ఈ కాలంలో తెలంగాణాలో అధిక ప్రాంతం క్రమంగా బహమనీ రాజ్యంలో చేరగా, రాయలసీమలోని అధిక భాగం విజయనగర రాజ్యంలో అంతర్భాగమైంది. ఓరుగల్లులో ముసునూరు నాయకరాజ్యం, రాచకొండ, దేవరకొండలలో వెలమ రాజ్యం , తీరాంధ్రంలో రెడ్డి రాజ్యాలు ఏర్పడ్డాయి. పాలనా విధానం ప్రతి రాజ్యంలోనూ సాంప్రదాయ పాలనా విధానమే అమలు జరిగింది. రాజ్యపాలనలో రాజుకు ప్రధాని, సేనాధిపతి, పురోహితుడు, తోడ్పడేవారు.

ప్రభుత్వ యంత్రాంగంలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. కొడుకులు లేనప్పుడు తమ్ముని యువరాజుగా నియమించేవారు. వైదిక ధర్మాన్ని రక్షించటం, వర్ణవ్యవస్థను కాపాడటం దానధర్మాలు చేయటం, వ్రతాలు చేయటం నాటి రాజుల కర్తవ్యము. రాజ్యవిభాగాలు రాజ్యంలో 'సీమ' ముఖ్యమైన విభాగం, సీమకు దుర్గం కేంద్రంగా ఉండేది. ప్రతి సీమ కొన్ని నాయంకరాలుగా విభజింపబడేది. రాజ్యానికి గ్రామం పునాది. గ్రామపాలనను పన్నెండు మంది ఆయగాండ్రు చూచేవారు. న్యాయ పాలనకు ధర్మాసనాలను ఏర్పటు చేసేవారు. నేరాలను విచారించటానికి ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పటు చేసేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. నేరవిచారణకు అవసరమైతే దివ్యపరీక్షలను పెట్టేవారు. ప్రజలపై పన్నుల భారం అధికంగా ఉండేది. రాజులకు భూమి శిస్తు ప్రధానమైన ఆదాయ మార్గం. పంటలో ఆరోవంతు పన్నుగా వసూలు చేసేవారని విలసశాసనం తెలుపుతున్నది. రాచవూళ్లను వ్యక్తులకు కౌలుకు ఇచ్చేవారు. కాళ్ళను చెల్లించని రైతులను కఠినంగా శిక్షించేవారని శ్రీనాధుని చాటువు వల్ల తెలుస్తున్నది. దేవ బ్రాహ్మణ మాన్యాలపై పన్ను మినహాయింపు ఉండేది. వాణిజ్య సుంకాలు, వృత్తిపన్నులు మొదలైన పన్నులు కాకతీయ యుగంవలె ఉండేవి. రాజ్యరక్షణకు సైన్యం ప్రధానాధారం. రాజ్యాధ్యాంలో అధికభాగం సైన్యపోషణకు ఖర్చయ్యేది. సైన్యంలో కాల్బలం, అశ్వికదళం ప్రధానాంగాలు. యుద్ధాలలో గిరి దుర్గాలు కీలక పాత్రను వహించేవి. యుద్ధాలు క్రూరంగా జరిగేవి. 'రణముకుడుపు' అనే అతి జుగుప్సాకరమైన ఆచారాన్ని రేచర్ల పద్మనాయకులు అమలులోకి తెచ్చారు. యుద్ధంలో మరణించినవారి రక్త మాంసాలలో అన్నం కలిపి వండిన వంటకాన్ని రణదేవతలకు, భూతప్రేత పిశాచాలకు నివేదించడమే 'రణము కుడుపు'. ఈ కాలంలో యుద్ధాలవల్ల ప్రజలు ఎన్నో బాధలు పడేవారు.

ఆర్థిక, మత,సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు

ఈ యుగంలోని అనిశ్చిత వాతావరణం వల్ల కాకతీయుల కాలంనాటి ఆర్థికాభ్యున్నతి సన్నగిల్లింది. ఈ కాలంలో వృత్తి సంఘాలు, సమయాలు, సంతల ప్రసక్తి ఎక్కువగా కనపడదు. వ్యవసాయం ఈ కాలంలో ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైంది. ఈ కాలంలో చతుర్థ కులజులేగాక రాజాస్థాన జీవితాలతో విరక్తి చెందిన బ్రాహ్మణులు కూడా వ్యవసాయ వృత్తిని స్వీకరించారు. చెరువులు, కాలువలు, బావులు నాటి ప్రధాన నీటి పారుదల సౌకర్యాలు. రాజులు, ధార్మికులు తటాకాలను, బావులను త్రవ్వించేవారు. పద్మనాయక రాజులు అనపోతు సముద్రం, రాయసముద్రం, నాగ సముద్రం మొదలైన తటాకాలను నిర్మించారు. ఏతాము, రాట్నాల ద్వారా కూడా పొలాలకు నీటి వసతి కల్పించుకొనేవారు. వరి, జొన్న, సజ్జ, చెరకు, నువ్వులు, ప్రతి నాటి ముఖ్యమైన పంటలు, జొన్నలే సామాన్య ప్రజల ప్రధాన ఆహారం. 

