1948 ఫిబ్రవరి నెలలో ప్రకటించిన భారత రాజ్యాంగ ముసాయిదాలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని చేర్చలేదు. రాజ్యాంగ పరిషత్తు లోని తమిళసభ్యులు తమిళ రాష్ట్రం కావాలనే కొత్త నినాదం మొదలు పెట్టడంతో ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తే మిగతా భాషా ప్రాంతాల నుంచి కూడా అలాంటి ఉద్యమాలు ప్రారంభమవుతాయని భారత ప్రభుత్వం భావించింది. 

థార్ కమిషన్:

1948 మార్చిలో విశాఖపట్నం వచ్చిన నెహ్రూ, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు విషయాన్ని సమగ్రంగా పరిశీలించడానికి ఒక సంఘాన్ని ఏర్పరచగలమనీ ఆ సంఘం సిఫారసులమేరకు సరిహద్దు నిర్ణయ సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కన్నడిగులు, మహారాష్ట్రులు కూడా స్వరాష్ట్రం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతర సమస్యలతో తల మునకలుగా ఉన్న కేంద్రం ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని భావించింది. చివరికి ప్రజాభిప్రాయాన్ని పరిగణించి 1948 జూన్ 17వ తేదీన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించమని అలహాబాద్ న్యాయమూర్తి థార్ అధ్యక్షులుగా ఒక సంఘాన్ని నియమించింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల నిర్ణయం, రానున్న ఆర్థిక , పాలన సమస్యలను పరిశీలించమని కోరారు.

1948 సెప్టెంబర్ లో మద్రాసులో థార్ కమిషన్‌ను కలిసిన ఆంధ్రమహాసభ తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ కలిపి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. 1946లో జరిగిన ఎన్నికలలో సర్కారులో, రాయలసీమలో కాంగ్రెసువారే ఎన్నికయ్యారు. పార్టీ నాయకుని ఎన్నికలో రాయలసీమ సభ్యులలో ఎక్కువమంది ఓటువేసి ప్రకాశం గారిని గెలిపించారు.

కాని ఆయన మంత్రివర్గంలో రాయలసీమ నుంచి ఒక్కరికే పదవి లభించింది. 1947 అక్టోబర్ లో నంద్యాలలో జరిగిన రాయలసీమ సభలో సరైన రక్షణలు లేనిదే తమ ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో చేరడం ప్రమాదమని తీర్మానించారు. 1948 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ కమిటీ ఎన్నికలలో పట్టాభివర్గం, సంజీవరెడ్డిని, ప్రకాశం వర్గం రంగాను బలపరచగా సంజీవరెడ్డి ఓడిపోయాడు. రంగా తెలివిగా తిమ్మారెడ్డి, ఓబులరెడ్డిని కార్యదర్శులుగా నియమించి సంజీవరెడ్డి బలం తగ్గించ డానికి ప్రయత్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సంజీవరెడ్డి థార్ కమిషన్‌ను కలిసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని, లేకపోతే శ్రీబాగ్ ఒప్పందాన్ని రాజ్యాంగంలో చేర్చాలని కోరారు. థార్ కమిషన్ 1948 డిసెంబర్‌లో నివేదిక సమర్పిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దేశ సమైక్యతకు భంగకరంగా పరిణమించే ప్రమాదముంది కాబట్టి పాలనా సౌలభ్యం ఆధారంగా మాత్రమే రాష్ట్రాలను పునర్విభజించాలని సిఫారసు చేసింది. 

జె.వి.పి.రిపోర్ట్

థార్ నివేదికపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దీంతో జయపూర్ కాంగ్రెసు మహాసభలో జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభిలతో ఒక సంఘాన్ని నియమించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పునఃపరిశీలించమని చెప్పారు. వీరి నివేదిక అయిన జె.వి.పి. రిపోర్ట్ (ముగ్గురి మొదటి అక్షరాలతో)ను 1949 ఏప్రిల్ లో ప్రకటించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్ళపాటు వాయిదా వేయాలనీ అయితే ఆంధ్ర విషయంలో మాత్రం వారు మద్రాసు వదులుకొంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవచ్చునని ఈ నివేదిక సిఫారసు చేసింది. ఈ నివేదికను ప్రభుత్వం అంగీకరించింది. జె.వి.పి. రిపోర్ట్ మూలంగా ప్రాంతీయ భేదాలు తలెత్తాయి. మద్రాసుపై హక్కు వదులుకోడానికి ప్రకాశం ఇష్టపడలేదు. పైగా రాయలసీమ వారు మద్రాసులేని రాష్ట్రాన్ని అంగీకరించకపోవచ్చు. అనేక వివాదాల తరువాత వివాదం కాని 12 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలని, మద్రాసు తాత్కాలికంగా ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆంధ్రకాంగ్రెసు సంఘం కోరింది. దీనికి మద్రాసు ప్రభుత్వం అంగీకరించడంతో 'ఆస్తుల విభజన' సంఘాన్ని నియమించడమైంది. ఆస్తుల విభజనలో తిరిగి వివాదాలు చెలరేగాయి. మద్రాసు నగరంలోనే ఆంధ్రుల రాజధాని, హైకోర్టు ఉండాలని ప్రకాశం వాదించగా, ఆంధ్రలోనే తాత్కాలిక రాజధాని ఉండాలని, శాసనసభ సమావేశాలు, మంత్రివర్గ ప్రమాణం ఆంధ్రలోనే జరగాలని మెజారిటీ సభ్యులు వాదించారు. ఈ అసమ్మతి, ముఠారాజకీయాలు అవకాశంగా తీసుకొని కేంద్రం ఆంధ్రరాష్ట్ర స్థాపనను వాయిదా వేసింది. 

