భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమానికి పునాది వేశారు. ఆయనపై బ్రహ్మసమాజ ప్రభావం ఉండేది. సమాజంలో నిమ్నవర్గాలుగా ఉన్న దళితుల హక్కుల కోసం భాగ్యరెడ్డివర్మ పోరాడారు. ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించారు. దళితులు మూలవాసులని, వీరికి ఆది హిందువులని భాగ్యవర్మ పేరు పెట్టారు. విదేశాల నుంచి ఈ దేశానికి వచ్చిన అగ్రవర్ణాలవారు మూల వాసులైన తమను అణచి, పెత్తనం చెలాయిస్తున్నారని భాగ్యరెడ్డివర్మ అభిప్రాయపడ్డారు. అందుకే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న దళితులను ఆది హిందువులుగా పేర్కొన్నారు.
భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్ నగరంలో జన్మించారు. ఆయన మొదటి పేరు భాగయ్య. ఆర్యసమాజం ఆయన సేవలకు 1913లో వర్మ అనే బిరుదును ప్రదానం చేసింది. భాగ్యరెడ్డివర్మ 1906లో అస్పృశ్యతా నిర్మూలన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన 1906లో 'జగన్ మిత్రమండలి' పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సభ్యులు అస్పృశ్యత నిర్మూలన కోసం పనిచేశారు. హరికథలు, భజనలు, బహిరంగ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ సంస్థ కృషి చేసింది.
భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్ లో దళితుల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వ న్యాయస్థానాల్లా పనిచేసేవి. భాగ్యరెడ్డివర్మ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించేవారు. ప్రధాన లేక కేంద్ర న్యాయపంచాయితీ చాదర్‌ఘా లోని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ భవనంలో కొలువు తీరేది. ఈ భవనంలోనే గ్రంథాలయం, పఠనాలయం, బాలబాలికలకు పాఠశాలలను నిర్వహించేవారు.హరిజనుల సమస్యల పరిష్కారం కోసం భాగ్యరెడ్డివర్మ 'హైదరాబాదు' పేరుతో తెలుగు వారపత్రికలను నడిపారు. ధర్మవీర వామన్ నాయక్, పాండురంగజోషి, మాడపాటి హనుమంతరావుల సహాయంతో భాగ్యరెడ్డివర్మ అంబర్ పేటలో హిందూ శ్మశానవాటికను ఏర్పాటు చేశారు.
అంటరాని కులాల్లో ఆత్మగౌరవం పెంచడానికి చదువే పరిష్కార మార్గమని గ్రహించిన భాగ్యరెడ్డి వర్మ, మిత్రమండలి కార్యక్రమాల్లో భాగంగా 1910లో ఇసామియా బజారులో, లింగం పల్లిలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. తర్వాత ఎం.ఎల్.ఆదయ్య సికింద్రాబాద్ లో ప్రారంభించిన, ఆది హిందూ పాఠశాలతో సహా వీటి సంఖ్య 26కి పెరిగింది. దళితుల విజ్ఞప్తి మేరకు 1934లో నిజాం ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ చేపట్టి, వ్యయాన్ని భరించింది. 1911లో జగన్ మిత్ర మండలి 'మన్యసంఘం' గా రూపాంతరం చెందింది. వvటి శేషయ్య అధ్యక్షుడిగా, హెచ్.ఎస్. వెంకటరావు ఉపాధ్యక్షుడిగా, జె.ఎస్.ముత్తయ్య సెక్రటరీగా, భాగ్యరెడ్డి వర్మ కార్యనిర్వాహక కార్యదర్శిగా 1913లో పూర్తి కార్యవర్గాన్ని ఈ సంఘం ఏర్పారచు కున్నది. బాల్య వివాహాలను నిర్మూలించడం, దేవదాసి, జోగిని వంటి ఆచారాలను నిషేధించడం లక్ష్యంగా ఈ సంఘం పనిచేసింది. ఈ దురాచార నిర్మూలన కోసం భాగ్యరెడ్డి వర్మ ప్రత్యేకంగా 'దేవదాసీ నిర్మూలన సంఘాన్ని' స్థాపించారు. ఈయన నిరంతర కృషి వలన నిజాం ప్రభుత్వం తరువాత కాలంలో దేవదాసీ వ్యవస్థను నిర్మూలించింది. 1911లో ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను భాగ్యరెడ్డివర్మ ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో అగ్రవర్ణాల వారిని చేర్పించి, ఆది హిందువుల అభివృద్ధికి తొడ్పడ్డారు. 1912లో భాగ్యరెడ్డి వర్మ 'అహింసా సమాజాన్ని' ప్రారంభించారు. అనంతర కాలంలో ఇదే సంస్థ 'ది దక్కన్ హ్యూమనిటేరియన్ లీగ్'గా రూపాంతరం చెందింది. ఈ సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ప్రచారం ప్రభావం వలన 1920లో గోవధను నిషేధించడం జరిగింది. 1912లో భాగ్యరెడ్డివర్మ ఒక స్వస్తిక్ వాలంటీర్ల దళ్ ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సభ్యులు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు పలు రకాల సేవలు చేశారు.
