వెంకటగిరి

వెంకటగిరి జమీందారీ కింద 730 గ్రామాలుండేవి. ఈ జమీన్ 'పేష్కష్' కింద రూ. 2,68,711 చెల్లించేవారు. వెంకటగిరి జమీందారు పాన నిరంకుశంగా ఉండేది. జమీందారు రైతుల జిరాయితీ హక్కులను గుర్తించకుండా, భూములను ఒకరి నుంచి ఒకరికి తరుచూ మార్చేవాడు. రైతులను కష్టాలకు గురిచేసేవాడు. పంటలు పండినా, పండకపోయినా శిస్తు చెల్లించాల్సిందే జమీందారు కోరుధాన్యపు పద్ధతిలో శిస్తు సంఘాలు చేసేవాడు. అక్కడ అన్నీ వర్షాధార భూములే తరుచూ అతి వృష్టి, అనావృష్టి సంభవించేవి. జమీందారు మద్రాసు భూస్వాముల సంఘానికి అధ్యక్షుడు. 1937 వరకు మద్రాసు శాసన సమితిలో సభ్యుడు.

రైతుల హక్కులను కాపాడుకోవడానికి 1929 అక్టోబరులో నెల్లూరు జిల్లా జమీందారీ రైతు సంఘ స్థాపన జరిగింది. సంఘం మొదటి సమావేశం 1929 అక్టోబరు 19న దొడ్ల రామిరెడ్డి స్వగృహంలో జరిగింది. ఈ సమావేశం వెంకటగిరి రైతు ఉద్యమానికి నాంది పలికింది. ఈ రైతు సంఘానికి వెన్నెలకంటి రాఘవయ్య. పొట్టపల్లి గురప్ప నాయుడు, వేమాటి వెంకటరెడ్డి కార్య నిర్వాహకులుగా, నెల్లూరు వెంకట్రామనాయుడు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సంఘం రైతుల్లో చైతన్యం తీసుకువచ్చింది. . నెల్లూరు వెంకట్రామనాయుడు 'మా కొద్దీ తెల్లదొరతనం' బాణిలో 'మా కొద్దీ జమీందార్ల పొందు...” అనే గేయాన్ని రాసి, రైతుల్లో చైతన్యం కలిగించాడు. 1931 సెప్టెంబరులో నెల్లూరు జిల్లా రైతుసంఘం మొదటి ఆంధ్ర రాష్ట్ర జమీందారీ రైతు సదస్సును ఏర్పాటు చేసింది. జమీందారు, అతడి కుమారుల దుశ్చర్యలను ఈ సదస్సులో పలువురు వక్తలు దుయ్యబట్టారు. 1931 నవంబరులో మోపూరు తదితర గ్రామాల్లో రైతులు సత్యాగ్రహానికి దిగారు. కలెక్టర్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చాడు. వెంకటగిరి తాలూకా పాళెంకోటకు చెందిన పనసకోన అనే అడవిలో రైతులు అనాదిగా తమ పశువులను మేపుకునేవారు. కానీ, ఎన్నికల్లో రైతులు తనకు వ్యతిరేకంగా పనిచేశారని జమీందారు కక్షగట్టి, పోలీసుల సహాయంతో అడవుల్లోకి పశువులను రానివ్వకుండా చేశాడు.

1933 మార్చి 20, 22 తేదీల్లో పెట్టోరి గోవిందరెడ్డి నాయకత్వంలో రైతులు తమ పశువులను అడవుల్లోకి తోలారు. పాళెంకోట వద్ద జమీందారు పోలీసులను మోహరింపజేశాడు. పోలీసులు రైతులను నిర్బంధించి, పశువులను దొడ్లలోకి పంపడానికి ప్రయత్నించారు. మహిళలు చెల్లమ్మ అనే గర్భిణి నాయకత్వంలో చేతుల్లో చీపురు కట్టలు, వేడినీళ్లు, బడుల్లో కారంపొడి తీసుకుని వెళ్లారు. పోలీసుల కళ్లలో కారంచల్లి, కొట్టారు.

మహాత్మాగాంధీ 1933 డిసెంబరు 30న వెంకటగిరిలో పర్యటించి సత్యాగ్రహం ద్వారా జమీందారీ నిర్మూలనకు కృషిచేయాలన్నాడు. 1937 లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి కుమార్ రాజాతో బత్తిన పెరుమాళ్లు నాయుడు. వెంకటగిరి మహారాజ కుమార్ తో బద్దెపూడి వెంకటనారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడ్డారు. జమిందారీ ఉద్యమ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. ఎన్నికల్లో జమీందార్లు ఓడిపోయారు. ఎన్నికల తరువాత జమీందార్ల దుశ్చర్యలు మితిమీరాయి. 