స్వామి సీతారాం నిరాహారదీక్ష

1950 నుంచీ ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ముఠా రాజకీయాలు మరింత పెరిగాయి. 1951 కాంగ్రెసు అధ్యక్ష పదవిపోటీలో పట్టాభి అభ్యర్థిగా సంజీవరెడ్డి, ప్రకాశం అభ్యర్థి రంగాను ఓడించారు. ప్రకాశం, రంగా కాంగ్రెసుకు రాజీనామా చేసి 'కిసాన్ మజ్జూర్ పార్టీకి స్థాపించారు. ఈ రాజకీయాలలో ఆంద్రోద్యమం మరుగున పడింది. ఆంధ్రరాష్ట్ర స్థాపనకు గాంధీజీ గారి సత్యాగ్రహమొక్కటే మార్గమని సర్వోదయ నాయకుడు గొల్లపూడి సీతారామశాస్త్రి గారు భావించారు.

స్వామి సీతారంగా పేరు పొందిన సీతారామశాస్త్రి గారు 1951 ఆగస్టు 15వ తేదీన నిరాహారదీక్ష ప్రారంభిస్తూ అక్టోబర్ రెండోతేదీ లోపుగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు జరగాలని, మద్రాసు నగర భవితవ్యం మూడేళ్ళలో నిర్ణయించాలని ప్రకటించారు. అఖిలపక్ష కమిటీ వారి ప్రకటనను సమర్ధించింది. నెహ్రూ నిరాహారదీక్షను విమర్శిస్తూ తాను రాజకీయ వాస్తవాలను మాత్రమే గమనిస్తానుకొని దీక్షలకు బెదరను అని ప్రకించాడు. శాంతియుత వాతావరణంలో సీతారాంగారి కోర్కెలను పరిశీలించగలమని హామీ ఇవ్వగా దీక్షను విరమించడమైంది. దీంతో ప్రజలు అసంతృప్తికి లోనై 1952 ఎన్నికలలో కాంగ్రెసును ఓడించారు. సంజీవరెడ్డి, గోపాలరెడ్డి, కళా వెంకటరావు వంటి నాయకులు కూడా పరాజయం పాలయ్యారు. ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టులు 40 సీట్లు గెలుచుకొని బలపడ్డారు. వీరు కిసాన్ మజ్జూర్ పార్టీతో కలిసి 'యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్' స్థాపించగా ప్రకాశం ఫ్రంట్ నాయకునిగా ఎన్నికయ్యారు. మద్రాసు శాసనసభలో ఫ్రంట్ దే మెజారిటీ. కాని గవర్నర్ కాంగ్రెసు పక్ష నాయకుడు రాజగోపాలాచారిని మంత్రివర్గం ఏర్పాటు చేయమని కోరాడు. రాజగోపాలాచారి గారిపై ఆంధ్రులకు మొదటినుంచి అపనమ్మకం. కృష్ణా పెన్నా ప్రాజెక్టు కట్టి కృష్ణానది జలాలను మద్రాసుకు తరలించాలని చేసిన అతని ప్రయత్నాలు ఆంధ్రదేశంలో తీవ్ర అసంతృప్తికీ ఆగ్రహానికి కారణమయ్యాయి. కేంద్రం నియమించిన ఖోస్లాసంఘం కృష్ణా, పెన్నారు ప్రాజెక్టు కన్నా నందికొండ ప్రాజెక్టు ఉచితమని అక్కడే ప్రాజెక్టు కట్టాలని అభిప్రాయ పడింది. ఆ నందికొండే నేటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, రాజ గోపాలాచారి ప్రభుత్వంలో ఆంధ్రులకు తీరని అన్యాయం జరగగలదని, రాష్ట్ర సాధనకు నిరాహారదీక్ష ఒక్కటే శరణ్యమని భావించారు. 

