భారతదేశంలో 1857లో జరిగిన తిరుగుబాటును ఆంగ్లేయులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా పేర్కొంటే జాతీయ చరిత్రకారులు మాత్రం దీనిని ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించారు. ముఖ్యంగా వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి, డలౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఎందరో రాజులు రాజ్యాలు పోగొట్టుకున్నారు. మత, సాంఘిక కార్యకలాపాల్లో కంపెనీ జోక్యం వల్ల ప్రజల్లో రగిలిన అసంతృప్తి, సైన్యంలో అసంతృప్తి ఈ తిరుగుబాటుకు కారణాలుగా చెప్పవచ్చు. ఈ తిరుగుబాటు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో జరిగింది. దీని ప్రభావం దక్షిణ భారతంలోని హైదరాబాద్, ఔరంగాబాద్, కడప, మచిలీపట్నం మొదలైన ప్రాంతాల్లో కనిపించింది. తిరుగుబాటు ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని ఉద్యమకారులకు విజయం చేకూరడంతో హైదరాబాద్ రాష్ట్రంలోని ముస్లింలలో ఉత్సాహం పెరిగింది. సికింద్రాబాద్ బొల్లారంలోని కంపెనీ సైన్యాన్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఒక ఫకీర్ నగరమంతా తిరుగుతూ ప్రజల్ని బ్రిటిషర్లపై తిరగబడాలని రెచ్చగొట్టాడు. మసీదుల వద్ద మతాధికారులు ఉద్రేకపూరిత ఉపన్యాసాలిచ్చి బ్రిటిషర్లపై జీహాద్ (పవిత్ర యుద్ధం) ప్రకటించాలని ప్రజలను రెచ్చగొట్టారు. అల్లాఉద్దీన్ లాంటి ముస్లిం మౌల్వీలు హైదరాబాద్ మక్కా మసీదు వద్ద ఇచ్చిన మతోపన్యాసాల్లో బ్రిటిషర్లను ఇస్లాం మత శత్రువులుగా పేర్కొన్నారు. వారిని దేశంనుంచి తరిమికొట్టాలని ప్రబోధించారు. పర్లాకిమిడి తిరుగుబాటు

గంజాం జిల్లాలోని పర్లాకిమిడి ప్రాంతంలో సవరలు దండ సేనుడు అనే ఆదివాసి నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు చేశారు. బ్రిటిషర్లు దండ సేనుడిని నిర్బంధించగా అక్కడనుంచి తప్పించుకు వచ్చాడు. తర్వాత సవరలను సమీకరించి బ్రిటిషర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎన్నో గ్రామాలు అగ్నికి ఆహుతయ్యాయి. కెప్టెన్ విల్లన్ ఆధిపత్యంలో బ్రిటిషర్లు తిరుగుబాటును అణచివేశారు. దండ సేనుడిని ఉరి తీశారు. దాంతో ఉద్యమం ఆగిపోయింది. గోదావరి జిల్లాలో తిరుగుబాటు

గోదావరి జిల్లాలో కోరుకొండ సుబ్బారెడ్డి అనే గ్రామాధికారి గిరిజనులను సమైక్యపరిచాడు. నానాసాహెబ్ సైన్యంతో వస్తున్నాడని, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడేవారందరికి బహుమతులిస్తాడని ప్రచారం చేసి తిరుగుబాటు లేవదీశాడు. సుంకరస్వామి అనే గ్రామ మునసబు సుబ్బారెడ్డితో ఉన్న శత్రుత్వం మూలంగా ఆంగ్లేయులకు ఈ కార్యకలాపాలు తెలియజేశాడు. ప్రభుత్వం సుబ్బారెడ్డిని బంధించి ఉరితీయడంతో ఉద్యమం ఆగిపోయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాటం

బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని కర్నూలు జిల్లా పాళేగార్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆంగ్లేయులు పాళేగార్ పదవినుంచి తొలగించారు. దానితో ఆయన అయిదువేల మంది యోధులను తయారుచేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. వారు ఆంగ్ల పాలకులను, సైనికులను ముప్పుతిప్పలు పెట్టారు. కోయలకుంట్ల ప్రభుత్వ ఖజనాను దోచారు. ఆంగ్లేయులు ఆ పోరాటాన్ని అణచివేశారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఫలితంగా భారతదేశంలో కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ రాణి విక్టోరియా పాలన మొదలయింది. 1858 నవంబరు 1న అధికారాన్ని స్వీకరిస్తూ విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసింది.


Tags :   1857 Revolt in Andhra      1857 Revolt in Andhra Pradesh     

 1857 Revolt     Sepoy Mutiny in Andhra      Andhra History     

Andhra Pradesh Hisory