పరిపాలనలో వీరు కాకతీయులను అనుసరించారు. వీరిపాలన గురించి రాగి, శిలాశాసనాలు తక్కువ సమాచారం అందిస్తున్నాయి. బద్దెన రాసిన నీతిసారం, మల్లన రుక్మాంగద చరిత్ర, శ్రీనాథుడి హరవిలాసం, భీమఖండం, కాశీఖండం, పల్నాటి చరిత్ర, కొమ్మన శివలీలా విలాసం, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, అనంతమాత్యుడి సంస్కృత భోజరాజీయం, ఎర్రాప్రగడ- నృసింహపురాణం, ఉత్తర హరివంశం, మంచన కేయూరబాహు చరిత్ర (తెలుగు), గౌరవ-హరిశ్చంద్ర, నవనాథ చరిత్రలు వంటి సంస్కృత, తెలుగు గ్రంథాలు క్రీ.శ. 13, 14 శతాబ్దాల కాలం నాటి మధ్యయుగ ఆంధ్రదేశ సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి. వెలమ, రెడ్డి రాజుల ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రకారం పాలన సాగించారు. పాలనా సౌలభ్యంకోసం రాజ్యాన్ని భూములు, సీమలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించారు. రాజ్యంలో పెద్ద విభాగం భూములు. భుములను సీమలుగా, సీమలను నాయంకరులుగా విభజించారు. రాజ్యంలో సీమలు ముఖ్య విభాగాలు. ఇవి రెడ్డిరాజుల కాలంలో విశేష ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ఈ విభాగం కాకతీయుల కాలంలో లేదు. ఉదాహరణకు కొండవీటి, వినుకొండ, బెల్లంకొండ, అద్దంకి, ఉదయగిరి, నెల్లూరు సీమలుగా ఏర్పడ్డాయి. నాడులు రాజ్యంలో సరిహద్దు విభాగాన్ని సూచిస్తాయి. నాడులను స్థలాలుగా, స్థలాలను గ్రామాలుగా విభజించారు. గ్రామ వ్యవహారాలను ఆయగాండ్రు లేదా గ్రామభటులు నిర్వహించేవారు.

గ్రామానికి అధిపతి రెడ్డి. ఆయగాండ్రకు జీతాలు డబ్బు రూపంలో కాకుండా భూములను మాన్యాలుగా ఇచ్చేవారు. రాజ్యానికి సర్వాధికారి రాజు. అతడే ఉన్నత న్యాయాధీశుడు. రాజ్యం వంశ పారంపర్యంగా సంక్రమించేది. పౌర, సైనిక వ్యవహారాల్లో తుది నిర్ణయం రాజుదే. పాలనలో రాజుకు సలహాలివ్వడానికి ప్రధాని, సేనాపతి, పురోహితుడు, ప్రధాన పాత్ర వహించేవారు. పన్నెండుమందితో మంత్రి పరిషత్ ఉన్నట్లు నాటి గ్రంథాల ద్వారా విశిధమవుతోంది. రాజు తర్వాత ప్రధానపాత్ర యువరాజుదే. వీరితర్వాత రాజ్యపాలనలో భూకామందులు, సామంతులు, ఉన్నతోద్యోగులు ప్రధానపాత్ర వహించేవారు. భూకామందులు రాచభూములకు ప్రాతినిధ్యం వహిస్తూ పన్నులు వసూలు చేసేవారు. సామంత రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ జమా ఖర్చులు చూసేవారు. బద్దెన నీతిశాస్త్రం రాజ్యానికి ముఖ్య గణాధికారి రత్నంలాంటి వాడని పేర్కొంది. రెడ్డిరాజుల కాలంలో ప్రధాన గణాధికారిని కవిలెసంప్రతులు అని పిలిచేవారు. కోశాధికారిని రాయసం అనేవారు. వీరు లేఖనాలు కూడా రాసేవారు. అందుకే రాయస కాండ్రు అని కూడా పిలిచేవారు. అన్ని కులాలకూ వారి శక్తి, సామర్థ్యాలు తెలివితేటల ప్రకారం అధికారం, గౌరవ పదవులు దక్కేవి. బ్రాహ్మణులు, వైశ్యులు మంత్రులుగా పని చేసినట్లు మెకంజీ కైఫీయత్ ద్వారా తెలుస్తోంది. వైశ్యుల్లో అవచి దేవయ్య, తిప్పయ్య, తిరుమలయ్య మంత్రులుగా పనిచేశారు. 

