రేచర్ల పద్మనాయకుల రాచకొండ రాజ్యం హిందూ రాజ్య పునఃప్రతిష్టాపన తరువాత ఏర్పడిన స్వతంత్ర రాజ్యం . రేచర్ల వంశీయులు కాకతీయుల కాలంలో సుప్రసిద్ధులైనారు. పద్మనాయకులనే వెలమలని కూడా అంటారు. వీరి పరిపాలనా కాలం సుమారు 150 సంవత్సరాలు. వీరి మొట్టమొదటి రాజధాని రాచకొండ. ఇది తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో ఉన్నది. వీరి రెండో రాజధాని దేవరకొండ. ఇది కూడా నల్గొండ జిల్లాలోనే ఉన్నది. 

పూర్వ చరిత్ర

రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధాన ఆధారము వెలుగోటి వంశావళి. దీని ప్రకారం రేచర్ల వంశానికి మూలపురుషుడు భేతాళరెడ్డి. ఈ కాలంలో రేచర్ల గోత్రికులు పిల్లలమర్రిని పాలించేవారు. రేచర్ల వంశీయులలో దామానాయుడు, ప్రసాదిత్యనాయుడు, రుద్ర నాయకుడు అనేవారు కాకతి గణపతిదేవుని కొలువులో పని చేసేవారు. వీరిలో ప్రసాదిత్యనాయుడు కాకతి సింహాసనంపై రుద్రమదేవిని అధిష్టింపచేసి 'కాకతి రామరాజ్యస్థాపనాచార్య, 'రాయ పితామహాంక' అనే బిరుదులను కూడా పొందాడు.

వెన్నమనాయని కుమారుడు ఎరదాచానాయుడు, అతని కుమారుడు సింగమనాయకుడు కాకతి ప్రతాపరుద్రుని సేనానులు. క్రీ.శ. 1316లో ప్రతాపరుద్రుని కాంచీపుర దండయాత్రలో పాల్గొన్న దాచానాయుడు ముప్పడి నాయకునితో పోరాడి విజయం సాధించి 'పంచపాండ్యదళ విభాళ' అనే బిరుదును పొందాడు. సింగమ నాయకుడు తన శౌర్య ప్రతాపాలతో ప్రతాపరుద్రుని మెప్పించి 80 వరాలను పొంది 'అశీతివరాల సింగమనాయకుడ'ని ప్రసిద్ధి పొందాడు. 

సింగమనాయకుడు 

ఓరుగల్లును ముస్లింలు ఆక్రమించిన తరువాత ఆంధ్ర నాయకులు ప్రోలయ నాయకుని నాయకత్వంలో లేవదీసిన విముక్తి ఉద్యమంలో సింగమనాయకుడు పాల్గొన్నాడు. ఓరుగల్లును ముస్లింలు ఆక్రమించిన తరువాత ఆంధ్ర నాయకులు ప్రోలయనాయకుని నాయకత్వంలో లేవదీసిన ఉద్యమంలో సింగమనాయకుడు పాల్గొన్నాడు. ముస్లింల పాలన నుండి ఆంధ్రదేశం విముక్తి పొందిన తరువాత తెలుగు నాయకులు స్వార్థపరులై విడిపోయి స్వతంత్రరాజ్యాలను స్థాపించుకొన్నారు. కాపయనాయకుడు బహమనీ సుల్తానుతో పోరాడే సమయంలో సింగమనాయకుడు దక్షిణదిశలోని నాయకులను జయించి కృష్ణాతీరం వరకు గల రాజ్యాన్ని ఆక్రమించాడు. కృష్ణా, తుంగభద్రా, అంతర్వేదిలోని కొన్ని దుర్గాలు, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం సింగమనాయకుని వశమైనాయి. రాజ్య విస్తరణ ప్రయత్నంలోనే సింగమనాయకుడు జల్లిపల్లి కోటను ముట్టడించి సోమవంశ క్షత్రియులచేత చంపబడినాడు. 

