దేశం మొత్తం స్వాతంత్ర్య సాధన కోసం వివిధ ఉద్యమాలను, నిరసనలను చేపడున్న సమయంలో హైదరాబాద్ రాజ్యంలో ఉన్న ప్రజలు మాత్రం తమ నిరసనలను వ్యక్త పరిచే పరిస్థితిలో లేక పోవడం అనే విషయాన్ని కొందరు మేధావులకు జీర్ణించుకోలే విషయంగా మారింది. తెలంగాణలో నిజాం పరిపాలనలో మగ్గుతున్న యువతలో చలనం గలిగించడానికి విద్యా వ్యాప్తి ఒక్కటే మార్గమని వారు గ్రంథాలయాల స్థాపన చేయడం ప్రారంభించారు. ఈ విధంగా గ్రంథాలయోద్యమం ప్రారంభమైనది. సురవరం ప్రతాపరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే 'తెలంగాణ లో జరిగిన తొలి ఉద్యమం గ్రంథాలయోద్యమమే'. 

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో గ్రంథాల యోద్యమానికి, తెలంగాణలో ప్రజా చైతన్యానికి, జన జాగృతికి, చివరికి రాజ్య విముక్తి పోరాటానికి నాంది జరిగింది. నిజాం రాష్ట్రంలో తెలుగుభాషా సంస్కృతులకు అత్యంత హీనస్థితి ఏర్పడిన సమయంలో క్రీ.శ. 1897లో మునగాల రాజా నాయని వేంకటరంగారావు, కొమర్రజు వేంకట లక్ష్మణరావు, ఆదిపూడి సోమనాధరావు వంటి మేధావులకు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. తెలంగాణలో తెలుగు ప్రజలు అనుభవిస్తున్న వెనకబాటు తనాన్ని గమనించిన రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాధరావులతో కలిసి కొమఋజు వేంకటలక్ష్మణరావు మాతృ భాషలో చైతన్యం కలిగిస్తే తెలంగాణలో తప్పక వికాసం కలుగుతుందని భావించి 1901 సెపెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో రావిచెట్టు రంగారావు గారి ఇంట్లో "శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ మహత్కార్యము పాల్వంచ సంస్థానాధీశులు రాజా పార్థసారథి అప్పారావు బహద్దరు గారి ఆధిపత్యంలో ప్రారంభమైంది. ఈ గ్రంథాలయం స్థాపించిన నాటి నుండి రావిచెట్టు రంగారావు గారు కార్యదర్శులుగా పనిచేస్తూ అనేక విధాలుగా సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందించారు. ఆయన మరణానంతరం ఆయన భార్య శ్రీమతి లక్ష్మీనరసమ్మ గారు కూడా గ్రంథాలయ భవన నిర్మాణమునకు రూ.3000 విరాళమునిచ్చి తోడ్పాటు అందించారు. ఈ గ్రంథాలయానికి మాడపాటి హనుమంతరావు గారు చాలాకాలం కార్యదర్శిగా పనిచేసి దాని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడినారు.ఈ గ్రంథాలయ స్థాపనతో తెలుగు ప్రజల మధ్య భావసమైక్యతకు పునాది ఏర్పడినదని చెప్పవచ్చును. తెలంగాణలో సాహిత్య సాంస్కృతికోద్యమాలకు కేంద్ర స్థానంగా నిలవటమే కాక, తెలుగువారికి విజ్ఞాన భిక్షను ప్రసాదించి మహోద్యమాలకు కేంద్రస్థానంగా నిలవడానికి ఈ గ్రంథాలయం దారి చూపింది. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏర్పాటుతో 1927 నాటికి ఒక ఉద్యమంగా ఎదిగి తెలంగాణలో సుమారుగా 110 గ్రంథాలయాల స్థాపను దారితీసింది.

విజ్ఞానచంద్రికా మండలి 

క్రీ.శ. 1905లో నాయని వేంకటరంగారావు, కొమఋజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, ఆచంట లక్ష్మీపతి, గాడిచర్ల హరిసర్వోత్తమరావులు మద్రాసులో డా||సి.బి.రామారావు ఇంట్లో సమావేశమై విజ్ఞానచంద్రికా మండలిని స్థాపించారు. విజ్ఞానచంద్రికా మండలి స్థాపనతో అది కూడా ఒక ఉద్యమం లాగా మారి తెలుగువారి సమకాలీన సమాజ పరిస్థితుల వైపు మళ్ళించడమే కాకుండా సమాజ శ్రేయస్సుకు తోడ్పడే సాహిత్యాన్ని అందించింది. ఆ విజ్ఞాన చంద్రికా మండలి కార్యస్థానాన్ని మద్రాసు నుండి హైదరాబాద్ కు మార్చడంలో రావిచెట్టు రంగారావు ముఖ్యపాత్ర పోషించారు. ఆయనకు ఆదిరాజు వీరభద్రరావు సహాయం చేశారు. 

రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం

1904 సెప్టెంబర్ 4వ తేదీన రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం హనుమకొండలో ప్రారంభించబడింది. హనుమకొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు మెట్రిక్యులేషన్ పరీక్షలు రాయడానికి గుంటూరుకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులు గమనించి హనుమకొండలో ఒక ఆంధ్రభాషా నిలయం స్థాపించాలని శ్రీ కొమరగిరి సీతారామారావు గారితో, శ్రీ కె.తిరుమల రావుగారితో సంప్రదించి గ్రంథాలయ స్థాపన చేయడం జరిగింది. ఈ మహత్కార్యానికి శ్రీ హంపి విరూపాక్షా స్వాముల వారు మొదటగా సహాయం చేశారు. తరువాత ఖమ్మం మెట్టులో, హనుమ కొండలో హైస్కూలు విద్యార్థులు కొన్ని నాటకాలు ప్రదర్శించి, వచ్చిన ధనంతో కొన్ని గ్రంథాలు సేకరించి రాయ మురళీధర్ సుబేదార్ బహద్దరు గారిని కలిసి వారి సహకారంతో, ఆయన అధ్యక్షుడుగా ఒక సభను ఏర్పాటు చేసి 1904 సెప్టెంబర్ 6వ తేదీన రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయాన్ని ప్రారంభించారు. ఈ సభకు విచ్చేసిన వారు తమకు తోచిన విధంగా విరాళాలు అందించారు. పింగళి వెంకటరామారెడ్డి గారు, దేశ్ ముఖ్ గారు విరాళంతో పాటు హనుమకొండలో రాగన్న దరువాజ వద్ద ఉన్న తమ భవనమును అద్దె లేకుండా గ్రంథాలయ నిర్వహణకు ఇవ్వడం జరిగింది. తరువాత కాలంలో ఈ భవనం గ్రంథాలయ నిర్వహణకు పూర్తిగా ఇచ్చివేసినారు.

