భారతదేశ చరిత్రలో 19వ శతాబ్దాన్ని ముఖ్య యుగంగా పేర్కొనవచ్చు. ఈ కాలంనాటికి భారత సమాజం మూఢ నమ్మకాలతో, సాంఘిక దురాచారాలతో ఉండేది. 19వ శతాబ్దంలోనే ఎంతోమంది ముఖ్య సంఘ సంస్కర్తలు జన్మించారు. మూఢాచారాలతో ఉన్న సమాజాన్ని సంస్కరించి ప్రజల్లో ఆధునికతను, జాతీయ భావాలను కలిగించారు. అలాంటి వారిలో పేర్కొనదగినవారు రాజారామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి. రాజారామ్మోహన్ రాయ్ 1828లో బ్రహ్మసమాజాన్ని స్థాపించి సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టాడు. దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఈ రెండు సంస్థల ప్రభావం ఆంధ్రదేశంపై తీవ్రంగా ఉండేది. మూఢ విశ్వాసాలతో నిద్రాణమైన ఆంధ్రజాతిని సంస్కరించిన వారిలో కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నంనాయుడు ముఖ్యులు. 

తొలి సంఘసంస్కర్తలు

తొలి ఆంధ్ర సంఘసంస్కర్త ఏనుగుల వీరాస్వామి. ఆయన 19వ శతాబ్దం ప్రారంభంలో మద్రాస్ సుప్రీం కోర్టులో దుబాసీగా పనిచేశాడు. అస్పృశ్యతా నిర్మూలనకు పాటుపడ్డాడు. అస్పృశ్యతకు స్మృతులలో ఎలాంటి ఆధారాలు లేవన్నాడు. దేవాలయాల్లో జరిగే అర్థంలేని తంతును విమర్శించాడు. నెల్లూరుకు చెందిన అనంతరామశాస్త్రి హరిజనోద్ధరణకు పాటుపడ్డాడు. హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని ప్రచారం చేశాడు. గాజుల లక్ష్మీనరసింహ చెట్టి 'క్రీసెంట్' అనే పత్రికను స్థాపించి దానిద్వారా సాంఘిక సంస్కరణలను ప్రచారం చేశాడు. వెట్టిచాకిరీని రద్దు చేయాలని కోరాడు.

విశాఖపట్నంలో పరావస్తు వెంకటరంగాచార్యులు స్త్రీ పునర్వివాహం శాస్త్రసమ్మతమేనని ఆధారాలతో నిరూపించాడు. సామినేని ముద్దు నరసింహ 1862లో రాసిన 'హితసూచని' అనే గ్రంథంలో సాంఘిక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేశాడు. స్త్రీ విద్యకు కృషి చేశాడు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వ్యభిచారం లాంటి దురాచారాలను ఖండించాడు. క్షుద్రశక్తుల ఆరాధన, మాంత్రికుల, తాంత్రికుల చర్యలను ఖండించాడు. కొమిలేశ్వర శ్రీనివాస పి స్త్రీ విద్య కోసం కృషిచేశాడు. బాలికల పాఠశాలల స్థాపనకు రూ. 70 వేలు ఇచ్చాడు. ఆత్మూరి లక్ష్మీనరసింహం బ్రహ్మసమాజ ప్రభావానికి లోనై, స్త్రీ పునర్వివాహ సమాజంలో సభ్యుడై ప్రచారం చేశాడు. ఆయన వీరేశలింగం పంతులుకు గురువు. 

కందుకూరి వీరేశలింగం

వీరేశలింగం ఆంధ్రదేశంలో సంస్కరణల యుగానికి యుగపురుషుడ య్యాడు. ఆయన 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించాడు. 1869లో మెట్రిక్యులేషన్ అనంతరం కొరంగిలో ఉపాధ్యాయుడిగా, రాజమండ్రిలో సీనియర్ తెలుగు పండితుడిగా పని చేశాడు. విద్యార్థి దశ నుంచే హేతు వాదాన్ని అలవరుచు కున్నాడు. విగ్రహారాధన, మూఢ విశ్వాసాలు, శకునాలు, మంత్రతంత్రాలను ఖండించాడు. బ్రహ్మ సమాజ సిద్దాంతాలతో ప్రభావితుడయ్యాడు. 