అనవోతా నాయకుడు 

రాచకొండ రాజ్య నిర్మాత ఇతడే. తన రాజధానిని అనుమనగల్లు నుండి రాచకొండ మార్చాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా జల్లిపల్లి పై దండెత్తి సోమవంశ రాజులను సంహరించి వారి రక్తంతో తన తండ్రికి తర్పణం సమర్పించి 'సోమకుల పరశురామ' బిరుదాన్ని సంపాదించాడు. ఈ యుద్ధంలో అనవోతా నాయకుని తమ్ముడు మాదా నాయకుడు కూడా పాల్గొన్నాడు.

జల్లిపల్లి దండయాత్ర తరువాత అనవోతా నాయకుడు రాచకొండను దుర్భేద్యమైన దుర్గంగా మార్చి రాజధానిని అనుమనగల్లు నుండి రాచకొండకు మార్చాడు. తరువాత కాపయనాయకునిపై దండెత్తి క్రీ.శ. 1368లో వరంగల్లు జిల్లాలోని భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో కాపయనాయకుని సంహరించి ఓరుగల్లును ఆక్రమించాడు. ఓరుగల్లు రాజ్యం రేచర్ల వెలమ నాయకుల వశమైంది. అనవోతా నాయకునికి 'ఆంధ్ర దేశాధీశ్వర' బిరుదు లభించింది. అప్పటి నుండి తెలంగాణా ప్రాంతాన్ని రాచకొండ పద్మనాయకులు సుమారు 100 సంవత్సరాలు పాలించారు. అనవోతానాయకుడు సాధించిన విజయాలవల్ల రేచర్ల వెలమల రాజ్యానికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన శ్రీశైలం, పశ్చిమాన బహమనీ రాజ్యం , తూర్పున కొండవీటి రెడ్డి రాజ్యాం సరిహద్దులైనాయి. రేచర్ల పద్మనాయకులు బహమనీ సుల్తానులతో మైత్రి కలిగిఉన్నారు. ఉభయ రాజ్యాల మధ్య రాజకీయ సంబంధాలు సవ్యంగానే ఉన్నట్లు పద్మనాయకులు రాజులైన దగ్గర నుండి బహమనీ సుల్తానులు తెలంగాణా పై దండెత్తక పోవటంవల్ల తెలుస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం అనవోతా నాయకుడు తన రాజ్యాన్ని రెండుగా విభజించి తన తమ్ముడైన మాదానాయని దేవరకొండ ప్రభువుగా నియమించాడు. నాటి నుండి రాచకొండలో అనవోతా నాయకుని సంతతివారూ, దేవరకొండలో మాదానాయకుని సంతతివారు పరస్పర సహకారంతో పరిపాలించారు. రాచకొండ రాజ్యానికి దేవరకొండ రాజ్యం లోబడి ఉండేది. 

