న్యాయపరిపాలన 

రాజు నిష్పాక్షికంగా న్యాయపాలన చేసేవాడు. అత్యున్నత న్యాయస్థానం సభకు చక్రవర్తి అధ్యక్షత వహించేవారు. రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో తీర్పులు చెప్పటానికి న్యాయస్థానాలుండేవి. వీటికి వివిధ దశల్లో రాజాధికారులు నాయకత్వం వహించే వారు. తీర్పులు 'యాజ్ఞవల్క్య స్మృతి', 'పరాశర న్యాయసూత్రాల ఆధారంగా ఇచ్చేవారు. కులకట్టుబాట్లు తప్పడం, వ్యాపార సూత్రాలను పాటించకపోవడం వంటి చిన్న చిన్న తగాదాలు గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. తలతీసేయడం, కాళ్ళు చేతులు నరకడం, ఏనుగులతో తొక్కించడం సర్వసామాన్యమైన శిక్షలు. గూడఛార వ్యవస్థ ఉండేది. నేరగాళ్ళు, నిందితులు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అనేక యాతనలు పడాల్సి వచ్చేది. సామంతులు, రాజ్యప్రతినిధులు, కులీన వంశస్థుల నడవడికను, కుట్రలు కుతంత్రాలను పసిగడుతూ గూఢచార వ్యవస్థ పటిష్టంగా పనిచేసేది. ఈ కుట్రలు కుతంత్రాలను ఎప్పటికప్పుడు చక్రవర్తికి రహస్యంగా సమాచారాన్ని వేగుల ద్వారా అందించే వారు. 

సైనిక పరిపాలన 

కుందదార అనేది సైనికశాఖ. ఇతడిపై దండనాయకుడు సర్వసైన్యాధికారి. సుశిక్షత, సమర్ధమైన శాశ్వత సైన్యం చక్రవర్తి వద్ద ఉండేది. సైన్యంలో రాజు కింద పని చేసే సైన్యాన్ని 'కైజీత' సైన్యమనే వారు. 'అమర నాయంకరులు' పోషించే సైన్యం 'నాయక' సైన్యమనే వారు. సైన్యంలో ఆశ్వికదళం, కాల్బలం, శతఘ్నిదళం, గజదళం ఉండేవి. వివిధ భాగాలకు వివిధ అధికారులు ఉండేవారు (నాయకు, పాళెగార్లు ఉన్నత స్థాయి అధికారులు) దండయాత్రల సమయంలో చక్రవర్తికి సహాయంగా సామంతరాజులు, రాజప్రతినిధులు, స్థానిక ప్రభువులు తమ తమ సైన్యాలతో రాజసైన్యంలో చేరే వారు. చక్రవర్తి సైన్యంలో సామాన్య సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించేవారు. పాళెగార్లు వంటి సైనికాధికారులకు అమరం అనే పేరుతో కొంత భూమిని కేటాయించే వారు. ఈ అమరనాయకులు మండలాలపై అధిపతులుగా ఉండేవారు. 

