ఆంధ్రమహాసభలు

1913 మే 20వ తేదీన గుంటూరు జిల్లాలో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ వైభవంగా జరిగింది. సమావేశ స్థల ద్వారాలకు ఆంధ్ర సంస్కృతి ప్రతిబింబించే రీతిలో పేర్లు పెట్టారు. ఈ సమావేశంలో 800 మంది ప్రతినిధులతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పరిశీలకులు కూడా కలిసి మొత్తం రెండువేల మందికి పైగా పాల్గొన్నారు. వందేమాతర గీతంతో సభను ప్రారంభించడమైంది. మద్రాసు శాసనమండలి సభ్యులు బి.యన్.శర్మ అధ్యక్షత వహించారు. తెలుగులోనే సమావేశ కార్యక్రమాలు జరిగాయి. అధ్యక్షోపన్యాసంలో శర్మగారు ఆంగ్లేయుల పట్ల విధేయత చూపుతూ ఆంధ్రుల అభ్యున్నతికి పాటుపడాలని చెబుతూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర భావన వల్ల లాభం కన్నా నష్టం జరగగలదని భావించాడు. దీనిపై వాదవివాదాలు తీవ్రస్థాయిలో కొనసాగాయి. వేమవరపు రామదాసు పంతులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఆంధ్రరాష్ట్రం లక్ష్యంగాలేని ఆంద్రోద్యమం అర్థరహితం అని వాదించారు. న్యాపతి సుబ్బారావు, మోచర్ల రామ చంద్రారావు తీర్మానాన్ని వ్యతిరేకించి నాటి పరిస్థితులలో ఈ కోరిక అనుచితమని చెప్పారు. ప్రత్యేకాంధ్ర విషయంపై ప్రజాభిప్రాయం సేకరించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చుననే సవరణ నెగ్గింది. ఆంధ్రుల సమకాలీన సమస్యల అవగాహన, ప్రగతి కోసం సమైక్యపోరాటం అవసరమని భావించారు. మొత్తంమీద బాపట్ల సభలో ప్రత్యేకాంద్రోద్యమం మరింత ప్రచారం పొందింది. ఈ సమావేశానంతరం జరిగిన జిల్లా సభలలో గుంటూరు, విజయవాడ, గోదావరి సమావేశాలు ప్రత్యేకాంధ్ర అనుకూల తీర్మానాలు చేయగా విశాఖపట్నం కూడా వాటిని సమర్థించింది. నెల్లూరు, దత్తమండలాలు, పెద్ద ఆసక్తి చూపలేదు. గంజాంజిల్లాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో కొండా వెంకటప్పయ్యగారి ఆధ్వర్యంలో ఒక సంఘం ప్రత్యేకాంధ్ర అవసరాన్ని వివరించడానికి రాష్ట్రమంతటా పర్యటించింది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోరికను ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక సమర్థించాయి. దేశభక్తికి ప్రత్యేక రాష్ట్రం ఎలాంటి ఆటంకం కాదని పట్టాభిసీతారామయ్య గారు స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉద్యమాలను ఉదహరిస్తూ 'హిందూ'లో రాశారు.

1914 ఏప్రిల్ నెలలో ఆంధ్రమహాసభ రెండో సమావేశం విజయవాడలో జరిగింది. ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టడమైంది. నెల్లూరు, కడప ప్రతినిధులు వ్యతిరేకించారు. అత్యధికులు తీర్మానాన్ని ఆమోదించారు.

1915 మే నెలలో విశాఖపట్నంలో జరిగిన మూడో ఆంధ్ర మహాసభలో నాటివరకు ప్రత్యేకాంధ్రను వ్యతిరేకించిన పానగల్ రాజాగారు అనుకూలంగా మాట్లాడటంతో ఉద్యమానికి బలం చేకూరింది. “పదకొండు తెలుగు జిల్లాలను ప్రత్యేకాంధ్రరాష్ట్రంగా రూపొందించడం న్యాయం, ఆవశ్యకం” అనీ సెకండరీ పాఠశాలలో తెలుగు బోధనా భాషగా ఉడాలనీ తీర్మానించారు.

