సర్కారు జిల్లాలు

కంపనీ రాజకీయ ప్రాబల్యాన్ని సవాలు చేస్తూ జరిగిన తిరుగుబాట్లకు కొన్ని కారణాలున్నాయి. ఆంగ్లేయ కంపెనీ తన అధికార విస్తరణలో భాగంగా కొత్త పరిపాలనా పద్ధతిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. కంపెనీ అధికారులు దుడుకుగా ప్రవర్తించేవారు. స్థానిక ప్రభువులు, జమిందారులు కంపెనీ అధికారుల ప్రవర్తనను నిరసించారు. కంపెనీ పాలన విదేశీయమైనది. వారికి స్థానిక ఆచారాలు, సమస్యలపట్ల పెద్దగా అవగాహన లేదు. వ్యాపారస్తులుగా వచ్చిన కంపెనీ అధికారులకు పాలనా సామర్థ్యం లోపించింది. కొత్తగా అధికారం రావడంతో వారిలో కూడా అహంకారం పెరిగింది. వారి శిస్తు వసూలు పద్ధతి కఠినంగా ఉండేది. పైగా జమిందారుల వారసత్వపు తగాదాల్లో జోక్యం చేసుకునేవారు. అన్నింటినీమించి జమిందారులు కంపెనీకి చెల్లించవలసిన మొత్తాలను అధికం చేశారు. వీటిని 'పేష్ కుష్'లని పిలుస్తారు. ఇది జమిందారులకు ఆగ్రహకారణమైంది. సమర్ధమైన కేంద్రప్రభుత్వం లేనందువల్ల ఇన్నాళ్ళు ఈ జమిందారులు స్వతంత్ర నాయకులుగా చెలామణి అయ్యారు. సర్కారులలో జమిందారులు, రాయలసీమలో పాలెగారులు సర్వస్వతంత్రులయ్యారు. దక్కలో నిజాం ఉల్ ముల్క్ మరణం వల్ల వీరు మరింత బలపడ్డారు. కోటలను నిర్మించుకొని సైనిక బలగాలను సమీకరించుకుని ఉన్నారు. వారికి కొత్తగా వచ్చిన కంపెనీ పెత్తనం కంటగింపుగా తయారుకావడంలో ఆశ్చర్యం లేదు. దీంతో కంపెనీకి స్థానిక ప్రభువులైన జమిందారులు, పాలెగాండ్ర మధ్య వైరం అనివార్యమైంది. ఈ వైరమే కొన్ని తిరుగుబాట్లకు కారణమైంది. 

గంజాం

గంజాం సర్కారు కొండలతో, గుట్టలతో నిండి సహజరక్షణ గల ప్రాంతం. ఇక్కడికి సైన్యాలు పెద్దఎత్తున తరలిరావడం కష్టం. పైగా ఈ కొండప్రాంతంలో సహజంగా స్వేచ్ఛా ప్రవృత్తి అధికం. కంపెనీ ఈ ప్రాంతలపై అధికారం సంపాదించుకునే నాటికి సుమారు 20 మంది జమిందారులున్నారు. గంజాం జమిందారుల పోషణలో సుమారు 30వేల సైన్యం ఉండేది. ఈ ప్రాంతంలో ఎన్నో దుర్గాలు నిర్మించుకున్నారు. వీరు కంపెనీ పరిపాలనను ఆమోదించ లేదు. మొదట్లో గుమనూరు, పర్లాకిమిడి జమిందారులు ఎదురు తిరిగారు. దీనికి కంపెనీ పెద్దగా భయపడలేదు. కాని ఈ ప్రాంతం లోని అతి పెద్ద జమిందారైన విజయనగర ప్రభువు తిరుగుబాటు ఆంగ్లేయుల పాలకులను కలవరపరచింది. 

