రైతు ఉద్యమాలు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ పాలనాకాలంలో జమీందార్లకు భూమి శిస్తువసూలు అధికారమే కాకుండా, నీటి వనరుల మీద, అడవుల మీద, బంజరుభూముల మీద అధికారాలుండేవి. రైతుల మీద జమీందార్ల దమనకాండ మితిమీరింది. దీనికి వ్యతిరేకంగా అనేక రైతు ఆందోళనలు జరిగాయి. 

రైతుల్లో కదలిక

భారత స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు, ముఖ్యంగా మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన చంపారన్, కైరా సత్యాగ్రహ పోరాటాలు రైతులను చైతన్యపరిచాయి. రైతుల్లో ఉన్న అసంతృప్తిని మద్రాసు ప్రభుత్వం గ్రహించి రైతు సంఘాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా మోతీలాల్ నెహ్రూ రాసిన 'కిసానోంకా సందేశ్ (రైతులకు సందేశం)' అనే హిందీ కరపత్రాన్ని దాని అనువాదాన్ని 1921 జూన్ 16న మద్రాసు ప్రభుత్వం నిషేధించింది. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని నూజెళ్లలో 1905లో జరిగిన రైతు సమావేశం రైతు ఉద్యమాలకు నాంది పలికింది. 1928లో మాగంటి బాపినీడు 'రైతు సంఘాలెందుకు?” అనే కరపత్రాన్ని ప్రచురించాడు. 1928లో రంగా నాయకత్వంలో రైతు పార్టీ ఏర్పడింది. 1928లోనే ఆంధ్ర రాష్ట్ర సంఘం. 1929లో ఆంధ్రరాష్ట్ర జమీందారీ రైతు సంఘం. 1937లో ఆంధ్రరాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘాలేర్పడ్డాయి. 

జమీందారీ విధానం

కోస్తా ఆంధ్ర జిల్లాల్లో 50 శాతం భూమి జమీందార్ల కింద ఉండేది. ఆంధ్రదేశంలో ప్రభుత్వం వ్యవసాయ భూముల విషయంలో జమీందారీ, రైత్వారీ విధానాలను అనుసరించింది. ఈ విధానాలు లోపభూయిష్టంగా మారాయి. ప్రభుత్వం రైతుల నుంచి నిర్దాక్షిణ్యంగా పన్ను వసూలు చేసింది. 1929-31 సంవత్సరాల మధ్య ప్రపంచంలో ఏర్పడిన ఆర్థికమాంద్యం ఆంధ్ర గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యత్యాసాలను బాగా పెంచింది. రైతులు తమ భూములను భూస్వాముల దగ్గర తనఖా పెట్టి అప్పులు తీసుకున్నారు. అధిక వడ్డీలను తీర్చలేక వారి భూములు భూస్వాముల పరమయ్యాయి. 1921 తరువాత జనాభా పెరుగుదల అధికమయింది. బ్రిటిష్ ప్రభుత్వ విధానాల వల్ల చాలామంది భూములపై ఆధారపడ్డారు. ఫలితంగా వ్యవసాయ కూలీల సంఖ్య పెరిగింది. భూములు ఎక్కువ భాగం జమీందార్ల ఆధీనంలో ఉన్నాయి. జమీందార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. వారు రైతులను పీడించి. పెద్దమొత్తంలో భూమి శిస్తును వసూలు చేయసాగారు. రైతులు జమీందార్లకు కట్టుబానిసలుగా మారారు. రైతులతో, వారి కుటుంబాలతో జమీందార్లు ఊడిగం చేయించుకున్నారు. జమీందార్లకు అండగా ఉన్న వలస పాలన అంతమైతేనే తమకు విముక్తి కలుగుతుందని రైతులు భావించారు. 

జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమం

జమీందారీ ప్రాంతాల్లో తమ హక్కులు కాపాడుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. 1931 సెప్టెంబరులో ఎన్.జి. రంగా అధ్యక్షతన ప్రథమ ఆంధ్ర రాష్ట్ర జమీందారీ రైతు సంఘ సమావేశం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది. నెల్లూరు వెంకట్రామనాయుడు 1930 మార్చి 7న నెల్లూరులో 'జమీన్ రైతు' పత్రికను స్థాపించాడు. దీంతో జమీందారీ వ్యతిరేకోద్యమం వేగం పుంజుకుంది. ఈ పత్రిక ఆంధ్ర జిల్లాలోని జమీందారీ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటింది. రైతులపై జమీందార్ల దమనకాండ మితిమీరిపోయింది. దీనికి వ్యతిరేకంగా చాలా రైతు ఆందోళనలు జరిగాయి. 

మునగాల

బ్రిటిషర్లు మునగాలకు 1852లో జమీందారీ హోదా కల్పించారు. అదే సంవత్సరం ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి శాశ్వత పైసలా నిబంధనల కింద 'సన్నద్' పొందింది. 1900లో వెంకటరంగారావు దీనికి జమీందారు అయ్యాడు. ఆయన మంచి దేశభక్తుడు అనేక గ్రంథాలయాలు, విద్యా సంస్థల స్థాపనకు విరివిగా విరాళాలు ఇచ్చాడు. గొప్ప సాహిత్య పోషకుడు. రంగారావు ఇతర రంగాల్లో చూపిన ఉదారత జమీందారీపాలనలో ప్రదర్శించసాగారు. ఆయన పాలన మధ్యయుగాలనాటి భూస్వామ్య నియంతృత్వాన్ని తలపించేది. ఆయన ఆగడాలకు రైతులు, రైతు కూలీలు బలయ్యారు. పేద రైతులు జమీందారు భూములను ఉచితంగా దున్నాలి. పంటలు పండినా, పండకపోయినా రైతులు శిస్తు చెల్లించాలి. వివిధ వృత్తుల వారు ఉచితంగా సేవచేయాలి. నీటిపారుదల