నిజాం రాష్ట్రంలో స్థాపించబడిన కొన్ని ముఖ్య గ్రంథాలయాలు 

వాడి రైల్వే స్టేషన్ సమీపంలో 'నాగాయి' అనే గ్రామంలో గల గ్రంథాలయం 1058లో చాళుక్య ప్రభువైన మొదటి శేఖరుడు స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. 1872లో సికింద్రాబాద్ లో ప్రజాహితార్ధం సోమసుందర మొదలియార్ ఒక గ్రంథాలయం స్థాపించాడు. దీనికి ముందు తెలుగు రాష్ట్రంలో ఎక్కడ గ్రంథాలయం లేదు. గ్రంథాలయం స్థాపించి తెలుగు వారిలో గ్రంథాలయోద్యమం తీసుకుని రావాలన్న కాంక్ష కలిగేలాగా చేసిన వ్యక్తి ముదిగొండ శంకరారాధ్యులు. ఈయన వరంగల్ వాస్తవ్యుడు. 1872లో శంకరానంద గ్రంథాలయం పేరున ఒక గ్రంథాలయం హైదరాబాద్ లోని కవాడి గూడలో గ్రంథాలయం స్థాపించడం జరిగింది. సికింద్రాబాద్లో 'సార్వజనిక గ్రంథాలయాన్ని' కూడా శంకారారాధ్యుల వారే స్థాపించారు. 1908 మే 22వ తేదీన వరంగల్ లో స్థాపించబడిన శబ్దానుశాసన ఆంధ్ర భాషా నిలయానికి మట్టెవాడలో గల తన సొంత ఇంటిని దానం చేసిన మహానుభావుడు ఈయనే. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ 1879లో 'యంగ్ మెన్ ఇంప్రూవ్ మెంట్ సొసైటీ'(YMIS) స్థాపించి అందులో ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. ఈ గ్రంథాలయంలో రక రకాల భాసలకు సంబంధించిన పత్రికలు, పుస్తకాలు తెప్పించాడు. 1880వ సంవత్సరం నుండి నడుస్తున్న ఒక పౌర గ్రంథాలయాన్ని నిజాం ప్రభుత్వం 1891లో స్వాధీనం చేసుకుని 'ఆసఫియా స్టేట్ లైబ్రరీ'గా పేరు మార్చింది. మొదట్లో అరబ్బీ, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృత భాషల వ్రాతప్రతులు, ముద్రిత గ్రంథాలు మాత్రమే ఇందులో ఉండేవి. ఆ తరువాత 1940 నుంచి హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా గ్రంథాలు, పత్రికలు తెప్పించడం ప్రారంభించారు. ఈ గ్రంథాలయం ప్రస్తుతం 'స్టేట్ సెంట్రల్ లైబ్రరీ'గా పిలువబడుతున్నది. ప్రభుత్వ స్కాలర్ షిప్ తో లండన్ వెళ్ళే హిందూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోస 1892లో హిందూ సోషల్ క్లబ్ స్థాపించబడినది. హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ తర్వాత మరాఠీ భాషకు ఉన్న ప్రాధాన్యాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రకు చెందిన కొంత మంది సంపన్న వర్గాల వారు 1895 మార్చి 25వ తేదీన భాషా సంస్కృతుల అభివృద్ధి కొరకు 'భారత గుణవర్ధక సంస్థ'ను స్థాపించారు. దానిలో భాగంగా స్థాపించబడినదే 'భారత గుణవర్ధక సంస్థ గ్రంథాలయం'. ఈ గ్రంథాలయాన్ని కొంతకాలం గణేష్ రావు ఇంట్లో నడిపించారు. ఆ తరువాత కొంత కాలానికి గోపాలరావు ఎక్బోటే వంటి వారి కృషితో సొంత భవనం ఏర్పాటయినది. 1905లో శంషాబాద్ లో బాలభారతీ నిలయ ఆంధ్ర భాషాభివర్ధక సంఘం స్థాపించబడింది. 1905-06లో సికింద్రాబాద్ లోని ఆంధ్ర పఠన మందిరంలో ఆంధ్ర సంవర్ధినీ గ్రంధాలయం స్థాపించబడింది. ముదిగొండ శంకరాచార్యులు, తూము వరదరాజులు, తూము రంగయ్య, ఆకారపు భద్రయ్య, కుందూరి బసవయ్య మొదలైన వారి కృషితో శబ్దానుశాసనాంధ్రభాషా నిలయం 1908 మే 22వ తేదీన వరంగల్ లోని మట్టెవాడలో ప్రారంభ మైనది. గ్రంథాలయ స్థాపకాధ్యక్షులైన ముదిగొండ శంకరారాధ్యులు చమన్ దగ్గర గల తమ ఇంటిని ఈ గ్రంథాలయ నిర్వహణకు గాను దానంగా ఇచ్చారు. 1910లో ఖమ్మంలో ఆంధ్రభాషానిలయం స్థాపించబడింది.