1925లో హైదరాబాద్ లో ప్లేగువ్యాధి వచ్చినప్పుడు ఈ సంస్థ సభ్యులు రోగులకు సేవలు అందించారు. భాగ్యరెడ్డివర్మ మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. భాగ్యరెడ్డివర్మ మాటకారితనం, నేర్పుతో పలువురు అగ్రవర్ణ హిందువులు ఆయనకు చేయూతనిచ్చారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తి బాలకుముద్, జైనుడైన సేర్ ఘన్ శ్యామ్ జీ, ధరమ్ వీర్, వామన్ నాయకు స్వస్తిక్ దళ్ లో సభ్యులుగా ఉండేవారు. 1915లో 'సంఘ సంస్కార నాటక మండలి'ని భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు. ఈ సంస్థ సాంఘిక దురాచారాలను విమర్శించే మూడు నాటకాలను ప్రచురించింది. భాగ్యరెడ్డి వర్మ 1916లో ఇంటి పని మనుషుల కోసం 'విశ్వగృహ పరిచారిక సమ్మేళనాన్ని' స్థాపించారు. 1917 నాటికి అంటరాని వర్గాల సమస్యల పట్ల పూర్తి అవగాహన పెంచుకున్న భాగ్యరెడ్డి వర్మ నవంబర్ 4-6 తేదీల్లో విజయవాడలో 'మొదటి పంచమ సదస్సు' ఏర్పాటు చేసి అందులో 'పంచమ' శబ్దాన్ని ఖండించారు. అగ్రకుల హిందూ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అంటరాని వర్గాలకు 'పంచమ' అనే పేరు ఇచ్చిందని, వీరిని రాష్ట్రస్థాయిలో 'ఆది ఆంధ్రులు'గా జాతీయ స్థాయిలో 'ఆది హిందువులు'గా పిలవాలని ప్రతిపాదించారు. మన్యసంఘం సహాయ కార్యదర్శి ముత్తయ్య సంపాదకత్వంలో డిసెంబర్ 31, 1918న 'ది పంచమ' అనే ఆంగ్ల మాస పత్రిక ప్రారంభించబడింది. భాగ్యరెడ్డివర్మ 1921లో ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య ఏర్పాటు చేశారు. ఆయన మొదటి ఆది హిందూ సదస్సును హైదరాబాద్లో 1921లో నిర్వహించారు. ఆ సదస్సుకు బొంబాయి ప్రెసిడెన్సీలోని బెల్గాంకు చెందిన టి.జె. పాపన్న అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో దేశ వ్యాప్త ప్రతినిధులు పాల్గొన్నారు. తరువాత 1924 వరకు జరిగిన ఆది హిందూ మహాసభలకు కేశవరావు, వామన్ నాయక్, రాజా ధన్ రాజ్ గిలు అధ్యక్షత వహించారు.
1922 మార్చి 29-31 తేదీల్లో రెసిడెన్సీ బజార్ లో భాగ్యరెడ్డి వర్మ, ఎం.ఎల్.ఆదయ్య ఆధ్వర్యంలో జరగిన తొలి 'అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్' కొన్ని పాత తీర్మానాలతో పాటు రెండు ముఖ్యమైన తీర్మానాలు చేసింది.
