ఆంద్రోద్యమం పుట్టుక

19వ శతాబ్దపు సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాల ఫలితంగా జాగృతమైన తెలుగుజాతి జాతీయోద్యమ ప్రభావంతో చైతన్యవంతమైంది. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి ఎవరికీ తీసిపోవనే భావన కలిగింది. సమకాలీనసాహిత్యం , పత్రికలు తెలుగువారి గత వైభవాన్ని వివరించాయి. ఆంధ్రులు తమ సమకాలీన సమస్యల పట్ల స్పందించడం జరిగింది. ఒకవైపు ఆంధ్రులు తమ పూర్వ వైభవాన్ని స్మరించి గర్వపడుతుండగా మరోవైపున మద్రాసు రాష్ట్రంలో వారికి జరుగుతున్న అన్యాయాలు, అవమానాలు, నిరాదరణ రోజు రోజుకీ పెరుగుతూ ఉండటంతో ప్రత్యేక రాష్ట్రం ద్వారానే తమకు న్యాయం చేకూరగలదనే భావం విశ్వాసంగా మారి ఆంద్రోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆంధ్ర సంస్కృతీ వికాసం ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా ఆంద్రోద్యమం ప్రారంభించడమైంది. స్వతంత్ర ప్రతిపత్తిలోనే ఆంధ్రదేశ ప్రగతి, భాషా వికాసం, సాంస్కృతిక పరి రక్షణ సాధ్యపడగలవని ఆంధ్రులు భావించారు. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రుల పట్ల వివక్షమద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రుల జనాభా నలభై శాతం కాగా, విస్తీర్ణం సుమారు 60 శాతం. దేశంలోనే భాషా పరంగా చూస్తే మూడోస్థానంలో ఉన్న ఆంధ్రులకు ఒక ప్రత్యేక గుర్తింపు లేదు. ఉత్తర భారతంలో వారిని 'మద్రాసీ'లుగా పిలిచేవారు. మద్రాసులో తమిళులదే అన్ని రంగాలలో అగ్రస్థానం. ఉద్యోగాల్లో వ్యవసాయాభివృద్ధిలో, విద్యలో, పరిశ్రమలలో ఆంధ్రులపట్ల నిరాదరణ స్పష్టంగా కనిపిస్తుంది. మద్రాసు రాష్ట్రంలోని ఉన్నతోద్యో గాలలో వారి శాతం చాలా తక్కువ. నలుగురు సబ్ కలెక్టర్ లో ఒక్కడే ఆంధ్రుడు. 19 మంది జిల్లా జడ్జీలలో ఒక్క ఆంధ్రుల కూడా లేడు. రాష్ట్ర ఉన్నతోద్యోగులలో 64 మందికిగాను 8 మంది తెలుగు వారు. విద్యాశాఖలో 33 మందిలో 5 గురు తెలుగువారు. జిల్లా రిజిస్ట్రారులు 20 మందిలో ఇద్దరు తెలుగువారు. ఆంధ్రదేశంలోని గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, మొదలైన ప్రాంతాలన్నింటిలో కళాశాలలకు, ఉన్నత పాఠశాలలకు ఆంద్రేతరులే విద్యాలయాధికారులు. 1915లో మద్రాసు రాష్ట్రంలోని 31 కళాశాలల్లో ఎనిమిది మాత్రమే ఆంధ్రప్రాంతంలో ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, కళాశాలలు ఒక్కటి కూడా లేదు ఆంధ్రలో 163 సెకండరీ స్కూళ్ళు ఉండగా మిగతా రాష్ట్రంలో 583 ఉన్నాయి. పారిశ్రామిక పాఠశాలలు 3800లలో 400 మాత్రం ఆంధ్రలో ఉన్నాయి. విద్యాలయాలతో పాటు పరిశ్రమలన్నీ కూడా మాద్రాసు లో, లేదా మద్రాసు చుట్టూ ఉన్న తమిళ ప్రాంతంలో కేంద్రీకృత మయ్యాయి. రైల్వేలైన్ల నిర్మాణంతో మద్రాసులో సర్కారు జిల్లాలను కలపడం చివరగా జరిగింది. అన్ని రంగాలలో ఆంధ్రులను విస్మరించడం జరిగింది. వారి ఆర్థిక, విద్యా ప్రగతి మిగతావారితో పోలిస్తే చాలా తక్కువ. ఈ పరిస్థితులలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రమొక్కటే మద్రాసు రాష్ట్రంలోని రెండుకోట్ల తెలుగువారికి న్యాయం చేకూర్చగలదనే భావం సర్వత్రా వినిపించి ఆంద్రోద్యమానికి దారితీసింది. ఆంద్రోద్యమం నాటికి తెలుగు ప్రజలు మద్రాసు రాష్ట్రంలోనూ నిజాం ప్రాంతంలోని తెలంగాణాలోనూ ఉన్నారు. బ్రిటీష్ పాలనలో ఆంధ్రప్రాంతం కోస్తాజిల్లాలు, రాయలసీమ అనే రెండు ప్రాంతాలు రెండు ఉండేవి. వావిలాల గోపాలకృష్ణయ్యగారి మాటల్లో విశాలాంధ్రవని, విభిన్నాంధ్రవనిగా ఉంది. 

