దేవవర్మ 

ఇతడు రెండవ మాధవవర్మ జ్యేష్ఠపుత్రుడు. వేల్పూరులో రాజ ప్రతినిధిగా వుండేవాడు. 

మొదటి విక్రమేంద్రవర్మ 

రెండో మాధవ వర్మ మరణం అంతఃపుర కలహాలకు దారి తీసింది. దీని పర్యవసానంగా మొదటి మాధవ వర్మ, వాకాటక మహాదేవిల పుత్రుడైన మొదటి విక్రమేంద్రవర్మకు సింహాసనం అధిష్టించే అవకాశం లభించింది. రామతీర్థం తామ్ర శాసనం ప్రకారం సింహాసనం ఎక్కే నాటికి ఇతడు వయో వృద్ధుడు కావడం వల్ల కొంత కాలమే పరిపాలన చేశాడు. ఇతని మరణానంతరం దాయాదుల మధ్య పోరుజరిగి, వాకాటక హరిసేనుడు జోక్యం చేసుకొని చివరకు ఇంద్రభట్టారక వర్మ సింహాసనం అధిష్టించాడు. 

ఇంద్రభట్టారక వర్మ 

దాయాదులందరిని సంహరించి రాజ మార్గాన్ని నిష్కంటకం చేసుకొని ఇంద్రభట్టారక వర్మ సింహాసనం అధిష్టించినట్లు చిక్కుళ్ళ శాసనం తెలియజేస్తున్నది. ఇతడు అనేక యుద్ధాలు చేసి విజయం సాధించి ఎక్కువ కాలం పాలించాడు. ఈశానవర్మ చేతిలో ఓటమి చవిచూసి తన కుమార్తె ఇంద్రభట్టారికను ఈశానవర్మ పుత్రుడు శర్వవర్మకు ఇచ్చి వివాహం జరిపించాడు. కీసర సమీపంలో గల ఘటకేశ్వరం అనే ఘటికాస్థానాన్ని నెలకొల్పినది ఇతనే. 

విక్రమేంద్రభట్టారకవర్మ 

ఇతడు పృథ్వీమూలరాజు సహాయంతో పల్లవులను ఓడించి, ఆ విజయానికి గుర్తుగా ఇంద్రపురికి వచ్చి మొదటి గోవిందవర్మ భార్య మహాదేవి విహారానికి “ఇఱుణ్ణి” గ్రామాన్ని దానమిచ్చాడు. 

రెండవ గోవిందవర్మ 

విష్ణుకుండినుల వంశ చరిత్ర పరిశీలిస్తే ఇతని గురించిన విశేషాలేవీ పెద్దగా తెలియరాలేదు.

మూడవ మాధవ వర్మ 

రెండవ గోవిందవర్మ కొడుకు మూడవ మాధవ వర్మ. ఇతను ఎక్కువ కాలం పాలించినాడు. ఇతనికి 'జనాశ్రయ' అనే బిరుదు కలదు. ఇతను వేయించిన పొలమూరు శాసనం ప్రకారం క్రీ.శ.623 వరకు పరిపాలించాడని తెలుస్తున్నది. 'పొలమూరు' శాసనం ప్రకారం ఇతను న్యాయశాస్త్రాలను అధ్యయనం చేసి దివ్య మార్గాలను అనుసరించిన విష్ణుకుండిన రాజు. విష్ణుకుండినుల కాలంలో న్యాయ పాలను రాజు 'అత్యున్నత న్యాయాధికారి'. 

మంచన భట్టారకుడు 

విష్ణుకుండినులలో చివరి వాడు మంచన భట్టారకుడు. ఇతడు అంత సమర్ధుడైన పాలకుడు కాదు. ఇతని కాలంలో కళింగ కాందులు, పిష్టపుర దుర్జయులు ఎదురుతిరుగగా వారిని ఇతను సమర్థంగా అణచలేకపోయాడు.