పరిశ్రమలు 

వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా రంగుల పరిశ్రమ ఉండేది. 'సింహాసన ద్వాత్రింశిక' అనే గ్రంథం పలు రకాల పట్టుబట్టలను పేర్కొన్నది. నాటి వాజ్మయం పలు రకాల పరిశ్రమల ప్రసక్తి కనబడు తున్నది. పంచాణంవారు పంచ లోహాలతో కొలువు, చవికెలు, గజగంటలు, జయస్తంభాలు, దీపస్తంభాలు ఆయుధాలు తయారు చేసేవారు. నిర్మల్ కత్తులు దేశాంతరాలలో ప్రసిద్ధి చెందాయి. గాజు రెక్కల తలుపులు, అద్దాలు కూడా గ్రంథాలలో కనిపిస్తాయి. 

వాణిజ్యం 

దేశీయ, విదేశీయ వాణిజ్యాన్ని వైశ్య, బలిజ, తెలక కులాలు నిర్వహించేవి. దేశీయ వాణిజ్యానికి రాజధాని నగరాలు, పుణ్యక్షేత్రాలు కేంద్రాలుగా ఉండేవి. సంతలు, జాతరలు, వసంతోత్సవాల సమయంలో క్రయవిక్రయాలు ఎక్కువగా ఉండేవి. 

మత పరిస్థితులు

ముస్లింలు మత దౌర్జన్యాల తిరుగుబాటు ఫలితంగా ఏర్పడ్డ రెడ్డి, నాయక రాజ్యాలు, హిందూ మత సంస్కృతుల పరిరక్షణకు పూనుకొన్నాయి. ముస్లిం దాడులలో నష్టపడిన బ్రాహ్మణులకు అగ్రహార పునరుద్ధరణతో ఈ యుగం ప్రారంభమైంది. 

స్మార్తం 

ఈ యుగంలో కాకతీయుల కాలంలో ప్రారంభమైన సమన్వయ స్మార్త మత విధానానికి మంచి ప్రోత్సాహం లభించింది. ప్రోలయ వేమారెడ్డి శైవుడైననూ, వైష్ణవ మతాన్ని ఆదరించారు. 'అనవరత పురోహిత కృత సోమపాన' అని అతని బిరుదు. ఇతడు ఎన్నో అగ్రహారాలను విద్య తపో వృద్ధులైన బ్రాహ్మణులకు దానం చేశాడని ఎర్రాప్రెగడ వర్ణించాడు. 

శైవం 

ఈ కాలంలో తీవ్రవాద శైవానికి ఆదరణ హెచ్చింది. శివుని ఉగ్రమూర్తులైన భైరవ, మైలారు భటుల పూజ అధికమైంది. పద్మనాయక రాజులు అనేక భైరవ ప్రతిష్టలు చేశారు. 'రణము కుడుపు' ఆచారం భైరవారాధన ఫలితమై ఉండవచ్చు. వామాచార సంబంధమైన తాంత్రిక విధానం ద్వారా అష్టసిద్ధులు సంపాదించవచ్చుననే విశ్వాసం ఆ కాలంలో బలంగా వుండేది. ఆ విధంగా అష్టసిద్ధులు మత్స్యేంద్ర నాధాది నవనాధుల చరిత్రలను ప్రజలు పురాణాలుగా చెప్పుకొనేవారు. నాటి కావ్యాలలో చంపుడు గుడుల ప్రసక్తి ఎక్కువగా కన్పిస్తుంది. శైవ, వైష్ణవాలకు మధ్య వివాదాలు జరుగుతుండేవి. పద్మనాయకుల ఆస్థానంలోని శాకల్య భట్టుకు, పరాశర భట్టుకు వివాదం జరిగింది. విద్యారణ్యునికి, ద్వైత పీఠాధిపతియైన అక్షోభ్య తీర్థులకు వివాదం జరిగిందని వైష్ణవ సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. శైవ, వైష్ణవాలకు చెందిన ప్రధాన దేవతలతోపాటు అనేక చిన్న దేవతలను కూడా ప్రజలు ఆరాధించేవారు. ఆనాడు సామాజిక మత కార్యక్రమాలకు ఆలయం కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాలలో జరిగే ఉత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేవారు. పెద్ద పెద్ద ఆలయాలలో మఠాలుండేవి. ఈ మఠాలు ఆయా మత విద్యలకు కేంద్రంగా వుండేవి.

