స్థాపన:

విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1336లో సంగమ వంశానికి చెందిన హరిహర, బుక్కరాయలు తుంగభద్ర నదీ తీరంలో విద్యారణ్యస్వామి సహకారంతో స్థాపించారు. ఈ సోదరులు మొదట కాకతీయ ప్రతాపరుద్రుడి కొలువులో ఉండేవారు. క్రీ.శ. 1323లో కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు స్వాధీనం చేసుకోవడంతో హరిహర, బుక్కరాయలు కర్నాటకలో కంపిలి రాజ్యానికి వలస వెళ్లారు. తర్వాత ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ వీరిని ఇస్లాం మతంలోకి మార్చి అనెగొంది, కంపిలి ప్రాంతాలకు ప్రతినిధులుగా నియమించాడు. కాలక్రమంలో వీరు ఢిల్లీ సుల్తానులను ధిక్కరించి స్వతంత్ర విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. 

చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు:

విజయగనర సామ్రాజ్య స్థాపనలో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. విజయనగర రాజ్య నిర్మాత హోయసాల రాజు మూడో వీరభల్లాలుడని ఫెరిస్టా రచన ఆధారంగా రెవరెండ్ ఫాదర్ హెరాస్ పేర్కొన్నారు. రాజ్య నిర్మాత హరిహరరాయలేనని 'ది ఫర్ గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం' రచయిత రాబర్ట్ సీవెల్ నిర్ధారించాడు. ఈయన అభిప్రాయాన్నే అత్యధిక చరిత్ర కారులు ఏకీభవిస్తున్నారు. హరిహరుడు కన్నడ లేదా తెలుగువారనే వివాదం ఉంది. స్థానిక చరిత్రలు, బదౌని, ఇసామీ, న్యూనిజ్ రచనల ప్రకారం హరిహరరాయలు తెలుగువారేనని డాక్టర్ నేలటూరి వెంకట రమణయ్య నిర్ధారించారు. స్థానిక చరిత్రల ఆధారంగా హరిహర, బుక్కరాయలు కాకతీయ ప్రతాపరుద్రుని ఉద్యోగులని, మంగళ నిలయ నివాసి ఐన సంగముడి కుమారులని చరిత్రకారులు నిర్ధారించారు. 1336-40 మధ్య హరిహర, బుక్కరాయలు రాజధానిని అనెగొంది నుంచి విజయ నగరానికి మార్చారు. 

ఆధారాలు గ్రంథాలు:

విద్యారణ్యుడి కాలజ్ఞానంలో విజయనగర రాజుల చరిత్ర వివరాలున్నాయి. విద్యారణ్య వృత్తాంతం రాజ్య స్థాపన, కొందరు రాజుల పేర్లు పేర్కొంది. కంపిలి రాయ చరిత్ర, సాళువాభ్యుదయం; రాయవాచకం; కృష్ణరాయ విజయం; వరదాంబికా పరిణయం; అచ్యుత రామాభ్యుదయం; రఘునాథాభ్యుదయం, సాహిత్య రత్నాకరం... వంటి గ్రంథాల ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి. మాధవ సాయన, మాధవ మంత్రి చేసిన వ్యాఖ్యల్లో సంగమ వంశ వివరాలున్నాయి. రెండో బుక్కరాయల ఆస్థాన వైద్యుడు రాసిన వైద్యరాజ వల్లభం ఆయుర్వేద గ్రంథం, లక్ష్మీనారాయణుడి సంగీత సూర్యోదయం, కళింగ గజపతి ప్రతాపరుద్రుడి సరస్వతీ విలాసం, శ్రీకృష్ణ దేవరాయల ఆముక్తమాల్యద (విష్ణుచిత్తీయం) నాటి రాజనీతి, సామాజిక పరిస్థితులను వివరిస్తున్నాయి. 