విషయంలో శ్రద్ధ చూపలేదు. 42 గ్రామాల్లోని 20వేల మంది ప్రజలు సాలీనా రూ.1.30 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. సారవంతమైన భూములను జమీందారు ఏదోఒక మిషతో కాజేయసాగారు. ఎదురు తిరిగిన వారిని గూండాలతో కొట్టించేవాడు. ఇలాంటి నేపథ్యంలో మునగాలలో రైతు సంఘం ఏర్పడింది. ఈ సంఘ ప్రథమ సమావేశం 1930లో ఒరిస్సాకు చెందిన బచ్చు జగన్నాథదాసు అధ్యక్షతన జరిగింది. జమీందారు నియంతృత్వాన్ని ఎదిరించాలని నిర్ణయించారు. ఉద్యమాన్ని అణచడానికి జమీందారు అన్ని చర్యలు తీసుకున్నాడు. ఈ చర్యలకు భయపడి రైతులు మూడేళ్లపాటు ఎలాంటి ఉద్యమాలూ చేయలేదు.

మునగాల జమీందారుకు, రైతులకు మధ్య చెలరేగిన పోరాటం కలుకోవ గ్రామంలో పతాక స్థాయికి చేరింది. ఈ గ్రామంలో జమీందారుకు 22 ఎకరాల పొలముంది. వరికోతల కాలంలో ఎకరాకు 80 శేర్ల ధాన్యం ఇస్తానని చెప్పిన జమీందారు, తరువాత ఆ వాగ్దానాన్ని నిలుపుకోలేక పోయాడు. దాంతో రైతుల నండూరి ప్రసాదరావు నాయకత్వంలో సత్యాగ్రహానికి సమాయత్తమయ్యారు. సబ్-కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాడు. ఇక్కడ ఉన్న దారుణ పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర జమీన్ రైతు నాయకుడు అయిన నెల్లూరు వెంకట్రామనాయుడు 1933 సెప్టెంబరు 22, 23, 24 తేదీల్లో మునగాల ఎస్టేట్ లో పర్యటించాడు. ఈ పర్యటనలో ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి గెల్లి కొనయ్య సహాయంతో నాయుడు రామాపురంలో రహస్యంగా ఏర్పాటైన సమావేశంలో పాల్గొని, రైతుల కష్టాలు తెలుసుకున్నాడు. రైతుల కష్టాలను జమీన్ రైతు వార పత్రికలో 1935 జనవరి 25వ తేదీ సంచికలో ప్రచురించాడు. 1938 లో మునగాల జమీన్ రైతు సంఘం పునఃస్థాపితమైంది. దీని శాఖలు ప్రతి గ్రామంలో వెలిశాయి. 'పోలీసు విధానం నశించాలి, జమీందారు జులుం నశించాలి' అనే నినాదాలు గ్రామాల్లో మార్మోగాయి. మునగాల గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తమయ్యేసరికి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గొట్టిపాటి బ్రహ్మయ్య జోక్యం చేసుకున్నాడు. 1939 జనవరి 8, 9 తేదీల్లో బ్రహ్మయ్య జమీందారుకు, రైతులకు మధ్యవర్తిత్వం వహించి, ఒక ఒప్పందం కుదిర్చాడు. ఈ ఒప్పందానికి బ్రహ్మయ్య అవార్డు అని పేరు వచ్చింది. ఈ ఒప్పందం మీద 1939 జనవరి 15న సంతకాలు జరిగాయి. జమీందారు ప్రజలతో ఉదారంగా ఉంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఒప్పందం జరిగిన మరుసటి రోజు నుంచే జమీందారు పేచీలు పెట్టాడు. నండూరి ప్రసాద రావు నాయకత్వంలో సత్యాగ్రహ సంఘం ఏర్పడింది.

1930లో జమీందారీ రైతు సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న ఇమ్మడి పాపయ్య భూములను జమీందారు ఆక్రమించాడు. సత్యాగ్రహం చేసి ఈ పొలాలను ఇప్పించాలని రైతులు నిర్ణయించారు. 1930 జూన్ 2న ఉప్పల రామయ్య, నండూరి ప్రసాదరావు, నల్లపాటి వెంకట నర్సయ్య, మోటూరి పరంధామయ్య, వేముల పల్లి హనుమంతరావు నాగళ్లు, పట్టుకుని పొలాల్లోకి కదిలారు. జూన్ 4న సత్యాగ్రహులపై తీవ్రమైన లాఠీచార్జ్ జరిగింది. సత్యాగ్రహం 15 రోజులు సాగింది. ఈ నాయకులు జైలు పాలయ్యారు. జమీందారు గ్రామాల్లో భీభత్సం సృష్టించాడు. 1931 జూన్ 11ను 'మునగాల దినం'గా పాటించమని ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం పిలుపునిచ్చింది. వాహిని, నవశక్తి, జమీన్ రైతు పత్రికలు ఈ పోరాటాలను సమర్థిస్తూ వ్యాసాలు రాశాయి. టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్.జి. రంగా మునగాలలో పర్యటించారు. వారి జోక్యంతో రైతులు సత్యాగ్రహం నిలిపివేశారు. పాపయ్యకు పొలాలు ఇవ్వడానికి జమీందారు అంగీకరించాడు. అయినా, జమీందారు జులుం కొనసాగుతూనే వచ్చింది.


Tags :   Peasant Revolt against Zameendari      Peasant Revolt in Andhra Pradesh     

 Peasant Revolt     Zameendari in Andhra      Andhra History     

Andhra Pradesh Hisory