నాలుగో మహాసభలు కాకినాడలో 1916 మే నెలలో జరిగాయి. ఈ సభలో మోచర్ల రామచంద్రరావుగారు ప్రత్యేకాంధ్ర ఆవశ్యకతను గురించి ప్రసంగించారు. దీన్నిబట్టి ప్రత్యేక ఆంధ్రవ్యతిరేకులు కూడా క్రమంగా తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నట్లు విదితం కాగలదు. నెల్లూరు, అనంతపురం ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని వ్యతిరేకించినా యుద్ధానంతరం ప్రత్యేకాంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలనే తీర్మానం నెగ్గింది. 

1917 జూన్ నెలలో నెల్లూరులో జరిగిన అయిదో మహాసభలో సర్కారు, రాయలసీమ మధ్యగల అభిప్రాయ భేదాలు బహిర్గతమయ్యాయి. మొదటి నుంచి నెల్లూరు, రాయలసీమ వారికి మద్రాసుపై మక్కువ. పైగా ప్రత్యేకాంధ్రలో కోస్తావారి పెత్తనం జరుగుతుందనే భయం. దీంతో ప్రత్యేకాంధ్ర తీర్మానంపై ఓటింగ్ తప్పని సరయింది. ప్రత్యేకాంధ్ర తీర్మానం నెగ్గగా, ప్రత్యేకాంధ్ర వ్యతిరేకులు ప్రత్యేక సమావేశం జరిపి మద్రాసు నగరంతో కూడిన ఆంధ్రరాష్ట్రమే, తమకు సమ్మతమని తీర్మానించారు.

1917లో మాంటేగు రాజ్యాంగ సంస్కరణలను పరిశీలించ డానికి భారతదేశం రాగా వారిని కలిసి ప్రత్యేకాంధ్ర రాష్ట్ర కోరికను విన్నవించాలని విజయవాడలో జరిగిన ప్రత్యేక ఆంధ్రమహాసభ నిర్ణయించింది. కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, పట్టాభి, గాడిచెర్ల, మోచర్ల మొదలైన ప్రముఖులంతా ప్రతినిధి వరంగా మాంటేగుని కలిసి ప్రత్యేకాంధ్ర అవసరాన్ని వివరించారు. 1918 ఫిబ్రవరిలో కేంద్ర శాసనసభలో బి.యన్.శర్మ వీలయినంత పరిధిలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలనే తీర్మానం ప్రతిపాదించగా ఎక్కువ మంది వ్యతిరేకించారు. తీర్మానం వీగిపోయింది. నిరుత్సాహ పడిన ఆంధ్రులు భాషాప్రయుక్త రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. 

ప్రత్యేకాంధ్ర కాంగ్రెస్ సర్కిల్

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచి జాతీయోద్యమంలో ఆంధ్రులపాత్ర గణనీయమైంది. 1891లో ఆనందాచార్యులు కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. న్యాపతి సుబ్బారావు జాతీయ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1914లో మద్రాసులో జరిగిన కాంగ్రెసు సభలకు ఆంధ్రదేశం నుంచి 256 మంది ప్రతినిధులు వచ్చారు. వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా, వారి ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా తమిళులు అడ్డుపడ్డారు. దీంతో ఆంధ్రులు తమకు ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలని పట్టుబట్టి తిలక్ గారి జోక్యంతో, పట్టాభి, కొండా వెంకటప్పయ్యగార్ల కృషితో 1918 జనవరిలో ప్రత్యేక విభాగాన్ని సాధించుకున్నారు. ప్రత్యేక ఆంధ్రకాంగ్రెసు విభాగానికి న్యాపతి సుబ్బారావు అధ్యక్షులు, కొండా వెంకటప్పయ్య గారు కార్యదర్శి, ఆంద్రోద్యమానికి ఇది ప్రథమ విజయం.