పద్మనాభ యుద్ధం

విజయరామరాజు తరువాత అధికారంలోకి వచ్చిన ఆనంద గజపతి ఆంగ్లేయ సేనాని ఫోర్ సాయంతో ఫ్రెంచివారిని విజయ నగరం, రాజమండ్రి, మచిలీపట్నం ప్రాంతాలనుంచి పారద్రోలడం మనం చదివి ఉన్నాం. ఆనంద గజపతి తరువాత జమిందారైన విజయరామరాజు బాలుడు. కాబట్టి పినతల్లి కుమారుడు సీతారామ రాజు దివాన్ గా అధికారాలు చెలాయించాడు. సీతారామరాజు స్వార్థపరుడు. అధికార దుర్వినియోగం చేసి ప్రజలను పీడించాడు. విజయరామరాజు యుక్తవయస్సు రాగానే అధికారాలను స్వీకరించి, ప్రజాభిప్రాయం గమనించి సీతారామరాజును దివాన్ పదవి నుంచి తొలగించాడు. అతను మద్రాసు వెళ్ళి సంబంధిత అధికారులను ప్రలోభపెట్టి తిరిగి దివాన్ పదవి పొందినా, విషయం తెలిసిన కంపెనీ డైరెక్టర్లు జోక్యం చేసుకుని అతనిని తొలగించారు. సీతారామ రాజు దుర్మార్గుడే కాని సమర్థుడు. అతని బర్తరఫ్ తరువాత విజయ రామరాజు పాలన బలహీనమై పన్నులు సరిగా వసూలుకాక ఆంగ్లేయులకు పెద్దమొత్తంలో అప్పుపడ్డాడు. తమకు రావలసిన ఎనిమిది లక్షల 'పెష్ కుష్'లను చెల్లించమని కంపెనీ కోరగా, తాను బకాయిపడలేదని విజయరామరాజు బదులు చెప్పాడు. కంపెనీ సైన్యాలు విజయనగర కోటను ముట్టడించి ఆక్రమించుకున్నాయి. రాజుపట్ల అభిమానం గల ప్రజలు కంపెనీకి శిస్తు చెల్లించలేదు. ఈ వ్యతిరేకతకు విజయరామరాజు కారకుడని భావించిన కంపెనీ, అతనికి 120 రూపాయల ఫించను మంజూరు చేసి మచిలీపట్నం వెళ్ళమని ఆదేశించింది. విజయనగర సంస్థానం కంపెనీ పాలనలోకి వచ్చింది. విజయ రామరాజు కంపెనీ ఆదేశాలను ధిక్కరించి విజయనగరం, భీమునిపట్నం మధ్యగల పద్మనాభ గ్రామం చేరాడు. ఈ గ్రామాన్ని కంపెనీ సైన్యాలు చుట్టుముట్టగా విజయరామరాజు ఓడిపోయి హతుడయ్యాడు. దీన్నే 1794 పద్మనాభ యుద్ధంగా పేర్కొనడం జరిగింది.

విజయరామరాజు మరణం నాటికి అతని కుమారుడు నారాయణ బాబు ఎనిమిదేండ్ల బాలుడు. కొందరు కుటుంబ సభ్యులతో కొండ ప్రాంతంలోని 'మక్కువ' గ్రామానికి చేరి తలదాచుకున్నాడు. అక్కడి కొండ ప్రజలు నారాయణబాబు పక్షాన కంపెనీతో పోరాటానికి సంసిద్ధులయ్యారు. కొండప్రాంతంలో పోరాటం క్షేమదాయకం కాదని భావించిన అధికారులు తెలివిగా నారాయణ బాబుతో సంప్రదింపులు జరిపి, అతని సంస్థానం ఇచ్చివేసి కంపెనీ బకాయిని 5 లక్షలకు తగ్గించి చెల్లించమని చెప్పారు. దీనికి నారాయణ బాబు అంగీకరించాడు. 1802లో ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు పద్ధతి వల్ల, అక్కడ కమీషనర్ గా నియమితుడైన జార్జి రసెల్ కృషివల్ల ఈ ప్రాంతంలో జమిందారుల ప్రాబల్యం తగ్గిపోయి, కంపెనీ పాలన సుస్థిరమైంది. శాంతి భద్రతలు మెరుగయ్యాయి. ఈ ప్రాంతంలో చెదురుమదురుగా కొండజాతులు తిరుగుబాట్లు చేసి వాటిని సులభంగానే అణచివేయడం జరిగింది.

సర్కారులలోని గోదావరి ప్రాంతంలో పిఠాపురం, పోలవరం, పెద్దాపురం జమిందారులు తిరుగుబాట్లు చేశారు. కృష్ణ సర్కారులో ఒంగోలు, నిజాంపట్నం జమిందారులు కంపెనీ పాలనను వ్యతిరేకించారు. దీనికితోడు కొన్నిచోట్ల బందిపోటుల బెడద కూడా ఉండేది. వీటన్నింటినీ కంపెనీ సులభంగానే అణచివేసి శాంతి భద్రతల పరిస్థితిని మెరుగు పరచింది.


Tags :   Revolt in Company Rule      Padmanabha war     

 Sarkar Districts     Seetarama raju      Andhra History     

Andhra Pradesh Hisory