విదేశీ యాత్రికుల కథనాలు :

ఇబన్ బటూటా (మొరాకో-ఆఫ్రికా) మొదటి హరిహరుడి కాలం నాటి విజయనగర పరిస్థితులు వివరించాడు. ఇటలీ (వెనీషియన్) యాత్రికుడు నికోలా డికోంటి మొదటి దేవరాయల కాలంలో రాజ్యాన్ని సందర్శించి రాజ్య విస్తరణ, నాటి సాంఘిక పరిస్థితులను వివరించాడు. పారశిక యాత్రికుడు అబ్దుల్ రజాక్ రెండో దేవరాయల కాలం నాటి పరిస్థితులను వివరించాడు. డొమింగో పెయిస్ (పోర్చుగీస్) శ్రీకృష్ణదేవరాయల పాలనా స్వరూపం, వ్యక్తిత్వం, నాటి సంపదలు, రక్త తర్పణాల గురించి వివరించాడు. ఫెర్నానో న్యూనిజ్ అనే పోర్చుగీసు యాత్రికుడు కృష్ణదేవరాయలు, అచ్యుత రాయల కాలం నాటి పరిస్థితులను గ్రంథస్థం చేశాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చిన పోర్చుగీస్ యాత్రికుడు ఎడ్వర్డో బార్బోసా నాటి పాలనా విధానాన్ని వర్ణించాడు. రష్యా వ్యాపారస్థుడు ఆస్తనాసియన్ నికితిన్ 1470 లో బహమనీ రాజ్యాన్ని సందర్శించి న్యాయ స్థానాలు, సైన్యం, ప్రజల స్థితిగతులను వివరించాడు. లుడోవికో-డి-వల్లెమా (ఇటలీ) గోవా, కాలికట్, పశ్చిమ తీర ఓడరేవులు, విజయ నగర రాజ్య స్థితిగతులను వివరించాడు. 

శాసనాలు

మొదటి హరిహర రాయలు వేయించిన బాగపల్లి శాసనం, అతడి ఘనకార్యాలు తెలుపుతుంది. కంపన కుమారుడు రెండో సంగముడు వేయించిన భిట్రగుంటదాన శాసనం సంగమ వంశావళిని తెలుపుతుంది. రెండో హరిహర రాయల చెన్నరాయ పట్నం శాసనం ఒకటో బుక్కరాయలు జయించిన ప్రాంతాలను వివరిస్తుంది. శ్రీరంగపట్నం తామ్రశాసనం, రెండో దేవరాయల విజయాలు వివరిస్తుంది. ఇమ్మడి నరసింహరాయల దేవులపల్లి రాగి శాసనం సాళువ రాజుల వంశావళిని వివరిస్తుంది. 

నాణేలు :

విజయనగర రాజులు పెద్ద సంఖ్యలో అనేక రకాల బంగారు నాణేలను ముద్రించారు. వీటిని వరహాలు, పగోడాలు, ఫణాలని పిలుస్తారు. వీటిలో కొన్ని పూర్తి వరహాలు, అర్థవరహాలుగా ముద్రించారు. నాణేల వెనుక భాగంలో దేవతల బొమ్మలు, నంది, ఏనుగు, గండ భేరుండ బాలకృష్ణుడు, లక్ష్మీ-వెంకటేశ్వరుడు, వంటి బొమ్మలు ముద్రించారు. నాణేనికి ఒక వైపు దేవ నాగరిలిపి, మరొక వైపు వైష్ణవ సంప్రదాయాల బొమ్మలు ముద్రించారు. కొన్ని నాణేలపై కన్నడ లిపి కన్పిస్తుంది. ఈ నాణేల ద్వారా రాజకీయ చరిత్ర, మత విశ్వాసాలు, ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవచ్చు. 

దేశీయ సాహిత్యం

శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద నాటి రాజనీతిని, సాంఘిక పరిస్థితులు, అల్లసాని పెద్దన మనుచరిత్ర నాటి కుల వ్యవస్థను, సంగమ రాజు కుమారుడు కంపన భార్య గంగా దేవి-మధురా విజయం ఒకటో బుక్క రాయల కాలంలో మధురై విజయం గురించి వివరిస్తుంది. గంగాధరుడు-గంగాదాస ప్రలాప విలాసం బహమనీ సుల్తానులు కళింగ గజపతులపై విజయాలు; డిండిముడు- సాళువాభ్యుదయంలో సాళువ వంశ ప్రశస్తి కన్పిస్తుంది.