1. భారతదేశంలో మూలవాసులైనందున దళితులను ఆది హిందువులుగా పిలవాలి.
2. పాఠశాలల్లో ఆదిహిందువులను చేర్చుకోకపోతే జరిమానా విధించాలి.
ఈ కాన్ఫరెన్స్ సందర్భంలోనే మన్యసంఘం 'ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్'గా మారింది. దీనికి సికింద్రాబాద్ శాఖ అధ్యక్షుడిగా ఎం.ఎల్.ఆదయ్య ఎన్నికైనారు. 1925లో ఆదిహిందూ బస్తీల్లో సుబేదార్ సాయన్న మాదిగ అధ్యక్షతన భాగ్యరెడ్డి వర్మ అనేక సభలను నిర్వహించి వారి హక్కుల కోసం చైతన్య పరిచారు. ఇదే సంవత్సరంలో గుంటిమల్ల రామప్ప నేతృత్వంలో 'మాతంగ మాదిగ జనసభ' ఏర్పడింది. దీనికి కొన సాగింపుగా 1927 మార్చి 2వ తేదీన మల్లేపల్లిలో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన 'మాతంగిసభ' జరిగింది. 1927 సికింద్రాబాద్ లో బి.ఎస్.వెంకట్రావు వంటి వారి కృషితో ఎం.ఎల్.ఆదయ్య అధ్యక్షుడిగా 'ఆదిహిందూ మహాసభ' ఏర్పడింది. 1928లో బి. ఎస్.వెంకట్రావు దీనికి అనుబంధంగా 'ఆది హిందూ లైబ్రరీ'ని కూడా ఏర్పాటు చేశాడు. దళితుల విద్యాభివృద్ధికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేసింది. 1930, జోగిపేటలో జరిగిన తొలి ఆంధ్రమహాసభలో భాగ్యరెడ్డివర్మ అంటరానితనం నిర్మూలన, హరిజన విద్యాభివృద్ధికి సంబంధించిన తీర్మానాలను ప్రతిపాదించారు. ఆ తీర్మానాలు నెగ్గాయి. దేవరకొండలో 1931లో జరిగిన రెండో ఆంధ్రమహాసభలో భాగ్యరెడ్డివర్మ పాల్గొని ప్రసంగిస్తూ, ఆది హిందువుల హక్కుల కోసం అనేక ప్రతిపాదనలు చేశారు. నాటి ఆంధ్రమహాసభల్లో ఆయనతో పాటు మాటూరి బలరామయ్య చిత్తారయ్య, అరిగె రామస్వామి వంటి నాయకులు కూడా పాల్గొన్నారు.
ఆది హిందూ ఉద్యమ ప్రచారానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అనేక నాటకాలు వేయించారు. అందులో 'సత్యహరిశ్చంద్ర' నాటకం ప్రధానమైంది. భాగ్యరెడ్డివర్మ దళితుల్లో జాగృతి కలిగించడానికి అనేక కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా ఆయన 1925లో ఆది హిందూ వర్గాల కళాకారులను ప్రోత్సహించడానికి వారు వేసిన పెయింటింగ్లు, శిల్పాల ప్రదర్శనను హైదరాబాద్ లోని రెసిడెన్సీ బజారులో ఏర్పాటు చేశారు. అదే సంవత్సరంలో ప్రేమ్ థియేటర్ మైదానంలో ఆది హిందూ యూత్ జిమ్నాస్టిక్స్ పోటీలను నిర్వహించారు. 1931 జులై10న ఎం.ఎల్.ఆదయ్య అధ్యక్షతన జరిగిన 'ఆది హిందూ ధార్మికసభ' అంటరాని వర్గాలన్నింటినీ ఒక వేదిక మీదకి తెచ్చి వారి ఐక్యతకు ప్రయత్నించింది. అదే సంవత్సరంలో వర్మ అధ్యక్షతన నవంబర్ 7వ తేదీన సికింద్రాబాద్ లో 'నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సభ' జరిగింది. ఈ సదస్సుతో దళిత హక్కుల సాధనలో మరో ముందుడుగు పడింది. అణగారిన వర్గాలకు వేదికను కల్పిస్తూ 1931లో భాగ్యరెడ్డి వర్మ 'భాగ్యనగర్' అనే పత్రికను ప్రారంభించారు. 