భారత రాజ్యాంగం ప్రకారం దేశాధిపతి రాష్ట్రపతి అయినా కూడా కేంద్ర మంత్రి మండలి వాస్తవమైన కార్యనిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం విధినిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి కొలువుదీరి ఉంటుంది. కేంద్ర మంత్రిమండలి అనేది కేంద్ర కార్యనిర్వాహక శాఖలో వివిధ రకాల మంత్రులతో కూడిన సమూహంగా ఉంటుంది. 

కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ:

భారతదేశంలో 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి 'మంత్రిమండలి' ఏర్పాటయినప్పుడు దాన్ని మంత్రి పరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచేవారు. నెహ్రూ మంత్రిమండలిని వ్యవస్థీకృతం చేయడానికి గోపాలస్వామి అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం మంత్రిమండలిని మూడు వర్గాలుగా విభజించి. ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక స్థాయి, హోదా కల్పించి, తగిన విధులు బాధ్యతలు అప్పగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసులను పూర్తిగా కాకున్నా, చాలావరకు పాటించి మూడు అంచెలలో కేంద్ర మంత్రిమండలిని ఏర్పరచారు. దాని ప్రకారం మంత్రిమండలిలో 1. క్యాబినెట్ మంత్రులు, 2. స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు, 3. డిప్యూటీ లేదా సహాయ మంత్రులు అనే మూడు రకాల మంత్రులు ఉంటారు. 

క్యాబినెట్ మంత్రులు: 

కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్ధిక, హోం, రైల్వే లాంటి ముఖ్య శాఖలకు అధిపతులుగా క్యాబినెట్ హోదాగల మంత్రులు వ్యవహరిస్తారు. వీరు తమ మంత్రిత్వ శాఖల నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది. అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులు ప్రధాన మంత్రికి సన్నిహిత నాయకులుగా వ్యవహరిస్తారు. క్యాబినెట్ మంత్రులు అధికారపార్టీలో అత్యంత ప్రబల్యం, విశేష పరిపాలనానుభవం పొందినవారై ఉంటారు. 

రాజ్య మంత్రులు లేదా స్టేట్ మంత్రులు: 

క్యాబినెట్ మంత్రికి అప్పగించిన ప్రభుత్వ శాఖల్లో ఒక శాఖను స్టేట్ మంత్రులు స్వతంత్రంగా నిర్వహించవచ్చు. వీరు తమ మంత్రిత్వశాఖకు సంబంధించి చర్చ జరిగే సమయంలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానంపై క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతారు. వీరికి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఏ పాత్ర ఉండదు. కొన్ని మంత్రిత్వశాఖల్లో ఇద్దరు లేదా ముగ్గురు స్టేట్ మంత్రులు ఉండవచ్చు. 

డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు: 

మంత్రిత్వశాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాల్లో క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమింతులయ్యేవారు డిప్యూటీ మంత్రులు లేదా సహాయమంత్రులు. డిప్యూటీ మంత్రులకు స్వతంత్ర ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత ఉండదు. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు సంబంధించి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయడం మొదలైన కొన్ని విధులు వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

మంత్రిమండలి నియామకం: 

75(1) ప్రకరణ ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యులను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు. మంత్రివర్గ నిర్మాణంలో ప్రధానమంత్రిదే అంతిమ నిర్ణయం. ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సభ్యుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి వారిని నియమిస్తారు. సాధారణంగా ప్రధానమంత్రి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి భావసారూప్యమున్న ఇతర పార్టీలవారికి కూడా కేంద్ర మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించవచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుంది. మంత్రుల సంఖ్య: మంత్రిమండలిలో మంత్రుల సంఖ్యను గురించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో వివరణలేదు. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 16కు మించరాదని, మొత్తం మంత్రుల సంఖ్య 45కు మించరాదని సిఫారసు చేసింది. కానీ ఈ నియమం ఆచరణలో లేదు. 2003లో రాజకీయ పార్టీల్లో చీలికల నిరోధానికిగాను మంత్రివర్గ సైజును పరిమితం చేశారు. దీనికోసం 91వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ మంత్రుల సంఖ్య దిగువసభ అంటే లోకసభ లేదా విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు. మంత్రుల అర్హతలు: 1. పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం ఉండాలి. 2. ఒకవేళ సభ్యత్వం లేనిపక్షంలో మంత్రిగా ప్రమాణం స్వీకరించాక ఆరునెలల్లోగా ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడవ్వాల్సి ఉంటుంది. 