మాంటెగు సంస్కరణలలో ప్రత్యేకాంధ్ర ప్రస్తావన లేదు. ఇది కొంత నిరుత్సాహం కల్గించినా వెంకటపతి రాజు గారు మద్రాసు శాసనమండలిలో మద్రాసులోని తెలుగు ప్రాంతాలలో స్వయం పాలనకు అవసరమయ్యే సంస్థలను శాఖల కార్యాలయాలను ఏర్పరిచి వాటి అధికారాలను ఆంధ్రప్రాంతానికి విస్తరింప చేయాలని తీర్మానం ప్రతిపాదించగా మండలి ఆమోదం పొందింది. 1920 నుంచి గాంధీ గారి సహాయ నిరాకరణోద్యమం దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరిచింది. ఈ జాతీయోద్యమ ఉధృతంలో ప్రత్యేకాంధ్ర కోరిక మరుగునపడింది. ఆంధ్ర మహాసభలు జరగలేదు.

జాతీయ కాంగ్రెసులోను, ప్రత్యేకాంధ్ర ఉద్యమంలోను బ్రాహ్మణ నాయకత్వం అధికం. ఉద్యోగాల్లోను వారే అధికాశాతం. వీరు బ్రాహ్మణేతరులను పైకిరాకుండా అడ్డుకొంటున్నారని 'దక్షిణ భారత ప్రజాసంఘం' పేరుతో ఒక సంస్థ ఏర్పడింది. బ్రాహ్మణేతరుల సమస్యల పరిష్కారానికి 'జస్టిస్' అనే పత్రిక ప్రారంభించారు. తరవాత 'జస్టిస్ పార్టీ'ని నెలకొల్పారు. ఈ పార్టీ ఆంగ్లేయ పాలనను సమర్థించింది.

1920లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పాల్గొనలేదు. దీంతో జస్టిస్ పార్టీ మంత్రివర్గం ఏర్పడింది. ఆ పార్టీలోని ఆంధ్రప్రముఖులు ప్రత్యేకాంధ్రను బలపరచలేదు. దీంతో 1920-30 మధ్య మద్రాసు రాజకీయాల్లో తమిళాంధ్ర విభేదాలతో పాటు బ్రాహ్మణ బ్రాహ్మణేతర వివాదాలు కూడా ప్రముఖంగా కనిపిస్తాయి. 1925 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్'లో ప్రత్యేక భాషారాష్ట్రాల తీర్మానాలన్ని వీగిపోయాయి.

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఏర్పాటు (1926):

1913 బాపట్ల ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవశ్యకతను గురించి చర్చించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగుభాషా గ్రంథాలు సరిగాలేవని, పాఠ్యపుస్తకాలను, పరీక్ష సమాధానాలను పరిశీలించే వారికి తెలుగు సరిగా రాదని, తెలుగు భాషాభివృద్ధికోసం ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం కావాలని అభిప్రాయపడ్డారు. మద్రాసు ప్రభుత్వం ఈ అభ్యర్థనను నిరాకరించింది. 1917లో వెంకటపతిరాజు మద్రాసు శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తూ యుద్ధానంతరం తెలుగు జిల్లాలకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఆంధ్రదేశంలో మరికొన్ని కళాశాలలనూ పాఠశాలలనూ నెలకొల్పాలని కోరారు. 1920 అక్టోబర్ నెలలో మద్రాసు విశ్వ విద్యాలయం సెనెట్ మరికొన్ని విశ్వవిద్యాలయాల ఏర్పాటు ఆవశ్యకమని, ఇవి భాషా ప్రయుక్తంగా ఉండాలని తీర్మానించింది. ప్రత్యేకాంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించాలని విశాఖపట్నం సభ్యుడు సూర్యనారాయణ శాసన మండలిలో తీర్మానం ప్రతిపాదించగా కొందరు తమిళులు కూడా సమర్థించారు. ఫలితంగా తీర్మానం నెగ్గి మద్రాసు పునర్వ్యవస్థీకరణ బిల్లును గురించి చర్చించడమైంది. ఇది జరిగిన నాలుగేళ్ళకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదించారు. రాయలసీమ సభ్యులు తమ ప్రాంతాన్ని ఈ విద్యాలయ పరిధి నుండి తొలగించాలని కోరారు. బళ్ళారిని మినహాయించమని సత్యమూర్తి కోరారు. ఈ సవరణలన్నీ వీగిపోయాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 ఏప్రిల్ 26వ తేదీన విజయవాడలో కట్టమంచి రామలింగా రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గా ఏర్పాటయింది. భాషాపరంగా పేరు పెట్టబడిన ప్రథమ విశ్వవిద్యాలయం ఇదే. ఆంధ్ర,