పొట్టి శ్రీరాములుగారి ఆత్మాహుతి 

1901లో జన్మించిన శ్రీరాములుగారు నెల్లూరు జిల్లాలో విద్యనభ్యసించి, అనంతర కాలంలో వైరాగ్య జీవనం గడుపుతూ గాంధీజీగారి ఉద్యమంలో చేరి ప్రాపంచిక సుఖాలకు దూరంగా శేషజీవితాన్ని గడపాలని నిర్ణయించు కొన్నారు. సబర్మతీ ఆశ్రమం లో చేరి నియమ బద్ద జీవనం, నిరాడంబరతలతో గాంధీజీ గారి అభిమానం పొందారు. జాతీయోద్యమంలో కారాగారశిక్ష అనుభవించారు. నిర్మాణాత్మక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. మద్యపాన నిషేధం, ఖద్దరుధారణ, అస్పృశ్యతా నివారణ వారి ముఖ్య ఆదర్శాలు. 1944లో నెల్లూరులో నివాస మేర్పరచుకొని హరిజనోద్ధ రణకోసం ఎన్నో నిరాహారదీక్షలు చేశారు.

నిరాడంబర నిస్వార్ధ జీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రరాష్ట్ర సాధనకోసం గాంధేయ మార్గంలో 1952 అక్టోబర్ 19వ తేదీన మద్రాసులో బులుసు సాంబమూర్తిగారి ఇంట్లో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ దీక్షను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. ఆంధ్రులు కలవరపడ్డారు. 'ఆంధ్రరాష్ట్ర సమస్యను పరిశీలించగలనని నెహ్రూ చెప్పినా శ్రీరాములుగారు విశ్వసించలేదు. నిరాహారదీక్ష కొనసాగించి 58 రోజుల తరవాత 1952 డిసెంబర్ 15వ తేదీన స్వర్గస్తు లయ్యారు. ఆంధ్రుల పాలిట 'అమరజీవి'గా వెలుగొందారు. ఈ ఆత్మాహుతి ఆంధ్రదేశాన్ని అగ్నిగోళంగా మార్చింది. మూడు రోజులపాటు ఆంధ్రరాష్ట్ర మంతటా దౌర్జన్యకాండ. చెలరేగి ప్రభుత్వ ఆస్తులు విధ్వంసమయ్యాయి. పోలీసు కాల్పులలో ఎందరో మరణించారు. అయినా ఉద్యమం వేడి, వాడి తగ్గలేదు. దీంతో కనువిప్పుకలిగిన కేంద్రప్రభుత్వం, వివాదాస్పదం కాని తెలుగు ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటుచేయగలమని ప్రకటించింది.

ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు 

నెహ్రూ ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు గురించి పార్లమెంటులో చేసిన ప్రకటనకనుగుణంగా, అన్ని విషయాలను పరిశీలించి నివేదిక సమర్పించమని రాజస్థాన్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వాంఛూను నియమించారు. వారి నివేదికను 1953 మార్చి నెలలో సమర్పించగా శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారిలోని ఆలూరు, ఆదోని, రాయదుర్గ తాలూకాలతో కొత్త రాష్ట్రం ఏర్పడాలని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన తరువాత రాయలసీమ ప్రతినిధులు పట్టుబట్టారు. కమ్యూనిస్టులు విజయవాడ రాజధాని కావాలని భీష్మించారు. దీంతో తిరిగి ఆంధ్ర రాయలసీమ భేదాలు తలెత్తాయి. నాటికి కిసాన్ మజ్జూర్ పార్టీ చీలిపోయి ప్రకాశం గారు ప్రజా సోషలిస్టు పార్టీ, రంగా కృషికార్ లోక్ పార్టీలు స్థాపించారు. విజయవాడలో రాజధాని ఉంటే కమ్యూనిస్టుల పలుకుబడి పెరుగుతుందనే భయంతో సంజీవరెడ్డి, ప్రకాశం, రంగాల సాయం కోరారు. రాజధాని నిర్ణయం కోసం ఆంధ్ర శాసనసభ్యులు మద్రాసులో సమావేశమయ్యారు. కాంగ్రెసు, ప్రజాసోషలిస్టు, కృషికార్ లోకపార్టీ కర్నూలు రాజధానిగా ఉండాలని కమ్యూనిస్టులు రాజధాని విజయవాడ, గుంటూరుల మధ్య ఉండాలని వాదించారు. మధ్యలో కృషికార్ లోక్ పార్టీ మనసు మార్చుకొని తిరుపతి రాజధానిగా ఉండాలని ప్రకటించింది. ఈ పరిస్థితితులలో రాజధాని నిర్ణయంపై ఓటింగ్ జరిగింది. ఒటింగ్ లో ఆంధేతరులు పాల్గొనడం సబబుకాదని రాజగోపాలచారి ప్రకటించారు. అయినా ఆంధేతరులు అయిదుగురు కర్నూలుకు అనుకూలంగా ఓటు చేయడంతో ఒక్క ఓటు తేడాతో కర్నూలు రాజధాని అయింది. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆంధ్ర శాసనసభ తీర్మానించింది.

దీంతో 1953 అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడి ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేరింది. కర్నూలు రాజధానిగా, టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వమేర్పడింది. అయితే ఆంధ్రులు మద్రాసు నగరంతోపాటు కొన్ని తెలుగు ప్రాంతాలను కూడా పోగొట్టుకున్నారు.



Tags :   Andhra State Formation     Andhra State Formation History