స్త్రీ విద్య

ఆంధ్రదేశంలో వీరేశలింగం స్త్రీ విద్యకోసం పాటుపడ్డాడు. 1870 దశకంలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న పురుషార్థప్రదాయని, ఆంధ్రభాషా సంజీవని అనే పత్రికల్లో స్త్రీ విద్య గురించి వివాదం చెలరేగింది. ఈ సందర్భంలో వీరేశలింగం స్త్రీ విద్యను సమర్థించాడు. తన సిద్ధాంత ప్రచారం కోసం వివేకవర్ధిని అనే పత్రికను 1874లో రాజమండ్రిలో ప్రారంభించాడు. తన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు 1874 సెప్టెంబరులో ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలను స్థాపించాడు. ఇది ఆంధ్రదేశంలోనే తొలి బాలికల పాఠశాల. ఆయన రాజమండ్రిలోని ఇన్నీస్ పేటలో 1881లో మరో బాలికల పాఠశాలను స్థాపించాడు. హరిజనులకోసం పాఠశాలలు, శ్రామికుల కోసం రాత్రి పాఠశాలలు స్థాపించాడు. 

వితంతు పునర్వివాహాలు

వీరేశలింగానికి స్త్రీ జనోద్దారకుడిగా విశేషఖ్యాతి లభించింది. ఆయన 1874లో మద్రాసులో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. 1875లో వితంతు పునర్వివాహాలను సమర్థిస్తూ విశాఖపట్టణవాసి అయిన పరావస్తు వెంకటరంగాచార్యులు 'పునర్వివాహ సంగ్రహం' అనే గ్రంథాన్ని రాశాడు. ఇదే సమయంలో వీరేశలింగం బ్రిటిష్ అధికారుల, ఇతరుల మద్దతును కూడగట్టాడు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధానాధికారి ఇ.పి. మెట్ కాఫ్ వీరేశలింగానికి మద్దతు తెలిపాడు. ఆయన రాజమండ్రిలో 1878లో సంఘసంస్కరణ సమాజాన్ని స్థాపించాడు. 1879 ఆగస్టు 3న వీరేశలింగం వితంతు పునర్వివాహాలను సమర్థిస్తూ ఉపన్యసించాడు. అక్టోబరు 12న మరో ఉపన్యాసం ఇచ్చాడు. సంప్రదాయవాదులు వీరేశలింగంపై భౌతిక దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. 1880లో చల్లపల్లి బాపయ్య, బసవరాజు, గవర్రాజుల సహకారంతో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతువులను వివాహం చేసుకునే వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఒక వితంతువు దొరికింది. ఆమె పేరు సీతమ్మ. 1881 డిసెంబరు 11న రాజమండ్రిలో గోగులపాటి శ్రీరాములుతో సీతమ్మ వివాహం జరిగింది. ఇది వీరేశలింగం జరిపించిన తొలి వితంతు వివాహం. డిసెంబరు 15న రత్నమ్మ అనే వితంతువును రాచర్ల రామచంద్రయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇది ద్వితీయ వితంతు వివాహం. 1892 నాటికి వీరేశలింగం ఇరవై వితంతు వివాహాలను జరిపించాడు. పైడా రామకృష్ణయ్య అనే కాకినాడ వ్యాపారి వీరేశలింగానికి ఆర్థిక సహాయం చేశాడు. వీరేశలింగం 1897లో మద్రాసులో, 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయాలను స్థాపించాడు. 1883లో స్త్రీలకోసం ప్రత్యేకంగా 'సతీహితబోధిని' అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఆయన కార్యకలాపాలు, వార్తలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించాయి.

మహాదేవ గోవిందరనడే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, చంద్రార్కర్, మహర్షి డి.కె. కార్వే లాంటి సంఘసంస్కర్తలు వీరేశలింగం సేవలను కొనియాడారు. ఆయన పేరు విదేశాల్లో కూడా వ్యాపించింది. బ్రిటన్ దేశస్తురాలైన మానింగ్ అనే యువతి వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయానికి 50 పౌండ్లు చెందేలా వీలునామాలో రాసిపెట్టింది. వీరేశలింగం సేవలకు మెచ్చి ప్రభుత్వం 1893లో రావు బహదూర్ బిరుదు ప్రదానం చేసింది. మద్రాసులో 1898లో భారత సంఘ సంస్కరణ సభకు అధ్యక్షత వహించి అత్యున్నతమైన గౌరవాన్ని పొందాడు. ఈ సభలోనే మహాదేవ గోవింద రనడే, వీరేశలింగాన్ని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడిగా అభివర్ణించాడు. 1905 డిసెంబరు 15న వీరేశలింగం తాను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణ కోసం 'హితకారిణి సమాజం' అనే కేంద్ర సంస్థను స్థాపించి తన యావదాస్తిని ఆ సంస్థ పేరున రాశాడు.