న్యాయవ్యవస్థ :

న్యాయసభను ధర్మసభ లేదా ధర్మాసనం అని పిలిచేవారు. న్యాయసభ్యులను ధర్మసభ జనాలు అనేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. నేరాలు చేసేవారికి అంగవిచ్చేదం, గానుగుల్లో ఆడించి చంపడం, వీపుపై బరువైన రాళ్లు ఎత్తడం, పట్టకారుతో తొడపాశం పెట్టడం వంటి శిక్షలుండేవి. బాగా కాగిన వేడి నూనెలో చేతులుంచడం, ప్రమాణాలు చేయించడం, దేవుడి ముందు దీపాలు ఆర్పడం వంటి ప్రక్రియలు నేర నిరూపణలో ఉండేవి. పన్నులు చెల్లించనివారిని నగర వీధుల్లో ఊరేగించడం, పెద్దగుళ్లను భుజాలపై మోయించడం, కాళ్లకు సంకెళ్లు వేయడం లాంటి శిక్షలుండేవి. 

సామాజిక పరిస్థితులు: 

సంఘంలో అగ్రస్థానంలో బ్రాహ్మణులు ఉండే వారు. క్షత్రియులు ప్రాధాన్యం కోల్పోయారు. శూద్రుల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా ఉన్న వారికి రాజ్యాధికారం దక్కింది. వర్తక, వాణిజ్యాల్లో వైశ్యులు ప్రధాన పాత్ర పోషించారు. బ్రాహ్మణులు వ్యాకరణం, జ్యోతిష్యం, గణిత, షడ్దర్శనాల్లో పాండిత్యం సంపాదించారు. వీరి పోషణకు అగ్రహారాలు, దేవీ మాన్యాలను పన్నులు లేకుండా రాజులు దానమిచ్చారు.

అవచి తిప్పయ్యశెట్టి పంజరం (పంజాబు) గోవా, సింహళం, చైనా, బర్మా దేశాల్లో నౌకా వాణిజ్యం నిర్వహించాడు. పంజాబు నుంచి కర్పూరం, సింహళం నుంచి సుగంధద్రవ్యాలు, భూటాన్ నుంచి కస్తూరి, చైనా నుంచి పట్టువస్త్రాలు, టెహ్రాన్ నుంచి అందమైన బానిస స్త్రీలను దిగుమతి చేసేవాడు. క్రీ.శ. 1358లో అనపోతారెడ్డి విదేశీ నౌకా వ్యాపారుల రక్షణ, సౌలభ్యం కోసం మోటుపల్లి రేవు అభయశాసనాన్ని సంస్కరించాడు.

సమాజంలో అధిక శాతం ప్రజలు శూద్రులు. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. శూద్రుల్లో రెడ్డి, వెలమ, కమ్మ కులాలు ఏర్పడి రాజకీయాధికారాన్ని కైవసం చేసుకున్నాయి. రేనాడు, పల్నాడు, మెట్టభూముల్లో నివసించే ప్రజలు నిరాడంబరులు. ప్రజల్లో మూఢనమ్మకాలు అధికం. ఆనాటి పల్లెల్లో విస్తర్ల భోజనం, కుండల్లో వంటలు, సద్దన్నం వాడుకలో ఉండేవి. తాంబూలం వేయడం గౌరవ సూచకం. ప్రజలు శక్తి దేవతలు, జంతువులను బలిచ్చేవారు. కోడి పందాలు, జూదాలు, వీర పూజల గురించి శ్రీనాథుడి రచనల్లో కన్పిస్తాయి. సంఘంలో సతీసహగమనం ఉండేది. దేవదాసీలు, వేశ్యలకు గౌరవ స్థానముండేది. సమాజంలో నైతిక విలువలు పతనమయ్యాయి. దీనారాలు, టంకాలు, మాడల పేర్లతో డబ్బు చెలామణి అయ్యేది. గుర్రపు స్వారి, వేట, విద్యా గోష్టి, పరరాజ్యాలపై దాడి, వసంతోత్సవాలు, కోడిపందాలు ఆనాటి వినోదాలు. గుడులు, కోటలు, సత్రాలు, పూటకూళ్ల వసతులు విరివిగా నిర్మించేవారు. పట్టణ వాసులు విలాస వస్తువులను విరివిగా వాడేవారు. పల్లె ప్రజల బ్రతుకులు దీనావస్థలో ఉండేవని శ్రీనాథుడి రచనల ద్వారా తెలుస్తోంది.