రెండో సింగమనాయకుడు 

అనవోతానాయుని జ్యేష్ఠపుత్రుడు రెండో సింగమ నాయకుడు. ఇతనికి కుమార సింగమనాయుడు, కుమార సింగ భూపాలుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు అనే పేర్లున్నాయి. ఇతడు సుమారుగా 15 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. ఇతడు యువరాజుగా ఉన్నప్పుడే గుల్బర్గా జిల్లాలోని కళ్యాణి దుర్గాన్ని జయించి అక్కడ విజయస్తంభం ప్రతిష్టించి, 'కళ్యాణ భూపతి' అనే బిరుదును పొందినట్లు ఇతని ఆస్థానకవి విశ్వేశ్వరుని 'చమత్కార చంద్రిక' వల్ల తెలుస్తున్నది. రెండో సింగమనాయడు రాజ్యానికి వచ్చిన వెంటనే విజయనగర రాజులతో పోరు ప్రారంభమైంది. విజయనగర రాజైన రెండో హరిహర రాయలు తన కుమారుడైన వీర బుక్కరాయలును ఓరుగల్లు రాజ్యంపై దండయాత్రకు పంపాడు. అప్పుడు పద్మనాయకులకు సహాయంగా బహమనీ సుల్తానులు విజయనగర రాజ్యంలోని కొత్తకొండ ముట్టడించారు. ఈ యుద్ధంలో విజయనగర దండనాధుడైన సాళువ రామదేవరాయలు హతుడైనాడు. ఈ విషయాలన్నీ క్రీ.శ. 1384 నాటి విజయనగర శాసనంవల్ల తెలుస్తున్నది. విజయనగర రాజులతో జరిగిన ఈ యుద్ధంలో విజయం వెలమరాజులదే. వెలమ రాజులు ముస్లింలతో మైత్రి పెంచుకోవడం వల్ల విజయనగర రాజులకు శత్రువులైనారు. క్రీ.శ. 1389 లో విజయనగర రాజులపై విజయం తరువాత రెండో సింగమనాయకుడు దక్షిణ కళింగపై దండెత్తి, గోదావరి తీర ప్రాంతంలోని రెడ్డి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ దండయాత్ర తరువాత దక్షిణ కళింగలో రెడ్డి రాజుల అధికారం అంతరించింది. ఈ దండయాత్రలో సింగమనాయకునికి దేవరకొండ పాలకుడైన పెదవేదగిరి తోడ్పడ్డాడు. రెండో సింగమనాయకుడు కవి. కవి పండిత పోషకుడు. 'సర్వజ్ఞ చక్రవర్తి', 'సర్వజ్ఞ చూడామణి' అని కవులచే మన్ననలందాడు. ఈతనికి 'ఆంధ్ర మండలాధీశ్వర', 'ప్రతిదండ భైరవ', 'ఖడ్గనారాయణ' బిరుదులున్నాయి. ఈయన ఆస్థానకవులు-విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయామాత్యుడు.

రెండో అనపోతానాయకుడు 

రెండో సింగ భూపాలుని తరువాత అతని జేష్ఠ కుమారుడు రెండో అనవోతా నాయకుడు రాజ్యానికి వచ్చాడు. రెండో అనవోతానాయకునికి 'కుమార అన్నవోతానీడు', 'పిన్న అన్నమ నాయకుడు', 'ఇమ్మడి అనవోతానయకుడు' అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతడు 22 సంవత్సరాలు పాలించాడు. అనవోతానాయకుడు గొప్ప పరాక్రమశాలి. రెండో అనవోతా నాయకునికి సమకాలికంగా దేవరకొండ పద్మనాయక రాజ్యాన్ని పాలించిన వారు, కుమార మాదా నాయకుడు, రామచంద్ర నాయకుడు. రెడ్డి రాజులచే బహిష్కరింపబడిన అన్నదేవ చోడునకు వీరు సహాయం చేయడం వలన వీరి కాలంలో తిరిగి రెడ్డి రాజులతో పోరాటం సంభవించింది. వెలమ సైన్యంతో అన్నదేవుడు రాజమండ్రి రెడ్డి రాజ్యంపై దండెత్తాడు. కాని క్రీ.శ. 1402 లో సర్వసిద్ది వద్ద జరిగిన యుద్ధంలో రెడ్డి రాజుల సామంతుడైన చాళుక్య విశ్వేశ్వర భూపతి చేతిలో ఓడిపోయాడు. రెండోసారి మాదానేడు స్వయంగా అన్నదేవునికి సాయంగా రెడ్లపై దండెత్తాడు. కాని విజయం సాధించలేక పోయాడు. కొండవీడు, బహమనీ రాజ్యాల మధ్య కుదిరిన మైత్రివల్ల పెదకోమటి వేమా రెడ్డి కోరికపై క్రీ.శ. 1417లో ఫిరోజ్ షా రాజమండ్రి రెడ్డి రాజ్యంపై దండెత్తాడు. కాని అల్లాడ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొంది తిరిగిపోయాడు. అల్లాడ రెడ్డి విజయానికి విజయనగర సహాయం కారణమని, రాజమహేద్రవరానికి విజయనగర సహాయం పానుగల్లు ద్వారా లభిస్తున్నదని గ్రహించి ఫిరోజ్ షా క్రీ.శ. 1417లో పానుగల్లుపై దండెత్తాడు. ఈ సందర్భంలోనే విజయనగరం - పద్మనాయక రాజ్యాల మధ్య సంధి కుదిరింది. విజయనగరం, వెలమ రాజలు సైన్యాలు కలిసి బహమనీ సుల్తానును ఓడించాయి.పానుగల్లు యుద్ధం తరువాత రెడ్డి రాజులకు, వెలమ రాజలుకు మధ్య స్పర్థ తీవ్రతరమైంది. పానుగల్లు ముట్టడి కొనసాగుతున్న సమయంలో దేవరకొండ వెలమ రాజ్య ప్రభువైన పిన వేదగిరినాయుడు ధరణికోటపై దండెత్తి పెదకోమటి వేమారెడ్డి తమ్ముడైన మాదారెడ్డిని చంపాడు. ఇందుకు ప్రతీకారంగా పెదకోమటి వేమారెడ్డి దేవరకొండను ముట్టడించి పినవేదగిరిని వధించాడు. పానుగల్లు యుద్ధం ముగిసిన తరువాత అనవోతానాయుడు, పినవేదగిరి సోదరుడైన లింగమనీడు కలిసి కొడవీటి పై దండెత్తారు. ఈ యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డి వధింపబడినాడు. 