రాయలసీమ విభేదాలు

రాయలసీమ ప్రాంతంవారు రకరకాల కారణాలతో ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. 1913 ఏప్రిల్ లో కర్నూలు జిల్లాలోని మహానంది వద్ద రాయలసీమ జిల్లాల మహాసభ జరిగింది. దీనికి గుత్తి కేశవ పిళ్లే అధ్యక్షత వహించాడు. ఈ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించారు. 1931 నాటికి విభేదాలు తీవ్రమయ్యాయి. 1931న ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మద్రాసులో కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. 

రాయలసీమ మహాసభలు

రాయలసీమ మహాసభను 1934లో స్థాపించారు. 1934 జనవరి 28న ప్రథమ రాయలసీమ సభ మద్రాసులో పట్టాభి రామారావు అధ్యక్షతన జరిగింది. రెండో రాయలసీమ మహాసభ కడపలో 1935లో జరిగింది. 

శ్రీభాగ్ ఒప్పందం

ప్రత్యేకాంధ్ర ఏర్పాటు విషయంలో రాయలసీమ ప్రాంత ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించడానికి, వారికి కొన్ని రక్షణలు కల్పిస్తూ, శ్రీభాగ్ ఒప్పందం జరిగింది. శ్రీభాగ్ అనేది మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు నివాసం పేరు. 1937లో జరిగిన శ్రీభాగ్ ఒప్పందానికి రాయలసీమ ఆంధ్ర ప్రతినిధులు హాజరయ్యారు. 

ఒప్పందంలోని అంశాలు :

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు విశ్వవిద్యాలయ కేంద్రాలను (ఒకటి వాల్తేరులో, రెండోది అనంతపురంలో) ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఆంధ్రుల పరస్పర సాంఘిక, సాంస్కృతిక అవగాహనకు వీలుకలుగుతుంది. 
  • కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల వ్యవసాయక, ఆర్థికపరమైన సత్వరాభివృద్ధికి కృషి చేయాలి. పదేళ్లు లేదా అవసరాన్ని బట్టి అంతకంటే ఎక్కువ కాలం పాటు నీటిపారుదల ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదీ జలాల వినియోగం విషయంలో ఈ ప్రాంతాలకు అవకాశం కల్పించాలి. 
  • శాసనసభ స్థానాల విషయంలో జిల్లాలన్నింటికీ వీలైనంత సమాన ప్రాతినిధ్యం ఉండాలి. 
  • ఆంధ్ర రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాన్ని ఉన్న చోటనే ఉంచి, రాజధాని, హైకోర్టుల్లో ఒకటి రాయలసీమలో, రెండోది కోస్తాలో ఏర్పాటు చేయాలి. వీటిని ఎంచుకునే హక్కు రాయలసీమకు ఉంటుంది.