ఉద్యోగుల అవినీతి, దేవదాసీ పద్ధతులపై వీరేశలింగం ధ్వజమెత్తాడు. వేశ్యలను, భోగం స్త్రీలను ఉన్నత వర్గాలవారు, ధనవంతులు ఉంచుకోవడం గౌరవంగా భావించేవారు. వీరి గృహాల్లోనే అధికార, అనధికార నిర్ణయాలు కూడా జరిగేవి. అధికారుల నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండేందుకు కొంతమంది ఈ దేవదాసీలను సాధనంగా వాడుకునేవారు. వివాహాలు, ఇతర ఉత్సవాల సందర్భాల్లో దేవదాసీలు, భోగంవారితో నాట్యం చేయించేవారు. దేవదాసీ పద్ధతి నైతిక విలువలను దిగజార్చేదిగా ఉందని భావించి వీరేశలింగం తీవ్రంగా వ్యతిరేకించాడు. అవినీతిపరులైన అధికారుల గుట్టు బట్టబయలు చేసి, భయోత్పాతాన్ని సృష్టించాడు. ఆయన బయట పెట్టిన అవినీతికి భయపడి జిల్లా మున్సిఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రచయితగా వీరేశలింగం వీరేశలింగం రాసిన 'రాజశేఖరచరిత్ర' తెలుగులో మొదటి నవలగా ప్రశంస పొందింది. చిన్నపిల్లల కోసం 'సత్యరాజా పూర్వదేశ యాత్రలు', 'ఈసఫ్ కథలు' రాశాడు. కవుల చరిత్ర, శాకుంతల నాటకానువాదం రచించాడు. గద్య తిక్కన, గద్యవాజ్మయ బ్రహ్మ, యుగకర్త అనే బిరుదులున్నాయి. 

రఘుపతి వెంకటరత్నం నాయుడు 

రఘుపతి వెంకటరత్నం నాయుడు విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రహ్మ సమాజ ప్రభావానికి లోనయ్యాడు. 1885లో బ్రహ్మ సమాజంలో చేరి మద్రాసులో మన్నవ బుచ్చయ్య పంతులు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 1894లో మచిలీపట్నం నోబుల్ కళాశాలలో ప్రొఫెసర్ గా చేరిన తర్వాతే ఆయన సంఘసంస్కరణ ప్రారంభమైంది. 1894, 1895 సంవత్సరాల్లో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు పట్టణాల్లో బ్రహ్మ సమాజ ఉద్యమం, సిద్ధాంతాలపై పలుమార్లు ప్రసంగించాడు. ఆ ప్రసంగాల్లో సంఘశుద్ధి, అనాథ ఉద్ధరణ ముఖ్య ఆశయాలుగా ఆయన వివరించాడు. అస్పృశ్యతా నిర్మూలన, మద్యపాన నిషేధం, దేవదాసీ పద్ధతి నివారణకు పాటుపడ్డాడు. 1878లో వీరేశలింగం స్థాపించిన 'ప్రార్థనా సమాజం' పేరుతోనే నాయుడు సంస్కరణోద్యమం నడిచింది. వెంకటరత్నం 1891లో సాంఘిక శుద్ధి సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘంలో చేరిన సభ్యులు ధర్మాన్ని పాటిస్తామని, పరిశుద్ధంగా ఉంటామని ప్రమాణం చేయాలి. దేవదాసీ పద్ధతి నిర్మూలనకు వెంకటరత్నం పాటు పడ్డాడు. దేవదాసీల పేరుతో వారిని వేశ్యలుగా మార్చిన హిందూ సంప్రదాయాన్ని అసహ్యించుకున్నాడు. దేవదాసీల నైతిక పతనానికి సంఘం, మతమే కారణమని, ఈ మతం ఆమోదించిన పాపపంకిలాన్ని తుదముట్టించాలని పోరాడాడు. వేశ్యలు పడుపు వృత్తి నుంచి బయటకు వచ్చి గౌరవప్రదంగా జీవించేలా అవకాశాలు కల్పించాడు. అనాథ బాలబాలికలకు రక్షణ కల్పించడం కోసం కాకినాడలో ఆయన అనాథ బాలబాలికల శరణాలయాన్ని స్థాపించాడు. హరిజన బాలబాలికల వసతి గృహాన్ని కూడా నిర్మించాడు. మహాత్మాగాంధీ కంటే ముందే వెంకటరత్నం నాయుడు అస్పృశ్యతా నివారణకు కృషి చేశాడు. హరిజన బాలికలను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి, పెళ్లిళ్లు కూడా జరిపించాడు. ఈశ్వరుడికి, మానవుడికి ఏ అంతరం లేని విధంగా ఆధ్యాత్మిక, సాంఘిక ఉపాసనలు జరిపి, ఈశ్వర భక్తిభావం పెంపొందించాడు. పిఠాపురం రాజా ఆర్థిక సహాయంతో కాకినాడలో ఆంధ్ర బ్రహ్మోపాసనా మందిరాన్ని, బ్రహ్మధర్మ ప్రచారానికి నిధిని నెలకొల్పాడు. ఆయన నోబుల్ కళాశాలను వదిలి, సికింద్రాబాద్ లోని మహబూబ్ కళాశాలలో, ఆ తరువాత కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. 