మాదానాయకుడు 

రెండో అనపోతానాయకుని తరువాత అతని తమ్ముడు మాదానాయకుడు రాచకొండ సింహాసనం ఎక్కి సుమారు పది సంవత్సరాలు పరిపాలించాడు. ఈతని కాలంలో బహమనీ సుల్తానులతో వైరం తీవ్రస్థాయికి చేరింది. విజయనగరం రెండోదేవరాయలుకు బహమనీ సుల్తాన్ అహమ్మద్ షా కు క్రీ.శ. 1424 లో జరిగిన యుద్ధంలో మాదానాయకుడు విజయనగరం పక్షం వహించాడు. దేవరాయలతో సంధి చేసుకున్న అహ్మద్ షా, పద్మనాయకులను శిక్షించే ఉద్దేశ్యంతో ఆజింఖాన్ అనే సేనానిని క్రీ.శ. 1425లో ఓరుగల్లు పైకి దండుపంపాడు. ఆజిమ్ ఖాన్ ఓరుగల్లు మొదలైన దుర్గాలను ఆక్రమించగా, మాదానాయకుడు గత్యంతరం లేక బహమనీ సుల్తాన్తో సంధి చేసుకున్నాడు. అహమ్మద్ షా మాళ్వా, గుజరాత్ యుద్ధాల్లో నిమగ్నుడై ఉన్నప్పుడు మాదా నాయకుడు అజిమ్ ఖానను ఓడించి తెలంగాణాలోని అన్ని దుర్గాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.మాదానాయకుడు గొప్ప విద్వాంసుడు. క్రీ.శ. 1427లో రామాయణానికి 'రాఘవీయం' అనే వ్యాఖ్యను వ్రాసి శ్రీరామచంద్రునికి అంకిత చేశాడు. మాదానాయకుడు గొప్ప వైష్ణవ మతాభిమాని. ఇతడు శ్రీశైల వంశంలో జన్మించిన రామానుజాచార్యుని కుమారుడైన వెంకటాచార్యుని శిష్యుడు. క్రీ.శ. 1421లో శ్రీరంగనాధస్వామికి తొర్లూరు గ్రామాన్ని శ్రీరంగపుర అగ్రహారం అనే పేరుతో దానం చేశాడు. మాదానాయకుని భార్య నాగాంబిక క్రీ.శ. 1429లో రాచకొండ సమీపంలో 'నాగసముద్రం' అనే చెరువును నిర్మించింది. 