రాజనీతి-పరిపాలన 

విజయనగర రాజ్యపాలనలో రాజే పరిపాలనాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు, సర్వన్యాయ ధీశుడు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ఆనాటి పరిపాలన పద్ధతి వివరాలున్నాయి. రాచరికం, వారసత్వ పద్ధతిలో ఉండేది. సింహాసనాన్ని బలవంతంగా కూడా స్వాధీనం చేసుకునే వారు. చక్రవర్తి మైనరుగా ఉన్నప్పుడు పాలన వ్యవహారాలు చూసేందుకు రాజ్య రక్షకుడిని నియమించే వారు. రాజుకు సలహా సంప్రదింపుల్లో మంత్రిమండలి సహకరించేది. ప్రధానమంత్రిని సర్వశిరః ప్రధాని అనేవారు. రాజ కుటుంబానికి చెందిన వారిని మంత్రులుగానూ, ప్రాంతాలకు రాజప్రతినిధులుగాను, సైనిక ఉన్నతాధికారులు గాను నియమించే వారు. మొదటి హరిహరుడి కాలంలో ఈ పద్ధతిని ప్రవేశ పెట్టారు. కేంద్ర పాలనను శాఖలుగా విభజించారు. ఆయా శాఖల పర్యవేక్షణకు రాజ్యాధికారిని నియమించే వారు. రాజు రాజ్య వ్యవహారాల గురించి తనకు సన్నిహితులైన వారితో కూడా చర్చించే వారు. సామ్రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం అనేక మండలాలు లేదా రాజ్యాలు (ప్రాంతాలు)గాను, నాడులు (జిల్లాలు)గాను, స్థలాలు (ఉప జిల్లాలు)గాను, గ్రామాలుగానూ విభజించారు. ప్రతి ప్రాంతం ఒక రాజప్రతినిధి ఆధ్వర్యంలో ఉండేది. పరిపాలన అంశాలను వారే చేసేవారు. రాజ్య ప్రతినిధిని 'మహామండలేశ్వరుడు' లేక 'నాయక్' అని పిలిచే వారు. చక్రవర్తి చేతిలో ఓడిపోయిన రాజులకు, రాకుమారులను 'మండలేశ్వరులు'గా నియమించేవారు. మండలేశ్వరులు చక్రవర్తికి కప్పం చెల్లించినంత కాలం పదవిలో కొనసాగే వారు. విజయనగర రాజులు స్థానిక పరిపాలనలో జోక్యం చేసుకునే వారు కాదు. స్థానిక పరిపాలకులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. 

పరిపాలన వ్యవస్థలో 'గ్రామం' అనేది ప్రాథమిక యూనిట్. గౌండ లేదా పటేల్ గ్రామ పెద్దగా ఉండేవాడు. మహానాయకాచార్యుడు గ్రామ పరిపాలన పరిశీలకుడిగా వ్యవహరించే వాడు. గ్రామంలో లెక్కలు చూసేందుకు సేనాత్య-గ్రామ గణకుడు ఉండేవాడు. తలారి గ్రామ కాపలాదారు. బేగర వెట్టి చాకిరిపై పర్యవేక్షణాధికారి. విజయనగర సామ్రాజ్యానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయం . సామంతులు చెల్లించే కప్పాలు, బహుమతులు, రాజప్రతినిధులు చెల్లించే రాజభరణాలు ముఖ్య ఆదాయ వనరులుగా ఉండేవి. భూమిని నాలుగు రకాలుగా విభజించారు. 1) ఎండిపోయిన భూములు 2) తేమ భూములు, 3) పండ్లతోటలు, 4) కొత్తగా సాగులోకి తెచ్చిన భూములు భూమి పన్ను ఎక్కువగా ఉండేది. మదింపును బట్టి శిస్తు వసూలు జరిగేది. పంటపొలం, సారం, దిగుబడులను బట్టి శిస్తు మదింపు చేసే వారు. సాధారణంగా ఫలసాయంలో ఆరోవంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. రాజుకు లభించే ఆదయాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఖర్చు పెట్టేవారు. న్యూనిజ్ యాత్రికుడి కథనం ప్రకారం 9/10వంతు పన్నుగా ఉండేది. భూమి పన్ను, వివాహ పన్ను, వృత్తిపన్ను, పారిశ్రామిక పన్నులు ఉండేవి. భూమిని కొలవడానికి 'కేసరిపాటి గడ' అనే కొలతను ఉపయోగించే వారు. డొమింగో పీస్ తన యాత్రారచనలో వేశ్యలపై పన్ను విధించే వారని, ఆ పన్నుతో రక్షక భటులను పోషించే వారని రాశాడు. బిచ్చగాళ్లపై కూడా పన్ను విధించే వారు. అటువంటి పన్నును 'గణాచారి' పన్ను అనే వారు. ఆముక్తమాల్యద గ్రంథంలో పేర్కొన్న ప్రకారం చక్రవర్తి తన ఆదాయాన్ని రాజదానాలు, రాజు వ్యక్తిగత వ్యయం, గుర్రాల నిర్వహణకు,దండయాత్రలకు, అభివృద్ధికి, రక్షణకు ఎక్కువగా ఖర్చు చేసేవారు.