1927-1935 మధ్య ముఖ్యమైన సంఘటనలు

1927 మార్చిలో మద్రాసు శాసనమండలిలో ప్రత్యేకాంధ్ర తీర్మానం 8 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కాంగ్రెసు సూత్ర ప్రాయంగా అంగీకరించినా సైమన్ కమిషన్ ముందు మద్రాసు ప్రభుత్వం భాషా ప్రయుక్త సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. 1931లో గాంధీగారిని కలిసిన పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వర రావులు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును గురించి చెప్పగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రత్యేకాంధ్రరాష్ట్రం రాగలదని సూచించారు. 1932లో బొబ్బిలి రాజా మద్రాసు ముఖ్యమంత్రి అయ్యారు. గాడిచెర్ల శాసనమండలిలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానం ప్రతిపాదించారు. నాటి వరకూ ఉద్యమాన్ని బలపరిచిన బొబ్బిలిరాజా ముఖ్యమంత్రికాగానే ప్లేటు ఫిరాయించి తీర్మానాన్ని వ్యతిరేకించాడు. అయినా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. మద్రాసు ప్రభుత్వం తీర్మాన ప్రతిని ఎలాంటి సిఫారసు లేకుండా కేంద్రానికి పంపింది. జాతీయోద్యమలో పాల్గొంటూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని కాంగ్రెసు నాయకులు విస్మరిస్తున్నారని భావించి జి.వి. సుబ్బారావు నాయకత్వంలో ఆంధ్ర కాంగ్రెసు స్వరాజ్య పార్టీ ఏర్పడింది. ఏడాదిలో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు కావలసిన కార్యక్రమాలను నిర్వహించాలని భావించారు. 1934లో శాసనోల్లంఘనోద్యమం ఆగిపోయింది. ఆ ఏడాది డిసెంబర్ నెలలో ఆంధ్రమహాసభ విశాఖపట్నంలో జరిగింది. ఆంధ్రనిధి ఏర్పాటు చేయాలని ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి నచ్చచెప్ప టానికి ఇంగ్లాండ్ కు ప్రతినిధి వర్గాన్ని పంపాలనీ నిర్ణయించారు. అయ్యదేవర ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును జీవన్మరణ సమస్యగా భావించాలని చెప్పారు. సమయం ఆసన్నమయినప్పుడు దీనిని గూర్చి ఆలోచిస్తామని ఆంగ్ల ప్రభుత్వం సమాధానమిచ్చింది. 

1935-47 మధ్య ఆంద్రోద్యమం సర్కారు-

రాయలసీమ విభేదాలు: బాపట్ల ఆంధ్రమహాసభకు ముందే కర్నూలులోని మహానందిలో జరిగిన రాయలసీమ ప్రతినిధుల సభకు అధ్యక్షత వహించిన గుత్తి ప్లీడర్ కేశవపిళ్ళై ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం సాధ్యం కాదని చెప్పాడు. పైగా ఈ ఉద్యమాన్ని బ్రాహ్మణ ఉద్యమంగా చిత్రించారు. ఫలితంగా రాయలసీమలో ఆంద్రోద్యమం పట్ల అనుమానాలు ఏర్పడ్డాయి. వీటిని తొలగించడానికి ఉద్యమ నాయకులు రాయలసీమలో విస్తృతంగా పర్యటించారు. కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. 1915లో జరిగిన కర్నూలు సభలో 1916 కడపసభలో ఆంద్రోద్యమాన్ని బలపరిచారు. ఆ తరవాత ప్రత్యేకాంధ్ర ఏర్పాటును సమర్ధిస్తూ కర్నూలులో మదన పల్లిలో తీర్మానాలు చేశారు.

