కుమార్ లలిత్ కమిటీ

జై తెలంగాణ ఉద్యమం(1969) కంటే ముందు ముల్కీ ఉద్యమంలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి కుమార్ లలిత్ కమిటీని నియమించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగుల వివరాలు సేకరించటం. తెలంగాణలో మిగులు నిధులు ఎంతన్నది అంచనా వేయటం ఈ కమిటీ కర్తవ్యం. కమిటీ తన నివేదికలో 4,500 మంది ఆంధ్రా ఉద్యోగులు అక్రమంగా ఉన్నారని తెలంగాణాలో మిగులు నిధులు రూ.30 కోట్లని పేర్కొంది. 

తెలంగాణ వాదుల ఆందోళన

1969లోనే అక్రమ ఉద్యోగుల సంఖ్య 4,500 ఉంటే అది 2014 నాటికి లక్షల్లోకి చేరి ఉంటుందని తెలంగాణ వాదుల ప్రధాన ఆరోపణ. అప్పట్లోనే మిగులు నిధులు రూ.30 కోట్ల మేర ఉన్నాయని లలిత్ కమిటీ తెలిపింది. అప్పట్నుంచి 2014 వరకు వేల కోట్ల తెలంగాణ నిధులను ఆంధ్ర ప్రాంతాలకు తరలించారనే విమర్శలు. మిగులు నిధుల్లోంచి ఒక్క రూపాయి అయినా తెలంగాణాలో ఖర్చు చేశారా! తెలంగాణ రైతులను ఆదుకున్నారా! చేనేత కార్మికులకు చేయూతనిచ్చారా! అనే ఆరోపణలు చేశారు. 

వశిష్ఠ భార్గవ కమిటీ

లలిత్ కమిటీ పరిశీలించిన అంశాలపై 1969, ఏప్రిల్ 22న భార్గవ్ కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్ గా జస్టిస్ వశిష్ఠ భార్గవ్, సభ్యులు ప్రొ.ఎం.విహారి మాధూర్, హరిభూషణ్ బార్లు, సెక్రటరీగా టీఎన్ కృష్ణస్వామి. ఈ కమిటీ తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,500, తెలంగాణ మిగులు నిధులు రూ.28 కోట్లుగా లెక్కతేల్చింది. 

వాంఛూ కమిటీ

ముల్కీ నిబంధనలు 'కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయడం కోసం కేంద్రం ఈ కమిటీని 1969లో ఏర్పాటు చేసింది. కమిటీ- ఏం చెప్పింది కమిటీ ఆంధ్ర పాలకులకు అనుకూలంగా 'ముల్కీ నిబంధనలు విరుద్ధం' అని తేల్చింది. తెలంగాణలో ఉద్యోగాలు పొందేందుకు ఆంధ్ర ప్రాంతం వారు కూడా అర్హులని చెప్పింది. 

భరత్ రెడ్డి సుందరేషన్ కమిటీ

ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను అంచనా వేసేందుకు ఈ కమిటీని నియమించింది. 1956 నుంచి 1985 వరకు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా వచ్చినవారు, ఉద్యోగాల్లో చేరినవారు తెలంగాణలో కొనసాగాలా!వద్దా! అనే అంశాలను కమిటీ పరిశీలించి పలు సూచలను చేసింది. 1976 అక్టోబరు నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులు అందర్నీ 1986 మార్చి 30 నాటికి వెనక్కి పంపాలి. ఆ స్థానాల్లో తెలంగాణా వారిని నియమించి, ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణేతరుల కోసం సూపర్ న్యూమరరీ పోస్టులను తెలంగాణాలో సృష్టించాలి. జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, శ్రీరాంసాగర్ లో ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపాలి. సచివాలయంలో వివిధ శాఖల హెచ్ఓ డీల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలి. బోగస్ లోకల్ సర్టిఫికేట్ల ద్వారా నియమితులైన తెలంగాణేతరులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో చేరిన వారిని, ప్రమోషన్లలో చేరిన వారిని గుర్తించి వెనక్కి పంపించాలి వంటి సూచనలు కమిటీ చేసింది. 