గురజాడ అప్పారావు 

గురజాడ అప్పారావు భాషవేత్త, భావకవి. వ్యావహారిక భాషలో, ప్రజలకు అర్థమయ్యే రీతిలో తన రచనలు చేశాడు. ఆయనకు దేవుడికంటే మనిషి ముఖ్యం. మతంకంటే సమాజం ప్రధానం. ముత్యాలసరాలు, కన్యాశుల్కం, పూర్ణమ్మ మొదలైన రచనలు చేశాడు. కన్యాశుల్కం అనే సాంఘిక దురాచారానికి అద్దం పట్టడానికి సునిశితమైన హాస్యంతో 'కన్యాశుల్కం' నాటకం రాశాడు. బాల్య వివాహాలు అనే దురాచారం ఎలాంటి ఫలితాలనిస్తుందో తెలిపేందుకు 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' రచించాడు. ఆనాటి అస్పృశ్యతను రూపుమాపడానికి ఆయన తన ముత్యాలసరాలులో సర్వమానవ సౌభ్రాత్రాన్ని తెలియ జేశాడు. మతం పేరుతో మానవుడిని నిర్లక్ష్యం చేసే సాంఘిక వ్యవస్థను దుయ్యబట్టాడు. విగ్రహారాధన, మూఢాచారాలు, గుడ్డి నమ్మకాలను విమర్శించాడు. 

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలుగువారికి చరిత్ర, పరిశోధనలు పరిచయం చేశాడు. తెలుగులో చరిత్ర, వైజ్ఞానిక గ్రంథాలు లేనికొరతను తీర్చడానికి మహోద్యమాన్ని ప్రారంభించాడు. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితా మహుడిగా ప్రసిద్ధి పొందాడు. క్రీ.శ. 1900లో మునగాల ఎస్టేట్లో దివాన్ గా చేరాడు. 1901లో హైదరాబాద్ లో 'శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం' గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. తెలుగు భాషాస్థితిని మెరుగుపరచడమే దీని లక్ష్యం. విజ్ఞానశాస్త్ర రచనలను ప్రోత్సహించడానికి ఆయన 1906లో 'విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి' స్థాపనకు కారకుడయ్యాడు. ఈ మండలి ఎన్నో గ్రంథాలను ప్రచురించింది. బ్రిటిష్ ఎన్ సైక్లోపీడియా పద్ధతిలో 'ఆంధ్ర విజ్ఞానసర్వస్వం' అనే గ్రంథరచనకు లక్ష్మణరావు కారకుడయ్యాడు. ఇది మూడు భాగాలుగా, రెండువేల పేజీలతో వెలువడింది. భారతీయ భాషల్లో ఇదే మొదటి విజ్ఞాన సర్వస్వం. గిడుగు వెంకట రామమూర్తి పరవస్తు చిన్నయసూరి తరువాత అడుగున పడిపోయిన వ్యావహారిక భాషకు సాహిత్యంలో పట్టం కట్టే 'వచనం' విస్తరించేందుకు కృషిచేసినవాడు 

గిడుగు వెంకట రామమూర్తి 

తెలుగు భాషావ్యాప్తికి గ్రాంథిక భాష ఆటంకం అని వ్యావహారిక భాషోద్యమం చేపట్టాడు. 'తెలుగు' అనే పత్రికను స్థాపించి గ్రాంథిక భాషావాదుల వాదాన్ని, పద్ధతులను ఖండించాడు. పర్లాకిమిడి ప్రాంతంలో జీవించే సవరుల భాషకు లిపిలేదు.

రామమూర్తి వారి సంప్రదాయాలు, వ్యవహారాలను పరిశీలించి, వాటిని తెలుగు లిపిలో ప్రచురించాడు. సవరుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి అంటరానితనం నిర్మూలనకు కృషిచేశాడు.


Tags :   Kandukuri Veeresha Lingam      Gidugu Venkata Ramamurthy     

 Komarraju Venkata Laxmana Rao     Andhra History      Andhra Pradesh Hisory