రాయలసీమకు వలస వచ్చి ముఖ్య పదవులలో ఉన్న తమిళులు మాత్రం ఈ ఉద్యమాన్ని వ్యతిరే కించారు. 1917 నెల్లూరు సభలో ప్రత్యేక ఆంధ్రతీర్మానం నెగ్గినా, రాయలసీమ ప్రజలను తృప్తిపరచడానికి సర్కారువారు గట్టి కృషి చేయాలనే వాస్తవం తెలిసింది. మాంటేగు ముందు ప్రత్యేకాంధ్ర కావాలని కోరిన ప్రతినిధి వర్గంలో పదిమంది రాయలసీమవారే.కాని 1924లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలో రాయలసీమకు చెందిన గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. దీంతో తిరిగి వారిలో అనుమానాలు మొదలుకాగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు వివాదం దానికి తోడైంది. 1931 నుంచి ఈ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అక్టోబర్ నెలలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మద్రాసులో జరిగింది. కడప కోటిరెడ్డి అధ్యక్షులు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర శాసనసభలో రాయలసీమకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని కల్లూరి సుబ్బారావు, రాయలసీమకే ప్రత్యేక రాష్ట్రం కావాలని సుబ్రహ్మణ్యం సవరణ తీర్మానాలు ప్రతిపాదించారు. 1933లో మద్రాసు శాసనసభలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర చర్చలో పాల్గొన్న కోటిరెడ్డి మద్రాస్ రాజధానిగా ఉండాలని కోరారు. 1934లో ఏర్పడిన రాయలసీమ మహాసభ, పట్టాభి రామా రావు అధ్యక్షతన జరిగింది. రాయలసీమ ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో చేరాలా లేదా అనే విషయం ఆ ప్రాంత ప్రజలకే వదిలి వేయాలని సత్యమూర్తి కోరారు. తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరారు. కడపలో జరిగిన రెండో రాయలసీమ మహాసభలో ప్రత్యేకాంధ్రరాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించాలని తీర్మానించారు. 1937లో జరిగిన ఎన్నికలలో రాయలసీమ మహాసభ ప్రతినిధులు కాంగ్రెసు చేతిలో ఓడిపోయారు. రాజగోపాలచారి కాంగ్రెసు మంత్రివర్గం ఏర్పడగా తిరిగి ఆంధ్రరాష్ట్ర స్థాపన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్ బులుసు సాంబమూర్తి ఆంద్రోద్యమాన్ని బలపరుస్తూ పర్యటించి భారత సమ్మేళన రాజ్యాంగం అమలుకు ముందే ఆంధ్రరాష్ట్రం కావాలని వాదించారు. రాజగోపాలాచారి మంత్రివర్గంలో ఆంధ్రులు ముగ్గురే. రాయలసీమ వారు ఒక్కరూ లేరు. ఇది బహుశా ఆంధ్రులను విభజించడానికి జరిగిన కుట్రలో భాగం కావచ్చు. ఈ ఆంధ్ర- రాయలసీమ విభేదాలను గమనించి రాజగోపాలాచారి, రాజన్ మొదలైన తమిళనాయకులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేక ప్రకటనలు చేశారు.

ఆంధ్ర మహాసభ 1941 నవంబరులో శ్రీవిజయ అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం 1948 జూన్ 17న థార్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 'భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దేశసమైక్యతకు భంగకరం' అని నివేదిక ఇచ్చింది. ప్రజల అసంతృప్తి వల్ల ప్రభుత్వం 1948 డిసెంబర్ లో జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన జె.వి.పి. కమిటీని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను 1949 ఏప్రిల్ లో ప్రకటించింది. ఆంధ్రులు మద్రాస్ నగరాన్ని వదులుకుంటే ప్రత్యేకాంధ్ర ఏర్పాటు చేయవచ్చని తెలియజేసింది. 1951 ఆగస్టు 15న స్వామి సీతారాం ప్రత్యేకాంధ్ర ఏర్పాటు కోసం నిరాహారదీక్ష మొదలు పెట్టారు. కానీ, వినోభాబావే కోరిక మేరకు 35 రోజుల తరువాత దీక్ష విరమించారు. 1952 అక్టోబరు 19న పొట్టి శ్రీరాములు మద్రాస్ లోని బులుసు సాంబమూర్తి ఇంటిలో ప్రత్యేకాంధ్ర కోసం నిరాహారదీక్ష మొదలు పెట్టారు. 58 రోజుల తరువాత 1952 డిసెంబరు 15న స్వర్గస్థులయ్యారు. ఆయన మరణం ఆంధ్రదేశాన్ని అగ్నిగోళంగా మార్చివేసింది. ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. దీనికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు. ప్రథమ గవర్నర్ త్రివేది. ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి. 



Tags :   Andhra Movement      Separate Andhra Movement      Andhra History    

  Andhra Pradesh Hisory