1937 డిసెంబర్ నుండి ఈ పత్రిక 'ఆదిహిందూ'గా పేరు మార్పు చేయబడి మాస పత్రికగా వెలువడసాగింది. ఇదే సంవత్సరంలో అరుంధీయుల్లో చైతన్యం తీసుకురావడానికి 'జాంబవర్ణ సేవాసమితి' ఏర్పడింది. 1920 నుంచి అఖిల భారత ఆదిహిందూ సదస్సులు జరిగాయి. 1927, 1930లలో అలహాబాద్ లో జరిగిన ఆది హిందూ సదస్సుల్లో భాగ్యరెడ్డివర్మ దక్షిణ భారతావనికి ప్రాతినిధ్యం వహించారు. 1931లో లక్నోలో జరిగిన రాజకీయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సదస్సులోనే ఆయన తన పేరులోని వర్మ పదాన్ని తొలగించుకున్నారు. 1933లో ఆది హిందూ సదస్సుకు భాగ్యరెడ్డి అధ్యక్షత వహించారు. గుంటిమల్ల రామప్ప నాయకత్వాన 1932లో అంటరాని వర్గాల ఐక్యత కోసం మాతంగ (మాదిగ) మహాసభ జరిగింది. 1934లో ఆదిహిందూ భవన్ లో జరిగిన సమావేశం హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో తమ ప్రతినిధిగా అరిగె రామస్వామిని నియమించాలని, ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీని ఫలితంగా ఎం.సి. హెచ్.కు రామస్వామి కౌన్సిలర్ గా ఎన్నికైనారు.
దళితుల్లో తొలి ప్రజా ప్రతినిధిగా ఇతనిని భావించవచ్చును. 935 సంవత్సరంలో బి.ఎస్.వెంకట్రావు అంబేద్కర్ అధ్యక్షతన 'దళిత యువకుల సదస్సు'ను నిర్వహించారు. ఈ సదస్సుకు బొల్లారం ప్రాంతానికి చెందిన విద్యావేత్త రాజారాం భోలే సహకరించారు. 1936 మే 17న వెంకట్రావ్ అధ్యక్షతన సికింద్రాబాద్ లో 'అంబేద్కర్ యూత్ లీగ్' ఏర్పడింది. పి.ఆర్.వెంకటస్వామి దీనికి కార్యదర్శిగా ఉన్నారు. అంబేద్కరిజం ప్రచారానికి తెలంగాణలో వేసిన తొలి అడుగుగా దీనిని భావించవచ్చును. 1936లో రాంసింగ్ పాకీ పని చేసే వారి కోసం 'శబరి' అనే పేరుతో ఒక సంఘాన్ని స్థాపించాడు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వెట్టిచాకిరీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి, వెట్టి చేయవద్దని మాల, మాదిగలకు బోధించిన సామాజికవేత్త పీసరి వీరన్న. 1937 డిసెంబర్ 19న మజ్లిస్ ఎఖ్వనిన్ సంస్కరణలపై ఆది హిందువులు 43 శాఖల సమావేశాలు భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో బి.ఎస్.వెంకట్రావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాల్లో హైదరాబాద్ రాష్ట్ర విస్తరణకు కాశీనాధరావు వైద్య రూపొందించిన అనధికార బిల్లుపై మాట్లాడిన భాగ్యరెడ్డి వర్మ 'ఆది హిందువులకు ప్రత్యేక ప్రాతినిధ్యం గల పది నియోజక వర్గాలను కేటాయించాలని' తీర్మానించారు. 1939లో భాగ్యరెడ్డి వర్మ మరణం తెలంగాణలో దళిత ఉద్యమానికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చును. భాగ్యరెడ్డి వర్మ తరువాత దళిత ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో టి.వి.నారాయణ ముఖ్యులు. ఈయన 1940 దశకంలో దళిత ఉద్యమాన్నినిర్మించారు.
Tags : Aadi Hindu Movements in Hyderabad
Bhagyareddy varma Ambedkar Youth League
Jagan Mitra Mandali Freedom Movement
Telangana History
Pages