బ్రాహ్మణులు అన్నిరంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే, బ్రాహ్మణేతరులు బాగా వెనుకబడిపోయారనే ఉద్దేశంతో త్యాగరాయ శెట్టి 1916 నవంబరులో దక్షిణ భారత ప్రజల సంఘాన్ని స్థాపించారు. బ్రాహ్మణేతరుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ఎందుకు త్యాగరాయశెట్టి వివిధ భాషల్లో పత్రికలను కూడా నడిపారు. దక్షిణ భారత ప్రజల సంఘం 1917 ఫిబ్రవరి 26న 'జస్టిస్' అనే ఇంగ్లీష్ దిన పత్రికను ప్రారంభించింది. 1916లోనే బ్రాహ్మణేతరుల ప్రయోజనాలను కాపాడటానికి 'దక్షిన భారత లిబరల్ ఫెడరేషన్' ప్రారంభమైంది. తరువాత కాలంలో ఫెడరేషనే జస్టిస్ పార్టీగా రూపొందింది.

1920లో మద్రాస్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ పోటీ చేసి, గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సుబ్బరాయలు రెడ్డియార్ ముఖ్యమంత్రి అయ్యారు. 1921లో రెడ్డియార్ అనారోగ్య కారణంగా రాజీనామా చేశారు. ఆ తరువాత రామరాయనింగార్ ముఖ్యమంత్రి అయ్యారు. జస్టిస్ పార్టీలోని ఆంధ్రులు, తమిళుల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఇది కొంతవరకు జస్టిస్ పార్టీని బలహీనపరిచింది. పార్టీ నాయకులైన త్యాగరాయశెట్టి, పానగల్లు రాజు వంటివారిని తెలుగు పక్షపాతులని నిందించారు. పేదవారైన హరిజనుల వంటి వారి అభ్యున్నతికి తమ పార్టీ ఎటువంటి కార్యక్రమం చేపట్టలేకపోయందని పార్టీ సభ్యుడైన నటేశ మొదలియార్ అభిప్రాయపడ్డారు. పార్టీకి 1923లో తక్కువ సీట్లు వచ్చాయి.

1925 ఏప్రిల్ 28న త్యాగరాయశెట్టి మరణించడంతో, పార్టీ మనుగడకు తీవ్ర విఘాతం కలిగింది. పార్టీలో ప్రముఖుడైన పానగల్లు రాజా 1928లో మరణించారు. దీంతో జస్టిస్ పార్టీ మరింత బలహీనపడింది. 1930 నాటికి జస్టిస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. 

ఆత్మగౌరవ ఉద్యమం

ఆత్మగౌరవ ఉద్యమం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇది తమిళనాడులోని సామాజిక నిమ్న వర్గాల అభివృద్ధికోసం జరిగింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది రామస్వామి నాయకర్. సామాజిక న్యాయం, కుల నిర్మూలన మొదలైన అంశాలు ఈ ఉద్యమానికి ముఖ్య లక్ష్యాలయ్యాయి. రామస్వామి నాయకర్ బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని బలపరిచాడు. ఆయన రామాయణ, మహాభారతాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నాయకర్ అస్పృశ్యతా నివారణకు కృషి చేశారు. ఈ ఉద్యమం యువతను బాగా ఆకర్షించింది. తన అభిప్రాయాలను ప్రచారం చేసేందుకు నాయకర్ 'కుడిఆరసు' అనే పత్రికను ప్రారంభించారు. ఈయన ఇంకా 'విదుతలై' అనే దినపత్రికను, 1935లో 'పగు తరివు' అనే పేరుతో మాస పత్రికను ప్రారంభించారు. 1928లో ఇంగ్లీషు మాట్లాడే వారికి ఆత్మగౌరవ సందేశం అందించాలనే లక్ష్యంతో ఎస్. గురుస్వామి, ఎస్. రామ నాథన్లు 'రివోల్ట్' అనే పత్రికను ఆరంభించారు. ఈ ఉద్యమం బ్రాహ్మణేతరుల అభివృద్ధికి పాటుపడింది. తర్వాత కాలంలో నాయకర్ హిందీ వ్యతరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 