సాంఘిక పరిస్థితులు

హిందూ సంఘంలో వర్గాలు, కులాలు ఉండేవి. నానాటికీ వర్గాల సంఖ్య పెరిగింది. భక్తి ప్రధానమైన హిందూమతం సమాజంలో వర్గ విభేదాలను రూపు మాపడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో కొన్ని కొత్త కులాలు ఏర్పడినవి. బ్రాహ్మణులకు గౌరవ ప్రతిపత్తులు కొనసాగినవి. విద్యావంతులైన బ్రాహ్మణులను గౌరవించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. బ్రాహ్మణులలో రాజోద్యోగాలలో నియమితులైన వారు నియోగులైనారు. నియోగి వైదిక బేధాలు ఈ కాలంలో బలపడినవి. బ్రాహ్మణులు తర్క, వ్యాకరణం, జ్యోతిష్య, గణిత, వైద్యాది శాస్త్రాలను అభ్యసించేవారు. ఈ విద్యలకు అగ్రహారాలు కేంద్రంగా ఉండేవి. బ్రాహ్మణులలో కొందరు వ్యవసాయ వృత్తిని స్వీకరించారు. వైశ్యులు వ్యాపారం చేసేవారు. తెలగ, బలిజ మొదలైన కులాలు కూడా వ్యాపారంలో పాల్గొనేవి. సామాన్య శుద్రకుటుంబాలు వ్యవసాయం, చేనేత మొదలైన వృత్తులు అవలంభించేవి. విదేశీ వాణిజ్యం ద్వారా ధనవంతులైన వైశ్యులు, పెనుగొండ, కొండవీడు, వినుకొండలలో ఉండేవారు. ధనిక వైశ్య కుటుంబాల వారు సాహిత్యాన్ని, నాట్య సంగీతాలను పోషించేవారు. రాజాస్థానాలు, అగ్రహారాలు విద్యా కేంద్రాలుగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలలో అక్షరాస్యత తక్కువగా ఉండేది. కాని పురాణాది సత్కాలక్షేపాల ద్వారా సామాన్య ప్రజలు విద్యావంతులు, నీతి వర్తనులు అయ్యేవారు. ప్రజలకు శకునాలలో నమ్మకం ఎక్కువైంది. పంచాంగాన్ని సంప్రదించందే ఏ పనీ చేసేవారు కారు. జూదం సర్వసాధారణ వినోదం అయింది. పత్రాలపై వడ్డీలకు ఇచ్చే ఆచారం ప్రబలింది. వడ్డీ వ్యాపారులు చేసే మోసాలను నాటి కావ్యాలు వర్ణించాయి.

భాషా సాహిత్యా లు

కాకతీయానంతర యుగంలో సంస్కృతాంధ్ర భాషలలో సాహిత్య సృష్టి జరిగింది. ఈ యుగంలో కావ్యాలతోపాటు అనేక శాస్త్ర గ్రంథాలు కూడా రచింపబడినవి. తెలుగు సాహిత్యం నాయకరాజులు స్వయంగా సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప పండితులు. సంగీత రసజ్ఞులు, సాహిత్య ప్రియులు. కవి పండిత పోషకులు. రేచర్ల పద్మనాయక రాజ్యంలో సుప్రసిద్ధ కవి బమ్మెర పోతన వుండేవారు. ఆంధ్ర మహాభారతమును రచించి రాజులకు అంకితం చేయక శ్రీరామునకు అంకితం చేశాడు. 'భోగినీ దండకం, వీరభద్ర విజయం ', నారాయణ శతకమనే ఇతర రచనలు. వీటిని పోతన వ్రాయలేదని కొందరు చరిత్రకారుల వాదన. సంస్కృత సాహిత్యం రేచర్ల పద్మనాయకులు గొప్ప కవులు, కవి పండిత పోషకులు. వీరిలో రెండో శింగభూపాలుడు 'రసారవ సుధాకరము' అనే అలంకార శాస్త్రాన్ని 'సంగీత సుధాకరం' అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని 'రత్న పాంచాలిక' అనే నాటకాన్ని వ్రాశాడు. ఇతనికి 'సర్వజ్ఞ సింగ భూపాలుడు' అనే బిరుదు వున్నది. సింగ భూపాలుని కొడుకు రావు మాధవ నాయకుడు రామాయణానికి 'రాఘవీయము' అనే వ్యాఖ్యను రచించాడు.రేచర్ల రెండో సింగ భూపాలుని ఆస్థానంలోని విశ్వేశ్వరుడు, 'చమత్కార చంద్రిక' అనే అలంకార శాస్త్ర గ్రంథన్ని అప్పయార్యుడు 'అమరకోశ వ్యాఖ్య'ను రచించాడు. అనవోతా నాయకుని ఆస్థానంలోని పశుపతి నాగనాధుడు 'మదన విలాస బాణము' అనే గ్రంథాన్ని రచించాడు. రేచర్ల ఆస్థానంలోని శాకల్య మల్లు భట్లు 'నిరోష్ఠ్య రామాయణం', 'ఉదార రాఘవం', 'అవ్యయ సంగ్రహం' అనే గ్రంథాలను రచించారు.


Tags :   Recharla Padmanayaka     Telangana History   

 Industry    Commerce   Economic Policies 

  Amara Kosha     Prolaya Vemareddy    Chamatkara Cnandrika