సంగమ వంశం 

మొదటి హరిహరరాయలు

సోదరుల సహాయంతో సామ్రాజ్యాన్ని తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించాడు. ఇతడి కాలంలోనే 1847 లో బహమనీ సామ్రాజ్యం స్థాపితమైంది. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమనీ సామ్రాజ్యాలు స్థాపించిన సమయంలో మహ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ గా ఉండేవారు. బహమనీ సుల్తానుల రాజ్య విస్తరణ కాంక్ష, ఇస్లాం మతాన్ని నిరోధించి, వైదిక మతాన్ని కాపాడాలనే విజయనగర రాజ్య పాలకుల పట్టుదల కారణంగా రెండు సామ్రాజ్యాల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణం కొనసాగింది. దీనికి మొదటి హరిహరరాయల కాలంలో బీజం పడింది. ఇతడి కాలంలో బహమనీ రాజ్యస్థాపకుడు అల్లా ఉద్దీన్ హసన్ రెండుసార్లు దండెత్తాడు. 

మొదటి బుక్కరాయలు

ఇతని కాలంలో జరిగిన ముఖ్య సంఘటన - మధురా విజయం. మొదటి బుక్కరాయల కుమారుడు కంపరాయలు మధుర సుల్తాన్‌ను ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ విజయాన్ని కంపరాయలు భార్య అయిన గంగాదేవి తాను రచించిన 'మధురా విజయం 'లో వర్ణించింది. మొదటి బుక్కరాయల కాలంలో రాయచూర్ అంతర్వేది గురించి విజయనగర, బహమనీ సామ్రాజ్యాల మధ్య నిరంతరం పోరాటాలు జరిగేవి. బహమనీ సుల్తానులతో యుద్ధం తర్వాత రెడ్డి రాజులతో కూడా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బుక్కరాయలు రెడ్డి రాజ్యంలోని అహోబిలం, వినుకొండ ప్రాంతాలను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. మొదటి బుక్కరాయలు మత సహనానికి పెట్టింది పేరు. ఇతడు అల్ప సంఖ్యాకులైన జైనులకు రక్షణ కల్పించాడు. విదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాడు. 1374 లో మింగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ప్రముఖ ఆంధ్ర కవి నాచన సోముడు ఇతడి ఆస్థానంలోనివాడే. 

రెండో హరిహరరాయలు

ఇతడికి రాజాధిరాజు, రాజపరమేశ్వర అనే బిరుదులు ఉన్నాయి. బహమనీ సుల్తాన్ అయిన రెండో మహ్మద్ ఇతడికి సమకాలీనుడు. 1378 లో రెండో హరిహరరాయల మంత్రి మాధవుడు గోవా రాజ్యాన్ని జయించి, 'భువనైక వీరుడు' అనే బిరుదు పొందాడు. రెండో హరిహరరాయల కాలంలో సింహళానికి, విజయనగర రాజ్యానికి ఘర్షణ ప్రారంభమైంది. 1398 లో బహమనీ రాజైన ఫిరోజ్ షా వియనగరంపై దండెత్తి ప్రజలను ఊచకోత కోయడమే కాకుండా విజయనగర సంపదను దోచుకున్నాడు. ఇతడి మరణం తర్వాత సింహాసనం కోసం అంతఃకలహాలు చోటుచేసుకున్నాయి. 

రెండో బుక్కరాయలు

సోదరుడైన విరూపాక్షుడిని పదవీభ్రష్టుడిని చేసి సింహాసనాన్ని అధిష్టించాడు. కేవలం రెండేళ్లు మాత్రమే పాలించాడు. 

మొదటి దేవరాయలు

ఇతడు ఫిరోజ్ షా చేతిలో ఓడిపోయి తన కుమార్తెను అతడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మొదటి దేవరాయలు రెడ్డి రాజులను ఓడించి ఉదయగిరి, మోటుపల్లిని ఆక్రమించాడు. తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఇటలీ యాత్రికుడైన నికొలో కాంటే 1420 లో ఇతడి కాలంలోనే విజయనగరాన్ని సందర్శించాడు. 