ఆది ఆంధ్ర దళిత ఉద్యమాలు

20వ శతాబ్దం రెండో దశాబ్దిలో ఆంధ్రలో దళిత ఉద్యమం వ్యాప్తిలోకి వచ్చింది. అస్పృశ్యత, అంటరాని తనానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. హైదరాబాద్ సంస్థానంలో ఆరంభమైన ఉద్యమాన్ని ఆది హిందూ ఉద్యమం అని, కోస్తా ప్రాంతంలో ఆది ఆంధ్ర ఉద్యమం అని పిలిచారు. హైదరాబాద్ లో భాగ్యరెడ్డివర్మ అనే సంఘ సంస్కర్త దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని బలంగా నిర్వహించారు. ఆయన ప్రభావం కోస్తా ప్రాంతంలో ఎక్కువగా ఉంది. దళితులు తమను ఈ ప్రాంతపు మూలవాసులుగా చాటుకోసం ప్రారంభించారు. 1917లో గూడూరు రామ చంద్రరావు అనే సంస్కర్త విజయవాడలో ఒక సభను నిర్వహించారు. ఈ సభకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించారు. ఆయన అభిప్రాయం మేరకు ఈ సదస్సును ఆది ఆంధ్ర సదస్సుగా వ్యవహరించారు. ఈ సదస్సులో మొత్తం 18 తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వ బావులను, పాఠశాలలను, సత్రాలను వాడుకునేందుకు అనుమతించడం, పిల్లల కోసం ఉచిత పాఠశాలలు తెరవడం మొదలైన తీర్మానాలు చేశారు. 1917-1937 మధ్యకాలంలో దళితుల కోరికలను చాటుతూ వివిధ ఆంధ్రప్రాంత జిల్లాల్లో దాదాపు పదిహేను సదస్సులు జరిగాయి. ఈ సదస్సులు ఆంధ్రప్రాంతంలోని దళితులను చైతన్యపరిచాయి. 

లేబర్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు

మద్రాస్ ప్రభుత్వం తన పాలనలోని దళితుల అభివృద్ధి కోసం లేబర్ డిపార్ట్ మెంట్ ను స్థాపించింది. ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు వల్ల దళితుల్లో వలసలు పెరిగాయి. వలసలవల్ల వారిలో అభివృద్ధి పెరిగింది. ముఖ్యంగా బర్మాకు వలసపోయేవారు. రంగూన్ ఓడ రేవులో పనిచేయడానికి వేల సంఖ్యలో వెళ్లేవారు. అక్కడ పనిచేసి, డబ్బు సంపాదించి, స్వదేశంలో దళితుల అభివృద్ధికి పాటుపడ్డారు. బర్మా అనే పదంకంటే 'రంగం' (రంగూన్) అనే పదమే ఎక్కవ వాడుకలో ఉండేది. అనేక దళిత కథల్లో రంగం అనే పదం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రముఖ సంస్కర్త గూడూరు రామచంద్రరావు కృష్ణాజిల్లా గుడివాడలో 1912లో ఒక సేవాశ్రమాన్ని స్థాపించి, సాటి వారికి సేవ చేయడానికి, దళితులకు శిక్షణ ఇప్పించారు. శిక్షణ పొందిన అనేకమంది గ్రామీణ ప్రాంతాల్లోని దళితుల్లో చైతన్యం తీసుకువచ్చారు. తొలి ఆది ఆంధ్ర సదస్సు జరిగిన తరువాత భాగ్యరెడ్డివర్మ మరో ఆది ఆంధ్ర సదస్సును 1919లో మచిలీపట్నంలో నిర్వహించారు. తరువాత 1920, 1922, 1925 లలో కోస్తాలోని గుడివాడ, ఏలూరు, గుంటూరులలో సదస్సులు జరిగాయి. అనంతపురంలో 1925లో జరిగిన సదస్సుకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించారు. 1926, 1929, 1939 లలో వెంకటగిరి, బెజవాడ, అనంతపురాల్లో ఆది ఆంధ్ర సదస్సులు జరిగాయి.

1932లో విజయవాడ, హైదరాబాద్ లో హరిజన సేవక సంఘ్ ఆంధ్ర శాఖలను నెలకొల్పారు. 1932-33లో మహాత్మాగాంధీ ఆంధ్ర ప్రాంతంలో జరిపిన పర్యటన హరిజన సేవక సంఘ్ కార్యకలాపాలకు బలాన్నిచ్చింది. పలువురు దళితులు సంఘలో చేరి హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంఘ్ కు కె.నాగేశ్వరరావు అధ్యక్షుడుగా, బాపినీడు కార్యదర్శిగా, ఇద్దరు దళితనేతలు ఎన్. దేవేంద్రుడు, వి. కూర్మయ్యలు సంయుక్త కార్యదర్శులుగా పనిచేశారు.

గాంధీ ఆంధ్ర పర్యటన సందర్భంగా 'హరిజన భిక్ష' పేరిట ప్రజల నుంచి నిధులను సేకరించి, హరిజనోద్ధరణ కార్యక్రమానికి ఖర్చు పెట్టారు. మహాత్మాగాంధీ ఆంధ్రలో దళితుల దేవాలయ ప్రవేశానికి కృషి చేశారు. 1933 డిసెంబర్ 17న కృష్ణా జిల్లా, గుడివాడ తాలుకా సిద్ధాంతం గ్రామంలో రెండు దేవాలయాల్లో హరిజనుల ప్రవేశానికి గాంధీ స్వయంగా నాయకత్వం వహించారు. 