మంత్రి మండలి కాలపరిమితి:

కేంద్ర మంత్రిమండలి సభ్యుల కాలపరిమితి గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనలేదు. 75(2) అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాల మేరకు కేంద్ర మంత్రులు పదవుల్లో కొనసాగుతారు. అంటే రాష్ట్రపతి సంతృప్తి మేరకు కేంద్ర మంత్రులు అధికారంలో ఉంటారు. 75(3) ప్రకరణ ప్రకారం లోకసభకు సమిష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే లేదా బాధ్యత వహించాల్సిన సభలో విశ్వాసం కోల్పోతే మంత్రివర్గం రాష్ట్రపతి సంతృప్తికి దూరమైనట్లే అవుతుంది. సాధారణంగా లోక్ సభ సంతృప్తికి దూరమైనట్లే అవుతుంది. సాధారణంగా లోకసభ కాలపరిమితి ప్రకారం మంత్రిమండలి అయిదేళ్లు ఉండవచ్చు. 

మంత్రుల తొలగింపు:

మంత్రుల వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమిష్టిగా లోక్ సభకు బాధ్యత వహిస్తారు. క్యాబినెట్ నిర్ణయాలలో మంత్రులు ఏకీభవించకపోతే వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి తొలగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ఒక మంత్రిని పదవినుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు. ప్రధానమంత్రి తనకు ఇష్టం లేని మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా కోరవచ్చు లేదా మంత్రిని తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఈ విధంగా మంత్రులు రాష్ట్రపతిచే నియమితులవుతారు. రాష్ట్రపతిచే తొలగించబడతారు. దీనినే 'మంత్రులు రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించడం' అంటారు. 

మంత్రిమండలి సమిష్టి బాధ్యత: 

రాజ్యాంగ నిబంధన 75(3) ప్రకారం మంత్రిమండలి లోకసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు సమిష్టి బాధ్యత సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. సమిష్టి బాధ్యత అంటే, కార్యనిర్వాహక శాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చార్యలకు, కార్య కలాపాలకు లోకసభకు సమిష్టిగా బాధ్యత వహించడం. మంత్రిమండలి తమవల్ల జరిగే తొప్పొప్పులకు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. సమిష్టి బాధ్యత ప్రకారం మంత్రిమండలి ప్రతి ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలి. మంత్రులందరూ జట్టుగా కలిసి పదవిలో ఉంటారు లేదా పదవిని వదలుకుంటారు. సమిష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతారు. మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించేట్లు, అములలో ఉంచేట్లు చర్యలు తీసుకుంటారు. కార్య నిర్వాహకశాఖ సమిష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. ఉదాహరణకు పార్లమెంటు, మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది. సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోకసభకు సంబంధించిన అంశం. శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుంటుంది. మంత్రిమండలి సమైక్యంగా, బాధ్యతాయుతంగా, సదవగాహనతో వ్యవహరించేందుకు సమిష్టి బాధ్యత దోహదపడుతుంది. సమిష్టి బాధ్యతలో ఒక మంత్రి తన వ్యక్తిగత మంత్రిత్వశాఖ నిర్వహణ విషయంలో బాధ్యత వహించడంతో పాటు తన సహచర మంత్రుల మంత్రిత్వశాఖ విధానాలు పనిచేసే తీరు మొదలైన విషయాల్లో కూడా కలిసికట్టుగా బాధ్యత వహిస్తారు.