మూడో సింగమనాయకుడు 

మాదానాయకుని తరువాత అతని అన్నకొడుకైన మూడో సింగమనాయకుడు రాజైనాడు. ఇతనికి 'ముమ్మడి సింగమనాయకుడు', 'సర్వజ్ఞరావు సింగమనాయకుడు' అనే బిరుదులున్నాయి. ఇతడు 45 సంవత్సరాల సుదీర్ఘకాలం పాలించాడు. ఇతనితోనే రాజకొండ పద్మనాయక రాజ్యం అంతరించింది. క్రీ.శ. 1433లో బహమనీ సుల్తాను అహమ్మద్ షా తెలంగాణా పై దండెత్తాడు. అహమ్మద్ షా సైన్యాధిపతియైన సంజీర్ ఖాన్ తెలంగాణాలో అధిక భాగాన్ని జయించి బహమనీ సుల్తానుల వశం చేశాడు. బహమనీ రాకుమారులలో ఒకడైన దాసూర్ ఖాన్ రాచకొండలో రాజప్రతినిధిగా నియమింపబడినాడు. దేవరకొండ మినహా తెలంగాణా అంతా బహమనీల వశమైంది. రాజకొండ రాజ్యాన్ని తిరిగి ఆక్రమించటానికి సర్వజ్ఞసింగమ నాయకుడు కళింగను పాలించే కపిలేంద్ర గజపతి సాయాన్ని కోరాడు. కపిలేంద్ర గణపతి క్రీ.శ. 1444లో తెలంగాణాపై దండెత్తాడు. కాని బహమనీ సుల్తాను అల్లా ఉద్దీన్ సేనాని కపిలేంద్ర గజపతిని ఓడించి తరిమివేశాడు. క్రీ.శ. 1435 బహమనీ సుల్తాను అల్లాఉద్దీన్ తన తమ్ముడైన మహమూద్ ఖానకు తాను ఆక్రమించిన రాజకొండ రాజ్యాన్ని ఇచ్చాడు. బహమనీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ మరణం తరువాత క్రీ.శ. 1457లో హుమాయూన్ సుల్తానైనాడు. అతనిపై తిరుగుబాటు చేసిన సికిందర్ షా కు వెలమరాజులు సాయం చేశాడు. తిరుగుబాటును అణచిన తరువాత హుమాయూన్ ఆంధ్రనాయకులను అణచటానికి ఖ్వాజా జహాన్, నిజామ్ - ఉల్ - ముల నాయకత్వంలో అపార సైన్యాన్ని పంపాడు. సుల్తాన్ సైన్యం వెలమ రాజుల దేవరకొండను ముట్టడించింది. వెలమరాజుల కపిలేంద్ర గజపతి సాయం అర్ధించాడు. కపిలేశ్వరుడు తనకుమారుడైన హంవీర దేవుని నాయకత్వంతో అపార సేనావాహిని సాయంగా పంపాడు. బహమనీ సైన్యాలు ఓడి పారిపోయాయి. హైందవ సైన్యాలు తెలంగాణాలో ముస్లింల క్రిందనున్న దుర్గాలను వరుసగా జయించటం ప్రారంభించాయి. ఈ వార్త విన్న హుమాయూన్‌షా తెలంగాణాలో హిందూసైన్యాన్ని ఓడించటానికి మహమ్మద్ గవాన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. కాని బహమనీ సైన్యాలు ఓడి పారిపోయాయి. గజపతి వెలమ సైన్యాలు రాచకొండ, భువనగిరి, ఓరుగల్లు దుర్గాలను వశపర్చుకున్నాయి. ముమ్మడి సింగమనాయకుని సోదరుడు ధర్మానాయకుడు ఓరుగల్లు పాలకుడైనాడు. క్రీ.శ. 1462 నాటి ధర్మానాయకుని శాసనం శాయం పేటలో లభించింది. నాటినుండి క్రీ.శ. 1475 వరకు ఓరుగల్లు రేచర్ల పద్మనాయకుల అధీనంలో ఉన్నది. సుల్తాను నిజాం షా కాలంలో బహమనీ సుల్తానులు తిరిగి తెలంగాణాను జయించడానికి ప్రయత్నించారు. వెలమరాజులు గజపతుల సాయంతో వారి ప్రయత్నాలను వమ్ముచేశారు. క్రీ.