సంఘసంస్కర్తల కృషి

కొంతమంది సంఘసంస్కర్తలు, ఆది ఆంధ్ర నాయకులు ఈ ఉద్యమంలో ఎంతో కృషి చేశారు. పుండ్రు తాతయ్య బర్మాకు వెళ్లి బాగా డబ్బు గడించి ఆంధ్రకు వచ్చి దళిత ఉద్దరణకు కృషి చేశారు. ఆయన 1922లో పొన్న మండలంలో దళిత పిల్లలకు ఒక పాఠశాలను నెలకొల్పారు. ఉపాధ్యాయులగా పనిచేయడానికి అగ్రవర్ణ హిందువులు ముందుకు రాకపోతే, పుండ్రు తాతయ్య బర్మా నుంచి దళిత ఉపాధ్యాయులను రప్పించారు.

జాలా రంగస్వామి అనే మరో దళిత మేధావి తన భార్య మంగమ్మతో కలిసి దళితుల పిల్లలకోసం ఆంధ్రలో అనేక పాఠశాలలు నెలకొల్పారు. ఆయన 1928లో దళిత బాల బాలికల కోసం విడివిడిగా వసతి గృహాలను నిర్మించారు. జాలా రంగ స్వామి రామచంద్రాపురంలో లక్ష్మి పారిశ్రామిక శిక్షణ పాఠశాలలను స్థాపించారు. ఆయన 'జైభీమ్, వీరభారతి' అనే పత్రికలను నడిపారు. ఆయన రచనల్లో 'నిమ్మజాతుల చరిత్ర' ముఖ్యమైంది.

కుసుమ ధర్మన్న ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 'మాకొద్దీ నల్లదొరతనమూ' అనే పేరుతో ఆయన రాసిన కవిత ప్రసిద్ధి పొందింది. పలువురు దళిత నాయకులు అనేక పత్రికలు నడుపుతూ దళితుల్లో చైతన్యం కలిగించారు. అలాంటి దళిత పత్రికల్లో పుండ్రు సుబ్బారావు ప్రచురించిన “నవజీవన', చుట్టుమళ్ల వెంకటరత్నం ప్రచురించిన 'జీవనజ్యోతి', దిడ్ల పుల్లయ్య ప్రచురించిన 'ఆది ఆంధ్ర' పత్రికలు చెప్పుకోదగినవి. పలువురు దళితేతర రచయితలు కూడా తమ రచనలో దళితుల సమస్యలను వర్ణించారు. అలాంటి రచనల్లో గురజాడ అప్పారావు రచించిన 'మాలలు' అనే రచనలో సంఘసంస్కరణ కనిపిస్తుంది. 'దరిద్రనారాయణీయం' అనే కావ్యం గాంధేయ హరిజనోద్ధరణను ప్రాచుర్యంలోకి తెచ్చింది. దీన్ని కోడేటి రంగాచార్యులు రాశారు. ఉన్నవ లక్ష్మీ నారాయణ రాసిన 'మాలపల్లి' నవల ప్రముఖమైంది. ఈ నవల ప్రముఖమైంది. ఈ నవల దళితుల అణచివేతను తెలియజేస్తుంది. ఎన్.జి. రంగా రచించిన 'హరిజన నాయకుడు', గద్దె లింగయ్య రాసిన 'మాలపల్లి', త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన 'శంభూక వధ' మొదలైన రచనలు ప్రముఖ పాత్ర పోషించాయి.

ఎందరో దళిత కవులు కూడా తమ రచనల ద్వారా దళితుల్లో చైతన్యం కలిగించారు. అలాంటి వారిలో గుఱ్ఱం జాషువా ప్రముఖుమైనవారు. ఆయన రచనల్లో 'ఫిరదౌసి, గబ్బిలం' సుప్రసిద్ధమైనవి. బోయి భీమన్న దళిత మేధావుల్లో సుప్రసిద్ధులు. ఆయన 50 గ్రంధాలు రాశారు. వాటిలో 'పాలేరు, కూలీరాజు' ముఖ్యమైనవి. కుసుమ దర్మన్న రచించిన 'హరిజన శతకము', జాలారంగ స్వామి రచించిన 'మాలశుద్ధి', నక్కా చినవెంకయ్య రాసిన 'హరిజన కీర్తనలు' ప్రసిద్ధమైనవి. ఈ విధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో నిమ్న వర్గీయుల అభివృద్ధి కోసం ఆది ఆంధ్ర ఉద్యమానికి వెనుక రకరకాల వ్యక్తులు, సంస్థల కృషి ఎంతో ఉంది.


Tags :   Justice Party      Aadi Andhra Movements      Dalit Movements    

 Andhra History      Andhra Pradesh Hisory