ఆర్థికస్థితి

భూమి పన్ను ముఖ్య ఆదాయం . ఇంకా వివిధ రకాల పన్నులుండేవి. వీటి వసూలుకు సుంకాధికారులు వుండేవారు. గ్రామాధికారి, న్యాయాధికారి, కరణం, గ్రణి (నీరుడికాడు), తలారీ, జ్యోతిష్కుడు, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, గ్రామోపాధ్యాయుడు అనే పన్నెండు మంది ఆధీనంలో గ్రామం వుండేది. ఇంకా సాలె, చర్మకార, కంచరి అనే వృత్తికారులు, గౌండ, గౌడ, పటేబిరి, రెడ్డి అనే అధికారులు కూడా వుండేవారు. వడ్డీ వ్యాపారం వుండేది. 

మతం

వేములవాడ చాళుక్యులలో కొందరు జైనులు, మరికొందరు శైవులు. జినవల్లభుడు జైన మందిరాన్ని నిర్మించి ఆ మతాభివృద్ధికి పాటుపడినాడు. జైన మతంలోకి వచ్చిన వైదిక మతస్థులు పూర్వ వర్ణాన్ని విడిచి పెట్టేవారు కాదు. కొల్లిపర తామ్ర శాసనాన్ని బట్టి మొదటి అరికేసరి ఏలేశ్వర నివాసి అయిన సద్యో శివాచార్యునికి బల్మొగ అనే గ్రామాన్ని దానమిచ్చినట్టు తెలుస్తుంది. వేములవాడ చాళుక్యులు తమ పేర రాజ రాజేశ్వర, బద్దెగేశ్వర ఆలయాలు నిర్మించినారు. 

భాషా సాహిత్యాలు

రెండవ అరికేసరి కవి, పండితుడు. ఇతడు పంపకవికి ధర్మపురిని అగ్రహారంగా ఇచ్చినాడు. కన్నడ, తెలుగు సాహిత్యాలలో ఆదికవి అయిన పంప కవి ఇతని ఆస్థానకవి. పంప కవి రెండవ అరికెసరిని నాయకునిగా చేసి విక్రమార్జున విజయం రాసినాడు. తెలంగాణాలో క్రీ.శ. 940 నాటి "కుర్క్యాల” శాసనంలో మొదటి సారిగా పద్యాలు లభిస్తున్నవి. దీనిని రచించినవాడూ, వేయించినవాడూ పంపకవి సోదరుడైన జినవల్లభుడు. ఈ శాసనంలో మూడు కందపద్యాలతోపాటు సంస్కృత, కన్నడ పద్యాలు కూడా ఉన్నవి. జినవల్లభుని మిత్రుడు మల్లియ రేచన కవిజనాశ్రయం రచయిత.