి చెందింది. 2006 ఫిబ్రవరి 13న అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇందులో ప్రయాణించారు. 2010లో స్పల్పంగాను, 2013 ఆగస్టు 14న పెను ప్రమాదానికి గురై ముంబై డాక్మ లో మునిగిపోయింది.