బోధన్, వేములవాడ కేంద్రాలుగా పశ్చిమోత్తర తెలంగాణా ప్రాంతాలను రాష్ట్రకూట సామంతులుగా తెలంగాణా ప్రాంతంలో పాలన చేసిన చాళుక్య వంశాలలో వేములవాడ చాళుక్యులు ఒకరు. వేములవాడ చాళుక్యులు కరీంనగర్ జిల్లాలోని వేములవాడను రాజధానిగా చేసుకొని తెలంగాణా వాయువ్య ప్రాంతాన్ని పాలించారు.
విక్రమాదిత్య యుద్ధమల్లుడు
వేములవాడ వంశ స్థాపకుడు విక్రమాదిత్య యుద్ధమల్లుడు. ఇతని కాలంలో నిజామాబాదు జిల్లాలోని 'నిందూరుబోధను' రాజధానిగా వుండేది. ఇతడు కొన్ని రాజ్యాలను జయించి, చిత్రకూట దుర్గాన్ని సాధించి సపాదలక్ష దేశాన్ని ఏలినట్లు వేములవాడ చాళుక్యుల శాసనాలు తెల్పుతున్నాయి. సపాద లక్ష అనగా ఒక లక్షా పాతిక బంగారు నాణేలు ఆదాయం కలిగిన దేశమని అర్థం. నేటి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను వీరి కాలంలో సపాదలక్ష దేశమని పిలిచేవారు. రాష్ట్రకూట వంశ స్థాపకుడైన దంతి దుర్గుని సేనాపతిగా యుద్ధమల్లుడు అనేక యుద్ధాలలో పాల్గొని, విజయాలు సాధించి అతని మన్ననకు పాత్రుడైనాడు. బాదిమి చాళుక్యుల అధికారం కూలద్రోయడంలో దంతి దుర్గునకు యుద్ధమల్ల విజయాదిత్యుడు తోడ్పడినాడు. ఇతని సేవలను గుర్తించి దంతి దుర్గుడు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతాన్ని సామంతరాజ్యంగా ఇచ్చాడు.
మొదటి అరికేసరి
యుద్ధమల్లుని కుమారుడు మొదటి అరికేసరి. ఇతడు రాష్ట్ర కూట చక్రవర్తి ధృవుని సామంతుడు. తూర్పు చాళుక్య నాలుగో విష్ణువర్ధనునిపై ధ్రువుడు జరిపిన యుద్ధాలలో ఇతడు పాల్గొన్నట్లు కొల్లిపర శాసనం చెప్తున్నది. ఇతడు వేంగి, త్రికళింగలను జయించినట్లు విక్రమార్జున విజయం వల్ల తెలుస్తున్నది. ఈ విజయాల ఫలితంగా ఇతని రాజ్యం తూర్పుగా విస్తరించినందువల్ల ఇతడు వేములవాడను రాజధానిగా చేసుకొని పాలించాడు.
బద్దెగుడు
మొదటి అరికేసరి తరువాత వేములవాడ చాళుక్యులలో పేరెన్నికగన్నవాడు 'సోలదగండ' బిరుదాంకితుడైన బద్దెగుడు 'సోలదగండడు' అంటే 'నలభై-రెండు యుద్ధాలు చేసిన వీరుడు' అని అర్ధం. ఇతడు రాష్ట్రకూట రెండో కృష్ణుని సామంతుడు. ఇతడు రాష్ట్రకూటులకు - తూర్పు చాళుక్యలకు జరిగిన యుద్ధాలలో పాల్గొన్నాడు. ఇతడు తూర్పు చాళుక్యరాజైన గుణగ విజయాదిత్యుని చేతిలో ఓడిపోయాడు. గుణగ విజయాదిత్యుని మరణం తరువాత చెరపట్టినట్లు పర్భని శాసనం చెప్తున్నది. ముదిగొండ చాళుక్యుడైన కుసుమాయుధుడు మొదటి చాళుక్య భీముని విముక్తి గావించినట్లు తెలుస్తున్నది.
రెండో నరసింహుడు
బద్దెగుని కుమారుడైన రెండో నరసింహుడు (క్రీ.శ. 910-930) రాష్ట్రకూట చక్రవర్తియైన మూడో ఇంద్రుని పక్షాన ఉత్తర దేశ దండయాత్రను నిర్వహించాడు. ఇతడు లాట దేశాన్ని, సప్తమాళవాలను జయించి, కాలప్రియ (కల్పి) అనే చోట జరిగిన యుద్ధంలో ఘోర్జర ప్రతీహార మహీపాల చక్రవర్తిని ఓడించాడు. తన సైన్యాన్ని యమునానదిని దాటించి, కన్యాకుబ్జ నగరం చేరి తన గుర్రాలను గంగనీరు త్రాగించి మరల వచ్చాడు. ఇతడు మూడవ ఇంద్రుని సోదరి 'జాకవ్వ' ను పెండ్లి చేసుకున్నాడు. వీరికి కలిగిన పుత్రుడే రెండో అరికేసరి.
రెండో అరికేసరి
రెండో అరికేసరి (క్రీ.శ. 930-955) తండ్రిని మించిన తనయుడు. వేములవాడ చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఇతడు తన మేనమామయైన రాష్ట్రకూట మూడో ఇంద్రుని కుమారైన 'రేవక నిర్ముడిని', మరొక రాష్ట్రకూట కన్య 'లోకాంబిక' ను వివాహం చేసుకున్నాడు. రెండో అరికేసరి కాలంలో రాష్ట్రకూట రాజ్యంలో వారసత్వ యుద్ధం జరిగింది. రెండో అరికేసరి రాష్ట్రకూట నాలుగో గోవిందునితో (క్రీ.శ. 918-935) పోరు సంభవించింది. ఇతడు నాలుగో గోవిందుని ఓడించటమేకాక అతని దాయాదియైన బద్దెగుని సింహాసనంపై కూర్చుండబెట్టాడు. రెండో అరికేసరి గొప్ప కర్ణాటక భాషా పోషకుడు. ఇతని ఆదరణలో పంపకవి మహాభారత కథతో అరికేసరి కథను జోడించి 'విక్రమార్జున విజయం ' అనే కన్నడ కావ్యాన్ని వ్రాశాడు.
మూడో అరికేసరి
వేములవాడ చాళుక్యులలో చివరివాడు మూడో అరికేసరి. ఇతడు రాష్ట్ర కూట మూడో కృష్ణుని సమకాలికుడు. ఇతడు సుప్రసిద్ధ జైన సమయాచార్యుడు, 'యశస్తిలక చంపూ'కర్త అయిన సోమదేవసూరిని ఆదరించాడు. తన తండ్రి బద్దెగుడు వేములవాడలో నిర్మించిన 'సుభధామ జినాలయం'ను ఆచార్యుడైన సోమదేవ సూరికి దానం చేస్తూ పర్భని శాసనం ఇచ్చాడు. రాష్ట్రకూటులతోపాటు వేములవాడ చాళుక్యులు కూడా అంతరించారు.

.jpg)



Pages