ఉద్యమ భావన

1903-1904 మధ్య గుంటూరులో 'యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్' ప్రారంభమైంది. అందులో ఒక ముఖ్య సభ్యుడయిన జొన్నవిత్తుల గురునాధంగారు గుంటూరు క్రైస్తవ కళాశాలలో ఉపన్యాసకులుగా కురుపాంరాజాగారి కార్యదర్శిగా పనిచేసి కేంద్ర శాసనమండలి సభ్యులయ్యారు. వారి 'ది హిందూ' పత్రికలో మాద్రాసులో తెలుగువారి పట్ల చూపుతున్న విచక్షణ, వారి వెనుకబడిన తనాన్ని వ్యాసాలుగా రాశారు. ఇదే సంఘంలో గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు సభ్యులు. వీరు తెలుగువారి సమస్యలను చర్చించుకొనేవారు.

1905లో మొదలయిన వందేమాతర ఉద్యమం దేశవ్యాప్తంగా జాతీయతా భావాన్ని ప్రచారం చేయగా, ఆంధ్రదేశంలో రాజకీయ చైతన్యంతో పాటు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర భావనకు కూడా బీజం నాటింది. విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర మొదలైన గ్రంథాలు, నాటి తెలుగు పత్రికలైన కృష్ణా పత్రిక, దేశాభిమాని, దేశమాతలోని వ్యాసాలు ఈ ఉద్యమ భావనకు బలం చేకూర్చాయి. పత్రికలు ఎన్నో నిర్మాణాత్మక సూచనలు చేశాయి. 1911 బెంగాలు విభజన వ్యతిరేకోద్యమం ఫలించి విభజన రద్దయింది. ఈ నిజం తెలుగువారికి ఆదర్శప్రాయంగా తోచింది. 1911లో ఉన్నవ లక్ష్మీ నారాయణ, జొన్నవిత్తులు గురునాథం, సంయుక్తంగా మద్రాసులోని, నిజాం పాలనలోని, మైసూర్ సెంట్రల్ ప్రావిన్సెలో ఉన్న తెలుగు ప్రజల ప్రాంతం మొత్తాన్ని ఒక చిత్రపటంగా గీశారు. 1911 డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీ దర్బారులో మద్రాసు రాష్ట్రంలో నిరాదరణకు పాలయిన తెలుగువారికి ఒక ప్రత్యేక పాలనా విభాగం ఉండాలని పేర్కొనడం జరిగింది. బీహారీలకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వగా ఆంధ్రులకు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. “తెలుగువారిని ఏకీకృతం చేసి వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని గవర్నర్ ను, శాసనమండలిని ఏర్పాటుచేయడం ఆంగ్ల పాలకుల ధర్మమని” ఆంధ్రకేసరి పత్రిక రాయగా “బీహారీల వలె తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక ప్రభుత్వం ఇవ్వవలె. తెలుగు ప్రతిభ త్వరితగతిలో నాశనమవుతుంది. అది పూర్తిగా అంతరించకుండా కాపాడడం ప్రభుత్వం విధి. ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే తప్ప తెలుగు ప్రజల సంస్కృతికి రక్షణ లేదు. అని దేశాభిమాని ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజాభిప్రాయం పెరుగుతూ వచ్చింది.

1912 మే నెలలో నిడదవోలులో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సభలకు సాంఘిక సంస్కరణ సభ అనుబంధంగా, ఆంధ్రసాహిత్య సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు ప్రతినిధులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రస్తావన తీసుకురాగా, గోదావరి ప్రతినిధులు మొదట్లో అవహేళన చేసినా చర్చల తరవాత ప్రత్యేక రాష్ట్ర వాదనల లోని పటిమను గుర్తించారు. ఈ విషయాన్ని సమగ్రంగా చర్చించ డానికి అఖిలాంధ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభలో సూర్యనారాయణగారు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర తీర్మానాన్ని ప్రతిపాదించారు. సాంబశివరావుగారి కోరికపై తీర్మానం వాయిదా పడింది. అయినా గుంటూరు జిల్లా ప్రతినిధులు నిరాశచెందక నిడదవోలు నుంచి తిరిగిరాగానే ఉన్నవ లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, కొండా వెంకటప్పయ్యగారు ప్రభృతులు కలసి అఖిలాంధ్ర ఏర్పాటుకు ఒకస్థాయీ సంఘాన్ని నియమించారు. కొండా వెంకటప్పయ్యగారు దీనికి కార్యదర్శి. వారు గురునాధం గారితో కలిసి ప్రత్యేక ఆధ్ర రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ తెలుగు, ఆంగ్ల భాషలలో ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. ప్రథమ ఆంధ్రమహాసభను 1913లో బాపట్లలో జరపాలని నిశ్చయించారు.


Tags :   Andhra Movement      Separate Andhra Movement      Andhra History    

  Andhra Pradesh Hisory