రైతు ఉద్యమాలు

విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని పర్లాకిమిడి, మందస, చీకటి, కురుపాం, బొబ్బిలి మొదలైన ప్రాంతాల్లో జమీందారీ పాలనలో రైతులు నలుగుతూ ఉండేవారు. అనావృష్టితో సతమతమవుతున్న రైతులనుంచి జమీందార్లు అధిక పన్నులు వసూలు చేసేవారు. ఇలాంటి నేపథ్యంలో విశాఖపట్నంలో 1929 నవంబరు, 3న విశాఖపట్నం జిల్లా ప్రథమ జమీన్ రైతు సభ జరిగింది. పట్టాభి రామిరెడ్డి, బచ్చు విశ్వనాథదాసు, వేములకొండ రామదాసు మొదలైన వారు ఇందులో పాల్గొన్నారు. ఉద్యమ పటిష్ఠత కోసం ప్రజావాణి అనే పత్రిక గరిమెళ్ల కృష్ణమూర్తి సంపాదకత్వాన వెలువడింది. ఎస్టేట్ విధానం రద్దు కావాలని కోరుతూ 1937 లో విశాఖ జిల్లావ్యాప్తంగా రైతు రక్షణయాత్ర సాగింది. చలసాని వాసుదేవరావు, పుల్లెల శ్యాంసుందరరావు, లచ్చన్న పుండరీకాక్షాచార్యుల నాయకత్వంలో రైతు యాత్ర ఇచ్చాపురం నుంచి మొదలై జిల్లావ్యాప్తంగా సాగింది.

1937-38 లో మందేశ్వరశర్మ నాయకత్వంలో విశాఖపట్నం జిల్లాలో గిరిజనోద్యమం ప్రారంభమైంది. 1938 నవంబరు 15, 16 తేదీల్లో మాడుగులలో ప్రథమ కొండ జాతుల మహాసభ జరిగింది. ఈ సభ వెట్టిచాకిరీని రద్దు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో అమల్లో ఉన్న గొత్తి నౌకరిని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. రుణదాతకు బాకీలు తిరిగి చెల్లించలేనప్పుడు గిరిజనులు వంశపారంపర్యంగా చేసే నౌకరి - గొత్తి నౌకరి. ఫలితంగా ప్రభుత్వం 1940 జులై 14న గొత్తి నౌకరిని రద్దుచేస్తూ చట్టం చేసింది. ఇది గిరిజనుల్లో ఆత్మ సైర్యాన్ని నింపింది. అఖిల భారత రైతు మహాసభ 1940లో పలానాలో జరిగింది. ఈ సభకు సహజానంద సరస్వతి అధ్యక్షత వహించాడు. మందస జమీన్ లో జమీందారీ వ్యతిరేక పోరాటం తీవ్రరూపం దాల్చింది. రిజర్వ్ అడవిని రైతు కూలీలు తీవ్రరూపం దాల్చింది. రిజర్వ్ అడవిని రైతు కూలీలు కొట్టివేసినందుకు రామాపురానికి చెందిన ఏడుగురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. 1940 ఏప్రిల్ 1న పోలీసులు కాల్పులు జరుపగా ఆరుగురు చనిపోయారు. మరణించిన వారిలో పూసుమాను గున్నమ్మ అనే మహిళ ఉంది. ఈమె వీర గున్నమ్మగా జిల్లా అంతటా పేరొందింది.

1945లో ఉత్తర విశాఖపట్నంలో తీవ్రమైన గాలివాన సంభవించడంతో క్షామం ఏర్పడింది. ప్రభుత్వం క్షామ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనేక మంది రైతు కూలీలు మరణించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ చిత్రకారుడు పైడిరాజు అక్కడి పరిసితులను తన చిత్రాల ద్వారా కళ్లకు కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1947 నవంబరు 28న జమీందారీ రద్దు బిల్లును మద్రాస్ శాసన సభలో ప్రవేశపెట్టింది. మద్రాస్ శాసనసభ 1948 అక్టోబరు 27న ఈ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం 1949 సెప్టెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చింది.


Tags :   Peasant Revolt against Zameendari      Peasant Revolt in Andhra Pradesh     

 Peasant Revolt     Zameendari in Andhra      Andhra History     

Andhra Pradesh Hisory