పెద్ది శివరాజయ్య కార్యదర్శిగా ఆగస్టు 3, 1913న సంస్కృత కళావర్ధినీ గ్రంథాలయం సికింద్రాబాద్ లో స్థాపించబడినది. ఆ మధిర తాలూకా రేమిడిచెర్లలో 1913లో శ్రీ సిద్ధి మల్లేశ్వర గ్రంథాలయం స్థాపించబడినది. షబ్నవీసు వెంకట రామ నర్సింహారావు నిర్వాహకులుగా 1918 మార్చి నెలలో నల్లగొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథ నిలయం స్థాపించబడింది. ఇది వరకే పనిచేస్తున్న మహబూబియా పఠన మందిరం మరియు షబ్నవీసు రంగా రావు స్వంతంగా ఏర్పాటు చేసుకొన్న గ్రంథాలయం ఇందులో విలీనమైనవి. 1918లో పువ్వాడ వెంకటప్పయ్య ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయాన్ని సూర్యాపేటలో స్థాపించాడు. 'కృషి ప్రచారిణీ గ్రంథమాల' అనే ఒక సంస్థను స్థాపించిన ఆయన తెలుగు పుస్తకాలను సైతం ముద్రించాడు. 1918లో మాదిరాజు కోటేశ్వరరావు, హరి బాపయ్య, జమలాపురం వెంకటేశ్వరరావు, వేముగంటి రామకృష్ణారావు మొదలైన వారు కలిసి శ్రీ జ్ఞాన విద్యుత్ ప్రవాహిన్యాంధ్ర భాషా నిలయం స్థాపించారు. అనంతర కాలంలో ఇది 'విద్యార్థి గ్రంథాలయం'గా మారింది. * 1918 సంవత్సరంలో రాజబహద్దూర్ వేంకట రామారెడ్డి గారి చొరవతో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం స్థాపించబడింది. ఈ గ్రంథాలయంలో తెలంగాణలో లభ్యమైన తాళపత్ర గ్రంథాలు భద్రపరచబడడం విశేషమైనదిగా చెప్పవచ్చును. 1924-1932 వరకు సురవరం ప్రతాపరెడ్డి గారు ఈ గ్రంథాలయానికి ఉచిత కార్యదర్శిగా పని చేశారు. 'తెలంగాణాంధ్రుల కర్తవ్యం' అనే గ్రంథాన్ని రచించి ప్రతాప రెడ్డి గారు గ్రంథాలయ నిర్వహణ కొరకు, గ్రంథాలయోద్యమ కారులకు తగు సూచనలిచ్చారు. 1928 మేలో బాల సరస్వతీ గ్రంథాలయం, వేమనాంధ్ర భాషా నిలయం స్థాపించబడినవి. కోదాటి రామకృష్ణారావు, కోదాటి వేంకటేశ్వరరావు, ఎస్.బి. రామానుజాచార్యులు, షబ్నవీసు వేంకటరామ నర్సింహా రావు మరియు అక్కినేపల్లి జానకి రామారావు గార్ల ప్రేరణతో 1919లో విజ్ఞాన ప్రచారిణీ ముద్రణాలయంను ఇనుగుర్తి ఒద్దిరాజు సోదరులు నెలకొల్పారు. వట్టికోట ఆళ్వారు స్వామి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి అనేక ఉత్తమమైన గ్రంథాలను ముద్రించి అతి తక్కువ ధరలకే విక్రయించేవాడు. ఆయన తన స్వంత గ్రంథాలయాన్ని హైదరాబాద్ నగర గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చాడు. 1920లో మడూరి రాఘవులు భాషా కల్పవల్లి అనే గ్రంథాలయాన్ని స్థాపించారు.

కొలనుపాకలో ఏప్రిల్ 6, 1921న బహిరామియా గ్రంథాలయం స్థాపించబడింది. * 1921లో నల్లగొండలో శ్రీ బాలభారతీ నిలయం అనే గ్రంథాలయం స్థాపించబడింది. * సెప్టెంబర్ 17, 1921న ఖమ్మంలో శ్రీ ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం స్థాపించబడింది. గార్లలో 16 జూలై, 1922వ తేదీన శ్రీ వేంకటేశ్వర గ్రంథాలయం స్థాపించబడింది. సిద్ధిపేటలో ఆగస్టు 9, 1922న ఉమామహేశ్వర ఆంధ్ర భాషా నిలయం స్థాపించబడింది. - 1922లో హైదరాబాద్ లోని అఫ్టల్ గంజ్ లో బాలసరస్వతీ గ్రంథాలయం స్థాపించబడింది. * 1923లో అవధాని కృష్ణయ్య మంథనిలో విజ్ఞాన ప్రచారిణీ గ్రంథాలయం స్థాపించారు. ఈ గ్రంథాలయానికి 'ఉస్మానియా ఆంధ్రభాషా నిలయం' అని మరో పేరు కూడా కలదు. వెంకటరాజన్న అవధాని, లోకే విశ్వనాథరావు దీనికి ప్రధాన కార్యకర్తలు. 1923లో మంథనిలోని హనుమాన్ మందిరంలో వైదిక గ్రంథాలయం స్థాపించబడింది. 1923లో బాలసరస్వతీ గ్రంథాలయం మంథని దేవాలయంలో స్థాపించబడింది. కొండా వెంకట రంగారెడ్డి తన స్వంత ఖర్చులతో 1923లో వేమన ఆంధ్రభాషా నిలయం స్థాపించారు.