రెండో దేవరాయలు లేదా ప్రౌఢరాయలు

సంగమ వంశ రాజుల్లో అగ్రగణ్యుడు బహమనీ సుల్తానులతో జరుగుతున్న యుద్ధాల్లో విజయనగర సైన్యం ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించి, వాటిని సవరించడానికి పూనుకున్నాడు. సైన్యంలోని ఆయుధ విభాగాన్ని పటిష్టం చేసి, ముస్లింలను కూడా సైన్యంలో చేర్చుకున్నాడు. వారి కోసం రాజధానిలో మసీదు నిర్మించాడు. సింహాసనం ఎదురుగా ఖురాన్ ప్రతిని ఉంచాడు. ఇతనికి 'గజబేటకార' అనే బిరుదు ఉంది. ఇతడి కాలంలోనే పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ (1443) విజయనగరాన్ని దర్శించాడు.

ప్రౌఢ దేవరాయలు స్వయంగా కవి సంస్కృతంలో మహానాటక సుధానిధి. వృత్తి అనే గ్రంథాలను రచించాడు. విజయనగర ఆస్థాన కవి అయిన 'డిండిమభట్టు'ను ఓడించిన శ్రీనాథుడికి ఢ దేవరాయలు కనకాభిషేకం చేయించాడు. ఇతడి కాలంలోనే ప్రసిద్ది చెందిన విఠలస్వామి ఆలయం నిర్మితమైంది. ప్రౌఢ దేవరాయల తర్వాత సంగమ వంశ పతనం ప్రారంభమైంది. చివరి సంగమ రాజైన రెండో విరూపాక్షరాయలను పెనుగొండకు చెందిన సాళువ నరసింహుడు వధించడంతో సంగం వంశం అంతరించింది.

సాళువ వంశం 

సాళువ నరసింహరాయలు

ఇతడు సింహాసనం అధిష్టించిన తర్వాత సామంత రాజులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లను సమర్ధవంతంగా అణచివేసి, విజయనగర సంస్కృతీ సంప్రదాయాలను పదిలపరచాడు. అరబ్బు వర్తకులతో స్నేహం చేసి, వారి నుంచి ఉత్తమ అశ్వాలను సంపాదించి, అశ్విక దళాన్ని అభివృద్ధి చేశాడు. 

ఇమ్మడి నరసింహరాయలు

ఇతడు పేరుకు మాత్రమే రాజు. సర్వాధికారాలను నరసనాయకుడు చెలాయించేవాడు. నరసనాయుడు సమర్దుడైన సేనాని. శక్తిమంతమైన పాలకుడు. ఉమ్మత్తూర్ నాయకుడి తిరుగుబాటును అణచివేశాడు. శ్రీరంగ పట్టణాన్ని ఆక్రమించాడు. నరసనాయుడు 1503 లో మరణించాడు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించాలనే తమ నాయకుడైన సాళువ నరసింహరాయలి కోరికను పూర్తిచేశాడు. దక్షిణ భారతదేశంలో అత్యధిక భాగాన్ని విజయనగర సామ్రాజ్య పరిధిలోకి తీసుకువచ్చాడు. సైనిక శక్తిని పునర్నిర్మించడం ద్వారా తర్వాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు సాధించిన విజయాలకు పునాది వేశాడు. నరసనాయకుడు మరణించిన తర్వాత అతడి పెద్ద కుమారుడు వీర నరసింహరాయలు రాజ ప్రతినిధి అయ్యాడు. ఇతడు క్రీ.శ. 1505లో పెనుగొండ దుర్గంలో బంధితుడై ఉన్న అసలు రాజు ఇమ్మడి నరసింహరాయలను హత్య చేశాడు. దీంతో సాళువ వంశం అంతరించింది.