మత పరిస్థితులు

రెడ్డిరాజులు కాలంలో రాజుల మతాన్నే ప్రజలు అనుసరించేవారు. రెడ్డి, వెలమ రాజులు హిందూ ధర్మ సంరక్షణే ధ్యేయంగా శైవ, వైష్ణవ మతాలను ఆదరించారు. శివుడి రూపాలైన భైరవ, మైలార, వీరముష్టి, జంగమ మఠాలు ప్రతిష్టించి, పూజించారు. తాంత్రిక పద్ధతిలో దేవతలకు పంచమ కారాలతో నైవేద్యం సమర్పించేవారు. మద్యం, మీన (చేప), మాంస, ముద్ర, మైధూనం లను పంచమకారాలంటారు. మైలారభటులు, వీర ముష్టివారు, వార జంగములు, పాశుపత ఆరాధనలో అనేక సాహసకృత్యాలు చేసేవారు. రాజు శ్రేయం, రాజ్య శాంతి కోసం వీరు తలలు నరుక్కునేవారు. దైవ ప్రీతికోసం స్త్రీ, పురుషులు ఆత్మహత్య చేసుకొనే గుడులుండేవని సింహాసన ద్వాత్రింశికలో పేర్కొన్నారు. వీటినే చంపుడు గుడులనేవారు. రేచర్ల వెలమల కాలంలో రణము కుడుపు అనే భైరవ తాంత్రిక విధానం ఉండేది. శత్రువుల రక్తాన్ని శరీరమంతా పూసుకొని దేవతలను పూజించేవారు. చండి, భైరవి, దుర్గ, కాళి, భద్రకాళి వంటి పేర్లతో శక్తిని ఆరాధంచేవారు. శ్రీశైలం, త్రిపురాంతకం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట, భృమవరం, గుణుపూడి, అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. రెడ్డిరాజుల కాలంలో వైష్ణవమతం కూడా ప్రాముఖ్యం సంతరించుకొంది. మాచర్ల, బాపట్ల, సింహాచలం, శ్రీకూర్మం, సర్పవరం (కాకినాడ), అహోబిలం వంటివి ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రాలు. కుమారగిరిరెడ్డి, కాటయవేమారెడ్డి కాలంలో తమిళనాడు నుంచి భట్టారక, కందాడ, తిరుమల వైష్ణవ కుటుంబాలు ఆంధ్రదేశంలో తమ మత ప్రచారం చేశాయి. కాలక్రమంలో వైష్ణవ మతంలో వడగలై (ఉత్తరాది), తెంగలైశాఖ తమిళ ప్రబంధ సాహిత్యాన్ని ప్రచారం చేసింది. ఆంధ్రదేశంలో వడగలై వైష్ణవ శాఖ ఆదరణ పొందింది. ఈ శాఖకు నాయకుడు వేదాంత దేశికుడు. 

ఆలయాలు:

రెడ్డిరాజుల కాలంలో శ్రీశైలంలో వీర శిరోమండపం, సర్పవరం భావనారాయణ స్వామి ఆలయంలో వసంతరాయల మండపం, రాజమండ్రిలో నగరేశ్వరస్వామి, మార్కండేయ స్వామి ఆలయాలు, కోరుకొండలో శ్రీరంగ రామాలయ మండపం వంటి నిర్మాణాలు రెడ్డిరాజుల కాలంలో ప్రాచుర్యం పొందాయి. కుమారగిరిరెడ్డి ఆస్థాన నర్తకి లకుమాదేవి. ఈమె భరతనాట్యంలో ప్రవీణురాలు.

ఆర్థిక పరిస్థితులు:

రెడ్డిరాజుల కాలంలో వ్యవసాయం ముఖ్యవృత్తి. భూమిశిస్తు ముఖ్యాధారం. పంటలో ఆరోవంతు శిస్తుగా వసూలు చేసేవారు. వరి, జొన్న, పత్తి, నువ్వులు, సజ్జలు, చెరకు ప్రధాన పంటలు. పంట పొలాలు మూడు రకాలు. అవి వెలి పొలం, నీరు నేల, తోటభూమి భూమిని గడలతో కొలిచేవారు. ఎగుమతి, దిగుమతి సుంకాలుండేవి. రెడ్డిరాజులు పెద్ద చెరువులు తవ్వించారు. మాచర్ల, వినుకొండ, త్రిపురాంతకం, పెనుగొండ, నెల్లూరు, కొండవీడు, ద్రాక్షారామం, రాజమండ్రి ఆనాటి వర్తక కేంద్రాలు. గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, దున్నపోతులను సరకు రవాణాలో వినియోగించేవారు. నదులను దాటడానికి పుట్టీలు (పడవలు) ఉపయోగించేవారు. 

భాషా సారస్వతాలు:

రెడ్డిరాజులు సంస్కృతం, తెలుగు భాషలను ఆదరించారు. రాజులు స్వయంగా కవులు, పండితులుగా గుర్తింపుపొందారు. శ్రీనాథుడికి కవి సార్వభౌమ అనే బిరుదుంది. శ్రీనాథుడు మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగారనైషధం, కాశీఖండం, భీమేశ్వర పురాణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం, ధనుంజయ విజయం మొదలైన గ్రంథాలు రచించారు.

కుమారగిరిరెడ్డి బావమరిది కాటయ వేమారెడ్డి. ఈయన కాళిదాసు నాటకాలకు కుమారగిరి రాజీయం పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం రాశాడు. ఇతడి ఆస్థాన కవి వామనభట్ట భానుడు. ఈయన వేమన భూపాలీయం అనే చారిత్రక గ్రంథం, నలాభ్యుదయం, రఘునాథాభ్యు దయం అనే కావ్యాలు, శబ్దరత్నాకరం, శబ్దచంద్రిక అనే నిఘంటువులు రచించారు. ఎర్రాప్రగడ తెలుగులో నృసింహపురాణం, హరివంశం రాసి ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు పొందాడు. మహాభారతంలోని అరణ్యపర్వ శేషాన్ని తెలుగులో పూర్తిచేశాడు. ఈ యుగంలో చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని విశ్వేశ్వరకవి రచించాడు. చంద్రికా పరిణయం అనే గ్రంథాన్ని ఎలకూచి బాలసరస్వతి రాశారు. అభిదాన చింతామణి గ్రంథాన్ని హేమాద్రి రచించాడు.