మే 8, 1924న జనగామలో శ్రీ యువజన సంఘ గ్రంథాలయం స్థాపించబడింది. జూలై 3, 1924వ తేదీన మడికొండలో ప్రతాపరుద్రాంధ్ర భాషా నిలయం స్థాపించబడింది. ఈయనకు చేయూత నిచ్చిన వారిలో పల్లా దుర్గయ్య, మోత్కూరు మధుసూదన్ రావు, పింగళి వేంకటేశ్వరరావు, వీరపెల్లి నర్సింహాచార్యులు, తవిటిరెడ్డి గోపాలరెడ్డి ముఖ్యులు. ఈ గ్రంథాలయం 1946 వరకు నడిచింది. 1925లో ఆంధ్రసోదరీ సమాజ గ్రంథాలయం స్థాపించ బడింది. 1926లో వైశ్యసంఘ గ్రంథాలయం స్థాపించబడింది. 1926లో ఆది హిందూ లైబ్రరీ స్థాపించబడింది. మెదక్ జిల్లాలోని జోగిపేట గ్రంథాలయం 1930లో స్థాపించబడింది. 1930 సంవత్సరం సింగరేణిలో శ్రీ సీతారామాంజనేయ హిందూ వర్తక గ్రంథాలయం స్థాపించబడింది. 1934లో వేంసూరులో శ్రీ వేణుగోపాల గ్రంథాలయం స్థాపించబడింది. దీనికి అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు, కార్యదర్శి బెల్లంకొండ చంద్రమౌళీశ్వర శాస్త్రి. సెప్టెంబర్ 17, 1936వ తేదీన ఖమ్మం మెట్టులో ఆకుల పూర్ణానందం గుప్త అధ్యక్షులుగా, సుగ్గుల అక్షయ లింగం గుప్త ఉపాధ్యక్షుడుగా, కోదాటి నారాయణ రావు కార్యదర్శిగా విజ్ఞాన నికేతన గ్రంథాలయం స్థాపించబడింది. పెదగోపవరంలో మామునూరు నాగభూషణరావు, పుప్పల వేంకటేశ్వర శాస్త్రి, జములారెడ్డి, ఒద్దిరాజు నారాయణ రావు కలిసి శ్రీ ఆంధ్రభాషోద్ధారక గ్రంథాలయం స్థాపించారు. - 1939లో కరీం నగర్ జిల్లా తోటపల్లిలో బోయిన పల్లి వేంకట రామారావు విద్యాభివర్దినీ గ్రంథాలయం స్థాపించారు.

1939లో మహబూబాబాద్ లో బాపూజీ గ్రంథాలయం స్థాపించబడింది. బి.ఎన్.గుప్త చౌడవరపు పురుషోత్తం, కేసముద్రం వాస్తవ్యుడు నల్లపు పిచ్చయ్య దీని స్థాపనలో ప్రముఖపాత్ర పోషించారు. 1940లో హనుమకొండలోని బ్రాహ్మణవాడలో గాంధీ గ్రంథాలయంను భండారు నాగభూషణరావు స్థాపించారు. 1941లో రావినారాయణ రెడ్డిచే చిలుకూరులో రైతు గ్రంథాలయం స్థాపించబడింది. 1943లో ఖమ్మం తాలూకా ములకపల్లిలో శ్రీ హనుమదాంధ్ర గ్రంథాలయం ఆంధ్ర సారస్వత పరిషత్తు వారిచే స్థాపించబడింది. సూర్యాపేట తాలూకాలోని పిల్లలమర్రిలో వివేక వికాసినీ గ్రంథాలయాన్ని ఉమ్మెత్తల రామానుజరావు స్థాపించారు. 1943లో ఒక మహారాష్ట్ర వైద్యుడిచే చెన్నూరులో గోదావరి వాచనాలయం స్థాపించబడింది. 1946లో పర్కాలలో మిద్దెల నరసింహ రంగాచార్యులు వ్యవస్థాపక కార్యదర్శిగా చెన్నకేశవాంధ్ర భాషా నిలయం స్థాపించబడింది. దీనికి కార్యదర్శి కాటూరి భాష్యాచారి. 1946లో చెన్నిపాడులో శ్రీ సరస్వతీ విలాస పుస్తక భాండా గారం స్థాపించబడింది. 1946లో క్యాతూర్ లో సర్వజనాంధ్ర గ్రంథాలయం స్థాపిచబడింది. 1946లో ప్రౌఢ సరస్వతి వాచనాలయం ఆలంపూర్ వాస్తవ్యులు గన్నమరాజు రామేశ్వరావు స్థాపించారు. ఖిలేషాపురంలో చొల్లేటి నృసింహరాయశర్మ గారు జైహింద్ గ్రంథాలయాన్ని స్థాపించారు. హైదరాబాద్ లోని గౌలిగూడ చమలో బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయంను కోదాటి నారాయణ రావు స్థాపించారు.


Tags :   Sri Krishna Devarayandhra Bhasha Nilayam      

 Nizam State    Vignana Chandrika Mandali   

 Grandhalaya Udyamam    Freedom Movement   

 Telangana History