బ్రిటిష్ పరిపాలన కాలంలో ఆంధ్రదేశంలో ఆంగ్లవిద్య వ్యాప్తి చెందింది. క్రైస్తవ మత ప్రచారం కూడా జరిగింది. 1805లో లండన్ మిషన్కు చెందిన పాఠశాలను విశాఖపట్నంలో నెలకొల్పారు. 1822లో ఈ సంస్థవారు కడపలో పాఠశాలను నెలకొల్పారు. 1841లో రెవరెండ్ నోబెల్ అనే క్రైస్తవ మతాచార్యుడు మచిలీపట్నం లో మిషనరీ పాఠశాలను నెలకొల్పాడు. 1853లో రాజమండ్రిలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు అయింది. పిఠాపురం రాజా సహకారంతో పిఠాపురంలో 1884లో కళాశాల ఏర్పాటు చేశారు. 1895 ప్రాంతంలో 'స్త్రీల కొరకు' మొసలికంటి రామాబాయమ్మ గారు గోదావరి జిల్లాలలో అనేక పాఠశాలలు స్త్రీల కొరకు నిర్మించింది. 

సారస్వతాభివృద్ధి

ఈ కాలంలోనే విద్యారంగంతోపాటు, సారస్వతాభివృద్ధి కూడా జరిగింది. ఫిలిప్ బ్రౌన్ 'ఇంగ్లీషు-తెలుగు' నిఘంటువును కూర్చాడు. వేమన పద్యాలను ఆంగ్లభాషలోకి అనువదించాడు. బ్రౌన్ దొర ప్రాచీన గ్రంథాలపై వ్యాఖ్యానాల రచనకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చి, తెలుగు భాషకు మహోపకారం చేశాడు. కల్నల్ మెకంజీ అనే మరొక ఆంగ్లేయుడు ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాలను విస్తృతంగా పర్యటించి, జనశ్రుతి శాసనాల ఆధారంగా, వివిధ ప్రాంతాలకు చెందిన స్థానిక చరిత్రలను సేకరించి, ఆంధ్రదేశంలో చారిత్రక పరిశోధనకు పునాదివేశాడు. ఈ స్థానిక చరిత్రలనే కైఫీయతులని పేర్కొంటారు.

బిషప్ కాల్డ్ వెల్ అనే మరొక ఆంగ్ల పండితుడు - తెలుగు ద్రావిడ భాషాజన్యమని మొదటిసారిగా ప్రకటించి, తులనాత్మక భాషా శాస్త్ర పరిశోధనకు పునాదివేశాడు. ఆంగ్లేయ పండితుల స్ఫూర్తితో పరవస్తు చిన్నయసూరి 'నీతిచంద్రిక' అనే గ్రంథాన్ని తెలుగులో రచించాడు. తెలుగు గద్య సారస్వతానికి ప్రామాణికత్వాన్ని సృష్టించాడు. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం నవలలు, నాటకాలు, ప్రహసనాలు, రచనల ద్వారా సమకాలీన ఆంగ్ల సారస్వతంలో ఉన్న అన్ని ప్రక్రియలను తెలుగు సారస్వతంలో ప్రవేశ పెట్టారు.

బ్రిటిష్ పరిపాలనలో విద్యతో పాటు క్రైస్తవమత ప్రచారం విశేషంగా జరిగింది. ఆంధ్రదేశంలో రాయలసీమ, గోదావరి జిల్లాలలో మరికొన్ని వెనుకబడిన ప్రాంతాలలో క్రైస్తవమతం విశేషంగా ప్రచారం అయింది. క్రైస్తవ ప్రచారకులచే నెలకొల్పబడిన పాఠశాలలు తమ మత ప్రచారానికి గొప్ప సాధనాలుగా మారాయి. మత ప్రచారకుల కార్యక్రమాలు, వారి పాఠశాలల నిర్వహణ తీరు వలన కొన్ని ప్రాంతాలలో సామాజికమైన ఘర్షణలకు దారితీశాయి. 1885, 1895 సంవత్సరాల్లో మిషనరీ పాఠశాలలకు వ్యతిరేకంగా ఉద్యమాలు విశాఖపట్నం - రాజమండ్రిలలో జరిగాయి.

ఈ కాలంలోనే ఆంధ్రదేశంలో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు జరిగాయి. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో స్థాపించిన 'బ్రహ్మసమాజం' స్ఫూర్తితో ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గురజాడ అప్పారావు, న్యాపతి సుబ్బారావు పంతులు మొదలగు వారు సంఘ సంస్కరణలు చేపట్టి ఆనాటి బాల్య వివాహాలు, వితంతువుల దీనస్థితి, దేవదాసీ, కన్యాశుల్కం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా విశేష కృషి చేశారు. స్త్రీ విద్యావ్యాప్తికి కందుకూరి 'వివేకవర్ధిని' అనే పత్రికను స్థాపించారు. 1881లో తన సొంత గృహంలోనే ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిపించారు. (రాజమండ్రిలో) రఘుపతి వెంకటరత్నం నాయుడు దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు, అంటరానితనానికి వ్యతిరేకంగా విశేష కృషి చేశాడు. కాకినాడలో 'బ్రహ్మసమాజం' మందిరాన్ని నిర్మించాడు. గురజాడ అప్పారావు తన 'కన్యాశుల్కం' నాటకం ద్వారా బాల్యవివాహాలు, వ్యభిచార వ్యవస్థ వలన కలిగే అనర్థాలను వర్ణించాడు. గురజాడ రచించిన పుత్తడిబొమ్మ - పూర్ణమ్మ కథలో పసిబాలికలను వృద్ధులకిచ్చి వివాహం చేయడం వలన కలిగే అనర్థాలను హృదయం కదిలించేటట్లు వివరించారు. రాజమండ్రికి చెందిన న్యాపతి సుబ్బారావు పంతులు 1858-1911లో 'హిందూసమాజ్' అనే సంస్థను దయానంద సరస్వతి స్థాపించిన 'ఆర్యసమాజం' ఒరవడిలో స్థాపించారు. వీరేశలింగం ప్రారంభించిన సంస్కరణోద్యమాన్ని తీవ్రంగా ప్రతిఘటించి, భగవద్గీత సిద్ధాంతాల ప్రాతిపదికపై హిందూమత ప్రచార నిమిత్తం ఈ సంస్థను స్థాపించాడు. సుబ్బారావు భావాలు ఆంధ్రదేశంలో ప్రతిధ్వనించాయి.


Tags :   Education System During British Period in Andhra     

  Andhra History    Andhra Pradesh Hisory