జేఎమ్ గిర్‌గ్లానీ కమిటీ 

2001 జూన్ లో జీవో '610' అమలును పరిశీలించేందుకు జేఎమ్ గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయబడింది. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి గడువు విధించడం జరిగింది. కమిటీ రిపోర్ట్ ప్రకారం అన్ని శాఖల్లోనూ సమగ్ర విచారణ చేయాలి. అన్ని చోట్లా అక్రమాలు జరిగాయి. బోగస్ సర్టిఫికేట్ల ద్వారా ఆంధ్ర ప్రాంతం వారు ఎంత మంది ఉద్యోగాలు పొందారో తేల్చటం కష్టం. ఆ సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పటం కష్టం. తెలంగాణలోని ఓపెన్ పోస్టులను లోకల్, నాన్ లోకల్ గా విభజించాలి. న్యాయ శాఖలో చాలా ఉల్లంఘనలు, అక్రమ నియామకాలు జరిగాయి. బ్యాగ్ లాగ్ పోస్టులను' ఓపెన్ కేటగిరీ'లో చేర్చి నాన్ లోకల్స్ కు అంటే తెలంగాణేతరులకు అందించారనే అంశాలతో కమిటీ తన రిపోర్టును సమర్పించింది. 

ప్రణబ్ ముఖర్జీ కమిటీ

తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని నియమించారు. ఇందులోని సభ్యులు రఘువంశ ప్రసాద్ సింగ్, ఆర్రోడీ (బీహార్), దయానిధి మారన్, డీఎంకే (తమిళనాడు) ఈ కమిటీ గడువు ఎనిమిది వారాలుగా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా 36 పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. మాజీ ప్రధానులు వీపీ సింగ్, ఐకే గుజ్రాల్ తదితరులు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతునిచ్చారు. 2008లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాకు అనుకూలమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు. 

శ్రీకృష్ణ కమిటీ

కేంద్రం 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వాస్తవ అంశాలు ఏమిటి, తెలంగాణ రాష్ట్రం ఏమేరకు అవసరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దానికి రాజధాని హైదరాబాద్ ' లేదా ప్రత్యామ్నాయం ఉందా, హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాల్సి ఉందా, ' రాయల-తెలంగాణ' ఏర్పాటు! ప్రత్యామ్నాయం ఉందా అనే అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రం ఈ కమిటీకి సూచించింది. 

ఈ కమిటీకి జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షుడు కాగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వి.కె.దుగ్గల్ కార్యదర్శి, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ రవీందర్ కౌర్ , నల్సార్ వ్యవస్థాపక దిల్లీ జాతీయ యూనివర్సిటీ, వైస్ ఛాన్సలర్ రణ్ బీర్ సింగ్, ప్రముఖ ఆర్థికవేత్త అబుసలే షరీఫ్ మొదలైన వారు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 2010, డిసెంబర్ చివరి నాటికి తన నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం గడువు విధించింది. 2010, ఫిబ్రవరి 12న ఈ కమిటీ రాష్ట్రంలో తొలి పర్యటన జరిపింది. కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఈ కమిటీ తీరు ఒక ప్రశ్నకు రెండు ప్రశ్నల్లా సాగింది. నివేదికలోని కొన్ని అంశాలను షీల్డ్ కవర్ ద్వారా కేంద్ర హాం శాఖకు సమర్పించగా, మరికొన్నిటిని ఓపెన్ కవర్ లో పెట్టి బహిర్గతం చేసింది. ఈ కమిటీ మొత్తం 505 పేజీలతో 9 చాప్టర్లను నివేదికలో సమర్పించింది. 

కమిటీ ప్రతిపాదనలు 

  • తెలంగాణ సమస్యను శాంతి భద్రతల సమస్యగా పరిగణించి, కేంద్రసాయంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించటం. 
  • తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలి. 
  • హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ ఏర్పాటు. 
  • ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. గుంటూరు, కర్నూల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలిపి హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. 
  • హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు.
  • ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగ బద్ధ రక్షణ కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం. 

కమిటీ చివర్లో 6వ ప్రతిపాదన తన ప్రాధాన్యతగా చెప్తూ తెలంగాణ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అని, ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని పరోక్షంగా పేర్కొంది. 6వ ప్రతిపాదన అమలు సాధ్యం కాకపోతే 5వ ప్రతిపాదన తమ రెండో ప్రాధాన్యతగా చెప్పింది.