శ. 1468లో కపిలేశ్వర గజపతి మరణించాడు. కపిలేశ్వరుని కుమారులైన హంవీరుడు, పురుషోత్తముల మధ్య సింహాసనానికై పోరాటం అంతర్యుద్ధం ప్రారంభమైంది. దీనిని అదనుగా తీసుకొని బహమనీ సుల్తాను రెండో మహమ్మద్ షా తెలంగాణాను ఆక్రమించటానికి మాలిక్ నిజాం-ఉల్-ముల్క్ బటొని పంపాడు. క్రీ.శ. 1475 నాటికి తెలంగాణా పూర్తిగా బహమనీ సుల్తానుల వశమైంది. వీరు హిందూ సంస్థానాధిపతులను తొలగించి, వారి సంస్థానాలను ముస్లిం ఉద్యోగులకు ఇచ్చారు. ఓరుగల్లు ప్రాంతం అజిమ్ ఖాన్ కు దక్కింది. రాజ్యాన్ని కోల్పోయిన రేచర్ల పద్మనాయకులు విజయనగర రాజుల కొలువులో చేరారు. పురుషోత్తమ గజపతి విజయనగరం పై జరిపిన దండయాత్రలో విజయనగర రాజుల పక్షంలో పోరాడిన సర్వజ్ఞ సింగనాయకుని గజపతి సేనాని తమ్మభూపాలుడు ఓడించి వధించాడు. సర్వజ్ఞ సింగమనాయకుని మరణంతో పద్మనాయక చరిత్ర అంతమైంది. రేచర్ల పద్మనాయకుల ఘనత రేచర్ల పద్మనాయకులు గొప్ప వీరులు. సమర తంత్రజ్ఞులు. కాని క్రూరులై 'రణము కుడుపు' అనే బీభత్సమైన ఆచారాన్ని వాడుకలోకి తెచ్చారు. రేచర్ల పద్మనాయకులు కవులు, పండితులు, కవి పండిత పోషకులు. 'సర్వజ్ఞ చూడామణి' బిరుదాంకితుడైన కుమార సింగమనేడు 'రసార్ణవ సుధాకరము' అనే అంకార శాస్త్రాన్ని రచించాడు. శార్ణ దేవుని 'సంగీత రత్నాకరం' అనే గ్రాంథానికి 'సంగీత సుధాకరం' అనే వ్యాఖ్యను వ్రాశాడు. 'కువలయావళి' అనే మరో పేరుగల 'రత్నపాంచాలిక' నాటకాన్ని రచించాడు. పద్మనాయక రాజులు గొప్ప సాహిత్య పోషకులు. అమరకోశానికి వ్యాఖ్య రచించిన 'బొమ్మకంటి అప్పయామాత్యుడు', “చమత్కార చంద్రిక'ను రచించిన 'విశ్వేశ్వర కవి' వీరి ఆస్థానంలోని వారు. ముమ్మడి సింగ భూపాలుడు గొప్ప విద్వాంసుడు. శ్రీనాధ కవి సార్వభౌముడు దర్శించిన సర్వజ్ఞ సింగభూపాలుడు ఇతడే. పద్మనాయకులు తెలుగు కవులను కూడా పోషించారు. మొదటి అనవోతా నాయకుని కాలంలోని నాగనాధుడు విష్ణు పురాణమును రచించాడు. పెదవేదగిరి ఆస్థానంలోని అయ్యలార్యుడు 'భాస్కర రామాయణం'లోని యుద్ధకాండాన్ని పూర్తి చేశాడు. ఆంధ్ర మహాభాగవత కర్త బమ్మెర పోతనామాత్యుడు గౌరన, కొరవి గోపరాజు, భైరవి కవి మొదలైన వారు ముమ్మడి సర్వజ్ఞ సింగమ నాయకుని కాలంలోని వారే.రేచర్ల పద్మనాయక రాజ్య అస్తమయం తరువాత మరి రెండు వందల ఏండ్ల వరకు తెలంగాణాలో కవి, పండిత పోషణ అంతరించింది. 


Tags :   Recharla Padmanayaka     Telangana History   

 Singama Nayaka    Anavota Nayaka  

 Sarvagna Singama Nayaka   Bhaskara Ramayana   

  Prolaya Vemareddy    Chamatkara Cnandrika